*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*750 వ రోజు*
అశ్వమేధ పర్వము చతుర్ధాస్వాసం
యాగములో జరిగిన దానధర్మాలు
ధర్మరాజు సదస్యులకు కోటివేల నిష్కములు దానముగా ఇచ్చాడు. వ్యాసుడికి ధర్మరాజు తనరాజ్యమును దానముగా ఇచ్చాడు. వ్యాసుడు " ధర్మనందనా ! నీవు నాకు భూమిని దానంగా ఇచ్చావు. నేను ఈ భూమిని ఏమి చేసుకుంటాను. దానికి సమానమైన బంగారమును దానముగా ఇవ్వు " అని అన్నాడు. ధర్మరాజు " వ్యాసమునీంద్రా ! అశ్వమేధయాగ సమాప్తంలో భూదానము చెయ్యాలని ఆర్యులు అంటారు. అందు వలన అర్జునుడి వలన జయింపబడిన భూమిని నీకు దానము ఇచ్చాను. నాకు ఇక రాజ్యము లేదు. కనుక వనవాసముకు వెడతాను. అంతేకాని ఇచ్చిన రాజ్యము తిరిగి తీసుకోను " అన్నడు. వ్యాసుడు " ధర్మతనయా ! నీ చేత దానముగా స్వీకరించబడిన ఈ భూమి నాకే స్వంతము అనుటలో ఎటువంటి సందేహము లేదు. అందుకని మేము తిరిగి ఈ భూమిని నీకు అమ్ముతున్నాము నువ్వు తగిన వెల ఇచ్చి దానిని తిరిగి నీవే తీసుకో. ఇది రాజధర్మము ఇందులో ఎమీ తప్పులేదు " అని వ్యాసుడు చెప్పాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు కూడా వ్యాసుడు చెప్పినట్లే చెయ్యమన్నాడు. అప్పుడు ధర్మరాజు కోటికోట్లమాడలు కుప్పగా పోసి " నేను దానముగా ఇచ్చిన భూమి వెల ఇంత " అన్నాడు. వ్యాసుడు ఆ బంగారమును తీసుకుని రాజ్యాన్ని ధర్మరాజుకు తిరిగి ఇచ్చాడు. ఆ బంగారమును వ్యాసుడు యాగముకు వచ్చిన బ్రాహ్మణులకు దానముగా ఇచ్చాడు. ధర్మరాజు యాగము కొరకు తయారుచేసిన బంగారు పళ్ళెములు, బిందెలు, ఇతర వస్తువులు బ్రాహ్మణులకు పంచి పెట్టాడు. బ్రాహ్మణ దానములు అయిన తరువాత క్షత్రియులకు ఆ తరువాత వైశ్యులకు, ఆ తరువాత శూద్రులకు, ఆ తరువాత ఇంకా తక్కువ జాతి వారికి అపారముగా దానములు చేసాడు. యజ్ఞముకు వచ్చిన వారంతా అత్యంత సంతుష్టులై వారి వారి నివాసములకు వెళ్ళారు. వేదవ్యాసుడు తన వంతుకు వచ్చిన ధనమును కుంతీదేవికి ఇచ్చాడు. కుంతీదేవి ఆ ధనమును పేదలకు పంచి ఇచ్చింది. జనమేజయ మహారాజా ! దానములలో ధర్మరాజు రెండవ మరుత్తు అనిపించుకున్నాడు. యజ్ఞము పరిసమాప్తి అయిన తరువాత ధర్మరాజు తమ్ములతో భార్య ద్రౌపదితో యజ్ఞస్నానము చేసాడు. ఈ యజ్ఞముతో ధర్మరాజు తన మనసును శరీరాన్ని పవిత్రము చేసుకున్నాడు. ఆ యజ్ఞమును నిర్విజ్ఞముగా జరిపించిన వ్యాసుడికి ధర్మరాజు సాష్టాంగప్రమాణము చేసాడు. ధర్మరాజును దీవించి వ్యాసుడు తన శిష్యులతో అక్కడ నుండి వెళ్ళి పోయాడు.
యాగానంతరం రాజులను సత్కరించుట
అశ్వం తిరిగివచ్చిన తరువాత జరిగిన విందులో యుధిష్టురినితో మాట్లాడుతున్న కృష్ణుడు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం
వ్యాసుడు తన శిష్యులతో వెళ్ళిన తరువాత ధర్మరాజు " యాగముకు వచ్చిన రాజులకు సముచిత సత్కారాలు చేసాడు. బంగారమును, మణులను, నగలను, మాణిక్యాలను, నగలను, ఏనుగులను, అశ్వములను, వేశ్యలను కానుకగా ఇచ్చాడు. బభ్రువాహనుడికి సముచుత సత్కారము చేసి తన దేశముకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. ఎన్ని రోజులుగానో అర్జునుడికి దూరముగా ఉన్న ఉలూపి, చిత్రాంగదలు తమ భర్త అర్జునుడి వద్ద ఉండి పోయారు. బభ్రువాహనుడు మాత్రము తన దేశానికి తిరిగి వెళ్ళాడు. అందరికంటే ముందుగా యాగము చూడడానికి వచ్చిన శిశుపాలుని భార్యను ధర్మరాజు సముచితంగా సత్కరించాడు. ఆమె మనుమడిని సింధుదేశానికి అధిపతిగా పట్టాభిషిక్తుడిగా చేసాడు. తరువాత భారత యుద్ధములో ఓడిపోయి చనిపోయిన రాజుల రాజ్యాలను వారి వారసులకు ఇచ్చివేసాడు. అందరూ వెళ్ళిన తరువాత కూడా శ్రీకృష్ణుడు, బలరాముడు, యాదవ ప్రముఖులు ఉండిపోయారు. శ్రీకృష్ణుడికి, బలరాముడికి, సాత్యకికి, మిగిలిన యాదవ ప్రముఖులకు ధర్మరాజు అనేక రత్నాభరణాలు, విలువైన కానుకలు ఇచ్చి సత్కరించాడు. ధర్మరాజు చేసిన సత్కారాలకు తృప్తిచెందిన యాదవప్రముఖులు ద్వారకకు తిరిగి వెళ్ళారు " అని వైశంపాయనుడు జనమేజయునికి అశ్వమేధయాగ విశేషములు తెలిపాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి