10, మే 2026, ఆదివారం

*శ్రీ మహావిష్ణు పురాణం

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*ఆదివారం 10 మే 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

               *84 వ భాగం*


        *శ్రీరామావతారం-5*


సీతారామ కళ్యాణం:```

అయోధ్యలో దశరథుడు జనక మహారాజు దూత తెచ్చిన సందేశం “విశ్వామిత్ర మహర్షి ఆదేశంతో శ్రీరాముడు సీతాదేవి స్వయంవరంలో  శివధనుర్భంగం గావించి సీతాదేవి చేత వరింపబడ్డాడు” విని ఆనందపడ్డాడు.  కౌసల్య సుమిత్ర కైకేయిలకు చెప్పాడు. వారందరి ఆనందానికి అవధులు లేవు.


శుభ దినాన దశరథుడు కులగురువు వసిష్ట మహర్షి, భరత శత్రుఘ్నలు, బంధు మిత్రులు, ముఖ్య ప్రజలతో కలసి సీతరామ కళ్యాణం కోసం మిథిలానగరానికి బయలుదేరి వెళ్లారు.


జనకుడు తన బంధు మిత్ర పరివార జనంతో మిథిలానగర ముఖ ద్వారం వద్ద దశరథునికి, వచ్చిన అతిథులకి స్వాగతం పలికి  విడిది ఏర్పాట్లు చేసాడు.   విడిదిలో దశరథుడు వసిష్టునితో కలసి జనకునితో వివాహ లగ్నం గురించి చర్చిస్తున్నప్పుడు, జనకునికి మరో కుమార్తె ఊర్మిళ, జనక సోదరుడు- కుశధ్వజునికి మాండవి, శ్రుతకీర్తి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని తెలిసింది.  వారిని పిలిపించి దశరథుడు చూసాడు. తన కుమారులు భరత లక్ష్మణ శత్రుఘ్నలకు తగిన వధువులు అనిపించింది.


నలుగురి కుమారుల వివాహం ఒకేసారి చేయాలని తలచి జనకునితో మనస్సు లోని విషయం ప్రస్తావించాడు. జనకుని ఆనందానికి హద్దులేదు. కుశధ్వజుడు కూడా అంగీకరించాడు.   కులగురువు వసిష్టుడు, జనకుని పురోహితుడు శతానందుడు జాతకాలు పరిశీలించి భరతునికి మాండవితో, లక్ష్మణునికి ఊర్మిళతో, శత్రుఘ్నునికి శుత్రకీర్తితో వివాహం చేయవచ్చని తెలిపారు.


దశరథుడు, జనకుడు వెంటనే భరతుడు మాండవికి, లక్ష్మణుడు ఊర్మిళకు, శత్రుఘ్నడు  శుత్రకీర్తిలకు పెళ్ళి చూపులు ఏర్పాటు చేసి అభిప్రాయం అడిగారు.   

ఒకరికొకరు నచ్చి పెళ్ళి చేసుకోవడానికి వారు ఆనందంగా అంగీకరించారు. 


నాలుగు వివాహాలు ఒకే ముహుర్తానికి ఒకే వేదిక పై జరిపించాలని సుముహూర్తం నిశ్చయించారు. చైత్ర శుద్ద నవమి శ్రీరామచంద్రుని జన్మదినం. సీతారాముల కల్యాణానికి అదే శుభముహుర్తం అని పురోహితులు నిర్ణయించారు. నలుగురి అన్నదమ్ముల వివాహానికి ఆ ముహుర్తం సరైనది అని భావించి వివాహ ఏర్పాట్లు చేయసాగారు.  జనకుడు మగపెళ్ళివారి అంతస్థుకు తగినట్టు విడిది మందిరాలు ఏర్పాటు చేసాడు. 


భూలోకంలో సకల దేశ రాజులను వివాహానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు పంపారు. దేవలోక వాసులను పిలవడానికి నారద మహర్షి ఊర్ధ్వలోకాలకు వెళ్లాడు.  శ్రీ సీతరామ కళ్యాణం చూడటానికి దేవలోక భూలోక వాసులందరు ఆనందోత్సాహాలతో మిథిలకు తరలి రాసాగారు.


జనకుడు రంగ రంగ వైభవంగా వివాహ ఏర్పాట్లు చేశాడు. ఆకాశమంత పందిరి, వేదిక నిర్మించారు. వచ్చిన అతిథిలందరికి సంతృప్తి చెందేలా భోజనం, వసతి కల్పించారు. సుముహూర్తం రోజు రానే వచ్చింది. శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నలను  పెళ్లికుమారులుగా దశరథుని విడిది భవనంలో, సీతా ఊర్మిళ మాండవీ శ్రుతకీర్తులను జనకుని రాజభవనంలో పెళ్ళికుమార్తెలుగా  మంగళ స్నానాలు, అలంకరణలు చేసి కళ్యాణ వేదిక వద్దకు మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా నృత్య గానాలతో తీసుకువచ్చారు.


మిథిలానగర వాసులు భూమి పై, దేవ గంధర్వులు కిన్నెర కింపురుషులు ఆకాశం నుండి పెళ్లికుమారులు, పెళ్ళికుమార్తెల పై పూల వర్షం కురిపిస్తున్నారు. కళ్యాణ వేదిక వద్దకు వచ్చిన వారిని వసిష్ట విశ్వమిత్రాది మహర్షులు, శతానందుడు వేద మంత్రాలు చదువుతూ వివాహ విధులు పూర్తి చేయించారు.


జనకుడు భార్య సునయనతో కలసి జానకిని, ఊర్మిళను శ్రీరామ లక్ష్మణులకు సాలంకృత కన్యాదానం చేశాడు. కుశధ్వజ దంపతులు మాండవీ శ్రుతకీర్తులను భరత శత్రుఘ్నలకు సాలంకృత కన్యాదానం చేసారు. తరువాత పురోహితులు వధూవరుల చేత సప్తపది, అగ్నిహోమం మొదలైన వివాహ విధులు నిర్వర్తింప చేశారు.


చూచినవారందరికి కన్నుల పండుగగా సీతారామ కళ్యాణం మహావైభవంగా జరిగింది. పరమేశ్వరుడు పార్వతీదేవి, బ్రహ్మదేవుడు సరస్వతీదేవి, ఇంద్రుడు శచీదేవి మరియు ఇతర దేవతలు తమ పత్నులతో అదృశ్యంగా వచ్చి నూతన వధువరులను పూలు అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. వసిష్ట విశ్వమిత్రాది మహర్షులు, అంగ వంగ కళింగ కాశీ తదితర రాజ్యాల రాజులు ఆశీస్సులు అభినందనలు తెలిపారు. కళ్యాణ మహోత్సవం తిలకించిన అతిథులందరు ఆనందంతో తమ తమ నివాస ప్రదేశాలకు తిరిగి వెళ్లారు.


మిథిలలో వివాహ తదనంతర విధులు పూర్తి చేసిన తర్వాత జనక దంపతులు, కుశధ్వజ దంపతులు తమ కుమార్తెలకు అప్పగింతలు జరిపి దశరథుడు, శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నల వెంట ఒక పక్క వివాహ ఆనందం మరొక పక్క కుమార్తెలు దూరం అవుతున్నారన్న దుఖంతో వీడ్కోలు పలికారు.


నూతన వధువరులను స్వాగతం పలకడానికి అయోధ్యను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రజల హర్షధ్వానాల మధ్య, మంగళవాయుద్యాలు మధురంగా మ్రోగుతుంటే  శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నలు తమ పత్నులు సీత ఊర్మిళ మాండవి శ్రుతకీర్తిలతో,  దశరథుడు వసిష్టాది మహర్షులు బంధు పరివారం వెంటరాగా అయోధ్యలోకి ప్రవేశించారు.


రాచవీధులలో ప్రజలు పుష్ప వర్షం కురిపిస్తుంటే రథాలపై ప్రజలకు నమస్కరిస్తూ నూతన దంపతులు రాజభవనం చేరారు. సింహద్వారం వద్ద కౌసల్యా సుమిత్ర కైకేయిలు తమ కుమారులకు, కోడళ్ళకు మంగళహారతులతో స్వాగతం పలికి గృహప్రవేశం చేయించారు.


ఆనాటి నుండి  రాజభవనంతో పాటు అయోధ్య అంతా నిత్య పండుగ వాతావరణం నెలకొంది. దశరథుడు ఆనందోత్సాహాలతో గడుపుతున్నాడు. కొంతకాలం తర్వాత కైకేయి తండ్రి అనారోగ్యం పాలై మనవడిని చూడాలని కోరిక కలిగి తన కుమారుడిని అయోధ్య పంపాడు. మేనమామ వెంట భరతునితో పాటు శత్రుఘ్నని దశరథుడు కేకయ రాజ్యానికి పంపాడు..


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: