6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*643 వ రోజు*

అనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము

మునుల శపధం

తరువాత మునులు కొలనులో దిగి తామరతూడ్లను తీసుకుని వాటిని నీటిలో శుభ్రం చేసి కొలను పక్కన పెట్టారు. సంధ్యావందనం చేసుకోవడానికి కొలనులో దిగి సంధ్యావందనంచేసి కొలను బయటకు వచ్చిచూసే సరికి తామరతూండ్లు కనిపించ లేదు. వారికి అనుమానం వచ్చి శునశ్శఖుడిని మధ్యవర్తిగా పెట్టుకుని ఈ విధంగా శపధం చేయసాగారు. ముందుగా అత్రిమహర్షి లేచి " నేను కనుక తామర తూండ్లు దొంగిలించి ఉంటే ఆవును తన్నడం వలన, సూర్యుడికి అభిమఖంగా మలమూత్ర విసర్జన చేయడం వలన, వేదములు చదువకూడని రోజులలో వేదాధ్యయనం చేయడం వలన కలుగు పాపములు నాకు కలుగు కాక " అని శపధం చేసాడు. తరువాత వశిష్ఠుడు లేచి " ఈ తామరతూడ్లు దొంగిలింన వాడు వేదాధ్యయనం మానిన పాపం, సన్యాసిగా ఉండి కామకలాపం చేసిన పాపం, కుక్కను వెంట పెట్టుకుని తిరిగిన పాపముల పోతాడు " అని పలికాడు. తరువాత కశ్యపుడు లేచి " అవసరం లేకున్నా మాంసంతినడం, న్యాయసభలో ఒకరి పక్షం వహించడం, దుష్టులకు దానం చెయ్యడం, కట్టుకున్న భార్యతో పట్టపగలు చేరడం, విద్యా వంతులైన బ్రాహ్మణులను లోభబుద్ధితో ఏడిపించడం, సరకు అంతా ఒకేసారి కొని తరువాత లాభముకు అమ్మడం వంటి పాపములు ఈ తామరతూండ్లు దొంగిలించిన వాడికి కలుగు కాక " అని పలికాడు. తరువాత భరద్వాజుడు లేచి " ఈ తామరతూండ్లు దొంగిలించడం ఎట్టిదనిన జ్ఞాతులపట్ల, గోవులపట్ల, స్త్రీలపట్ల ధర్మం విడిచి ప్రవర్తించిన దానితో సమానం. యజ్ఞకుండంలో వేయవలసిన హవిస్సును కంపలలో మండుతున్న అగ్నిలో వేయడం, గురువును కించపరుస్తూ విద్యను అభ్యసించడం " అని పలికాడు. తరువాత జమదగ్ని లేచి " ఈ తామరతూండ్లు దొంగతనం ఎలా జరిగిందంటే రజస్వల అయిన భార్యతో చేరడం, తాగే నీటిలో మలమూత్రములు విసర్జించడం, ఎప్పుడూ పగప్రతీకారంతో రగిలి పోవడం, భార్యసంపాదన మీద జీవించడం ఈ తామరతూండ్లు దొంగిలించడం సమానం. ఇతరులను అతిధులుగా ఆదరించడానికి బదులు తమలోతామే ఒకరిని ఒకరు ఆదరించడంతో, అనవసరంగా పగను పెంచుకోవడం, పాడి ఆవును కొట్టడం వంటి పాపము చేసిన దానికి ఏ పాపం వస్తుందో ఈ తామరతూండ్లు దొంగిలించిన వాడికి వస్తుంది " అని పలికాడు. గౌతముడు లేచి " వేదము చదువుకొని కూడా వేదాధ్యయనం చేయకపోవడం, రోజూ అగ్ని ఆరాధన చేయక పోవడం, మద్యం విక్రయించడం, వర్ణసంకరం చేసి శూద్రస్త్రీని పెళ్ళి చేసుకోవడం మొదలైన పాపములు ఈ తామరతూండ్లు దొంగిలించిన వాడికి సంక్రమిస్తుంది " అని గౌతముడు చెప్పాడు. తరువాత విశ్వామిత్రుడు లేచి " అర్హత కలవారిని వదిలి అర్హత లేని వారిని పనిలో పెట్టుకోవడం, అధర్మవర్తనుడు, కపటి అయిన రాజును సేవించడం వంటి పాపములు ఈ తామరతూండ్లు దొంగిలించిన వానికి సంక్రమిస్తుంది " అని అన్నాడు. ఇదంతా విని అరుంధతి నవ్వి " ఎప్పుడూ అత్తగారిని ఆక్షేపించడం, తిట్టడం, భర్తపట్ల అనిచితంగా ప్రవర్తించడం, వండుకున్నది ఎవరికి పెట్టకుండా తానే తినడం వంటి పాపములు తామరతూండ్లు దొంగిలించిన వాడికి తగులుతాయి " అన్నది అరుంధతి.ఇంతలో సేవకురాలు గండ " వండినవంట ముందు తానే తినడం, పని చేయడములో సోమరిగా కుటిలముగా ఉండడం, అబద్ధాలు చెప్పడం, కన్నకూతురిని ధనము కొరకు అమ్ముకోవడం, మంచివారికి కీడు చెయ్యడం వంటి పాపములు ఈ తామరతూండ్లు దొంగిలించిన వానికి సంక్రమిస్తాయి. అదీ కాక ఈ తామరతూండ్లు దొంగిలించిన వాడు జీవితం అంతా ఒకరికి దాస్యం చేస్తుంటాడు " అని పలికింది. ఆమె భర్త పశుసఖుడు " ఈ తామరతూండ్లు దొంగిలించిన వాడికి సంతానం కలుగదు గర్భదరిద్రుడు ఔతాడు " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: