🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*ఆదివారం 31 మే 2026*
*శ్రీమహావిష్ణుపురాణం*
*105వ భాగం*
*శ్రీకృష్ణావతారము -8*
*ధేనుకాసుర, ప్రలంబాసుర వత్సా సుర, బకాసుర సంహారం*```
కాళింది మడుగు నీళ్ళు కృష్ణ స్పర్శతో స్వచ్ఛమై పక్షులు, జంతువులు, మానవులు త్రాగడానికి అనుకూలంగా మారాయి. కాళింది మడుగు పరిసరాలు సందడి సందడిగా మారాయి. కృష్ణుడి వెంట ఉండే గోపబాలురు, వారి తల్లిదండ్రులు కృష్ణుడు దివ్యత్వం కలిగినవాడు అని తెలుసుకున్నారు. తమను ఎటువంటి ఆపద నుండి అయినా రక్షిస్తాడు అనే నమ్మకం, విశ్వాసం కలిగింది. నిర్భయంగా గోపాలురు, బలరామకృష్ణుల వెంట వనాలలో గోవులను కాస్తూ తిరగసాగారు.
గోకులం నుంచి మాయమైన బలరామ కృష్ణులు,గోకులవాసులు,కాళింది మడుగు సమీపాన బృందావనంలో నివసిస్తున్నారు అన్న సంగతి "కాళీయమర్ధన"విశేషాలు విన్న కంసుడికి తెలిసింది.
తన సేవకులైన రాక్షసులనందరిని కృష్ణుని అంతం చేయమని ఆదేశించి బృందావనానికి పంపాడు.
బృందావనానికి అలా మొదట వచ్చిన రాక్షసుడు వత్సాసురుడు. ఆవుదూడ రూపం దాల్చి గోవుల మందలో చేరిపోయాడు. కృష్ణుని సమీపంలోనే ఉంటూ చంపడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.
మందలో ఉండే గోవులు, గోవత్సాలు (లేగలు) కృష్ణుడికి తెలుసు. ప్రతి దానికి పేరు పెట్టి, ఆ పేరుతో పిలిచేవాడు.
ఈ గోవత్సము కొత్తగా చేరింది. గోవుల సమీపంలో గోవత్సాలు
ఉంటాయి. ఈగోవత్సము మాత్రం కృష్ణుని వద్దనే ఉండేది. ‘వీడెవడో రాక్షసుడు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు’ అని అర్ధమైంది.
ఒకరోజు గోపబాలురు గోవులను, గోవత్సాలను కృష్ణుడికి దూరంగా మేతకు తీసుకెళ్లారు. వత్సాసురుడు వెళ్లినట్టే వెళ్లి తిరిగి కృష్ణుడి వద్దకు వచ్చాడు. కృష్ణుడు చూసి ఆ రోజు వాడికి మోక్షం కలిగించాలని అనుకున్నాడు. బలరామునికి కొద్దిదూరానికి వెళ్లి ఉండమని సైగ చేసాడు. బలరాముడు కొద్ది దూరం వెళ్లి చెట్టు చాటునుండి చూడసాగాడు.
ఎవరూ కృష్ణుడి పక్కన లేకపోవడం చూసి వత్సాసురుడు తన గిట్టలతో కుమ్మి చంపాలని వేగంగా కృష్ణుడి మీదకు రాసాగాడు. కృష్ణుడు వాణ్ణి దగ్గర వరకు రానిచ్చి చటుక్కున మెడను రెండు చేతులతో పట్టుకుని గాలిలో గిరగిరా వేగంగా తిప్పి తిప్పి విసిరివేసాడు. గడ్డిపోచలా ఆకాశంలో ఎత్తుకి ఎగిరిన రాక్షసుడు భూమి మీద పడి తల పగిలి రక్తం కక్కుకుని చచ్చి పోయాడు.
మరణించేటప్పుడు రాక్షసుని అరుపులు విని, రాక్షసుడి భారీ కాయము చూసి గోపబాలురు ఏమి భయపడలేదు. మరొక రాక్షసుడి పీడ మా కన్నయ్య వదిలించాడు అని సంబరపడ్డారు. బలరామ కృష్ణులు గోప బాలురను తల్లి తండ్రులకు, గ్రామంలోని వారికి ఏమి చెప్పవద్దని ఆదేశించారు. అందరు కలసి ఆ రాక్షసుడి దేహము దహనం చేశారు.
*తరువాత వచ్చినవాడు బకాసురుడు. పేరుకు తగ్గట్టే భయకర కొంగ రూపం దాల్చి గోపాలురు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత నీరు త్రాగే సరస్సువద్ద నిలిచాడు. గోపాలురు రోజూలాగానే మధ్యాహ్నభోజనం చేసి నీరుత్రాగుతున్నారు. పర్వతాకారంలో ఉన్న కొంగ వారిని తినాలని పరిగెత్తు కుంటూ వచ్చింది. గోపబాలురు ‘కృష్ణా కృష్ణా’అంటూ అరవసాగారు.
కృష్ణుడు పరుగున వచ్చి కొంగ ముందు నిలిచాడు. బకాసురుడు కృష్ణుని పట్టుకుని మింగటానికి ప్రయత్నించాడు.
కృష్ణుడు నోటికి అడ్డంగా నిలిచాడు. తన ఆకారం పెంచాడు. బకాసురుడు మింగాలేక కక్కాలేక ఇబ్బంది పడుతు న్నాడు. కృష్ణుడు కిందభాగం నొక్కిపెట్టి పైభాగాన్ని చేతులతో పట్టుకుని చీల్చివేశాడు. బకాసురుడు అరుస్తూ తన రాక్షస రూపం దాల్చి చచ్చి పోయాడు.
*తరువాత కృష్ణుడి చేతిలో మరణించింది ధేనుకాసురుడు. బృందావనం సమీపంలో గల తాటివనం ఆక్రమించి తన సేవకులతో ఉంటూ ఎవరినీ రాకుండా చంపేసేవాడు. తాటి వనంలో తాటిఫలాలు మహారుచిగా ఉంటాయని గోపబాలురు చెప్పడంతో కృష్ణబలరాములు తాటివనంలో ప్రవేశించారు. అడ్డువచ్చిన వారిని కొట్టివనంలో తాటిచెట్లు ఎక్కి పళ్లు కోసి గోప బాలురకి ఇవ్వసాగారు.
దెబ్బలు తిని పారిపోయిన కాపాలావాళ్ళు ధేనుకాసురుడికి చెప్పారు. ధేనుకాసురుడు, తన తోటి రాక్షసులు గార్ధభ రూపం దాల్చి గోపబాలురని తరుముతూ బలరాముడు,కృష్ణుడి వద్దకు వచ్చారు. బలరాముడు మిగిలిన రాక్షసుల పని పట్టగా, కృష్ణుడు ధేనుకాసురుడి ముందు రెండు కాళ్లు పట్టుకుని గిరగిరా తిప్పి ఆకాశంలోకి విసిరేశాడు.
వాడు రాక్షస రూపం దాల్చి భూమి మీద పడి రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. ధేనుకాసురుని తాటివనం అందరిది అయ్యింది.
*ధేనుకాసురుడి మరణవార్త విని కంసుడు ప్రలంబాసురుడు అనే మరో రాక్షసుని పంపాడు. వాడు ఒక గోపబాలుని రూపం ధరించి గోపబాలురిలో కలసి బలరామ కృష్ణుల వెంట వనాలలో తిరుగసాగాడు. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో అదృశ్యమై వనంలో ఉండేవాడు.
ప్రలంబాసురుడు గోపబాలునిగా బాగా కలసి పోయి ఆటలు ఆడుతుండంతో గోపబాలురు అతనెవరో పట్టించు కోలేదు. కాని బలరామ కృష్ణులు గ్రహంచారు. సమయం చూసి భరతం పడదామని ఉన్నారు.
బలరాముడు కృష్ణుని ఈసారి రాక్షసుని చంపే అవకాశం తనకి ఇవ్వమని కోరాడు.
ఆ రోజు బల రామ కృష్ణులు తమ రూపాలు మార్చుకున్నారు. బలరాముడు కృష్ణుడయ్యాడు. కృష్ణుడు బల రాముడయ్యాడు. ప్రలంబాసురుడు గోపబాలురతో గోపబాలుడిగా ఆడుతూ, ఆటలో ఓడిపోయిన వారు, గెలిచిన వారిని భుజాలపై ఎత్తుకుని వనం చివరన ఉన్న వృక్షము దాకా వెళ్లివెనక్కురావాలి అని నియమం పెట్టాడు.
ఆటలో ప్రలంబుడు కావాలనే కృష్ణుని చేతిలో ఓడిపోయాడు. అది చూసి బలరాముడు కూడా ఒక గోపబాలుడి చేతిలో ఓడి పోయాడు. ఆట నియమం ప్రకారం ప్రలంబుడు కృష్ణుని భుజాలపైకి ఎత్తుకుని వేగంగా వెళ్ళ సాగాడు. బలరాముడు గోపబాలుని ఎక్కించుకుని ప్రలంబుడి వెంట వెళ్ళసాగాడు. దూరంగా వనం చివరకు తీసుకెళ్లి రాక్షసరూపందాల్చి కృష్ణుని చంపేయాలని అనేది ప్రలంబుడి పన్నాగం.
కానీ ఆ రాక్షసుడికి తెలియనది బలరామ కృష్ణులు తమ ఆకారాలు మార్చుకుని ఉన్నారన్న సంగతి.
గోపబాలురకు కనపడకుండా దూరంగా వేగంగా వెళ్ళుతున్న ప్రలంబుడినిచూసి బలరాముడి రూపంలోని కృష్ణుడు చూసి "అన్నా! బలరామ! ప్రలంబాసురుని చంపేయి" అని వినపడేంత గట్టిగా అరిచి ఆగిపోయాడు.
ప్రలంబుడు "నేనుఎక్కించుకుంది కృష్ణుని కదా! బలరామా అని బలరాముని పిలుస్తాడేమిటి!" అని ఆశ్చర్యంగా పరిగెడుతునే తలెత్తి చూశాడు.
పైన కృష్ణుడి మాటలతో కృష్ణ రూపం వదలిన బలరాముడు కనిపించాడు. కృష్ణుడి మాటలు విని బలరాముడు ప్రలంబాసురుడు మెడలు విరిచి తలపై చావు దెబ్బ కొట్టి సంహరించాడు.
చనిపోయిన రాక్షసుడి దేహాన్ని గోపబాలురు కాల్చివేశారు.
బలరామ కృష్ణులు ఊరిలో చెప్పవద్దన్నా వత్సాసుర, బకాసుర, ధేనుకాసుర, ప్రలంబాసుర సంహారాలు నంద యశోదలతో పాటు గ్రామంలోని వారందరికి తెలిసాయి. బలరామ కృష్ణుల బలపరాక్రములు నంద గ్రామంలో అందరికి తెలుసు కాబట్టి ఎవరు భయపడలేదు. బృందావనం రాక్షసుల పీడ నుంచి విముక్తి చెందినందుకు సంబరాలు చేసుకున్నారు.
కానీ కంసుడిలో అసహనం పెరిగి పోతోంది. చివరగా మిగిలిన తృణావర్త, అజగర, కేసి నామ రాక్షసులను కృష్ణుని అంతమొందిం చటానికి పంపాడు.
*తరువాత కథ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారిసౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి