*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము
*660 వ రోజు*
కర్మ సిద్ధాంతము
ఇక నీకు కర్మ గురించి చెప్తాను విను. జననీ, జనకులు, గురువులకు మేలుచేస్తే సుఖము వారికి కీడుచేస్తే దుఃఖము కలుగుతాయి. వీరు కాక తక్కిన విషయములలో పాపముచేస్తే దానికి ప్రాయశ్చితము ఉంది కాని తల్లి, తండ్రి, గురువుల పట్ల చేసిన అపచారమునకు, పాపముకు పరిష్కారము లేదు. ఆహారధాన్యమును అపహరించిన వాడు మరుజన్మలో ఎలుకగాను, పందికొక్కుగాను, కుక్కగానూ జన్మిస్తాడు. పరులభార్యను కోరువాడు తోడేలుగాను, రాబందుగాను, కోతిగాను, గ్రద్దగానూ పుడతాడు. చివరకు పురుగుగాను పుడతాడు. అప్పటికి కాని ఆపాపముపోదు. ఎవరైతే తన కూతురును ఒకరికి ఇచ్చి పెళ్ళి చేసి మరలా మనసు మార్చుకుని ఆమెను వేరొకరికి అప్పగిస్తాడో అతడు పురుగుజన్మ ఎత్తుతాడు. దేవకార్యము చేసిన తరువాత పితరులకు నివేదనము చేయకుండా భోజనము చేయువాడు కాకిజన్మ ఎత్తుతాడు. అన్నగారిని తిట్టిన వాడు పక్షిజన్మ ఎత్తుతాడు. శూద్రుడు బ్రాహ్మణ స్త్రీని కోరిన అతడు పురుగుగా పుడతాడు. చేసిన మేలు మరచినవాడు నరకబాధలు అనుభవిస్తాడు. ధనము మీద వాంఛతో నిరాయుధుడిని చంపినవాడికి పక్షిజన్మ వస్తుంది. ఆ జన్మలో చావుదెబ్బలు తింటూ మారణాయుధాల వలన మరణిస్తాడు. స్త్రీని చంపినవాడు మరుజన్మలో అనేక రకములైన నరకబాధలు అనుభవిస్తాడు. అన్నము, పాలు దొంగిలించిన వాడు వాటిలో పురుగులుగా జన్మిస్తాడు. పండ్లను, ఇనుమును, వెండి, బంగారమును దొంగలించిన వాడు వరుసగా కోతి, కాకి, పక్షి, క్రిమిగా పుడతాడు. ఇతరుల దుస్తులు అపహరించిన వాడు కుందేలుగా పుడతాడు. ఇతరులు తన వద్ద ధనమును అపహరించి వంచించిన నమ్మక ద్రోహి చేప మొదలైన నీచ జన్మలు ఎత్తుతాడు. పైన చెప్పిన పాపాలు స్త్రీలు చేస్తే పురుషులు ఎత్తిన జన్మలలో వారికి భార్యలైపుట్టి వారితోచేరి నరకబాధలు అనుభ్యవిస్తారు .
పాపపరిహారము
బృహస్పతి " ధర్మనందనా ! చేసిన పాపములు దానధర్మము వలన నశిస్తుంది. అన్ని దానములలో అన్నదానము శ్రేష్టము. న్యాయముగా సంపాదించిన ధనముతో అన్నదానము చేసిన అది అన్ని పాపములను హరిస్తుంది. చివరకు తాను భిక్షగా తీసుకు వచ్చినది అయినా బ్రాహ్మణుడికి పెట్టి అతడి ఆకలి తీర్చిన అతడికి పుణ్యలోకములు కలుగుతాయి. బ్రాహ్మణుడు వేదాధ్యయనము చేసినందు వలన, తాను నేర్చుకున్నది పదిమందికి బోధించడం వలన, క్షత్రియుడు అటువంటి బ్రాహ్మణులను పోషించడం వలన ఉత్తమ లోకాలను పొందుతాడు. వైశ్యుడు ధర్మంగా చేసిన ఆర్జనతో అనన్నదానము చేసి పుణ్యం సంపాదించ వచ్చు. శూద్రుడు తాను శ్రమపడి తెచ్చిన ధనముతో అనన్నదానము చేసి పుణ్యలోకములకు పోతాడు. ఏ కులము వాడైనా తాను తినబోయే ముందు ఇతరులకు పెట్టి తినిన సద్గతి కలుగుతుంది. కనుక ధర్మనందనా అన్ని దానములలో అన్నదానము గొప్పది. దాని వలన సర్వ పాపములు నశిస్తాయి " అని అన్నాడు బృహస్పతి.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి