🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*మంగళవారం 5 మే 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
*78వ భాగం*
*భగీరథుడి వంశం*```
భగీరథుని కుమారుడు సుహోత్రుడు. సుహోత్రుని కుమారుడు నాభాగుడు. నాభాగుని కుమారుడు అంబరీషుడు. అంబరీషుని కుమారుడు సింధుధ్వజుడు. సింధుధ్వజుని కుమారుడు అయతాయువు. అయతాయువు కుమారుడు ఋతుపర్ణుడు.
ఋతుపర్ణుడు అక్షవిద్యలో(జూదములో) నిపుణుడు. జూదములో ఓడిపోయిన నలునికి జూదవిద్యలో మెలుకువలు తెలిపి జూదములో గెలిచి తిరిగి రాజ్యాధికారం వచ్చేట్టు చేసినవాడు.
ఋతుపర్ణుని కుమారుడు సర్వకాముడు. సర్వకాముని కుమారుడు సుదాసుడు. సుదాసుని కుమారుడు మిత్రసఖుడు. మిత్రసఖునికి సౌదాముడు అనే మరొక పేరు ఉంది.
మిత్రసఖుడు ఒకసారి వేటకు అడవికి వెళ్లి రెండు పెద్ద పులులు భయంకరంగా గాండ్రిస్తూ ఒకదానితో మరొకటి తలపడటం చూశాడు. పులుల గాండ్రిపులకు భయపడి మిగిలిన జంతువులన్ని వనం వదిలి దూరంగా వెళ్లిపోయాయి.మిత్రసఖుడు బాణములతో ఒక పులిని పడగొట్టాడు.
చనిపోయిన పులి పెద్ద రాక్షసాకారం ధరించి మరణించింది. అది చూసి రెండవ పులి రాక్షసాకారం ధరించి మిత్రసఖుడితో “రాజా! నా తోటి స్నేహితుని అన్యాయంగా చంపావు. ఇందుకు నీ పై తగిన సమయంలో ప్రతికారం తీర్చు కుంటాను” అంటూ గర్జించి వెళ్లి పోయింది.
మిత్రసఖుడు ఏమి జరుగుతుందో అని చింతించి రాజధానికి తిరిగి వెళ్లాడు.
కొంతకాలం తరువాత మిత్రసఖుడు కులగురువైన వసిష్టుడి పురోహితుడిగా యాగం చేసాడు. యాగం పూర్తైన తరువాత పురోహితుడైన వసిష్టుడికి భోజనం పెట్టి ఆశీస్సులు పొందాలి. నదికి వెళ్లి అనుష్ఠానం చేసుకుని భోజనానికి వస్తానని వసిష్టుడు నదీ తీరానికి వెళ్లాడు. యాగానికి ముందే మిత్రసఖుడిపై పగ పట్టిన రాక్షసుడు వంటవాడి రూపంలో రాజుగారి వంటశాలలో చేరాడు. సమయం కోసం వేచి చూస్తున్న వాడికి రాజుగారు వసిష్టుడికి భోజనం ఏర్పాటు చేయాలనడం గమనించి తగిన సమయం వచ్చింది అని తలచాడు నరమాంసం వండిపెడితే వసిష్టుడు గమనించి రాజుని శపించి శిక్షిస్తాడు అని భావించాడు.
వెంటనే చనిపోయిన మనిషి శరీరం ఒకటి తీసుకువచ్చి నరమాంసంతో భోజనం వండాడు.
అనుష్ఠానం ముగించి భోజనానికి కూర్చున్న వసిష్టుడు పెట్టిన ఆహారం చూసి అది నరమాంసంతో చేసినదని గ్రహించాడు. కోపంతో ఆసనం మీద నుంచి లేచి "రాజా! తపో సంపన్నుల మైన మాకు నర మాంసంతో భోజనం ఏర్పాటు చేస్తావా! ఇది క్షమించరాని నేరం. నీవు నేటి నుండి రాక్షసుడవై నరులను భక్షిస్తూ అడవులలో జీవించు” అని శాపం ఇచ్చాడు.
మిత్రసఖుడు వసిష్టుడి పాదాలకు నమస్కరించి “మహర్షీ! మీరు మా వంశానికి కులగురువు. మా వంశజులం సదా తమరికి శిష్యులమై ఉన్నాము. ఇటువంటి పాపకార్యం ఎన్నడూ తలంచము,చేయము. ఈ అపచారం నాకు తెలియకుండా జరిగింది. అర్ధం చేసుకుని శాపం ఉపసంహరించండి" అని ప్రార్ధించాడు.
వసిష్టుడు దివ్యదృష్టితో జరిగింది గ్రహించాడు. మిత్రసఖుడి తప్పు ఏమి లేదని తెలుసుకున్నాడు. "రాజా! నీమీద పగతో ఒక రాక్షసుడు వంటవానిగా చేరి ఈ పని చేశాడు. తెలిసి జరిగినా తెలియక జరిగినా, జరిగినదానికి రాజుగా నీకు బాధ్యత ఉంటుంది.నా శాపాన్ని ఉపసహరించ లేను. కానీ సమయ పరిమితి పెడతాను. పన్నెండు సంవత్సరాలు రాత్రి పూట రాక్షసుడిగా అడవుల్లో తిరుగుతూ నరమాంస భక్షణ చేస్తూ గడుపుతావు. గడువు ముగిసిన తరువాత శాపం నుండి విముక్తి పొందుతావు" అని శాప విమోచనం చెప్పాడు.
తన తప్పు లేదని తెలిసినా తనను శాపానికి గురి చేయడం మిత్రసఖుడికి కోపం తెప్పించింది. “మహర్షీ! నిరపరాధినని తెలిసినా నన్ను తమ శాపానికి గురిచేయడం మా వంశ గురువులైన మీకు తగినది కాదు. మీరు ఇకనుండి సూర్య వంశ గురువులుగా ఉండ టానికి అనర్హులు" అంటూ ప్రతి శాపం ఇవ్వడానికి చేతిలో నీరు తీసుకున్నాడు. మహారాణి మదయంతి రాజునకు అడ్డుపడి “ప్రభూ కుల గురువులను మీరు ఇలా శపించకూడదు. రాబోయే వంశజులు గురు ఆదరణ లేక ఇబ్బందులకు గురి అవుతారు. విరమించండి" అని ప్రాధేయ
పడింది.
మిత్రసఖుడికి తప్పు తెలిసివచ్చి శపించడం వదలి చేతిలోని మంత్ర జలాన్ని తన పాదాలపై చల్లుకున్నాడు. ఆ నీటి ప్రభావం వలన పాదాలు నల్లబడ్డాయి. కల్మషమైనట్టు కళాకాంతులు లేనివయ్యాయి. మిత్రసఖుడు(సౌదాముడు) నాటి నుంచి కల్మషపాదుడు అయ్యాడు.
వసిష్ట మహర్షి శాపం వలన కల్మషపాదుడు రాత్రివేళల్లో రాక్షసుడై అడవుల్లో తిరుగుతూ కనిపించే మానవులను తినేవాడు. పగలు నరుడిగా ఉండేవాడు. ఒకరోజు రాత్రి కల్మషపాదుడికి అడవిలో చెట్టుకింద కలసియున్న బ్రాహ్మణ దంపతులు కనిపించారు. రాక్షసుడైన కల్మషపాదుడు భర్తను భార్యనుండి విడదీసి తినబోయాడు.
బ్రాహ్మణుని భార్య.. "ఇక్ష్వాకు వంశజుడైన రాజా! రాక్షస రూపం ధరించిన నీవు కలసి వున్న దంప తులలో భార్య నుండి భర్తను విడదీసి చంపడం పాపం. బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్య దోషం వస్తుంది. నా భర్తను వదిలిపెట్టుము" అని బ్రతిమాలింది.
రాక్షస స్వభావం కల కల్మషపాదుడు వినకుండా బ్రాహ్మణుని చంపి తిన్నాడు.
బ్రాహ్మణ స్త్రీ కోపించి "నాతో కలసి ఉన్న నా భర్తను విడదీసి చంపి నాకు భర్త లేకుండా చేసావు. ఇందుకు ప్రతిగాశాపం ఇస్తున్నాను నీవు నీ భార్యతో కలవడానికి ప్రయత్నంచేస్తే వెంటనే మరణిస్తావు" అని శపించి అగ్ని ప్రవేశం చేసి మరణించింది.
కల్మషపాదుడు బాధపడటం తప్ప తనకు కలిగే రాక్షస బుద్దిని మార్చలేక పోయాడు. అలాగే పన్నెండు సంవత్సరాలు రాక్షస కార్యాలు చేస్తూ గడిపేశాడు. పన్నెండు సంవత్సరాల తరువాత వసిష్టుడు శాప విముక్తి శుద్దికి యాగం చేసి రాజుని రాక్షసత్వం నుండి విముక్తి కలిగించారు. సౌదాముడు రాజధానికి వచ్చి ధర్మ పాలన చేయసాగాడు.
సంతానం లేకపోవడంతో సౌదాముడు భార్య మదయంతితో కలసి పుత్రులను పొందాలి అని భార్యను దగ్గరకు తీసుకోబోయాడు. బ్రాహ్మణ స్త్రీ శాపం తెలిసిన రాణి మదయంతి భర్తకు మరణం రాకూడదని శాపం గుర్తుచేసి దూరంగా వెళ్లిపోయింది. భార్యాభర్తలు ఇరువురు వంశగురువు వసిష్ట మహర్షి వద్దకు వెళ్లి బ్రాహ్మణ స్త్రీ శాపం చెప్పి తమకు సంతానం కలిగేలా చేయమని ప్రార్ధించారు.
వసిష్టుడు తన తపశక్తితో సౌదాముడి తేజస్సు కలవకుండానే భార్య మదయంతి లో ప్రవేశించేట్టు చేసి గర్భం వచ్చేట్టు చేసాడు. ఇరువురిని ఆశీర్వదించాడు. మదయంతి గర్భాన్ని ఏడు సంవత్సరాలు ధరించినా పురుడు రాలేదు. భరించలేక మదయంతి ఒకఅశ్మము(రాయితో) గర్భ విచ్ఛిత్తి చేసింది. గర్భము నుండి ఒక పుత్రుడు బయటకు వచ్చాడు.
బాలునికి అశ్మకుడు అని పేరు పెట్టి పెంచారు. కుమారుడు పెద్దయ్యాక అశ్మకునికి రాజ్యం అప్పగించి కల్మషపాదుడు వాన ప్రస్థానికి అరణ్యాలకు వెళ్లిపోయాడు. తండ్రి తరువాత చక్కగా పరిపాలించిన అశ్మకునికి మూలకుడు అనే కుమారుడు పుట్టాడు.
మూలకుడు రాజై పరిపాలన సాగిస్తునప్పుడు పరశురాముడు రాజులను సంహరిస్తూ రాగా మూలకుడు స్త్రీ వేషంతో అంతపురంలో స్త్రీల మధ్య ఉండి ప్రాణ రక్షణ చేసుకున్నాడు. స్త్రీ సమానుడు అని భావించి పరశురాముడు వదలి వెళ్లి పోయాడు. అతనికి ఇలబిలుడు అనే కుమారుడు జన్మించాడు.
ఇలబిలునకు ఖట్వాంగుడు అనే కుమారుడు జన్మించి రాజైనాడు. ఖట్వాంగుడు దేవదానవ యుద్దంలో దేవతలకు సహాయంగా యుద్దం చేసి దేవతలను గెలిపించాడు. దేవతలు సంతోషముతో వరం కోరుకోమనగా ఖట్వాంగుడు తన ఆయుర్దాయం ఇంకా ఎంత ఉంది అని అడిగాడు.
దేవతలు నీ ఆయుష్యు ఇంకా రెండు ఘడియలు ఉంది అనే చెప్పగా ఖట్వాంగుడు "అయితే మీ వరం నాకు వద్దు. నన్ను భూమి పైకి వెంటనే పంపండి" అని భూమి మీదకు వచ్చేసాడు. సర్వం వదిలివేసి బ్రహ్మాదులకు సాధ్యం కాని పరమయోగ ప్రభావం పొంది ముహూర్త కాలంలో దేహత్యాగం చేసి విష్ణుసాయిజ్యం పొందాడు.
*దిలీప మహారాజు కుమారుడు రఘువు. ప్రసిద్ధ రఘు వంశం అతనితోనే ప్రారంభమైంది.
*(సశేషం)*
*రఘువంశ కథ రేపటి భాగంలో చచదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి