9-2-26
ఓం జగద్గురుభ్యోనమః
జగద్గురు బోధలు-145
(JAGATHGURU BHODALU VOL-7)
4)శంకరావతారము
మూడవ భాగము
ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్ శ్రియ మిచ్ఛేద్ధుతాశనాత్|
ఈశ్వరాత్ జ్ఞాన మన్విచ్ఛేత్ జ్ఞానదాతా మహేశ్వర:||
జ్ఞానదాత, జ్ఞానస్వరూపి మహేశ్వరుడే. ఈశ్వరుని కొక్కనికే సర్వజ్ఞుడని పేరు. అమరకోశం కూడా అట్లే చెప్పింది. 'ఈశానః సర్వవిద్యానాం' అని వేదము. లోకాలను పాలించుటకు పరమాత్మయే ఈశ్వరుడై ఉన్నాడు.
నశించిపోయిన జీవబ్రహ్మాభేదయోగాన్ని పునరుద్ధరించడానికై శ్రీకృష్ణులు అవతరించారు. ఆ అవతరణం ద్వాపరాంతంలో జరిగింది. పిమ్మట కలి పుట్టినది. ఆ యోగము తిరుగనష్టమై పోయినది. ఏవో డెబ్బదిరెండు దుర్మతాలు లోకంలో అల్లుకొన్నాయి. ఏ దుర్మతమైనా దానికి ఆరంభంలో జీవం ఎక్కువ. కాని అవి చిరకాలం నిలువలేవు. తొందరలోనే అంతరిస్తూ ఉంటాయి. కరుణానిధియైన పరమేశ్వరునితో ఏమీభేదంలేకుండా ఏకంకావడమే వేదాలు చెప్పే పరమార్థం. అదే అద్వైతం. ఆ అద్వైతముపై విశ్వాసం కృతయుగంలో పరిపూర్ణంగా ఉండేది. ద్వాపరంలో ఆ విశ్వాసం కొంత సన్నగిల్లినది. కాని కలిలో అధర్మం బాగా విజృంభిచి, ధర్మం చాలా క్షీణించింది. అందుచే అద్వైతవిశ్వాసం ఎక్కువగా లోపించింది.
శ్రీకృష్ణావతారంలో కొంతసేపుమాత్రమే అర్జునునకు జ్ఞానోపదేశం చెయ్యడం జరిగింది. మిగిలిన కాలం అంతా అయన రాజ్యవిషయాలను చక్కదిద్దడంలో గడిపేరు. రాజ్యాలలో ధర్మం సుప్రతిష్టితం కావడానికి వలసిన ముక్తులన్నీ ఆయన ఆచరించారు. పంచపాండవులు ప్రార్థిస్తే కౌరవసభకు దూతగా వెళ్ళేరు. ఇలా ఎన్నో పనులు నిర్వర్తిస్తూ జ్ఞానోపదేశానికి కొద్దిసమయం మాత్రమే వినియోగించేరు. అది ద్వాపరయుగం. ఆనాడు కలిలోవలె ధర్మం అనగా అద్వైతవిశ్వాసం బాగా క్షీణించనూలేదు, దుర్మతాలు ఎక్కువ విజృంభించనూ లేదు. కాగా ఆనాటికా పని చాలి ఉన్నా కలిలో ఆ మాత్రంచేస్తే చాలదు. ఇక్కడ పూర్తి జ్ఞానోపదేశంలోనే అవతారకాలం అంతానడవాలి. జ్ఞానోపదేశం తప్ప వేరోకపనిలేని అవతారం కలికి అవసరమైనది.
ఇక్కడ కొందరు శంకిస్తూ ఉంటారు. ఏమని అంటే అయ్యా! కలిలో అధర్మాలు ప్రబలుతాయని ధర్మం క్షీణిస్తుందని పురాణాలు చెప్పిన మాటయేకదా! ఇక వేదాలు నశిస్తున్నాయనీ అధర్మం పెరిగిపోతోందనీ గోల చేయడం ఎందుకు? దీనివల్ల ప్రయోజనం ఏమున్నది? పురాణాలు చెప్పినమాటలు దబ్బరలు కావని మీరే అంటున్నారు కదా!- అని ఆక్షేపిస్తారు వారు.
జోస్యం విషయంలోకూడా వారి ఆక్షేపణ ఈ తీరుగానే ఉంటుంది. దానిని గూర్చి వారి ఆక్షేపణ ఏమంటే-జోస్యం వట్టి నిరర్థకవిషయం. మనకు దుఃఖం రానున్నదని జోస్యం ద్వారా తెలిసింది. దానివల్ల ఎప్పుడో రాబోయే దుఃఖాన్ని తలచుకొని ఇప్పటినుండీ ఏడవవలసి వస్తోంది. అలా కాక మనకు ఏదో గొప్ప సుఖం కలుగనున్నదని జోస్యంద్వారా తెలిసింది. అప్పుడు రాబోయే సుఖాన్నిగూర్చి ముందే తెలియడంద్వారా వాస్తవంగా సుఖం కలిగిన సమయంలో ఎక్కువ ఆనందం అనుభవించలేకున్నాము. ఈ సుఖం ఎలాగూ రావలిసినదే. వచ్చినది, అంతే! అన్నభావంతో ఎక్కువగా ఆనందించలేము. కాగా జ్యోస్యం రానున్న సుఖాన్ని గూర్చి చెప్పినా లేక దుఃఖాన్ని గూర్చి చెప్పినా మనకు కలిగే ప్రయోజనం లేదు సరికదా; నష్టం ఉన్నదని వారి ఆక్షేపణ.
మరి అయితే ఆ పురాణాలలో కలిరాబోతోంది, ధర్మం క్షీణిస్తుంది, అధర్మం విజృంభిస్తుంది-అనే మాటలు ఎందుకు చెప్పినట్లు? ముందుగా ఈ హెచ్చరిక చేయడంవల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? పై ఆక్షేపణచూస్తే కొందరకు సమాధానం వెంటనే స్ఫురించదు.
కాని పరిశీలిస్తే ఆ హెచ్చరిక నిష్ర్పయోజనం కాదని, దానివల్ల ప్రయోజనం ఉందని తేలుతుంది.
ఒకచోట దొంగల భయం ఎక్కువగా ఉన్నది. ఆ దొంగలు గజదొంగలు. ఎంత జాగ్రత్తగా భద్రం చేసినా సొత్తు ఎత్తు పోతున్నారు. ఇది అచట నున్న వారికందరికీ తెలిసినదే. అయితే మాత్రం - మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగలు మన కన్నులుగప్పి సొత్తు అపహరిస్తూనే ఉన్నారు. ఇక మనం జాగ్రత్తపడి ప్రయోజనం ఏముంది? ఇంటిలో ఉన్న యీ సొత్తు అంతా వాకిటిలోనే పారవేద్దాం- అని తలచేవారు ఉంటారా! ఉండరు. జాగ్రత్తకలిగి ఉంటే ఏదో కొంతైనా రక్షించుకోవచ్చునను కొంటారేగాని సొమ్మును నడివీధిలో పారవేయరు.
అలాగే కలిలోని ధర్మవిషయములో కూడ ఎక్కువ జాగ్రత్త అవసరమని తెలియజేయడానికే పురాణాలు అలా హెచ్చరించాయి. అదీ కాక కలిలోని అధర్మప్రవాహాన్ని ఎదురిస్తూ ఆచరించిన ధర్మం అల్పమైనా ఇతర యుగాలలో ఆచరించపడినదాని కంటె కోటిరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిపక్షాన్ని ఎదురించి నిలుచుటలోనే శూరుడు యశ మార్జిస్తాడు. అందుచే లోకం ఎంత పరిహసిస్తూ ఉన్నా లక్ష్య పెట్టక ధైర్యంతో ధర్మాన్ని ఆచరిస్తే ఎంత కలి అయినా చిత్తశుద్ధి కలుగుతుందనడానికి సందేహం లేదు.
'కలిః సాధుః' అని ఒక వాక్యము. అనగా కలికాలము సాధువైన కాలము అని అర్థం. ఇదెలా! వెనుకచెప్పిన మాటలకిది విరుద్ధం కాదా! అనిపిస్తుంది. ఇది వేరొక దృష్టితో చెప్పినమాట. మిగిలిన యుగాలలో ఎంతోకాలం తపస్సుచేస్తేగాని లభించని ఫలితం కలిలో అల్పకాలం చేసిన తపస్సు ద్వారా పొందవచ్చును. అది దృష్టియందుంచుకొని 'కలిః సాధుః' అన్నారు. ఈశ్వరుడుకూడ ఈ యుగంలో తన్నెవరును ఆశ్రయింపవచ్చుటలేదే! అని, ఎవరైనా తనవద్దకు వెదకుకుంటూ వస్తారా! అనీ అట్టివారిని తానే వెదకుతూ ఉంటాడు. తనను గూర్చి కొంచెంగా అన్వేషించేవానిని కూడా చక్కగా అనుగ్రహిస్తారు. అందుచే కలిలో అధర్మం ఎక్కువుగా ఉండేమాట నిజమైనా ఇచట ఆచరితం అయ్యే ధర్మానికి విలువ ఎక్కువైనందున వేదధర్మాలను ఎవరూ విడచిపెట్టకూడదు.
కలి ప్రారంభంలో కట్టతెగిన ప్రవాహంవలె అధర్మం లోకాన్ని ముంచి ఎత్తింది. ఈ అధర్మ ప్రవాహాన్ని నిలుపడానికి సంకల్పించి పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణవంశంలో అవతరించేడు. సర్వవిద్యలకు అధిపతి అయిన సదాశివుడు జ్ఞానోపదేశానికై అవతరించారు. అదియే శంకరావతారము ఆయన ఈ అవతారము జ్ఞానప్రధానమైనది- విష్ణువు యొక్క అవతారాలన్నీ క్షాత్రప్రధానాలు.
--- “జగద్గురు బోధలు” నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
శ్రీ మహాపెరియవ శరణం పరమాచార్యా రక్ష రక్ష
జయ జయ శంకర | హర హర శంకర
జయ జయ శంకర | హర హర శంకర
*సర్వే జనాః సుఖినోభవంతు
Sekarana from `కంచి కామకోటి పీఠం (JAGATHGURU BHODALU VOL-7)నుండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి