10, మార్చి 2026, మంగళవారం

వార్ధక్యం

 శ్రీరామ (6)


( కాన్సర్ వ్యాధిలాగా  చూస్తుండగానే  క్షణ క్షణము శరీరాన్ని క్షీణింపజేసే భయంకరమైన వార్ధక్యం రాబోతోంది. 

ఆత్మీయులతో వియోగం మొదలైన  భరింపరాని దుఃఖాలు రాబోతున్నాయి.

ఆ సమయంలో చిత్తం చెదిరిపోకుండా ఉండటానికి, 

సమస్త దుఃఖాలు నశించి ముక్తి పొందటానికి,  బ్రహ్మజ్ఞానమే ( భగవంతుని తెలుసుకోవడం అనబడే ఆత్మజ్ఞానమే)

ఔషధం.

దానికోసం ఇప్పటినుండే కృషి చేయాలి).


శ్లో// ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).

                                 -----------


బ్రహ్మజ్ఞానమన్నా, ఆత్మజ్ఞానమన్నా, ఒకటే.


భగవంతుని "సత్, చిత్, ఆనంద" స్వరూపుడుగా ఉపనిషత్తులు వర్ణిస్తున్నాయి.

ఉపనిషద్వాక్యాలు  వినడానికి మాత్రమే చాలా బాగుంటాయిగానీ అర్థం కావు.

అయినా  అర్ధమైనట్లే ఉంటాయి.

వీటిని అర్థం చేసుకొనుటకు పురాణములు, వివిధ దేవతా స్తోత్రములు  సహకరిస్తాయి.

అందుకే నిత్యము పురాణములను, దేవతా స్తోత్రములను చదువుతూ ఉండాలి.

ఈ క్రింది శ్లోకము చూడండి, ఎంత బాగా ఈశ్వర తత్త్వాన్ని ఉపదేశిస్తున్నదో !


శ్లో//అవికారాయ శుద్ధాయ, నిత్యాయ పరమాత్మనే/

సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే//

(ఎటువంటి పరిణామములు లేనివాడు,

 ఎటువంటి మలినములు లేని పరిశుద్ధతత్త్వముతో కూడిన వాడు,

నిత్యుడు, అనగా ఎల్లప్పుడూ ఉండేవాడు, 

సమస్త జీవులకు ఆత్మస్వరూపుడు,

ఎల్లప్పుడూ  ఒకేవిధమైన సత్, చిత్, ఆనంద, స్వరూపంతో వుండే వాడు,

సర్వవ్యాపి,

జయశీలి,

అయిన శ్రీమహావిష్ణువునకు నమస్కారము).


 ఉపనిషద్వాక్యాలు మనకు అర్థమయ్యేటట్లు పై విధంగా చెప్పేవే పురాణోక్త  విష్ణు సహస్రనామ, లలితా సహస్రనామాది స్తోత్రాలు.


ఆత్మజ్ఞానం విషయానికి వస్తే,

" ఈ సృష్టిలో ప్రతి అణువు ప్రతి క్షణము పరిణామం చెందుతున్నది.

ఈ పరిణామములను చూస్తూ,ఎటువంటి పరిణామము చెందకుండా " నేను "  అనే భావం నిత్యంగా ఉన్నది.


శ్లో// అహమస్మి, సదాభామి, కదాచిన్నాహమప్రియమ్ /

బ్రహ్మైవాహమతస్సిద్ధం సచ్చిదానంద లక్షణమ్//


( " అహమస్మి " ("నేను" అనే భావంతో  ఎప్పుడూ ఉన్నాను).

" సదా భామి " (ఎప్పుడూ తెలివితోనే వున్నాను).

"  కదాచిన్నాహమప్రియః " (నాకు నేను ఎప్పుడు అప్రియుడిని కాను. అనగా "నేను" అనే భావం నాకెంతో ప్రియమైనది).

" బ్రహ్మైవాహ మతః సిద్ధం సచ్చిదానంద లక్షణమ్" (అందువలన నేను సచ్చిదానంద లక్షణములు గల బ్రహ్మ స్వరూపుడనని సిద్ధించినది).

కాబట్టి 

" అహం బ్రహ్మాస్మి "  (నేనే బ్రహ్మను).

 " బ్రహ్మైవాహమస్మి " (బ్రహ్మమే నేను).


సన్మార్గంలో నడుస్తూ, ఎంతోకాలం  సద్గురువులను సేవిస్తూ, వారు చెప్పిన ఉపదేశములు  మననం చేసుకుంటూ ఉంటే  వారి అనుగ్రహ భాగ్యంతో  ఈ వాక్యాలు అర్థమవుతాయి.


అందువల్ల విజ్ఞుడైన వాడు తాత్కాలిక సుఖాన్నిచ్చే ప్రాపంచిక వ్యవహారములలో మునిగిపోకుండా,

తన శ్రేయస్సు కోసం, సద్గురువులను ఆశ్రయించడం,

 సత్కర్మలు నిరంతరం ఆచరిస్తూ ఉండటం, మొదలైనవాటితో కూడిన  " గొప్ప ప్రయత్నం చెయ్యాలి " అంటున్నారు భర్తృహరి మహాయోగి.


శ్లో// యావత్ స్వస్థమిదం శరీర మరుజం యావచ్చ దూరే జరా/

యావచ్చేంద్రియ శక్తి రప్రతిహతా యావత్ క్షయో నాయుష:/

ఆత్మ శ్రేయసి తావదేవ విదుషా కార్య:ప్రయత్నో మహాన్/

సందీప్తే భవనేతు,కూప ఖననం ప్రత్యుద్యమ:  కీదృశ:// (భర్తృహరి మహాయోగి).


(ఈ శరీరములో ఆరోగ్యము, స్వస్థత ఉన్నప్పుడే,

ముసలితనం రాక ముందే, 

ఇంద్రియ పాటవం తగ్గక ముందే,

 ఆయుర్దాయము క్షీణింపక ముందే, 

తెలివి గలవాడు, 

తన శ్రేయస్సు కోసం,

సమస్త దుఃఖములను నశింపజేసే మోక్షప్రాప్తికోసం,

 గొప్ప ప్రయత్నం చెయ్యాలి. 

ఏదో ప్రయత్నించాము అన్నా,ముందెప్పుడో ప్రయత్నిద్దాం అన్నా, ఉపయోగం లేదు,  ఇప్పుడే గొప్పప్రయత్నం చెయ్యాలి అంటున్నారు మహాయోగి.

దేహంలో అన్ని శక్తులు నశించిన పిదప,ప్రయత్నంచేయడము అంటే, ఇల్లు తగలబడి పోతున్నప్పుడు, అగ్నిని చల్లార్చే నీటి కోసం అప్పుడు బావి త్రవ్వడం మొదలు పెట్టడం వంటిది).


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

10-3-'26.

కామెంట్‌లు లేవు: