20, ఫిబ్రవరి 2026, శుక్రవారం

సావడి కబుర్లు - 4

 


సావడి కబుర్లు - 4


*గెలుపు - ఓటమి రహస్యం — సనాతనధర్మ దృక్పథం.*


1500 సంవత్సరాలుగా విదేశీ పాషండ మతాల దురాక్రమలతో విసిగి వేసారిన హిందూ జాతి,  దేశానికి స్వతంత్రం వచ్చినా, పాలకులకు జాతీయ భావాలు లేకపోవడంతో అదే అణిచివేతకు గురౌతూ వచ్చింది. గత పది  సంవత్సరాలుగా జాతీయ భావాలు ప్రస్పుటంగా గల పాలకులు రావడంతో హిందూ సమాజం  చైతన్యమై సంఘటితమౌతూ మహోన్నతమైన రేపటికి సిద్ధమవుతోంది. 


ఇది ఎంతో కాలంగా దేశాభిమానుల హృదయాల్లో రగులుతున్న అగ్ని జ్వాలలు వెలిగించిన అఖండ దీపం.


 ఇటువంటి తరుణంలో,  శతాబ్దాల క్రితం అవైదిక మతాల దాడి నుంచి వేద ధర్మాన్ని రక్షించడానికి ఆదిశంకరాచార్యుల వారు ప్రతిపాదించిన అద్వైతంపై కొందరి అహంకారపూరిత అసంధర్భ అవమానకరమైన వ్యాఖ్యలకు సమాజం ఉలిక్కిపడింది. 


ఆ ఘటనపై ప్రతిస్పందన ఎలా ఉండాలి?  "కిం కర్తవ్యం?"  అంటూ  మానసికంగా మదనపడుతున్న కొంతమంది పెద్దలు కలిసి చర్చించుకోవడం జరిగింది.  చర్చల్లో వెలువడిన అభిప్రాయాల్లో, విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదని, అద్వైత సిద్ధాంతాన్ని నలుదిశలా వ్యాప్తి చేసిన జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారి ఆలోచనా విధానం వలే,  అవతల వారిని నొప్పించక ఒప్పించాలనే అభిప్రాయం కూడా ఒకటి.‌


 ఆరోజు సమావేశంలో నాతో పాటు ఉన్న శ్రీ సిఎస్ఎన్ శర్మగారితో మాటల్లో గెలుపు ఓటమిల రహస్యం గురించి ప్రస్తావన వచ్చింది. 


అసలు గెలుపు అంటే ఏమిటి! ఓటమి అంటే ఏమిటి?.


సాధారణంగా మనం గెలవడము అంటే దానిలో ఇతరుల ఓటమిని చూస్తాం. దానినే కోలమానంగా వాడతాం.  కానీ నిజమైన గెలుపు అంటే ఏమిటంటే మనని  వ్యతిరేకించే వారిలో వారి భావాలపై  తప్పొప్పులను    విశదీకరించి వారి మనసులను గెలవడం. మన అభిప్రాయానికి వారిని ఒప్పించి మనతో కలుపుకునేలా చేయడం.


అలాగే, ఓటమి అంటే తాను నమ్మిన సిద్ధాంతం లేదా విషయం సరైనది కాదని గ్రహించడం.  అంతేకాని, వారి మానసిక స్థితిని లేదా వినయాన్ని ఆక్రమించి అవమానం చేయడం, నిరుత్సాహపరచడం కాదు. 


ఈ ఆలోచన మన మనస్సులోని మానసిక రుగ్మతలు ఈర్ష్య, శత్రుత్వం, భయాలనూ తొలగించి, మన మధ్య ఉన్న సామాజిక విభేదాలను దూరం చేస్తుంది. ఇది సానుకూల మనస్తత్వాన్ని పెంపొందిస్తూ, సమాజాన్ని ఐక్యమయం చేస్తుంది. ఇదే మన సనాతన ధర్మం యొక్క అద్భుతమైన విశిష్టత.


*జయస్య నాస్తి విరామః పరాజయస్య చ|*

*ఉభయోరపి సంన్యాసః ధర్మస్య ఫలముచ్యతే॥*


జీవితంలో గెలుపుతో  ఎప్పుడూ ఆగకూడదు, అలాగే ఓడిపోయినప్పుడు కూడా ఆగిపోకూడదు. ఓటమి తర్వాత కూడా నిలబడి ముందుకు సాగాలి.‌


గెలుపు-ఓటమి రెండింటినీ సమానంగా చూసి, వాటి పట్ల మమకారం, ఆసక్తి , ఆశ-నిరాశలను త్యజించడమే (సంన్యాసం) నిజమైన ధర్మ ఫలం, అదే ఉత్తమ ఫలితం. ఆ రెంటినీ సమత్వ దృష్టితో (సమం పశ్యన్) చూడడమే ఉత్తమమని సనాతన ధర్మం చెబుతోంది.  


భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పినది కూడా ఇదే.

అహంకారాన్ని విడిచి పెడితే మనకి ఆత్మ విశాలత్వ స్వరూపం అర్థమవుతుంది.

_*జ్ఞాత్వా తు పరంజ్ఞానమతః పునస్త్వశ్ష్రేయసి*_

_*అహంకారవినాశేన తత్స్వరూపస్థితిః॥*_


గెలుపు అంటే అహంకారాన్ని జయించి, ఇతరుల మనస్సులను గెలవడం. మన భావాలు గెలిచినప్పుడు కూడా, వ్యతిరేకులను అవమానించకూడదు.  దీనినే  మహాభారతంలో


_*సత్యవాదీ పరః శ్రేయాన్వృత్తికరణమాప్నుయాత్*_

_*పరాజయేపి విజయీ భవతి యః సత్కర్మసు రతః॥*_


అంటూ, సత్కర్మలు చేసేవారిని ఓటమి ఎన్నటికీ ఓడించలేదు. అతని సత్కర్మల వలన అతను ఎప్పటికీ విజయవంతుడే అంటూ, గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని మహాభారతంలో వ్యాసమహర్షి తెలియజేశారు.


నిత్య జీవితంలో కూడా ఈ వాదాన్ని అనుసరిస్తే  ఆరోగ్యకరమైన సమాజం మనకు కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదం వచ్చినా, ఉద్యోగుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినా, సమాజంలో అసమానతలు తలెత్తినా సానుకూల దృక్పతితో ఇతరులు చెప్పిన విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని బలాబలాలను ఒప్పించగలిగితే సమస్యలకు శాంతియుత పరిష్కారాలు లభించగలవు.


చివరిగా,  భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు. 


*సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ।*

*అహం త్వా సర్వపాపేభ్యో మొక్షయిష్యామి మాశుచః॥*


ఈ సత్యాన్ని అర్థం చేసుకుని జీవిస్తే, మన మనసులో ఉన్నటువంటి  గెలుపు-ఓటమిల  అర్థాలే మారిపోతాయి. గెలిచిన వారు వినయంతో, ఓడినవారు అవగాహనతో మసులుకుంటే, అక్కడి శాంతి తరంగాలు సమాజాన్ని ఒక మహా కుటుంబంగా నిలబెడతాయి. 


ఇదే మన సనాతన ధర్మం ప్రబోధించే ఉన్నత  సిద్దాంతం.


జైహింద్

జై భారత్


మృశి

(దశిక ప్రభాకరశాస్త్రి)

 9849795167

20.02.2026

కామెంట్‌లు లేవు: