22, ఫిబ్రవరి 2026, ఆదివారం

పురాణాలలో మత ఉగ్రవాదం)

 శ్రీరామ (97)


                   

              (పురాణాలలో మత ఉగ్రవాదం)


శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).


                               ----------------


మతం అంటే అభిప్రాయం.

అనేకమంది అనేక అభిప్రాయాలను కలిగి యుంటారు.

ఒకే అభిప్రాయంగల అనేకుల సమూహం " మతం " గా ప్రస్తుతం చెలామణిలో ఉన్నది.

మా మతము గొప్పది,ఆచరణీయం అనుకోవడంలో తప్పులేదు.

కానీ అన్ని మతములకన్నా మా మతమే గొప్పది, అందరూ తదనుకూలంగా ఉండాలి అనేది మత తీవ్ర వాదం.

తమ మతం, తమ కులం, తమ భాష, తమ ప్రాంతం,ఇంకా చెప్పాలంటే తమ శాఖ, తమ సంప్రదాయములకు చెందని వారిని ద్వేషించడమే ఈ తీవ్రవాదుల మతం.

దానికి వారు యుక్తిగా అనేక కారణములు చెబుతారు.


కొందరు ఉన్మాదులు, మరికొంత ముందుకు వెళ్ళి తమ మతమునకు విరుద్ధంగా ప్రవర్తించే వారిని చంపివేయాలి అంటారు.

దీన్నే "మత ఉగ్రవాదం" అంటాము.

తాము సంహరిస్తున్న వారంతా " మత ద్రోహులు,అజ్ఞానులు,దుర్మార్గులు, నీచులు,వీరిని చంపితే గానీ సమాజం బాగుపడదు" అంటారు.


ఎంతమందిని చంపితే అంత ఎక్కువగా వారి దేవుడు సంతోషిస్తాడు అంటారు.


ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేస్తారు.


పరమత ద్వేషులైన మరికొందరు, సంప్రదాయ వేషధారులై శివ, విష్ణు, ద్వేషాలను సున్నితంగా రెచ్చకొడతూ అమాయకులను మభ్యపెడతారు.


వారు పైకి నవ్వుతూనే సమాజంలో

 "విషాన్ని" చిమ్మి, కొంతమంది మేధావులను లోబరచుకొని ప్రజలలో చీలికలు సృష్టిస్తారు.


ఇదంతా సత్యము, ధర్మము, అహింస, ప్రాణులందరి యందు సమభావము, లను బోధించే "సనాతన ధర్మము" నకు వ్యతిరేకమైన తీవ్రవాదమే.


 ప్రజలను అశాంతికి గురిచేసి, సమాజాన్ని సర్వ నాశనం చేసేది ఉగ్రవాదము.


ఆ ఉగ్రవాదానికి ప్రతీకే పురాణాలలో వర్ణించిన "హిరణ్యకశిపుడు".


తన మతానికి విరుద్ధంగా, ప్రహ్లాదుడు చేసిన విష్ణు ప్రశంశ, హిరణ్యకశిపుడు భరించలేక పోయాడు.


ఒడిలో నుండి పుత్రుని క్రిందికి త్రోసివేసి క్రోధావేశంతో అక్కడ ఉన్న మంత్రులతో ఇలా అన్నాడు.


"మంత్రులారా! ఈ ప్రహ్లాదునివంటి పితృద్రోహి, భూమండలంలో ఎవరైనా ఉన్నారా?


వీడియొక్క ‌పినతండ్రి హిరణ్యాక్షుని,వరాహ రూపంలో వచ్చి విష్ణువు సంహరించాడు.


వీడు సిగ్గు శరములు లేకుండా మన వంశ విరోధి అయిన ఆ విష్ణువునకు భజన చేస్తున్నాడు.


ప్రాణం పోయినంత బాధ నాకు కలిగిస్తున్నాడు. 

వీడిని ఏమాత్రం ఉపేక్షించ కూడదు,

అంటూ,

  రాక్షస భటులవంక తిరిగి వారిని ఈ విధంగా ఆజ్ఞాపించాడు.

శా// పంచాబ్దంబులవాడు, తండ్రినగు నా పక్షంబు నిందించి, య/

త్కించిద్భీతియు లేక విష్ణు, నహితుం గీర్తించుచున్నాడు,వ/

 ల్దంచుం చెప్పిన మాన డంగమున బుత్రాకారతన్

వ్యాధి జ/

న్మించెన్, వీని వధించి రండు దనుజుల్ మీ మీ పటుత్వంబులన్//

(రాక్షసులారా! వీడు చూస్తే ఐదేండ్ల పిల్లవాడు.

తండ్రి నైన నన్ను ధిక్కరించి,నా ఎదుటే, నా శత్రువైన విష్ణువును, నదురు,బెదురు, లేకుండా పొగడు చున్నాడు.

వద్దంటే నా మాట లెఖ్ఖ చేయడం లేదు.

వీడు నా కొడుకు కాదు. 

 "కొడుకు" అనే పేరుతో నా శరీరంలో జన్మించిన పెద్ద వ్యాధి.

మీ మీ శక్తి సామర్థ్యాలు చూపించి వీనిని తీసుకుని వెళ్లి వెంటనే వధించండి).


శా// అంగ వ్రాతములో జికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శే/

షాంగంబు రక్షసేయు క్రియ నీ యజ్ఞుం, గులద్రోహి, దు/

స్సంగుం, గేశవ పక్షపాతి, నధముం, జంపించి వీరవ్రతో/

త్తుంగ ఖ్యాతి జరించెదం,గులము నిర్దోషంబు గావించెదన్//


(ఓ రాక్షస భటులారా!

 శరీరంలో ఏదైనా ఒక అవయవం చెడిపోతే వైద్యుడు ఆ అవయవాన్ని శస్త్ర చికిత్సతో ఛేదించి, మిగతా దేహాన్ని రక్షిస్తాడు.

ఆ విధంగా " అజ్ఞాని, కులద్రోహి, దుర్మార్గులతో కూడిన వాడు, విష్ణు పక్ష పాతి, నీచుడు,అయిన ఈ ప్రహ్లాదుని సంహరించి,నా కులాన్ని నిర్దోషము చేస్తాను.

"పుత్రుని కూడా సంహరించి కులమును కాపాడాడు" అన్న మహాకీర్తిని సంపాదిస్తాను).

అన్నాడు.


హిరణ్యకశిపుని ఆజ్ఞానుసారం ఆ రాక్షసభటులందరు ఏకమై, శూలములు చేతుల్లో ధరించి, నిర్దయులై ప్రహ్లాదుని క్రూరంగా పొడిచి హింసించారు.

రాజకుమారుడు, అందరియడల దయగలవాడు, సాధువు, ప్రజలందరిచేత మన్నింపబడుతున్న వాడు, బాలుడు, చంపదగినవాడు కాడు, అనే ఆలోచనేదీ లేకుండా, వారంతా ఆ బాలుని చిత్రహింసలకు గురిచేశారు.


ఈ ఉగ్రవాదాన్ని చూచి, సాధుసంరక్షకుడైన భగవానుడు ఆగ్రహపరవశుడైనాడు.


భయంకరమైన నరసింహ రూపం ధరించాడు.

నిప్పులు కురిపిస్తున్న నేత్రాలతో హిరణ్యకశిపుని చూస్తూ అ దానవుడిపై లంఘించాడు.


మ// విహగేంద్రుం డహి వ్రచ్చు కైవడి, మహోద్వృత్తిన్, నృసింహుండు, సా/

గ్రహుడై,యూరవులందు జేర్చి, నఖ సంఘాతంబులన్ వ్రచ్చె, దు/

స్సహు,దంభోళి కఠోరదేహు,నచలోత్సాహున్,మహాబాహు, నిం/

ద్ర హుతాశాంతక భీకరున్, ఘనకరున్,దైత్యాన్వయ శ్రీ కరున్//


(ఆ హిరణ్యకశిపుడు సామాన్యుడు కాడు.

తన తపశ్శక్తితో ప్రపంచం సహించలేనంత శక్తి కలిగి ఉన్నవాడు.

వజ్రము వలె కఠినమైన దేహంతో కూడి ఉన్నవాడు.

అచంచలమైన ఉత్సాహంతో కూడి ఉన్నవాడు.

మహా బాహువు.

ఇంద్రుడు, అగ్ని, యముడు,మొదలైన దేవతలకు భీతి కలిగించిన వాడు,

దిగ్గజముల కుంభస్థలాలను పగులగొట్టగలిగిన బలమైన బాహువులు గలవాడు,

ముల్లోకాలను జయించి రాక్షస వంశానికి కీర్తి ప్రతిష్టలు చేకూర్చిన వాడు,

అటువంటి ఆ హిరణ్యకశిపుని "నృసింహుడు" మహాసంరంభంతో పట్టుకొన్నాడు.

తన తొడలమీద వేసుకొని,

మిక్కిలి ఆగ్రహపరవశుడై తన వాడి గోళ్లతో వాడి వక్షస్థలాన్ని చీల్చి వేశాడు)


                   ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

22-2-'26.

కామెంట్‌లు లేవు: