కశ్యపుని భార్యలలో "దితి" "అదితి" అనువారు ముఖ్యులు. దితియందు, అదితియందు కశ్యపప్రజాపతి సంతానాన్ని పొందటం జరిగినది.
దితి యొక్క సంతానము కనుక వారు దైత్యులు అని పిలువబడ్డారు. వీరందరికీ ఆసురీలక్షణాలు ఉండటంచేత అసురులని, రాక్షసగుణాలు కలవారగుటచేత రాక్షసులని వ్యవహరించబడ్డారు.
అదితియందు కశ్యపప్రజాపతికి కలిగిన సంతానము అగుటచేత ఆదిత్యులు అని పిలువడ్డారు. "సుర" అను పానీయమును త్రగువారు కనుక "సురలు" అని పిలువబడ్డారు. వీరే దైవీగుణములు కలిగి ఉండుటచేత దేవతలు అని వ్యవహరించబడుతున్నారు.
కశ్యపునకు "దితి అదితి" మాత్రమే కాకుండా ఇంకా అనేకవేలమంది భార్యలు కలరు. వారిలో "వినత, కద్రువ" కూడా ముఖ్యులు.
ఈ వినత కద్రువలకు చాలాకాలం సంతానం కలుగలేదు. సంతానంకోసం వీరు కశ్యపుని ప్రార్థించగా.... కొద్దికాలానికి ఈ వినత కద్రువలిద్దరూ గర్భం ధరించారు.
కొద్దికాలంలో కద్రువగర్భము నిండి అనేకవేలమంది నాగులను సంతానంగా పొందినది. ఆ సంతానమే సర్పజాతి అయినది.
వినతకు మాత్రం గర్భం ధరించి 500ల ఏండ్లు అయినా గర్భం కొనసాగుతున్నదే తప్ప, ఇంకా సంతానానికి ఆమె నోచుకోలేదు. తన సవతికి సంతానం కలిగి ఆమె ఆనందంతో ఉన్నది. నాకింకా సంతానం కలుగలేదే... అని విచారించి విచారించి కోరికను ఆపుకోలేక భర్త అయిన కశ్యపునే... ఇంకెప్పుడు సంతానం కలుగుతుంది? అని అడిగింది. దానికి కశ్యపుడు... కొద్దిరోజులు ఓపికవహించమని చెప్పాడు. ఆవిధంగా వేచి చూస్తుండగా మరొక 500 ఏండ్లకు వినత ప్రసూతి అయినది. కాని ఆమె రెండు అండములకు జన్మనిచ్చినది. దానితో వినత "సంతానం కలుగుతుందనుకుంటే అండములు పుట్టాయని హతాశురాలై మరలా కశ్యపుని చేరి తన బాధను తెలుపుకొన్నది.
దానికి కశ్యపుడు మరలా... కొద్దిరోజులు వేచి ఉండు. నీకు మంచి సంతానం కలుగుతుంది. అని చెప్పగా... వినత ఆ అండాలను జాగ్రత్తగా సాకుతూ వేచిచూస్తూ ఉన్నది. మరలా 500 ఏండ్లు గడచిపోయాయి. వినతకు ఆత్రం ఆగటంలేదు. మరలా కశ్యపుని అడగటం ఆయన వేచి ఉండమనటం ఇలా కాలం గడుస్తుండగా మరలా 500 ఏండ్లు గడచిపోయాయి. తనకు పుట్టిన అండములు పెరుగుతూ పెరుగుతూ ఉన్నాయి.
ఇక తన మనసును అదుపుచేసుకోలేక... "త్వరగా సంతానాన్ని చూడాలి. తన సవతి ఏమో తన సంతానంతో ఆనందంలో మునిగి తేలుతోంది. నేనుకూడా ఆ నందాన్ని పొందాలి." అనే తానత్రయంతో తహతహతో ఒకరోజున ఒక అండాన్ని పగులగొట్టి చూచింది.
ఆ పగులగొట్టిన అండంలో తన కుమారుడు శిరస్సునుండి పాదాలవైపు ఒక్కొక్క శరీరాంగం అభివృద్ధి చెందుతూ... నడుక్రింద వరకు శరీరాన్ని పొంది ఉన్నాడు. ఊరువుల నుండి పాదాలవరకు అభివృద్ధి చెందవలసి ఉన్నది. అటువంటి స్థితిలో ఉన్న కుమారుడు అరుణచ్ఛాయలతో ధగధగా మెరసిపోతూ అండమునుండి బయటకు వచ్చాడు. ఆవిధంగా జగజ్జేగీయమానంగా వెలిగిపోతున్న కుమారుని చూచి సంతోషించాలో ఊరువులు లేకుండా పుట్టాడని దుఃఖించాలో వినతకు అర్థంకాలేదు. అటువంటి పరిస్థితిలో వినత దగ్భ్రమకు లోనై కుమారుని చూస్తుండగా... ఊరువులు లేకుండా పుట్టిన ఆ కుమారుడు తన తల్లిని ఓదార్చి... "నాకు జన్మనివ్వటానికి తొంతదపడితే తొందరపడ్డావు. ఇకపు నేను ఊరువులు లేకుండానే ఇలా గడపవలసి ఉంటుంది. కనుక ఆ రెండవ అండంలో తమ్ముడు పెరుగుతున్నాడు. దయచేసి ఆ అండాన్ని తొందరపడి పగులగొట్టకు. పూర్తిగా ఎదిగిన తరువాత అందులోనుండి తమ్ముడే బయటకు వస్తాడు. అప్పటివరకు వేచి ఉండు." అని తన తల్లికి చెప్పి తాను సూర్యలోకానికి వెళ్ళిపోతాడు. ఊరువులు లేకుండా జన్మించటం వలన అతడు "అనూరుడు" అని పిలువబడ్డాడు.
ఆ తరువాత మరొక 1000 ఏండ్లకు రెండవ అండము నుండి గరుత్మంతుడు జన్మించాడు.
గ్రూపులోని అందరికీ అవగాహన కల్పించటంకోసం ఈ కథను తెలియజేయటం జరిగింది.
మీ
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి