శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 18 )
(సీతారాముల కళ్యాణం తరువాత కథ )
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏
సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
(27-3-'26 పోష్టు తరువాయి భాగము)
"దుష్టశిక్షణ" " శిష్టరక్షణ" "ధర్మ సంస్థాపన" ల కోసం అవతరించిన సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.
వివాహ వేడుకలైన మరుసటి రోజు, భార్యా సమేతులైన రామ, లక్ష్మణ,భరత శత్రుఘ్నులకు అనేక ఆశీర్వాదములు ఇచ్చి, జనక మహారాజు, దశరథ మహారాజుల వద్ద సెలవు తీసుకుని,"విశ్వామిత్ర మహర్షి" హిమవత్పర్వతమునకు వెళ్లిపోయారు.
దశరథ మహారాజు కూడా జనకుని వద్ద సెలవు తీసుకున్నాడు.
భార్యా సహితులైన పుత్రులతోను, వసిష్ఠ, వామదేవాది పురోహితులతోను, మంత్రులు,పరివారము, సైన్యము తోను అయోధ్యకు ప్రయాణమైనాడు.
వారందరికీ మార్గమధ్యంలో కొన్ని భయంకరమైన దుశ్శకునములు కనిపించినవి.
" ఈ శకునములకు ఫలితమేమిటి?నా మనస్సు ఆందోళన చెందుతున్నది"
అని దశరథుడు వసిష్ఠమహర్షిని అడిగాడు.
" భయంకరమైన పక్షి నాదములు వినిపిస్తున్నవి. అందువల్ల, మనకు ఇప్పుడు ఒక గొప్ప ఆపద రాబోతున్నది.
అయితే ప్రదక్షిణముగా తిరుగుచున్న మృగములు, ఆ ఆపద తొలగిపోతుంది అని సూచిస్తున్నాయి" అన్నారు వసిష్ఠమహర్షి.
వారిలా మాట్లాడుకుంటుండగానే, హఠాత్తుగా భూమి కంపించింది.
పెద్ద పెద్ద వృక్షములను నేలకూలుస్తూ, దుమ్ము, ధూళి ఎగజిమ్ముతూ, గొప్ప శబ్దము చేస్తూ, పెనుగాలి వీచింది.
దట్టమైన చీకటి ఆ ప్రాంతమంతా ఆవరించింది.
సైన్యమంతా బూడిదతో కప్పబడినట్లు కనిపించింది.
దశరథుడు, అతని పుత్రులైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు,
వారి పత్నులైన సీత, ఊర్మిళ,మాండవి, శ్రుతకీర్తులు,
వశిష్ఠ మహర్షి మొదలైన మహర్షులు,
తప్ప ఇతరులంతా చైతన్యరహితులై మూర్ఛ పోయారు.
శ్లో// తస్మింస్తమసి ఘోరే తు భస్మచ్ఛన్నేవ సా చమూః/
దదర్శ భీమ సంకాశం, జటామండల ధారిణమ్/
భార్గవం జామదగ్న్యం తం రాజ రాజ విమర్దినమ్/
కైలాస మివ దుర్ధర్షం,కాలాగ్నిమివ దుస్సహమ్/జ్వలన్తమివ తేజోభిః దుర్నిరీక్ష్యంపృథగ్జనైః/
స్కన్ధేచాసజ్య పరశుం ధనుర్విద్యుద్గణోపమమ్/
ప్రగృహ్య శర ముఖ్యం చ త్రిపురఘ్నం యథా శివమ్//
(ఆ ఘోరమైన చీకటిలో,వెలుగులు విరజిమ్ముతున్న
జటామండలము ధరించినవాడు,
రాజ రాజులను సంహరించినవాడు,
కైలాసపర్వతమువలె ఎదిరింప శక్యం కానివాడు,
కాలాగ్నివలె సహింప శక్యం కానివాడు,
తేజస్సుతో వెలిగిపోతున్న వాడు,
సామాన్యులచేత చూడ శక్యం కానివాడు,
భుజమునందు, గండ్రగొడ్డలి ధరించిన వాడు,
విద్యుత్కాంతులతో నిండిన ధనస్సును,శ్రేష్ఠమైన శరమును,చేతులలో ధరించిన వాడు,
సాక్షాత్తు త్రిపురములను ధ్వంసం చేసిన రుద్రుని వలె ఉన్న వాడు,
భృగువంశమునకు చెందిన జమదగ్ని మహర్షి కుమారుడు,
అయిన,
"పరశురాముడు" అక్కడ ప్రత్యక్షమైనాడు).
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.
ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః
(సశేషం)
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
28-3-'26
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి