"కృష్ణుడికి, గోపికల మధ్య నిజానికి ఉన్నది భగవంతుడు భక్తుడు మధ్య గల ఉన్నది. పరమాత్మకు జీవాత్మకు మధ్య గల ఆత్మ సంబంధం. భగవంతుని కొలవడంలో వావివరుసలు, స్త్రీ పురుష బేధాలు అడ్డురావు కదా. అందరు కొలవవచ్చును, అందరు ప్రేమించవచ్చును, అందరు ఆరాధించవచ్ఛును కదా! దీనికి ప్రపంచంతో గాని, భౌతిక బంధాలతో గాని సంబంధం లేదు.
సహజంగా స్త్రీలు పురుషుల కన్నా దేవి దేవతల ఆరాధనలలో పూజలలో మనసావాచా కర్మణా నియమ నిష్టలతో ఎక్కువగా పాల్గొంటారు. శ్రీకృష్ణుడు గోపికలకు గల ఈ గాఢ భక్తిని, ప్రేమని గుర్తించి, ప్రతి ఒక్క గోపికకు ఒక్కొక్క కృష్ణుడిగా మారి దర్శన మిచ్చి ఆలింగనం చేసుకుని అక్కున చేర్చుకునే వాడు" అని నారద మహర్షి చెప్పింది విని దేవతాగణాలు సంతృప్తి చెందారు.
కానీ భూలోకంలో కృష్ణుడి రాసలీలలు గురించి గోపికల కుటుంబ సభ్యులకు అభ్యంతరం లేకపోయినా ఇతర సామాన్య జనాలు చెడుగా అనుకోసాగారు. చెడుగా అనుకుంటున్న ఆ మాటలు కృష్ణుడి సోదరుడు బలరాముడి చెవికి చేరాయి.
"కృష్ణుడు వావివరుసలు, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా గోపికలందరితో రాసలీలలు ఆడుతున్నాడని. వాటి వలన కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సంప్రదాయాలు, సభ్యత చెడిపోతున్నాయి" అంటూ జనులు పలికే గుసగుసలు విన్నాడు. వెంటనే యమునా తీరంలో రాత్రి వేళ మురళిగానం చేస్తూ గోపికలను పిలుస్తున్న కృష్ణుడు దగ్గరకు వెళ్లాడు. గోపికలందరు తమ తమ ఇళ్ళను వదిలి రాసాగారు.
బలరాముడు వారిని చూపుతూ "కృష్ణా! ఏమిటీ రాసలీలలు. నీ వయస్సు ఏమిటి? గోపికల వయస్సు ఏమిటి? నీ ప్రవర్తన వలన నందకులానికి చెడ్డపేరు వస్తోంది. పరమాత్మ స్వరూపుడైన నీవు ఈవిధంగా సామాన్య మానవుని లాగా భౌతిక భోగాలకు బానిస కావచ్చున్నా" అని మందలించాడు.
అంతా విన్న కృష్ణుడు మందహాసం చేస్తూ "అన్నా! బలరామా! ఆదిశేషుడి అంశ అయినా నీవు కూడా భౌతిక సుఖాల దృష్టితో ఆలోచిస్తున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ వచ్చే గోపికలు ఎవరో తెలుసా? ఒకసారి త్రేతాయుగంలో లక్ష్మణుడుగా నా వెంట వనవాసానికి వచ్చినపుడు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకో! వనవాస సమయంలో మనం అనేక ముని ఆశ్రమాలు దర్శించాము.
ప్రతి ముని, తపస్వి నన్ను చూసి, నా రూపం చూసి ముగ్దులై నా శరీర స్పర్శ పొందాలని అనుకున్నారు. ఒక్కసారి నన్ను ఆలింగనం చేసుకోవాలని కోరుకున్నారు. నేను వనవాస దీక్షలో ఉండటం వలన వారి కోరికను తిరస్కరించాను. మునులు "భగవంతుడు భక్తుడి బంధం పవిత్రమైనది. భక్తుల కోరిక విష్ణువు అవతారమైన నేను తప్పక తీర్చాలి" అంటూ ప్రార్ధించారు. నేను వారితో "రామావతారంలో మీ కోరిక తీర్చలేను. ద్వాపరంలో శ్రీకృష్ణుడిగా జన్మిస్తాను. అప్పుడు మీరందరు గోపికలగా జన్మిస్తారు. బాలుడైన నన్ను మీరు తనివితీరా కౌగిలించుకోవచ్చును. నాతో సమయం గడపవచ్చును" అని మాట ఇచ్చాను.
మునులందరు ఇందుకోసం గోపికలుగా జన్మించారు. నేను నాటి వాగ్ధానం నెరవేరుస్తున్నాను. తల్లిని, తండ్రిని, భర్తను, సోదరుడిని, సోదరిని, కుమారుడిని, కుమార్తెని గురువుని, దైవాన్ని కౌగిలించుకోవడం తప్పు కాదు కదా! మరి ఇప్పుడు గోపికలకు అన్ని నేనే. ఇదే రాసలీలల పరమార్ధం.
గోపికలందరితో ఏకాంతంగా గడుపుతున్నాను అని అంటున్నావు. అసలు అందరిలో నేనే ఉన్నప్పుడు, నాతో నేను ఉండటంలో తప్పులేదు కదా. ఒకసారి ఆ వచ్చే గోపికల వంక దివ్య దృష్టితో చూడూ! అర్ధం, పరమార్ధం నీకే తెలుస్తుంది" అనడంతో బలరాముడు గోపికల వంక చూశాడు.
బలరాముడికి ప్రతి గోపికలో ఒక కృష్ణుడు కనపడ్డాడు. అదే సమయంలో కృష్ణుడు నుంచి అనేక కృష్ణ రూపాలు వెలువడి ప్రతి ఒక్క గోపిక దగ్గరకు ఒక్కో కృష్ణుడిగా వెళ్లి కలిసాడు. అందరు జంటలై నృత్యగానాలు చేయసాగారు. అంతా కృష్ణమయం. రాసలీలల పరమార్ధం బలరాముడికి అప్పుడు అర్ధమయ్యింది. భగవంతుడిలోను, భక్తుడిలోను ఉండే పరమాత్మ, జీవాత్మ ఒకరే కదా.
బృందావనంలో గోపికల తండ్రులకు, భర్తలు, సోదరులు, కుమారులు కృష్ణుడి దగ్గరికి గోపికలు రావడాన్ని ఎందుకు అభ్యంతరం పెట్టలేదో, ఎందుకు అడ్డు చెప్పలేదో ఇప్పుడు అర్ధమైంది. బలరాముడు కృష్ణుడికి నమస్కరించి "నారాయణా! నీ లీలలు తెలుసుకోవడం, అర్ధంచేసుకోవడం ఆదిశేషుడినైనా నా వలనే కాలేదు. ఇక సామాన్య మానవులకు ఎలా అర్థం అవుతుంది. నీ మురళి గానానికి సమస్త సృష్టి పరవశి స్తున్నప్పుడు, గోపికలు సంసార బంధనాల వదిలి రావడంలో తప్పులేదు" అన్నాడు.
శ్రీకృష్ణుడు మందహాసం చేస్తూ "అన్నా! నా అవతారంలో రాసలీల అనేది త్రేతాయుగం నాటి మునుల కిచ్చిన మాట నెరవేర్చడం కోసం మాత్రమే. త్వరలో అది పూర్తవుతుంది. మన అవతార లక్ష్యాలు, చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. రాబోయే శరత్కాల పూర్ణిమరాత్రి గోపికలతో జరిపే రాసలీల ఆఖరిది అవుతుంది. తరువాత మనం బృందావనం వదలి శాశ్వతంగా వెళ్లిపోతాము. సిద్దంగా ఉండు" అని మురళి గానం ఆరంభించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి