30, మే 2025, శుక్రవారం

భూషలుగావుమర్త్యులకు

 శు భో ద యం 🙏



భూషలుగావుమర్త్యులకు భూరిమయాంగదతారహారముల్

భూషిత కేశపాశమృదుపుష్ప సుగంధజలాభిషేకముల్ భూషలుగావు,పూరుషుని భూషితుజేయు పవిత్రవాణివా 

గ్భూషణమే సుభూషణము

భూషణముల్ నశియించు నెప్పుడున్,

భర్తృహరి సుభాషితములు!!

భావము:మానవులకు నిజమైన భూషణము విద్యయేవిద్యను మించిన భూషణములులేనేలేవు.

      బంగరునగలు,ముత్యాలహారములు వివిధ అలంకార విశేషములెవ్వియు భూషణాభాసములేతప్పభూషణములుగావు పవిత్రవాణియే నిజమగుభూషణము.తక్కినభూషణములు రావచ్చును పోవచ్చును.విద్యాభూషణము మాత్రమే సుస్థిరమైనది

                         స్వస్తి!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శ్రీరామచంద్ర ప్రభువు

 🕉️ *శ్రీరామచంద్ర ప్రభువు యొక్క గొప్పవైన 16 గుణములు* 🕉️


*కో అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్౹*

*ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ॥*

*చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః౹*

*విద్వాన్ కః కః సమర్థశ్చ కః ఏక ప్రియదర్శనః ॥*

*ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః౹*

*కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ॥*


ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు. అవే.. 1. గుణవంతుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మాత్ముడు, 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు, 5. సత్యం పలికేవాడు, 6. దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7. చారిత్రము కలిగినవాడు, 8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, 9. విద్యావంతుడు, 10. సమర్థుడు, 11. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, 12. ధైర్యవంతుడు, 13. క్రోధాన్ని జయించినవాడు, 14. తేజస్సు కలిగినవాడు, 15. ఎదుటివారిలో మంచిని చూసేవాడు. 16. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు.

గణపతి ఉపనిషత్తు 🙏 రెండవ భాగం

 గణపతి ఉపనిషత్తు 🙏

                     రెండవ భాగం 

సర్వం జగదిదం త్వత్తో జాయతే! సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి! సర్వం జగదిదం త్వయి లయమేష్యతి! సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి! త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః త్వం చత్వారి వాక్పదాని! 5

సర్వం జగదిదం త్వత్తో జాయతే! 

ఈ సకల చరాచర జగత్తు నీనుండే ఉద్భవించినది.

సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి! 

 ఈ జగత్తంతా నీలోనే ఉంటుంది. 

సర్వం జగదిదం త్వయి లయమేష్యతి

ఈ జగత్తు మొత్తంగా లయమయ్యేదీ నీలోనే. 

సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి

ఈ జగత్తంతా నీవైపే ప్రవహిస్తుంది (త్వయి ప్రత్యేతి) నిన్నే పొందుతుంది. 

త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః

నీవే భూమివి, నీరు, వాయువు, అగ్నివి, ఆకాశానివి.

త్వం చత్వారి వాక్పదాని

 పరా పశ్యంతి మధ్యమా వైఖరి గా పేర్కొనబడే వాక్కు యొక్క నాలుగు పదాలు నీవే.

త్వం గుణత్రయాతీతః! త్వం దేహత్రయాతీతః! త్వం కాలత్రయాతీతః! త్వం అవస్థాత్రయాతీతః!

త్వం మూలాధారస్థితోఽసి నిత్యమ్! త్వం శక్తిత్రయాత్మకః! త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్!

త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్! 6


త్రిగుణాలకు (సత్వ రజస్ తమో) నీవు అతీతునివి, నీవు స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా పేర్కొనబడే దేహత్రయానికీ అతీతునివి. నీవు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతునివి. నీవే కుండలినీ శక్తిగా నిత్యమూ మూలాధార చక్రంలో స్థితమైన (ఉండే) శక్తివి. నీవే మూడు శక్తులకు (ఇఛ్ఛా జ్ఞాన క్రియా శక్తులు) అతీతమైన వానివి.

నిత్యం యోగులచే ధ్యానం చేయబడే వానివి నీవే. త్రిమూర్తులు, ఇంద్రాగ్ని వాయు సూర్య చంద్రాదుల రూపంలో భాసిల్లే వానివి నీవే. ముల్లోకములలో (భూః, భువః సువః) నీవే, ముల్లోకములూ నీవే అయిన వాడివి.


గణాదిం పూర్వముచ్చార్య! వర్ణాదీం స్తదనంతరమ్! అనుస్వారః పరతరః! అర్ధేందులసితమ్!

తారేణ ఋద్ధమ్! ఏతత్తవ మనుస్వరూపమ్! గకారః పూర్వరూపమ్ అకారో మధ్యమరూపమ్ అనుస్వారశ్చాంత్యరూపమ్! బిందురుత్తరరూపమ్! నాదః సంధానమ్! సంహితా సంధిః!

సైషా గణేశవిద్యా! గణక ఋషిః! నిచృద్గాయత్రీచ్ఛందః! శ్రీ మహాగణపతిర్దేవతా ఓం గం గణపతయే నమః!7

"గం" అనేది గణపతి బీజం. దానిని ఉఛ్చరించే పద్దతి చెపుతున్నారిక్కడ. "గ్" ను ముందుగా ఉఛ్చరించాలి అటు పిమ్మట వర్ణములకు ఆది అయిన "అ"కారాన్ని ఉఛ్చరించాలి. తదుపరి అనుస్వరాన్ని ఉఛ్చరించాలి. ఇది "గం" అవుతుంది. అదే గణపతి బీజం. (దీని సాధనచేత ఆ స్వామి గోచరమౌతాడు).

అర్ధేందులసితం... అక్షరములు ధ్వనులకు సంకేతాలు. ధ్వని నాద భరితము. బిందువు తదుపరి వచ్చే నాదాన్ని "అర్ధేందు" అనే సంకేతంతో సూచించారు. ఆ నాదంతో ప్రకాశించే వాడు.

తారేణ రుద్ధం... తార అనగా తరింప చేసే మంత్రము దానినే ఓంకారము లేదా ప్రణవము అంటున్నాము. రుద్ధము పరివేష్టితుడు. ప్రణవము చేత పరివేష్టితుడు లేదా ప్రణవ స్వరూపుడు.

ఇది అతని యొక్క మంత్ర రూపము.

(ఇక పోతే సామాన్యార్థంలో చెప్పుకుంటే....శివ సంబంధమైన వాడు గణపతి కాబట్టి అతడు అర్ధేందుచే (అష్టమినాటి చంద్రుని) ప్రకాశించే వాడు. తారకలచే (నక్షత్రములు) పరివేష్ఠితుడు, అని చెప్పు కోవచ్చు... కాని ఇది సంప్రదాయము కాదు.)

“గం” బీజం సాధన చేసే సమయంలో... "గ్" కారం పూర్వ రూపం, "అ" కారం మధ్యమ రూపం, అనుస్వరం అంత్య రూపం అవుతుంది కాగా బిందువు (౦) ఉత్తర రూపంగా ఉంటుంది. దీనిని పలికి నప్పుడు వచ్చే నాదమే సంధానము. దీనితో అత్యంత సాన్నిహిత్యం కలిగినది సంధి.

ఇది మొత్తంగా (సైషా.. స ఏషా...) గణేశుని విద్య. దీనికి ఋషి గణక ఋషి. అనగా దీనిని దర్శించి ప్రవచించిన వాడు, గణకుడు అనే ఋషి. దీని ఛందస్సు నిచృద్ ఛందం. అధిష్టాన దేవత గణపతి.

“ఓం గణపతయే నమః ఏక దంతాయ విద్మహే, వక్ర తుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్”!

ఏకదంతం చతుర్ హస్తం పాశమంకుశధారిణమ్

రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజమ్!

రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససమ్ 

రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్!

భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతమ్ 

ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరమ్!

ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః 9

ఏకదంతుడు, నాలుగు చేతులలో.... పాశము, అంకుశము, దంతము, (ఇది ఏనుగు దంతం, త్యాగానికి సంబంధించినది. మహాభారత రచనా కాలంలో తన దంతాన్ని విరిచి వ్రాసాడు) అభయ ముద్రను ధరించినవాడు, ఎలుక వాహనమును ధ్వజముగా కలిగిన వాడు, పెద్దదైన పొట్టను కలిగిన వాడు, చాటల లాంటి చెవులను కలిగిన వాడు, రక్త వర్ణ వస్త్రములను ధరించిన వాడు, ఎర్రనైన సుగంధములను పులుముకున్న శరీరము కలిగిన వాడు, ఎర్రనైన పుష్పములచే చక్కగా పూజిlతుడు, భక్త కోటిపై అమితమైన అనుకంప (దయ) కలిగిన వాడు, భగవంతుడైన వాడు, ఈ జగత్తుకు కారణమైన వాడు, అచ్యుతుడు (జారిపోని వాడు), సృష్టి ఆదిలోనే ఆవిర్భూతుడు, ప్రకృతి పురుషులకు కూడా పరమమైన వాడు, ఎవరైతే ఉన్నాడో (గణపతి) వానిని నిత్యం ఎవరైతే ధ్యానిస్తారో వారు యోగులలో శ్రేష్టునిగా చెప్పబడతారు.

హే వ్రాత పతి (సమూహమునకు భర్త) నీకు నమస్సులు. గణములకు పతియైన నీకు నమస్సులు, ప్రమథ గణములకు పతివైన నీకు నమస్సులు, లంబోదరుని వైన నీకు నమస్సులు, ఏకదంతుని వైన నీకు నమస్సులు (ఏక దంతము త్యాగానికి చిహ్నము) విఘ్నములను నశింప చేసే నీకు నమస్సులు, శివ సుత నీకు నమస్సులు (శివము అంటే మహదానందము.. దానికి పుత్రుడు అంటే ఆనంద మూర్తియే... పోతన గారు కూడా మహానందాంగనా డింభకుడు అని అంటారు. మహా ఆనందము అనే అంగనకు డింభకుడు) వరద మూర్తయే... అపరిమితమైన దయా కారుణ్యాలకు ఆకృతి వస్తే ఎలా ఉంటుంది అంటే అది గణపతి వలె ఉంటుంది అనేందుకు వరద మూర్తయే అన్నారిక్కడ. ఆ వరద మూర్తికి నమస్సులు.

ఇక చివరగా ఫల శ్రుతి....

ఈ అథర్వ శీర్షంను ఎవరైతే శ్రద్ధతో, చక్కగా అధ్యయనం చేస్తారో, వారు (స) బ్రహ్మ స్థానాన్ని పొందుతారు. వారు సర్వ విఘ్నములనుండి విముక్తుడవుతాడు, వారు సర్వత్రా సుఖములను పొందుతారు, వానికి పంచ మహా పాతకముల నుండి విముక్తి కలుగుతుంది.

సాయం సమయంలో దీనిని అనుష్ఠించడం వల్ల పగలు చేసిన పాపములు తొలగిపోతాయి. ప్రాతఃకాలంలో అనుష్ఠించినట్లయితే రాత్రి చేసిన పాపములు తొలిగిపోతాయి. సాయం ప్రాతస్సులలో అనుష్ఠించిన వానికి పాపములు అంటుకొనవు. సర్వత్రా ఏ కార్యములలో నైనా ఏ విధమైన విఘ్నములు కూడా అతనికి కలగవు. అతడు ధర్మార్ధ కామ మోక్షములను పొందగలడు. ఇది అధర్వ శీర్షం.

దీనిని శిష్యులు కాని వారికి ఇవ్వకూడదు. ఇక్కడ శిష్యుడు అంటే నేర్చుకోవాలనే జిజ్ఞాసతో గురువును సభక్తికంగా చేరిన వాడు. అశ్రద్ధ లేనివాడు, ఉపాసన యందు అనురక్తి కలిగిన వాడు. విషయంపైన భక్తిభావన కలిగిన వాడు. అలాంటి లక్షణాలు లేని వానికి ఈ విద్యను ఇవ్వగూడదని చెపుతుంది, ఈ సూక్తం. ఏ ప్రలోభాలకైనా లోనై అలా అనర్హులకు ఈ సూక్తాన్ని ఇచ్చినట్లయితే అతడు పాప కూపంలొ పడిపోతాడని హెచ్చరిస్తుంది.

ఏ ఏ కోరికలతో నైనా సహస్రావర్తనంగా దీనిని అనుష్ఠించినట్లయితే దీని చేత (అనేన) ఆ కోరికలు సాధింపబడతాయి. ఈ ఉపనిషత్ చేత గణపతిని అభిషేకించినట్లయితే అతడు చక్కని వాక్పటుత్వం కలిగిన వాడవుతాడు.

భాద్రపద శుద్ధ చవితినాడు భోజనం చేయకుండా (చతుర్థ్యామనశ్నన్… అన అశనము) ఎవరైతే జపిస్తారో, అతడు విద్వాంసుడౌతాడు. ఇది అథర్వణ వాక్యము.

దీనిని బ్రహ్మ విద్యగా ఆచరించడం వల్ల కొద్దిగా కూడా భయం అనేది ఉండదు (నభిభేతి)

గణపతిని ... ఎవరైతే దూర్వారములచే అర్చిస్తారో అతడు అపర కుబేరుడౌతాడు. పేలాలతో ఎవరైతే అర్చిస్తారో అతడు యశస్కుడు అవుతాడు. మేధోవంతుడౌతాడు. మోదక సహస్రముచే ఎవరైతే అర్చిస్తారో వారికి వాంఛించిన ఫలితం లభిస్తుంది. ఎవరైతే ఆజ్యము (నేయి) సమిధలతో హవనం చేస్తారో వారికి ముమ్మాటికీ సర్వమూ లభిస్తుంది.

ఎనిమిది మంది వేద విదులైన బ్రాహ్మణులను చక్కగా సమకూర్చుకొని గణపతి నెవరైతే అర్చిస్తారో వారు సూర్య వర్చస్సును పొందుతారు.

సూర్య గ్రహణ కాలంలో, మహానది (జీవనది) వద్ద ప్రతిమ సాన్నిధ్యంలో జపించిన వారికి మంత్ర సిద్ధి కలుగుతుంది. వారికి మహా విఘ్నములు, మహా దోషములు, మహా పాపములు తొలగిపోతాయి. అతడు అన్నీ తెలిసిన వాడవుతాడు... ఇది తెలుసుకోండి అంటుంది.. ఈ గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు.

ఓం శాంతిః శాంతిః శాంతిః

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం -‌ చతుర్థి - పునర్వసు -‌‌ భృగు వాసరే* (30.05.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఆధ్యాత్మికత

 *ఆధ్యాత్మికత - సమాజము*




*ఆధ్యాత్మికత* అంటే మతాలకు, సిద్ధాంతాలకు, వర్గాలకు అతీతంగా *భక్తిని* ఏర్పర్చుకోగల్గి ఉన్నతమైన, ప్రశాంతమైన, నిశ్చలమైన, నిర్మలమైన, అన్య భావనలచే మిశ్రితము కాని స్థితిని చేరుకోనుట అని సాధారణ అర్థము. కాని, అంతటి ప్రశాంతత ఇప్పటి పరిస్థితులలో సాధ్యము కాదన్న భావన కల్గుతుంది. *ఎందుకంటే మహా మహా భక్తులలో గూడా మా దేవుడు గొప్పవాడoటే మా దేవుడు గొప్పవాడని (వైష్ణవులు, శైవులు, శాక్తేయులు, లింగాయతులు, తదితరులు) భావ వైరుధ్యాలతో సతమతమవుతున్నారు*. ఇటువంటి పరిస్థితులలో నిఖార్సైన ఆధ్యాత్మికతకు అవకాశమెక్కడిది. 


*ఈ మధ్యనే రామేశ్వరంలో శ్రీ రామచంద్రుల వారిచే శివ లింగ స్థాపన మరియు అర్చనపై పలు భిన్నాభిప్రాయాలు వెలువడుట ఆశ్చర్యకరము*.కాబట్టి ప్రస్తుతము నిరంతర భక్తి ప్రపత్తులు గలవారినే *ఆధ్యాత్మికులు* గా పరిగణిద్దాము. 


నీతి, ధర్మం ఈ రెండు మానవుణ్ణి సంస్కారవంతుడిని చేసి రాజమార్గంలో నడిపించేవి. నీతి అంటే దేశకాల పాత్రానుగుణంగా నడుచుకునే *హితరీతి* అని, ధర్మమంటే త్రికాలా సంబదితమైన *సత్యహిత* స్వరూపమని పెద్దలంటారు.


హృదయం, మేధ మానవుడికి జీవనాధారాలు. వీటిలో ఏది లోపించినా మానవత్వం సంపూర్ణం కాదు. ఈ రెండిటి సముచిత సమన్వయమే మానవత్వం. ఆ మానవత్వ సముపార్జనకై మానవుడు చేసే ప్రయత్నాలలో గ్రంథ పఠన, సాహిత్యోపాసన లలిత ప్రక్రియలు. 


ఈ క్రమంలో మానవుడు వేదాలను, వేదాంగాలను, ఉపనిషత్తులను, పురాణములను, ధర్మ శాస్త్రములను, ఆగమములను, ఇతిహాసములను (రామాయణ, మాహా భారత, భాగవతములు) మరియు భగవద్గీతను, ఇవే గాక లోక కళ్యాణ సంబంధమైన ఇతర గ్రంథములను అధ్యయనము చేసి ఉన్నాడు, కొనసాగిస్తున్నాడు కూడా. *ఇవి అన్నియు ఇహ పర సాధనాలే*. సాటిలేని నీతి, ధర్మ దర్పణాలు, ఇది విశ్వజనీనం. వీటిలోని ప్రతి వాక్యం, ప్రతి సన్నివేశం, ప్రతి కథ, ప్రతి పాత్ర గొప్ప నీతిని, ధర్మాన్ని స్పురింప జేస్తాయి.


ఆధ్యాత్మిక సూత్రాల ప్రకారము మానవ జన్మకు నాలుగు ప్రయోజనాలున్నాయి, వీటినే చతుర్విధ పురుషార్ధాలు అని అంటారు. అవి *ధర్మం*, *అర్థం*, *కామం*, *మోక్షం*. 


అర్థం, కామం, మోక్షం వ్యక్తిగతాలు. *లోక శ్రేయస్సును కల్గించేది "ధర్మం" మాత్రమే*. అందువల్ల ప్రతి ఒక్కరూ *ధర్మాన్ని రక్షించుకోవాలి*. దీనికి ప్రతిఫలంగా ధర్మం వ్యక్తుల్ని, సమాజాన్ని రక్షిస్తుంది. *ధర్మో రక్షతి రక్షితః*. సమాజంలో *ధర్మానికి* సమాంతరంగా *ధర్మ వ్యతిరేక* శక్తులు గూడా పనిచేస్తూ ఉంటాయి.


యోగ్యులైన వారు ఆ *పాపపు శక్తులను* చూస్తూ నిర్లక్ష్యము చేయరాదు. *ధర్మ రక్షణ* చేయకపోతే జాతి నిర్వీర్యమై పోతుంది. అందులో మనమూ (సామాన్యులు, మాన్యులు) ఉంటాము. *ఆధర్మాన్ని ఉపేక్షించడము ఆత్మహత్యా సదృశమే*.


*

29, మే 2025, గురువారం

భగవద్గీత

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                    *భగవద్గీత*

                   ➖➖➖✍️```

       (సరళమైన తెలుగులో)```


*#రెండవ అధ్యాయము:* 

 ***సాంఖ్యయోగము.* 

————————————-

*21.వ శ్లోకము:*


*”వేదావినాశినం నిత్యం య ఏవమజమన్నయమ్l*

*కథం సః పురుషః పార్థ కం* *ఘాతయతి హన్తి కమ్||”*

```

“ఓ అర్జునా! ఎవరైతే ఈ ఆత్మను సత్యమైనదిగా, నాశనము లేనిదిగా, నిత్యమైనదిగా, జన్మలేనిదిగానూ, మార్పులేనిదిగానూ, మరణము లేనిదిగానూ తెలుసుకుంటాడో, అటువంటి వాడు ఎవరిని చంపిస్తాడు. ఎవరిని ఎందుకు చంపుతాడు? ఎలా చంపుతాడు. కాబట్టి ఎవరూ ఎవరినీ చంపరు, చంపించరు.”


ఇప్పటి దాకా ఆత్మ నిత్యము అది చావదు అని చెప్పిన కృష్ణుడు, ఇప్పుడు ఆత్మ ఎవరినీ చంపదు. ఎవరినీ చంపించదు అంటే ఎవరి చావుకూ కారణం కాదు అని అంటున్నాడు. అర్జునా! నీలో ఉన్న అత్మస్వరూపము, భీష్మద్రోణ, కృపాచార్యులలోనూ ఇతర రాజులు, సైనికులలోనూ ఉన్న ఆత్మస్వరూపాలను చంపదు. వారిలో ఉన్న ఆత్మలు చావడానికి నీలో ఉన్న ఆత్మ కారణం కూడా కాదు. నీవే అందరినీ చంపుతున్నాను అని అనుకోవడం నీ భ్రమ.


ఆత్మజ్ఞానం కలిగి ఉండటమే ఆధ్యాత్మికత, కాని మనలో ఉన్న నేను అనే అహంకారము, ఈ శరీరమే నేను అనే భ్రమను కలుగచేస్తుంది. నేనే ఈ శరీరము, అంతా నేనే చేస్తున్నాను అన్న భ్రమలో ఉన్నంత కాలము, ఆత్మతత్వము అర్థం కాదు. ఆత్మ అవినాశి అనీ, నిత్యం అని అవ్యయం అనీ తెలుసుకోవాలి.


మనం అందరం నేను నేను అంటున్నాము. నేను అంటేనే ఆత్మ. నా పేరు సుబ్బారావు. నాకు ఆకలి వేసింది. నాకు కోపం వచ్చింది. అంటే మనకు తెలియకుండానే 'నేను అంటే ఈ శరీరం కాదు. నాలో ఉన్న ఆత్మ స్వరూపము' అనే జ్ఞానం మనకు సహజంగానే ఉంది. కాని దానిని గురించి మనం ఆలోచించము. ఆచరించము మనం ఏది "నేను" అని అనుకుంటున్నామో ఆ "నేను" అనే దాని స్వభావం మనకు తెలియదు. అంటే నేను అంటే మనకు తెలుసు కాని దాని స్వభావం మాత్రం తెలియదు.


ఈ "నేను" అనే ఆలోచన జంతువులకు పక్షులకు లేదు. అవి "నేను" గురించి ఆలోచించవు. ఆహారం తినడం, ఎద వచ్చినప్పుడు కలవడం, నిద్రవస్తే నిద్రపోవడం వాటి సహజలక్షణం, వాటి నేచర్, వాటికి ఆలోచించే శక్తి లేదు. కాని మనకు ఆ శక్తిని ఇచ్చాడు భగవంతుడు. ఒక డిన్నర్ జరుగుతూ ఉంది. ఒక ఆవు ఒక పులి వచ్చాయి. అవి వాటి సహజమైన ఆహారం దగ్గరకు వెళతాయి అంటే ఆవు విజిటేరియన్, పులి నాన్ వెజిటెరియన్. కాని మానవుడు అటు ఇటు చూస్తాడు. తెలిసిన వాళ్లుంటే వెజ్ లేకపోతే నాన్ వెజ్ కు జంప్. 


అంటే జంతువులు తమ స్వభావాన్ని పట్టి పనులు చేస్తాయి. మనిషి ఆలోచించి చేస్తాడు. అవకాశాన్ని బట్టి చేస్తాడు.


ఈ "నేను" అనే అహంభావం మనిషిలో కలగడం వలన "నేను అందరి కంటే గొప్ప వాడిని, వాడు నా కంటే తక్కువ" అనే భావన కలుగుతుంది. జంతువులకు ఈ భావన కలుగదు. అవి తాము అన్నీ ఒకటే అనే భావనతో ఉంటాయి. కాబట్టి ప్రతిమనిషికి నేను అంటే ఏమిటో తెలుసు కాని దాని స్వభావం తెలియదు. ఈ శరీరమే నేను అనుకుంటూ ఉంటాడు. అలాగే మనకు నేను అంటే ఏమిటో తెలుసు. నేను అనే దాని స్వభావం మనకు తెలియదు కాబట్టి కనపడే ఈ శరీరమే నేను అనుకుంటున్నాము. మన కన్ఫ్యూజన్ అంతా ఇక్కడే ఉంది. నేనే ఈ శరీరం ఈ శరీరమే నేను అనుకోవడం, నేను స్వభావం గురించి తెలుసుకోక పోవడమే అసలు సమస్య కాబట్టి సాధకుడు తెలుసుకోవలసిందేమిటంటే "నేను 

ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుడను" అని తెలుసుకోవాలి. అప్పుడు ఆత్మ అవినాశి, అజం, సత్యం, అవ్యయం అని తెలుసుకునే అవకాశం ఉంది. లేకపోతే వీటి అర్థాలు తెలియవు.


కాబట్టి ఆత్మజ్ఞానం రెండు దశలుగా తెలుసుకోవాలి. ముందు ఆత్మ యొక్క స్వభావం తెలుసుకోవాలి. అదే మొదటి పాదంలో చెప్పారు. ఆత్మ అవినాశి, నిత్యం, అజం, అవ్యయం అని, ఇంక రెండవ దశ ఆ ఆత్మ నేనే, నేనే ఆత్మను అని తెలియాలి. కాబట్టి రెండు దశల్లో ఆత్మజ్ఞానం సంపాదించాలి. కాని మనం అంతా ఈ శ్లోకం చదివి ఆత్మ ఇలా ఉంటుంది అని తెలుసుకుంటాము. కనిపించని ఆత్మ కొరకు వెదుకుతుంటాము. ఆత్మ కొరకు శోధిస్తున్నాను అని చెప్పుకుంటాము. కానీ నేను ఆత్మను అని మాతం అంగీకరించరు. మనలో ఉన్న ఆత్మ కొరకు బయట ఎక్కడెక్కడో వెదుకుతుంటాము. అదే అజ్ఞానము. దానికి కావాల్సినవి శ్రవణం అంటే ఆత్మ గురించి శాస్త్రముల ద్వారా వినడం, తరువాతది మననం, విన్నదానిని మననం చేయడం. ఆత్మస్వరూపం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం. దాని గురించి ఏవైనా సందేహాలు ఉంటే గురువు ద్వారా నివృత్తి చేసుకోవడం. మూడవది నిధి ధ్యాస. అంటే ఆత్మ ఎవరో కాదు నేనే. నేనే ఆత్మను. నేను ఈ శరీరం కాదు అనే జ్ఞానం కలగడం. అప్పటిదాకా నేనే దేహము, ఈ దేహంతో అన్ని పనులు చేస్తున్నాను. అమ్మో! ఈదేహం మరణిస్తుంది అని భయపడ్డ వాడు, ఆత్మజ్ఞానం కలగగానే, మరణించేది నేను కాదు, నా శరీరం మాత్రమే. నేను ఆత్మస్వరూపుడను నాకు మరణంలేదు అని నిశ్చింతగా ఉంటాడు. పైగా మరణాన్ని ఆనందంగా ఆహ్వానిస్తాడు.


కాబట్టి అర్జునా! నీవు దేహానివి కాదు. వీళ్లందరూ దేహాలు కాదు ఆత్మస్వరూపులు. దేహాలు వేరు వీళ్లు వేరు. నీవు చంపితే దేహాలు పోతాయి కానీ వాళ్లు ఎక్కడకూ పోరు. నీవు చంపడం వాళ్లు చావడం అంతా నీ భ్రమ, మిథ్య. చంపేవాళ్లు లేరు. చంపించేవాళ్లు లేరు. ఆత్మస్వరూపము ఎవరినీ చంపదు, ఎవరినీ చంపించదు. అలా అనుకోవడం 

నీ అవివేకమమ” అని బోధించాడు కృష్ణుడు.✍️```

```(సశేషం)

   🙏యోగక్షేమం వహామ్యహం🙏

రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 

 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

           🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

తిరుమల సర్వస్వం 254*

 *తిరుమల సర్వస్వం 254*

*ద్వాదశ ఆళ్వారులు-18*


2  *విష్ణుసాయుజ్యం* 


 అప్పటికే చోరవిద్యలో ఆరితేరిన తిరుమంగై ఆళ్వార్ తన చోరవృత్తిని యథేచ్ఛగా కొనసాగించి, ఆ వచ్చిన సొమ్ముతో శ్రీరంగంలో అచ్చెరువొందే అనేక నిర్మాణాలను చేపట్టాడు. వాటిలో కొన్ని ఇప్పటికీ చూపరులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి. అత్యద్భుత కళాఖండాలు సృష్టించిన వేలాది శిల్పకారులకు కూలి డబ్బులు సైతం చెల్లించలేని దయనీయస్థితికి చేరుకున్న తిరుమంగై ఆళ్వార్ తన సర్వస్వాన్ని ధారపోసి, అన్నపానాదులు సైతం త్యజించి, తాను కలగన్న నిర్మాణాలన్నింటినీ పూర్తిచేసి, పరమ భాగవతోత్తముడు అనిపించుకున్నాడు. తదనంతరం చిరకాలం శ్రీరంగనాథుని కైంకర్యంలో తరించి, పెక్కు వైష్ణవక్షేత్రాలను సందర్శించుకొని మోక్షప్రాప్తి నొందాడు.


 *నామాంతరాలు* 


 విష్ణుభక్తి ప్రధానంగా కలిగినప్పటికీ, అనేక విద్యలలో ఆరితేరిన వాడవ్వటం వల్ల, తిరుమంగై ఆళ్వార్ కు అనేక నామాంతరా లున్నాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి యైన తిరుమంగై ఆళ్వార్, ఆ నామాలన్నింటికీ సార్థకత చేకూర్చాడు. అనన్య సామాన్యమైన కవితాసామర్థ్యం కలిగి యుండటం వల్ల 'చతుష్కవి శిఖామణి' గాను; రాజాస్థానంలో నున్నపుడు శత్రువులకు సింహస్వప్నంలా ఉండటం వల్ల 'పరకాలుని' గాను; వైష్ణవభక్తులకు తలమానికంగా భాసిల్లడం ద్వారా 'తిరుమంగై ఆళ్వార్ గాను ఖ్యాతి నొందాడు. వారి పండితీప్రకర్ష ద్వారా 'ఆశుచిత్రమధురవిస్తరకవితానిర్మాణదక్షులు' అనే బిరుదును కూడా స్వంతం చేసుకున్నారు.


 *సాహిత్యసాధన* 


 వీరు తమ రచనల్లో శ్రీవేంకటేశ్వరుణ్ణి భూమ్యాకాశలపై పాదాల నుంచిన త్రివిక్రమావతారునిగా, గజేంద్రమోక్షప్రదాతగా, అష్టదిక్కుల సంరక్షకునిగా, బదరికాశ్రమవాసిగా, సప్తలోక సంచాలకునిగా ఇంకా అనేక రకాలుగా అభివర్ణించాడు. 'ఓం నమో వేంకటేశాయ' అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించిన వారికి పునర్జన్మ రాహిత్యం సంప్రాప్తిస్తుందని కూడా వీరు తమ రచనల ద్వారా స్పష్ట పరిచారు. తిరువళుక్కూత్తిరుక్కై, తిరుక్కురుందాండకం, శిరియతిరుమడల్ అనే ఇతర గ్రంథాలను కూడా వీరు రచించారు.


 శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏడవరోజు ఉదయం 'సూర్యప్రభ వాహనోత్సవం' లో తిరుమంగై ఆళ్వార్ రచించిన 'పెరియ తిరుమొళి' లోని ఎనభై పాశురాలను; అదే రోజు రాత్రి జరిగే 'చంద్రప్రభ వాహనోత్సవం' లో 'పెరియ తిరుమొళి' లోని మరో నూటనలభై పాశురాలను పారాయణం చేస్తారు.

 *విప్రనారాయణుడు (తొండరడిప్పొడి ఆళ్వార్)* 


 తమిళదేశం లోని కుంభకోణం అనే పుణ్యక్షేత్రంలో శ్రీమహావిష్ణువు *'శారంగపాణి'* గా వెలశాడు. వీరు అతృప్తామృతునిగా వాసికెక్కారు. అతృప్తామృతమంటే 'ఎంత సేవించినా తృప్తి తీరని అమృతం'. అంటే, ఈ స్వామిని ఎంతసేపు కాంక్షించినప్పటికీ తనివి తీరదన్నమాట.


 *పుష్పకైంకర్యం* 


 ఆ కుంభకోణం క్షేత్రానికి కొద్ది దూరంలో గల మండంగుడి అనే చిన్న పట్టణంలో, ఒక విప్రోత్తమునికి కలిగిన బాలునికి *'విప్రనారాయణుని'* గా నామకరణం చేశారు. ధనుర్మాసపు జ్యేష్టానక్షత్రాన, 787 వ సంవత్సరంలో ఉద్భవించిన వీరు శ్రీమన్నారాయణుడు ధరించే, *'వైజయంతిమాల'* యని పేరొందిన పుష్పమాల యొక్క అంశగా భావింపబడుతారు. సద్ర్భాహ్మణ వంశ సంజాతుడవ్వడం వల్ల, పండితుడైన తండ్రిగారి పెంపకం వల్ల విప్రనిరాయణుడు అతి చిన్నవయసు లోనే వ్యాకరణ, తర్క, మీమాంసాది సర్వశాస్త్రాలను; వేదవేదాంగాలను అభ్యసించ గలిగాడు. దానితో బాటుగా, భగవద్భక్తిని కూడా అలవరచుకున్నాడు. యుక్తవయసు కొచ్చిన విప్రనారాయణునికి తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు ప్రారంభింపగా, తన భగవదారాధనకు సంసారజీవితం ఆటంకమవుతుందనే ఉద్దేశ్యంతో; యువకుడు వివాహ ప్రస్తావనను నిరాకరించి, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండదలిచాడు. ముక్తిబాటలో పయనిస్తూ శ్రీరంగనాథుని సందర్శనార్థం 'శ్రీరంగం' చేరుకున్న విప్రనారాయణుడు రంగనాథునికి నిత్యము పుష్పకైంకర్యం చేసే లక్ష్యంతో, మరో ఆళ్వార్ శ్రీవిష్ణుచిత్తుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని; ఆలయానికి సమీపంలో ఒక పుష్పవనాన్ని పెంచసాగాడు. మిక్కిలి శ్రద్ధతో సంరక్షించడం వల్ల అనతి కాలంలోనే ఆ పూదోట రంగురంగుల, పరిమళ భరిత పుష్పాలకు నెలవై, నందనవనాన్ని తలపించేంత సుందరంగా తయారై, చూపరులను ఆకట్టుకుంది. విప్రనారాయణుడు మధ్యాహ్న సమయంలో భిక్షాటనతో జీవితాన్ని గడుపుతూ; ఉదయం మరియు సాయంకాల సమయాలలో పూమాలలల్లి శ్రీరంగనాథునికి సమర్పించు కునేవాడు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

17-26-గీతా మకరందము

 17-26-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ర్పయుజ్యతే 

ప్రశస్తే కర్మణి తథా 

సచ్చబ్దః పార్థ యుజ్యతే.


తాత్పర్యము:- ఓ అర్జునా! " కలదు' అనెడి అర్థమందును, "మంచిది' అనెడి అర్థమందును 'సత్' అను ఈ

పరబ్రహ్మనామము ప్రయోగింపబడుచున్నది. అట్లే ఉత్తమమైన కర్మమునందును ఆ 'సత్' అను పదము వాడబడుచున్నది.


వ్యాఖ్య:- పరబ్రహ్మవాచకమగు "సత్' అను పదము "ఉనికి"ని, 'శ్రేష్టత్వము'ను రెండింటిని సూచించుచున్నది. ఆ రెండు అర్థములలోగూడ ఆ పదము ప్రయోగింపబడుచుండును. (దృష్టాంతమునకు సత్ + భావము = ఉనికి).


ప్రశ్న:- పరబ్రహ్మవాచకమగు 'సత్' అను పదము ఏ యర్థములందు వాడబడుచుండును?

ఉత్తరము:- (1) "కలదు అను అర్థమందును ("ఉనికి యనెడి అర్థమందు), (2) "మంచిది' అనెడి అర్థమందును అది వాడబడుచున్నది.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వం – తృతీయాశ్వాసం*


*391 వ రోజు*


*కర్ణ పర్వము తృతీయాశ్వాసం*


కర్ణుడు తన చేత చిక్కిన ధర్మరాజును వదిలి సుయోధనుడిని రక్షించడానికి వెళ్ళాడని తెలియగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! కర్ణుడు అలా బుద్ధి లేని పని ఎందుకు చేసాడు. చేత చిక్కిన ధర్మరాజును చంపక ఎందుకు వదిలాడు ? సుయోధనుడు అంత మాత్రం భీమునితో యుద్ధం చేయ లేడా ? కర్ణుడు మోసం చేసాడంటావా ? సరేలే తరువాత ఏమి జరిగిందో చెప్పు అన్నాడు.


*ధర్మరాజు శిబిరముకు వెళ్ళుట*


కర్ణుడి చేత విడువ బడిన ధర్మరాజు శిబిరానికి చేరి మెత్తటి శయ్య మీద పరుండి. తన శరీరానికి తగిలిన బాణములు తీయించు కుంటూ తనకు జరిగిన పరాభవానికి బాధపడ సాగాడు. ఇంతలో నకుల సహదేవులు లోనికి వచ్చారు. ధర్మరాజు వారిని వెంటనే భీమునకు సాయంగా వెళ్ళమని చెప్పాడు. నకుల సహదేవులు భీముడికి సాయంగా వెళ్ళారు. అర్జునుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అర్జునుడు వేస్తున్న తీవ్రమైన బాణములు ఎదుర్కొంటూ అశ్వత్థామ అర్జునుడి మీద గదను విసిరాడు. ఆ గదను ముక్కలు చేసి వెంటనే అర్జునుడు అశ్వత్థామ శరీరంలో పది వాడి అయిన బాణములు గుచ్చి అతడి సారధిని చంపాడు. ఆగ్రహించిన అశ్వత్థామ కృష్ణార్జునుల మీద బాణవర్షం కురిపించాడు. అర్జునుడు ఆ బాణములు మధ్యలో తుంచి అశ్వత్థామ రధాశ్వముల పగ్గములను తెంచాడు. పగ్గములు తెగిన అశ్వములు రధమును ఎటో లాక్కుని వెళ్ళాయి. అది చూసి పాండవ సేనలు జయజయ ధ్వానాలు చేసాయి. కౌరవసేన పారిపోయింది.


*కర్ణుడు భార్గవాస్త్రాన్ని ప్రయోగించుట*


కురుసేనల వెనుకడుగు చూసి సుయోధనుడు " కర్ణా ! నీవు యుద్ధరంగమున ఉండగా కురుసేనలకు ఈ దుర్గతి ప్రాప్తించింది. నీవు సరిగా యుద్ధము చేసిన పాండవులు నీకు లెక్క కాదు. నీ వివిధాస్త్రాలను ప్రయోగించి నీ పరాక్రమాన్ని చూపించు " అని పురికొల్పాడు. అప్పుడు కర్ణుడు " శల్యా ! చూసావుగా సుయోధనుడి మాటలు మన రథమును అర్జునుడి వద్దకు పోనిమ్ము. అర్జునుడిని వధించి ఈ సువిశాల సామ్రాజ్యానికి సుయోధనుడిని చక్రవర్తిని చేసి నా ప్రతాపం లోకానికి తెలియజేస్తాను " అని వెంటనే విల్లు ఎక్కు పెట్టి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రము నుండి వివిధ ఆకృతులలో ఆయుధాలు వచ్చి పాండవ సేనను నాశనం చేస్తోంది. రధములు విరుగుతున్నాయి. హయములు, ఏనుగులు గుట్టలుగా చచ్చి పడుతున్నాయి. రధములు విరుగుతున్నాయి. ఆ అస్త్రప్రభావానికి తాళ లేని పాండవసేనలు పరుగులు పెట్ట సాగాయి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమహాభాగవతావతరణము

 🌻శ్రీమహాభాగవతావతరణము 🌻


సీ.

నారాయణుని దివ్యనామాంకితమ్మునౌ 

       కావ్యమ్ము విరచించు కౌతుకమున

నొకనాటి పూర్ణచంద్రోదయోదీర్ణ సత్ 

       చంద్రగ్రహణ దివ్యసమయ మందు

సజ్జను లనుమతిన్ స్నానమ్ము పాటించ

       గంగలో నిష్ఠతో  క్రుంకు లిడియు 

వెడలివచ్చి యచటి  విమల సైకత తటిన్  

       జేరి సద్భక్తితో  కూరుచుండి

తే.

ధ్యాన యోగాన పరమేశు నాత్మ నెంచి 

యర నిమీలిత నయనాల నరయు చుండ

భక్తపోతన్న యెదుటను ప్రభల నొల్కు 

దివ్య తేజస్సు కన్పించె  దిశలు వెలుగ       19*


సీ.

మెరుపుతీగకు ప్రక్క మేఘమ్ము వోలెను

          నువిద  చెంగట నుండ నొప్పు వాడు

చంద్రమండల సుధాసారమ్ము వంటిదౌ

          చిరునవ్వు ముఖమందు చిందు వాడు

వల్లీయుత తమాల వసుధజ వోలెను

           బలు విల్లు మూపునన్ బరగు వాడు

నీలాద్రి శిఖరాన నిల్చు భానునిగను

            ఘన కిరీటము దల గల్గు వాడు

ఆ.

పుండరీకయుగము బోలు నేత్రమ్ముల 

వెడద యురము తోడ  వెలయు నట్టి

రాజముఖ్యు డొకడు  తేజోనిధీశుండు 

పోతనార్యు నెదుట పొలిచి నిలిచె          20*


క.

కనె పోతన యా పురుషుని

తనువంతయు పులకలెత్త తన్మయమతితో,

కను లెదుటను కన్పించిన

ఘను డంతట పల్కెనిట్లు గాంభీర్యముగన్     21*


✍️గోపాలుని మధుసూదనరావు🙏