*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము
*658 వ రోజు*
సాంఖ్యము
పరమశివా ! యోగము గురించి చెప్పాను. ఇప్పుడు సాంఖ్యం గురించి చెప్తాను. సాంఖ్యయోగులు యోగము, సాంఖ్యము ఒకటే అని భావించి ఈ భవసాగరమును దాటి తరిస్తారు. ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సు కంటే అహంకారము, అహంకారము కంటే బుద్ధి, బుద్ధి కంటే ప్రకృతి గొప్పవి. వీటన్నింటికీ అధికుడు పురుషుడు. పరమశివా ! పంచభూతములు ఐదు, వాటి గుణములు ఐదు, ఇంద్రియములు పది, మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రకృతి నాలుగు. మొత్తము 24 తత్వములు. చేతనుడైన పురుషుని ఆశ్రయించుకుని అచేతనమైన ప్రకృతి కూడా చైతన్యవంతం ఔతుంది. మొత్తము 23 తత్వములు 24 వ తత్వమైన ప్రకృతి అనే మహాసముద్రపు అలల మీద తేలియాడుతూ ఉంటాయి. పురుషుడు గుణరహితుడైనా ప్రకృతితో చేరిన పురుషుడు గుణములు కలవాడుగా ఔతాడు. అందు వలన మిగిలిన 23 తత్వములు కూడా పురుషుడికి వాటి వాటి గుణములు ఆపాదిస్తాయి. తాను వేరు ఈ ప్రకృతి వేరు వేరు ఈ 23 తత్వములు వేరు అని తెలుసుకుని ప్రకృతిని ఉపేక్ష చేసి పొగలేని నిప్పులా ప్రకాశిస్తాడు. అలా కాక ఈ ప్రకృతే తానని అహంకరించి తానే ఈ సృష్టికి లయకు కర్త అని భావించిన పురుషుడు వికారమును పొంది ఈ ప్రకృతిని ఎదిరించ లేక దానికి వశుడై తమోగుణ ప్రధానములైన ఈ ప్రాపంచిక సుఖములలో మునిగి పోతాడు. 25వ తత్వమైన పురుషుడు ప్రకృతిని పట్టించుకొనక ఉపేక్షించిన 26వ తత్వమైన పరమానంద స్థితిని పొందుతాడు. కనుక పురుషుడు సత్యగుణమును ఆశ్రయించి తత్వజ్ఞానము అలవరచుకుంటే ప్రకృతిలో లీనంకాకుండా చిదానంద రూపుడౌతాడు. ఈ 26వ తత్వమే విద్య. కాని దానికి విద్య అవిద్య అనే గుణములు లేవు. దానికి ఆది అంతము లేదు, మార్పు లేదు, అజామరుడు, అనంతుడు, ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తాడు
సాంఖ్యయోగుల గుణములు
మహాదేవా ! ఈ సాంఖ్యయోగమును అభ్యసించిన వారు చక్కని జ్ఞానసంపదతో ప్రకాశిస్తారు. రాబోయే అరిష్టములను ముందుగా కనిపెట్ట కలిగిన పాటవము కలిగిఉంటారు. కనుక రాబోయే అరిష్టములు అరికట్టగలుగుతారు. యోగాభ్యాసకులైన మునులు తమకు రాబోయే అరిష్టములనుముందే తెలుసుకుని సర్వాంగదారణతో అన్ని తత్వములను ఏకంచేసి మృత్యువును జయిస్తారు. నీటిలో చేప మేడిపండులో పురుగులు ఎలా ఉంటాయో అలాగే తాను కూడా ఈ లోకములో సంచరిస్తుంటానని తెలుసుకున్న సాధకుడు ఈ ప్రకృతి నుండి విడివడి అవ్యయత్వము పొందుతాడు. తామరాకు మీద నీటిబొట్టులా పురుషుడు ఈ లోకములో సంచరిస్తూ కూడా తత్సంబంధమైన వికృతికి లోను కాకుండా నిర్లిప్తంగా, నిశ్చలంగా, అజరామరంగా వెలుగొందుతాడు. ఈ ప్రకారంగా ప్రకృతిని వదిలి పెట్టిన 25వ తత్వమైన పురుషుడు 26వ తత్వమును పొంది విమల, శివ, నిరంజన స్వరూపుడై వెలుగొందుతాడు. పరమశివా ఈ జ్ఞానమును నాకు, లోకానికి పూర్వము నా గురువైన కపిలమహర్షి అనుగ్రహించాడు. ఆయన కింద శిక్షణపొందిన అనేక మంది శిష్యులు ఆయన బోధనతో జ్ఞానవంతులు అయ్యారు. నేను కూడా అనేక మంది శిష్యులకు ఈ జ్ఞానాన్ని బోధించాను. ఎందరో దివ్యమునులు దీనిని శ్లాఘించారు. గార్గ్యుడు, గౌతముడు, కాత్యాయనుడు మొదలైన మహా మునులు ఈ బోధనతో తమ తమ మనసులోని సందేహాలను తీర్చుకున్నారు. వారు ఈ ప్రకృతి సంపర్కము వదిలి దివ్యత్వము పొందారు. పరమశివా పురుషుడు ప్రకృతితో కలవడమే బంధము కలవకుండా ఉండడమే మోక్షము " అని చెప్పి సనత్కుమారుడు ఆకాశమార్గాన వెళ్ళి పోయాడు. శివుడు కూడా తన దివ్యమైన మనో పధంలో విహరించసాగాడు " అని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి