11, మే 2026, సోమవారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*సోమవారం 11 మే 2026*


          *శ్రీ మహావిష్ణు పురాణం*                                      

                  *85 వ భాగం*


       *శ్రీరామావతారo-6*


           *అరణ్యవాసం*```


భరత శత్రుఘ్నలు కేకయ రాజ్యం వెళ్లిన కొంతకాలానికి అయోధ్య లో దశరథుడు ఓ రాత్రి నిద్రలో దుస్స్వప్నం కన్నాడు. తన ప్రియమైన రాముడు తనను విడిచి దూరంగా వెళ్లిపోయినట్టు వచ్చిన ఆ కల నిద్ర నుంచి దశరథుని మేలుకొల్పింది.


నాడు శ్రవణ కుమారుని శబ్దవేది బాణంతో జంతువనుకుని చంపినప్పుడు, అతని అంధ తల్లితండ్రులు తనను వారిలాగే “పుత్రవియోగంతో చనిపోతావు" అని శాపం ఇచ్చి మరణించిన విషయం జ్ఞాపకం వచ్చింది. "తన కుమారుడు తన నుంచి దూరం కాకుండా ఉండాలంటే శ్రీరాముని వెంటనే అయోధ్యకు రాజును చేయాలి. అప్పుడు తనను, రాజ్యాన్ని వదలి రాముడు వెళ్లడు" అని ఆలోచన చేసి దశరథుడు వెంటనే వసిష్ట మహర్షిని రమ్మని సందేశం పంపాడు.


వసిష్ట మహర్షి రాగానే దశరథుడు “శ్రీరామునికి వెంటనే పట్టాభిషేకం చేయాలి. తగిన ముహుర్తం చూడండి” అని కోరాడు. 


దశరథుని మనస్సు లోని ఆందోళన, భయం తెలుసుకున్న వసిష్టుడు శ్రీరామ పట్టాభిషేకానికి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామునే శుభ ముహూర్తంం పెట్టాడు.


అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయించి శ్రీరాముని పిలిచి దశరథుడు పట్టాభిషేకానికి ససంసిద్థుడవి కమ్మని ఆదేశించాడు. 


తండ్రి మాట జవదాటని రాముడు వసిష్టమహర్షి చెప్పినట్లు పట్టాభిషేకానికి ముందు జరగవలసిన విధులలో పాల్గొన్నాడు.


మరుసటి రోజు ఉదయమే శ్రీరాముని పట్టాభిషేకం అని రాజ్యమంతా చాటింపు వేయించారు. అంతపురంలో దాసీజనం చర్చించుకుంటున్న ఈ సమాచారం కైకేయి దాసి మంధర విని పరుగున వెళ్లి కైకేయికి చెప్పింది. “ప్రియపత్ని కైకేయికి తెలియకుండా దశరథుడు రాముని ప్రభువుగా చేయాలని కుట్ర పన్నాడని నాడు వివాహ సమయంలో కైకేయి పుత్రునే రాజుని చేస్తానన్న వాగ్దానాన్ని మరచి పోయాడని, భరతుడికి జరిగే అన్యాయం ఆపమని" మంధర కైకేయిని రెచ్చగొట్టింది.


కైకేయి కోపగృహానికి వెళ్లి దశరథునికి రమ్మని సమాచారం పంపింది. రాముని పట్టాభిషేక వార్త చెప్పి కైకేయిని శాంతపరచాలని వచ్చిన దశరథుని కైకేయి తనకు దేవదానవ యుద్దంలో చేసిన సహాయానికి ఇచ్చిన రెండు వరాలు గుర్తు చేసింది. 

ఆ వరాలు ఇప్పుడు కోరుకుంటున్నాను అని "మొదటి వరముగా రామునికి బదులు భరతుడికి పట్టాభిషేకం చేయాలి. రెండవ వరముగా రాముని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపాలి"


కైకేయి వరాలు విన్న దశరథుడు దుఖంతో కుప్పకూలి పోయాడు. "భరతుడికి పట్టాభిషేకం చేస్తానని, రాముని మాత్రం వనవాసం పంపాలనే వరం కోరుకోవద్దని" కైకేయికి నచ్చచెప్పడానికి విఫల ప్రయత్నం చేసాడు. 


కైకేయి తను కోరిన వరాలు ఇవ్వవలిసిందే అని పట్టుబట్టేసరికి మాట తప్పలేని దశరథుడు రాముని వీడలేక దుఖంతో సృహ కోల్పోయాడు.


కైకేయి రాముని పిలిపించి దశరథుడు తనకు ఇచ్చిన వరాల గురించి చెప్పి శ్రీరాముని వనవాసానికి వెళ్లమంది. 

తండ్రి మాట శిరసావహించిన రాముడు, సృహ వచ్చిన దశరథుడు వద్దని కోరుతున్నా వినకుండా నారవస్త్రాలు ధరించి పద్నాలుగు ఏళ్ల వనవాసానికి సిద్దమైయ్యాడు. వనవాసం సంగతి తెలిసిన సీతాదేవి, లక్ష్మణుడు శ్రీరాముడు వారించినా పట్టుబట్టి రాముని వెంట వనవాసానికి పయనమయ్యారు.


అయోధ్య ప్రజానీకం కూడా సీతారామ లక్ష్మణుల వెంట అయోధ్య వీడి వనవాసానికి బయలుదేరింది. 


సరయూ నదీ తీరాన నిద్రిస్తున్న అయోధ్య ప్రజలను అర్ధరాత్రి వేళ వదిలి రాముడు సీతాలక్ష్మణులతో నది దాటి అవతల తీరం వైపు వెళ్లాడు.


అయోధ్యలో దశరథుడు రాముని వియోగం భరించలేక మరణించాడు. మంత్రి సుమంతుడు, వసిష్ట మహర్షి కేకయ రాజ్యంలో ఉన్న భరత శత్రుఘ్నలను అయోధ్యకు వెంటనే రప్పించారు. తండ్రి మరణానికి, శ్రీరాముని వనవాసానికి తన తల్లి కైకేయి కోరిన వరములే కారణమని తెలిసిన భరతుడు తల్లి కైకేయిని నిందించి పరిత్యజించాడు. 

వసిష్ట మహర్షి ఉపదేశానుసారం తండ్రి దశరథునికిఅంత్యక్రియలు నిర్వహించాడు.


"తనకు రాజ్యాధికారం పై కోరిక లేదని, అన్న శ్రీరాముడే అయోధ్యకు రాజు" అని ప్రకటించిన భరతుడు శ్రీరాముని అయోధ్యకు తీసుకురావడానికి వసిష్టుడు, తల్లులు, మంత్రులను తీసుకుని సైన్యం వెంట రాగా బయలుదేరి వెళ్లాడు. సరయూ నది అవతల తీరాన గల చిత్రకూటం చేరాడు. 

శ్రీరాముని వద్దకు వెళ్లి రామలక్ష్మణులకు తండ్రి దశరథుని మరణవార్త వినిపించి దుఃఖించాడు.


రామలక్ష్మణులు నదీతీరాన తండ్రికి తర్పణాలు వదిలారు. భరతుడు శ్రీరాముని పాదములకు నమస్కరించి "తల్లి చేసిన తప్పులకు తనకు సంబంధం లేదని, రాజ్యం అగ్రజుడైన శ్రీరామచంద్రునిదేనని, అయోధ్య వచ్చి రాజ్య పాలన చేపట్టమని" ప్రార్ధించాడు.


"తండ్రికి యిచ్చిన మాట తప్పనని, పద్నాలుగు ఏళ్ల వనవాసం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యం స్వీకరిస్తానని" శ్రీరాముడు భరతునికి నచ్చచెప్పాడు. అంతవరకు తన తరపున ప్రతినిధిగా రాజ్యపాలన నిర్వహించమని భరతునికి చెప్పగా- 


భరతుడు "రాముని పాదుకలు సింహాసనం పై ఉంచి పరిపాలన చూస్తానని, పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఒక్క నిమిషం రావడం ఆలస్యమైనా ప్రాణ త్యాగం చేస్తానని" ప్రతిజ్ఞ చేసి అయోధ్యకు వెళ్ళాడు.


అయోధ్య సమీపంలో నందిగ్రామం వద్ద పర్ణశాల నిర్మించుకుని భరతుడు రాజసింహాసనం తెప్పించి రామ పాదుకలు ఉంచి పాలన చేయసాగాడు. తానూ రాముని వలె నారవస్త్రాలు ధరించి వనవాస జీవితం గడుపుతూ ఉండసాగాడు. అయోధ్యకు, అయోధ్య ప్రజలకు దూరంగా ఉండి వనవాసం గడపాలని శ్రీరాముడు తలచాడు. చిత్రకూటం వదలి దండకారణ్యం వైపు బయలుదేరి వెళ్లారు. 


దండకారణ్యం రావణుని అధీనంలో రాక్షసుల నివాసమై ఉంది. తాటకి మారీచ సుబాహువులు తరువాత ఖర దూషణ శూర్పణఖలు దండకారణ్య మధ్యప్రాంతానికి ఆధిపత్యం వహించి మునుల ఆశ్రమాలను ధ్వంసం చేసేవారు. యజ్ఞయాగాదులు చేయకుండా అడ్డం పడేవారు. మునుల అభ్యర్ధన పై శ్రీరాముడు దండకారణ్యంలో ప్రయాణిస్తూ రాక్షసులను సంహరిస్తూ, మునులకు ప్రశాంత జీవనం కల్పిస్తూ అగస్త్యాశ్రమం చేరాడు.


అగస్త్య మహర్షి మార్గదర్శనం పై దండకారణ్యంలో గోదావరి తీరాన పంచవటిలో ఆశ్రమం నిర్మించుకుని వనవాసం గడపసాగాడు. దండకారణ్యంలో ధర్మాన్ని స్థాపించి మునులకు సహాయంగా ఉంటూ శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలసి పదమూడేళ్ళు వనవాస జీవితo గడిపాడు.


               *(సశేషం)*

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: