6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

ధృతరాష్ట్ర కౌగిలి*

 

*ధృతరాష్ట్ర కౌగిలి*

జాతీయం - దాని నేపథ్యం.


వేద వ్యాసుని సాంత్వన వాక్యములు విన్న తరువాత, బంధు మిత్రుల శవాలకు అంత్య క్రియలు చేయడానికి, ధృతరాష్ట్రుడు గాంధారి వెంటరాగా మిగతా అంతఃపుర స్త్రీలతో పాటు కురుక్షేత్ర యుద్ధ భూమికి వెడలుతాడు. సరిగ్గా అదే కర్మ కాండల పనిలో ఉన్న పాండవులు వారికి తారసిల్లుతారు.


ధర్మరాజుతో సహా ఒక్కొక్కరు, ధృతరాష్ట్రునికి నమస్కరిస్తే, వారిని దగ్గరికి తీసుకొని గుడ్డిరాజు ఓదారుస్తాడు. భీముని వంతు వచ్చి ముందుకు వచ్చి వెళ్ళబోతుంటే, కృష్ణ పరమాత్మ వారిస్తాడు. అప్పటికప్పుడు భీముని బోలిన ఒక ఇనుప విగ్రహాన్ని రప్పించి, ధృతరాష్ట్రుని ముందు నిలబెడతాడు. ఈ విగ్రహం దుర్యోధనుని మందిరంలో ఉండేది. దీనితో ప్రత్యర్థి అయిన భీముడిని ఊహించుకొని దుర్యోధనుడు మల్ల గదా యుద్ధములను సాధన చేసేవాడు. యోగీశ్వరుడైన కృష్ణునికి ఎక్కడో ఉన్న విగ్రహాన్ని ఇక్కడికి రప్పించడం ఎంత పని! కృష్ణుడు విగ్రహాన్ని, ధృతరాష్ట్రునికి అతి సమీపములోనికి చేరుస్తాడు. అందరూ నిశ్శబ్దమైపోయి జరగబోయే విషయం ఉగ్గబట్టుకొని చూడసాగారు.


ఆ విగ్రహాన్ని కౌగిలించుకొని ధృతరాష్ట్రుడు ఏమి చేశాడొ తిక్కన గారు, ఆంధ్ర మహాభారతము స్త్రీ పర్వములో ఒక లయవిభాతి వృత్తము ద్వారా వివరించాడు.


*పెరుగగ నిజాంగములు*

*శరభస పరిస్ఫురణము*

*అరుదుగ జనావళులు*

*నిరుపమ విధంబిన్*

*కరయుగముతోలవియ*

*ఉరము సదియన్ పెలుచ*

*తరగగ పురిన్ నెత్తురులు*

*ముఖ రంధ్రముల*

*పరవశత మానసము*

*పొరయుటకు చొచ్చియును*

*సరిగొనగ గంటిన్*

*వరసుతునకిప్పుడును*

*పరమపద విన్మగుడ*

*కురునృపతియాప్రతిమ*

*పురినిటుల పుచ్చెన్*


అన్ని అంగములు వాటితో పాటూ శరీరము సాధ్యమైనంత పెద్దది చెసి, అదుపు తప్పిన ఉఛ్చ్వాస నిశ్వాసములతో, అన్ని ముఖ రంధ్రముల నుంచి నెత్తురు కారుతుండగా, విగ్రహమును తన యురమున బిగించి, కురు రాజు ఆ ప్రతిమను పుచ్చెలు పుచ్చెలుగా పిండి పిండి చేసి పరవశుడవడం చూసి, జనాలు అందరూ నిశ్చేష్టులయ్యారు.


కడుపులో లేని ప్రేమ కౌగిలించుకొంటే వస్తుందా? 


ఇదే ధృతరాష్ట్ర కౌగిలి!

ఇది ధృతరాష్ట్రకౌగిలి జాతీయం.

కామెంట్‌లు లేవు: