6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

మాఘ పురాణం* ➖➖➖✍️ 19 వ అధ్యాయము

  ```



         *మాఘ పురాణం*  

             ➖➖➖✍️

        19 వ అధ్యాయము


మాఘ పురాణం పందొమ్మిదదవ అధ్యాయంలో, 

గృత్నృమద మహర్షి జహ్ను మునితో మాఘమాస మహిమను వివరిస్తూ, 

ఒకసారి నైమిశారణ్యంలో భృగువు, గౌతముడు, లోమశుడు, గార్గ్యుడు, మాండవ్యుడు, శంతనుడు, పాలస్త్యుడు, శౌనకుడు వంటి మహామునులు తమలో ఎవరు గొప్పవారో అని వివాదం పెట్టుకున్నారని చెప్పాడు. 

వాదన తీవ్రంగా మారి, ఒకరినొకరు దూషించుకుంటూ, కొట్టుకుంటూ హింసాత్మకంగా మారింది. 

ఈ గొడవ గురించి తెలుసుకున్న నారదుడు వైకుంఠానికి వెళ్లి శ్రీహరికి విన్నవించాడు. 

హరి సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులతో పాటు మార్కండేయుని మునుల వద్దకు పంపాడు. 

వారి రాకతో మునులు గొడవ ఆపి వారికి గౌరవం ఇచ్చారు. 


మార్కండేయుడు మునులతో వయస్సు గురించి, జ్ఞానం గురించి మాట్లాడుతూ హరికథా ప్రాముఖ్యతను వివరించాడు.

తన కంటే సనకాది మునులు బాలురైనప్పటికీ వారు ఎల్లప్పుడూ హరినామ స్మరణ, కథా ప్రసంగాలలో మునిగి ఉండడం వలన వారే గొప్పవారని చెప్పాడు. 


మార్కండేయుని మాటలతో మునులు తమ తప్పు తెలుసుకొని, హరికథా ప్రసంగాల ప్రాముఖ్యతను గుర్తించి, సిగ్గుపడి, మార్కండేయుడు, సనకాది మునులకు క్షమాపణ చెప్పారు. 


ఈ సంఘటన ద్వారా మునులు అహంకారం మాని, వినయంతో హరికథా ప్రసంగాలలో మునిగి ఉండడం ద్వారా జ్ఞానం పొందడం నేర్చుకున్నారు. గృత్నృమద మహర్షి జహ్ను మునికి మాఘమాస వ్రతం ద్వారా భగవచ్చింతన చేయడం ద్వారా జీవులు తమ అహంకారాన్ని జయించి, జ్ఞానం పొంది, భవసాగరాన్ని దాటగలరని చెప్పాడు. 


*మునుల వాగ్వాదము:*```

గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లు పలికెను. ఓయీ వినుము గోమతీ నదీ  తీరమున పవిత్రమైన నైమిశా అరణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షగుల్మము లెన్నియోయున్నవి. అచట నుత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసికొనుచుండిరి. జ్ఞానము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువయనగ నేనేయక్కువయను వివాదము కలిగెను. భృగుమహర్షి, నేను తపోనిష్టుడను యోగీశ్వరుడను నన్ను మించిన వారెవరున్నారని యనెను. గౌతముడు అను నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తి అయ్యే వరకు తపమును చేసిన వాడను. నేనే గొప్పవాడనని పలికెను. లోమశుడను ముని నాకు సమానుడు లేడు. నేను మునులకు గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి వేదశాస్త్రాదులన్నియు నాకు వచ్చును.

కావున నేనే ఉత్తముడనని యనెను. మాండవ్యుడు నేను కర్మలను యేమరకుండ యధాకాలముగ చేయుదును. నిత్కర్మలనాచరింతును, అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటె ఉత్తముడెవడని గర్జించెను. శంతనుడ అను ముని నేను యోగా అభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత కలవాడను నన్ను మించిన వాడెవడు లేడని పలికెను. పాలస్త్యుడను ముని లేచి, నేను వేదములు,  శాస్త్రములు అన్నియు నేర్చినవాడను. పెద్దలు కూడ నన్నే గౌరవింతురు. కావున నేనే అధికుడననియనెను. శౌనకుడును ఆత్మనేత్తలలో నేను మొదటివాడను, నాకంటె పూజ్యులెవరును లేరనెను. ఆ మునివరులు తమ గొప్ప తనమును బిగ్గరగా ఏవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్లు బిగించి కొట్టిరి. ఒకరిని ఒకరు ధూషించుకొనుచు, కొట్టు కొనుచు వారి దండములను, ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి.

ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహ ప్రియుడైన నారదుడు వచ్చెను, కలహించు కొనుచున్నవారిని మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి యీ విషయమును విన్నవించెను. 


శ్రీహరియు ‘నారదా! ఆ మునులు జ్ఞానులైనను నామాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయముచే ఉపశమింపజేయవలెను. నాకిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును యెల్లప్పుడును అయిదు సంవత్సరములవారుగనే యుందురు. వీరి బాల్యమున చతుర్యుగములెన్నియో మార్లు గడచినవి. వీరితో బాటు వృద్ధుడు, బుద్ధిశాలియగు మార్కండేయుని గూడ పంపుదును. అతడు సప్త మహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారదా నీవును అచటకు పోయి చూడుము అని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూసి వివాద పడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారినందరిని కుశల ప్రశ్నాధికముతో శంతపరచెను. ఇట్లు కొంతకాలము గడచెను.              

కొంత కాలము గడచిన తరువాత బ్రహ్మ జ్ఞానులగు సనక సనందాది మునులు నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించుచు వచ్చిరి. మార్కండేయ మహర్షియు వారిని చూసి ఏదురువెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాధ్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై ప్రోక్షణ చేసుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూసి సనకాది మునులు ఆశ్చర్య పడి యిట్లనిరి. “మార్కండేయ మునీంద్రా! నీవు వయో వృద్ధుడవు మునులలో ఉత్తముడవు, సప్త మహాకల్పములు నీ ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై జల్లుకొనుచున్నావేమి?  వృద్దులు బాలురకు యెదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శ్రుతి వాక్యమున్నది కదా మేము అయిదేండ్లవారమే కదా!” అని పలికిరి.

ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి యిట్లనెను. “భగవద్గావలాలమలారా! ఒకొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము, కుండ నుండి స్రవించు నీరువలె తగ్గిపోవుచున్నది. ఇరువది యొక్క కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇందు సత్యము లేదు. యెక్కువ వయస్సు ఉండుటవలన ప్రయోజనమేమి వేదశాస్త్రములను చదువుటచేత లాభమేమి, యోగమును పాటించుటచే, ఉపయోగమేమి? తపముచేత, కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవియైనచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్దకముగ కాలము గడచుటచే దుష్టుల జీవనము గడచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించు వాడే యెక్కువగ వ్యర్థముగ అజ్ఞానియై యెక్కువ కాలము గడిపిన వాని గొప్పదనమేమున్నది వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మఫలముననుభవించి మరల జన్మించును. నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది.

మహాత్ములైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులారా! మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు, నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి యెల్లప్పుడును నీ హృదయ పద్మములందే యుండును. మేము క్షణ కాలమైనను విష్ణువును స్మరింపము. శ్రీహరి ప్రసంగములను కూడ చేయము. విష్ణు కథను విడువని బాలువాడైనను వృద్ధుడే, నిరంతరము హరి కథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే, హరికథా ప్రసంగములేని వారెంత వృద్ధులైనను బాలురే కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానము నిచ్చెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను  వినుచున్న మునులు తమలో తాము యెక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరును మార్కండేయ మహర్షికి, సనకాది మునులకును పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలిసికొంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ నెరుగ శక్తి యుండని ప్రార్థించిరి.

నారదుడును శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాస రూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను. సూతునివలన మునులు మొదలగు వారందరును శ్రుతుల సారము నెరిగిరి. శౌనకుడు మునులును అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము, పరమేశ్వర చింతనము కలిగియుండిరి. హరకేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపములనందినను కరిగిపోయి తుదకు తమ మూల ధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషము ననుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేద వేదాంగములను సర్వ శాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్త్యము నెరిగి పరమాత్మ చింతనమును చేసి భగవదనుగ్రహము నందుటయే జ్ఞానమునకు ఫలితము. మాఘ మాసాది వ్రతములు భగవచ్చింత నేను నిరంతరముగ అలవాటు చేసి జీవులను తరింప జేయును.

జహ్ను మునీశ్వరా! మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకములను దుష్కర్మ క్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయ ముని వినయ వివేకములను, సనక సనందనాదుల మహత్త్యమును, పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞాన ఫలములని యెరిగి ఆచరించి భవసాగరమును దాటవలెను సుమా అని గృత్నృమద మహర్షి వివరించెను.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

కామెంట్‌లు లేవు: