🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*ఆదివారం 8 మార్చి 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
*19వ భాగం*
*ఏకాదశ రుద్రులు - దశ బ్రహ్మ మానస పుత్రుల జననం - శివుడి ఆవిర్భావం:*```
ముల్లోకాలలో నివసించే వారిని సృష్టించిన బ్రహ్మకు తృప్తి కలుగ లేదు. వారికి ధర్మము బోధించి ధర్మమార్గంలో నడిపించే వారు ఎవరు అని ఆలోచించాడు. బ్రహ్మ నుంచి ఒకనిట్టూర్పువెలువడింది. ఆ నిట్టూర్పు నుండి ఒక దివ్య పురుషుడు అవతరించాడు.
అతడే కర్దమ ప్రజాపతి.
బ్రహ్మ కర్దముని చూసి “పుత్రా! కర్దమా! తగిన కన్యను వివాహమాడి మానవ సంతతిని వృద్ధిచేయము" అని ఆదేశించాడు.
కర్దముడు బ్రహ్మకు నమస్కరించి "తండ్రీ! మీ ఆజ్ఞను పాటిస్తాను. కానీ ముందుగా విష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేస్తాను. ఆయన ప్రత్యక్షం కాగానే తగిన కన్యను వివాహానికి చూపించమని అడిగి,
ఆ కన్యను వివాహమాడ తాను" అని తపస్సుకి వెళ్లి పోయాడు.
బ్రహ్మ కర్దముని నిర్ణయంలో గల ధర్మబద్దతను గమనించి మౌనంగా ఉండిపోయాడు. సృష్టి తను అను కున్నట్టు సాగకపోవడంతో బ్రహ్మకు తనమీద తనకే ఆగ్రహం కలిగింది. ఆగ్రహంతో రుద్రుడైనబ్రహ్మ లలాటంనుంచి మధ్యాహ్నసూర్య తేజంతో ప్రజ్వరిల్లే రుద్రుడు ఉద్భ వించాడు. రుద్రుడి కాలాగ్ని ఉచ్ఛ్వా సల నుండి రుద్రునితో సమానులైన మహాత్ముడు, మతిమంతుడు, భీషణుడు, భయంకరుడు, ఋతధ్వజుడు, ఊర్థ్వకేశుడు, పింగళాక్షుడు, రుచి, శుచి, కాలాగ్ని అనే రుద్రాంశ సంభూతులు జన్మించారు. పదిమందిని తీసుకుని లయకారుడైన రుద్రుడు కైలాసానికి వెళ్లి పోయాడు.
ఏకాదశ రుద్రులు అలా వెళ్లి పోయేసరికి బ్రహ్మ మరింత చింతనలో పడ్డాడు. అప్పుడు బ్రహ్మ మానసము నుండి మరీచి, కుడి చెవి నుండి పులస్త్యుడు, ఎడమ చెవి నుండి పులహుడు, కుడి కన్ను నుండి అత్రి, ఎడమ కన్ను నుండి క్రతువు, నాసిక నుండి వసిష్టుడు, నోటి నుండి అంగీరసుడు, కుడి పార్శ్వము నుండి భృగువు, ఎడమ పార్శ్వము నుండి దక్షుడు, కంఠం నుండి నారదుడు అవతరించారు.
బ్రహ్మ వారిని చూసి "పుత్రులారా! నా మానసములో ఏర్పడిన చింతన నుండి మీరు జన్మించి నా మానస పుత్రులు అయ్యారు. మిమ్మల్ని నేను ప్రజాపతులుగా నియమిస్తున్నాను. మీరు తగిన కన్యలను వివాహమాడి సంతానం పొంది సృష్టిని వృద్ధిచేయండి" అని ఆదేశించాడు.
నారదుడు బ్రహ్మకు నమస్కరించి "తండ్రీ! మనసా వాచా కర్మణా నేను నారాయణుని సేవకు అంకితమవుతాను. నారాయణ నామస్మరణం, గానం, తపస్సు, దర్శనం, స్పర్శనం, సేవాభాగ్యం తప్ప వేరే కార్యం చేయలేను. నన్నుమన్నించండి. నాకు సంసార సంతాన ఇచ్ఛలేదు. స్థిరంగా ఒక
చోట ఉండి నారాయణ సేవ చేసు కునే వరం ప్రసాదించండి" అని ప్రార్ధించాడు.
నారదుడి మాటలు బ్రహ్మకు ఆగ్రహం కలిగించాయి. "నారదాజన్మ నిచ్చిన తండ్రి ఆజ్ఞనే ధిక్కరించావా? సృష్టికర్తనైన నామాట కాదన్నందుకు నిన్ను శపిస్తున్నాను. "ఒక చోట స్థిరంగా నిలువకుండా ముల్లోకాలు నారాయణ నామ స్మరణ చేస్తూ తిరుగుతూ "త్రిలోక సంచారి" వై జీవించుము" అని శపించాడు.
నారదుడు మరింత ఆనందం పొంది "తండ్రీ! ముల్లోకాలు నారాయణ నామ స్మరణ చేస్తూ సంచరించేభాగ్యం ను కలిగించారు. నా జన్మ చరితార్థమైంది" అని నమస్కరించి నారాయణ నామ గానం చేసుకుంటూ వెళ్లి పోయాడు. మిగిలిన తొమ్మిది మంది మానస పుత్రులను చూసి బ్రహ్మ అసహనంగా "మీ సంగతి ఏమిటి? నారదునిలా శాపం పొందుతారా! లేక నా ఆదేశం పాటిస్తారా!" అని అడిగాడు.
మరీచి మొదలైనవారు భయభక్తులతో బ్రహ్మకు నమస్కరించి "తండ్రీ! మీ ఆదేశం ప్రకారమే సృష్టిని వృద్ధి చేస్తాము. మాకు తగిన కన్యలు లభించే వరకు మమ్మల్ని తపస్సు చేసుకోవడానికి అనుమతించండి" అని బ్రహ్మదేవుడు అనుమతి పొంది తపస్సుకి వెళ్లి పోయారు.
బ్రహ్మ తను అనుకున్నట్టుగా సృష్టి జరగక పోవడంతో అసహనం చెంది "సృష్టిలో తనకు సహకరించేవారు ఒక్కరు లేరు" అనుకుంటూ గట్టిగా తొడపై చేతితో చరిచాడు (కొట్టుకున్నాడు). మరుక్షణం ఆయన తొడ5 నుండి అఖండ తేజస్సుతో ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే "నాకు నామకరణం చెయ్యి" అంటూ ఏడవ సాగాడు.
బ్రహ్మ ఆ శిశువుని ఊరడిస్తూ "శిశువుగా జన్మించిన నీకు శివుడు అని నామకరణం చేస్తున్నాను. నిన్ను భక్తితో కొలిచినవారికి, ఆశ్ర యించినవారికి దుఖములు తొలగించి సకల సుఖములు ఇస్తాను. చివరలో కైవల్యం ప్రసాదిస్తావు" అని వరమిచ్చాడు.
శిశువు సంతోషపడకుండా ఏడుసార్లు బిగ్గరగా ఏడ్చాడు. ఏడ్చిన ప్రతిసారి ఒక్కొక్క నామంతో నామకరణం చేస్తూ బ్రహ్మ సముదాయించాడు.
భవుడు, శర్వుడు, మహేశ్వరుడు, పశుపతి, భీముడు, మహాదేవుడు, ఉగ్రుడు అనే ఏడు పేర్లు ఆ శిశువుకి వచ్చాయి. తరువాత బ్రహ్మ శిశువుకి శరీరాలుగా సూర్యుడు, చంద్రుడు, పృధ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, యజమాని అనే అష్టభూతములను నియ మించి శివుని అష్టమూర్తిగా చేశాడు.
అష్టమూర్తి అయిన శివుని చూసి "భూలోకానికి గల అష్ట దిక్కులు నీకు ఆధీనం చేస్తున్నాను. అష్ట దిక్కుల మధ్య నున్న భూమండ లానికి ఆయురారోగ్య ప్రదాతవై విరాజిల్లుము" అని దీవించాడు. వెంటనే శివుడు శిశురూపంవదలి పూర్ణ రూపం దాల్చి "బ్రహ్మదేవా! భూలోకంలోని అష్ట దిక్కులకు నన్ను అధిపతిని చేసి నీకు ఏ దిక్కు లేకుండా చేసుకున్నావు. ఫలితంగా నీకు భూలోకంలో ఆలయాలు ఉండవు. నీ విగ్రహ మూర్తికి ప్రతిష్టాపనలు, పూజలు ఉండవు" అని అదృశ్యమయ్యాడు. శివుడి మాటలకు బ్రహ్మ నిశ్చేష్టు డయ్యాడు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి