- అష్టాదశ ప్రజలు - కరండం - ఉగ్రాణం.
..........................................
(అ) ముఖ్యాగ్రహారమనేది అత్యున్నత స్థాయిలోవున్న అగ్రహారం.రాజులు సామంతులు మొ॥వారు హిందూశాస్త్రా
లలో విశేష పాండిత్యం కలిగిన బ్రాహ్మణులకు గ్రామాలను దానంగా ఇచ్చేవారు. అలాంటి దానగ్రామాలను అగ్రహారాలు అంటారు. వాటిలో అన్ని హక్కులు ప్రత్యేకాధికారాలు కలిగిన అగ్రహారాన్ని ముఖ్యాగ్రహారమని పిలిచేవారు. వారికి
భోగాష్టకములు అంటేఎనిమిది భోగాధికారాలుండేవి. (1)పౌరోవాత్యం – పురోహిత వృత్తి నిర్వహించే హక్కు (2) యాజకత్వం – యజ్ఞయాగాదులు నిర్వహించే అధికారం (3) ప్రభుత్వం – గ్రామ పరిపాలన లేదా స్థానిక అధికార హక్కు (4) జ్యోతిస్సారం – జ్యోతిష్య సేవలు అందించే హక్కు (5) హేమముద్రా పరీక్షా – బంగారు నాణేలు లేదా ధన ప్రమాణాల పరిశీలన హక్కు (6) సాముద్రికం – శరీర లక్షణాల ఆధారంగా ఫలితాలు చెప్పే విద్య అంటే సాముద్రిక శాస్త్రం. (7) లేఖకనం – పత్రాలు, శాసనాలు, లెక్కలు వ్రాసే అధికారం (8) యాజమానము – నిర్వహణ పర్యవేక్షణ నాయకత్వహక్కు. ఈ భోగాష్టకములతో పాటుగా
అష్టతేజస్వామ్యములు అగ్రహారానికి సంబంధించిన సంపదలు. ఈ అష్టతేజస్వామ్యముల వనరులపై వారికి హక్కులు ఉండేవి.(1) నిధి – భూమిలో దొరికే నిధులు (treasure trove) (2) నిక్షేప – భద్రపరచిన ధనం లేదా దాచిన వస్తువులు (3) జల – నీటి వనరులపై హక్కు (4) పాషాణ/ఆళ్మసార – రాళ్లు, ఖనిజాలు లేదా భూసంపదలపై హక్కు (5) అక్షీణ – ప్రస్తుతం ఉన్న స్థిర ఆదాయాలపై హక్కు (6) ఆగామి – భవిష్యత్తులో వచ్చే ఆదాయాలపై హక్కు (7) సిద్ధ – ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఆస్తులు, ఫలసాయం (8) సాధ్య – భవిష్యత్తులో అభివృద్ధి చేయగల సంపదలపై హక్కు.ముఖ్యాగ్రహారం అనేది కేవలం భూమి దానం కాదు. గ్రామంలోని ఆదాయాలు నీటి వనరులు, నిధులు పరిపాలనా అధికారాలు పురోహిత హక్కులు విద్యా సంబంధిత అధికారాలు మొదలైన సమగ్ర హక్కులతో కూడిన గ్రామదానం. ఇలాంటి అగ్రహారాలను రాజులు వేదవేదాంగాలలో, శాస్త్రాలలో ప్రావీణ్యం కలిగిన సద్బ్రాహ్మణులకు బహుమతిగా ఇచ్చేవారు.
(ఆ) మంగలమంటే బ్రాహ్మణ అగ్రహారాలకు సంబంధించిన పేరు.
మంగలమనేది గ్రామ నామాల చివర వచ్చే ఒక ప్రత్యేక అంత్యపదం
ఉదాహరణకు
చతుర్వేది మంగలం
బ్రహ్మదేయ మంగలం
ఉత్తరమేరూరు మంగలం బ్రాహ్మణులకు దానంగా ఇచ్చిన గ్రామం. బ్రాహ్మణులు అధిక సంఖ్యలో నివసించే గ్రామాన్ని సూచిస్తుంది.శాసనాలలోని నిర్వచనం ప్రకారం
ఏబదియెనిమిది (58) బ్రాహ్మణ కుటుంబాలు కలిసి నివసించే గ్రామాన్ని మంగలము అంటారు.
అంటే ఒక గ్రామంలో కనీసం 58 బ్రాహ్మణ కుటుంబాలు స్థిరనివాసం ఏర్పరచుకొని వేదాధ్యయనం యజ్ఞయాగాలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ గ్రామం మంగలముగా పరిగణించబడేది.
చతుర్వేది మంగలమంటే నాలుగు వేదాలను అధ్యయనం చేసిన బోధించే బ్రాహ్మణులున్న చోటు.దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా చోళ పాండ్య విజయనగర కాలపు శాసనాల్లో చతుర్వేదిమంగలమనే పేరు చాలా సాధారణంగా కనిపిస్తుంది.
మంగలం అగ్రహారం బ్రహ్మదేయం మధ్య సంబంధమేమిటో చూద్దాం.బ్రహ్మదేయమంటే బ్రాహ్మణులకు దానం చేసిన భూమి లేదా గ్రామం.అగ్రహారమంటే బ్రాహ్మణ నివాస కేంద్రంగా ఏర్పడిన గ్రామం.మంగలమంటే నిర్దిష్ట సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలు నివసించే బ్రాహ్మణ గ్రామం.చోళుల కాలం ACE 9–13వ శతాబ్దాలలో దక్షిణ భారతదేశంలో అనేక గ్రామాల పేర్లకు మంగలమనే ప్రత్యయం జతచేయబడింది. ఇది ఆ గ్రామం బ్రాహ్మణ దానగ్రామం లేదా విద్యా కేంద్రం అని సూచిస్తుంది.
కనుక మంగలము కనీసం 58 బ్రాహ్మణ కుటుంబాలు నివసించే బ్రాహ్మణ గ్రామమే మంగలం.
(ఇ) కరండబేదకుడు అంటే కరండమనే వాయిద్యాన్ని వాయించువాడు.కరండమంటే 18 వాయిద్యాలలో ఒకటి.
అష్టాదశ (పదునెనిమిది) వాద్యాలేమిటో గమనిద్దాం.
(1) భేరి (2) మృదంగం (3) పటహం (4) దుందుభి (5) మద్దెల (6) తిమిల (7) ఇడక్క (8) ఉడుక్కు (9) కాహళం (10) శంఖం (11) కొమ్ము (12) వేణువు (13) సన్నాయి (14) తాళం (15) ఘంట (16) చెంగిలగాంగ్వాయిద్యం (17) కరడిక / కరండం (18) డమరు.ఈ
కరండం అష్టాదశ వాద్యాలలో ఒకటిగా కొన్ని శాసనాలలో ప్రస్తావించబడింది. అయితే నేటికి కరండం వాడుకలో లేకపోవడం వల్ల దాని నిర్మాణ విశేషాలు పూర్తిగా తెలియదు.
మధ్యయుగ దేవాలయాల్లో ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు రథయాత్రలు నిత్యసేవల సమయంలో అనేక వాద్యకారులు నియమించబడేవారు. అలా దేవాలయ సంప్రదాయంలో కరండవాదకుడు దేవాలయంలో, ఉత్సవంలో సంగీత బృందంలో కరండం అనే ప్రాచీన వాద్యాన్ని వాయించే కళాకారుడు అని అర్థం.
(ఈ) ఉగ్రాణము అనగా ధాన్యము ఇతర ఆహార నిల్వలు సరుకులను భద్రపరచే గిడ్డంగి.ఆంగ్లంలో దీనిని Granary అంటారు.గ్రామాలలో రైతులు పండించిన వరి, జొన్న, సజ్జ, గోధుమ, కొర్ర,సాములు, అరికెలు, అపరాలు వంటి ధాన్యాలను సంవత్సరమంతా నిల్వ ఉంచడానికి ప్రత్యేకంగా నిర్మించిన గృహాన్నే ఉగ్రాణము అని పిలిచేవారు.గరిసె అనేది ఉగ్రాణానికి తెలుగు పర్యాయపదం.గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ గరిసెలో ధాన్యం పోశారు. గరిసె నిండిపోయింది వంటి వాడుకలు కనిపిస్తాయి.ఉగ్రాణము అనే పదం సంస్కృతంలోని ఉగ్రాణ (Ugrāṇa) నుండి వచ్చింది.ధాన్యాగారం భాండాగారమనే అర్థాలు ఉన్నాయి.రాజ్యపాలనలో దేవాలయాలలో అగ్రహారాలలో ఉగ్రాణాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండేది.దేవాలయాలకు వచ్చిన ధాన్య దానాలు ఉగ్రాణాలలో నిల్వ చేసేవారు.రాజులు భూమిశిస్తుగా వసూలు చేసిన ధాన్యాన్ని రాజఉగ్రాణాలలో భద్రపరచేవారు.
కరువు కాలాల్లో ప్రజలకు పంపిణీ చేయడానికి ఉగ్రాణాలు ఉపయోగపడేవి.అందుకే కొన్ని శాసనాలలో ఉగ్రాణాధికారి (Granary officer) ఉగ్రాణపాలకుడు,ధాన్యాగారాధికారి వంటి పదాలు కనబడుతాయి.
(ఉ) అష్టాదశప్రజలు = గ్రామములోని 18 ప్రధాన సామాజిక (వృత్తి) వర్గాలకు చెందిన జనులను అష్టాదశ ప్రజలు అని పిలిచేవారు.
(1) బ్రహ్మ = బ్రాహ్మణులు (2) క్షత్రియ = పాలకులు యోధులు (3) వైశ్య = వ్యాపారులు (4) శూద్ర = వ్యవసాయ, సేవావర్గాలు (5) వ్యావహారిక = వర్తకులు, లావాదేవీలు నిర్వహించేవారు (6) గోరక్షక = పశుపోషకులు
(7) శిల్పక = శిల్పులు చేతివృత్తి నిపుణులు
(8) పంచాణ = విశ్వకర్మ వర్గానికి చెందిన ఐదు శిల్పకుల సముదాయం
(9) కుంభకార = కుమ్మరులు
(10) తంతువాయి = నేతలు (సాలెలు)
(11) క్షౌరక = మంగళ్లు (క్షురకులు)
(12) రజక = చాకళ్లు
(13) వస్త్రచ్ఛేదక – బట్టలు కుట్టేవారు (దర్జీలు)
(14) చర్మకార – చెప్పుల తయారీ, తోలు పనివారు
(15) తిలఘాతుక – గానుగలతో నువ్వులు ఇతర గింజలు ఆడించి నూనె తీసేవారు.(16) లబ్ధక – వేటగాళ్లు లేదా అటవీ ఉత్పత్తులు సేకరించేవారు (17) చండాల = గ్రామానికి చెందిన సమాచారాన్ని వార్తలను కొమ్ము లేదా తప్పెట ద్వారా చాటింపు వేయువారు.(18) మాతంగ – మాతంగ సమాజానికి చెందినవారు. వీరంతా కలసికట్టుగా స్థాయి భేదము లేకుండా గ్రామాభివృద్ధికి దేవాలయాల అభివృద్ధికి పాటుపడేవారు.
॥సేకరణII
................... జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి