11, ఏప్రిల్ 2026, శనివారం

శ్రీ మహావిష్ణు పురాణం

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*శుక్రవారం 10 ఏప్రిల్ 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

 `` *53వ భాగం*``


*అనసూయ పరీక్షించడానికి వచ్చినత్రిమూర్తులనుపసిపాపలను చేయటం - త్రిమాతల కోరిక పై యధారూపం కలిగించుట*```


సరస్వతీదేవి లక్ష్మీదేవి ఉమాదేవి కోరిక పై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సతీ అనసూయ పాతివ్రత్య పరీక్ష చేయడానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఆ సమయంలో అత్రి మహర్షి ఆశ్రమంలో లేరు. వేరొక ప్రదేశానికి ఆహ్వానం పై యజ్ఞం చూడటానికి వెళ్లారు.


మధ్యాహ్నం వేళ త్రిమూర్తులు యతీశ్వరుల రూపంలో అత్రి మహర్షి ఆశ్రమం బయట నుంచుని "మాతా! భిక్షాం దేహి" అని ముగ్గురు గట్టిగా పిలిచారు. 


అనసూయ ఆ పిలుపు విని బయటకు వచ్చి తేజస్సుతో విరాజిల్లుతున్న ముగ్గురు యతీశ్వరులకు నమస్కరించింది. యతులు 

ఆశీర్వదించి "భవతీ భిక్షాం దేహి" అని అడిగారు.


అనసూయ "మహాత్ములారా! 

నా పతి అత్రి మహర్షుల వారు యజ్ఞం చూడటం కోసం బయటకు వెళ్లారు. వారి తరపున నేను మీకు అర్ఘ్యపాద్యములు సమర్పించి భోజనం ఏర్పాటు చేస్తాను. పాదపూజకు లోనకు రండి" అని స్వాగతం పలికింది. 


యతులు "సరే తల్లి! ఆకలితో ఉన్నాము. త్వరగా భోజన ఏర్పాట్లు చేయము" అని ఆమె వెంట లోనికి వెళ్లారు.


త్రిమూర్తులకు అనసూయ గృహస్థ ధర్మం ప్రకారం పాదపూజ, అర్ఘ్యపాద్యములు ఇచ్చింది. 


బ్రహ్మదేవుడు."భోజనం సిద్దం అయితే త్వరగా వడ్డించే ఏర్పాట్లు చేయండి" అని అడిగాడు. 


అనసూయ "సిద్దంగా ఉంది! స్వామీ! లోపలికి రండి" అని భోజనశాలకు తీసుకు వెళ్లింది. 


ముగ్గురికి ఉచితాసనాలు ఏర్పాటుచేసింది. ఆసీనులయ్యాక వారి ముందు శుభ్రపరచిన అరటి ఆకులు, మంచినీటి పాత్రలు ఏర్పాటు చేసింది.


ఆహార పదార్థాలు లోన నుంచి తెచ్చి వడ్డించబోతుంటే ముగ్గురు యతులు ఆగమని చెప్పారు. 


అనసూయ ఆశ్చర్యంగా చూస్తుంటే మహేశ్వరుడు "మాకుభోజనం వడ్డించడానికి, మేము తినడానికి ఒక నియమం నీవు పాటించాలి. అప్పుడే మేము స్వీకరిస్తాము" అని బ్రహ్మవంక నియమం చెప్పమన్నట్టు చూశాడు.


యతి రూప బ్రహ్మదేవుడు ముఖంలో ఏ భావం కనపడకుండా "మాకు నీవు వివస్త్రవై వడ్డించాలి. అప్పుడే మేము భోజనం చేయగలము" అన్నాడు. 


అనసూయ ఉలిక్కిపడ్డి, త్రిమూర్తుల వైపు అనుమానంతో చూసింది. ఒక ఇల్లాలిని వివస్త్రగా (వస్త్రములు లేకుండా) వడ్డించమంటున్నారు. వీరు అతిథి రూపంలో వచ్చిన రాక్షసులు కాదు కదా" అని వారి వంక తీక్షణంగా చూడబోయింది.


అనసూయ కోపంగా చూస్తే తాము ముగ్గురం భస్మం అవుతామోనని విష్ణువు వెంటనే "అమ్మా! అది మా యతుల నియమం" అని నెమ్మదిగా పలికాడు. అమ్మా అని పిలిచేసరికి అనసూయలో కోపం తగ్గింది. తల్లిగా భావిస్తున్నారు తనను అనుకుంది.


మహేశ్వరుడు "తల్లీ! తప్పుగా అనుకోకు. అది మా నియమం. కాదంటే మేము లేచి వెళ్ళి పోతాము" అన్నాడు. 


వెంటనే బ్రహ్మ కూడా "అమ్మా! ఆకలితో వచ్చిన అతిథుల ఆకలి తీర్చడం గృహిణి ధర్మం. భోజనం పెడతాను అని లోనికి రమ్మన్నావు. ఇప్పుడు మాట తప్పితే బ్రహ్మహత్యాపాతకం వస్తుంది. నీఇష్టం ఆలోచించు" అని హెచ్చరిస్తునట్టు అన్నాడు.


యతులు ముగ్గురు తనను తల్లిగా సంబోధించడంతో అనసూయకు వీరెవ్వరో తనను పరీక్షించడానికి వచ్చిన మహాపురుషులు అనిపించింది. తన పాతివ్రత్య శక్తితో అంతర్ముఖంగా పరిశీలిస్తే వచ్చిన యతులు ముగ్గురు త్రిమూర్తులైన బ్రహ్మవిష్ణుమహేశ్వరులుగా తెలుసుకుంది. మువ్వురు తనను తల్లిగా భావించారంటే వారు తనకు బిడ్డలు కావాలని కోరుకుంటున్నారు. తను ఏంచేయాలో అర్థం అయ్యింది. 


అనసూయ మందహాసం చేస్తూ "మీరు నన్ను అమ్మగా భావించారు. పిల్లల కోరిక తల్లి కాదనదు కదా. ఈ క్షణమే పసిపాపలై మీ తల్లి పెట్టే గోరుముద్దలు తినండి" అని అక్కడ ఉన్న కమండలం లోని ఉదకాన్ని అభిమంత్రించి ముగ్గురి మీద చల్లింది. 


తక్షణమే ముగ్గురు త్రిమూర్తులు పసిబిడ్డలుగా మారిపోయారు. ఆకలికి కెవ్వుమని ఏడవ సాగారు.


అనసూయ త్రిమూర్తులు కోరినట్లు వివస్త్రయై వచ్చి ముగ్గురు పసివాళ్ళను దగ్గరకు తీసుకుని లాలిస్తూ అరిటాకులలోగల అన్నం కూరలు కలిపి గోరుముద్దలు చేసి తినిపించింది. మంచినీరు త్రాగించింది. ఆకలి తీరిన పసివాళ్ళూ ఆనందంతో బోసినవ్వులు నవ్వారు. ఒడిలోకి తీసుకుని లాలిస్తూ జోలపాటలు పాడుతూ ముగ్గురిని నిద్రపుచ్చింది. అక్కడే చక్కటి పడక ఏర్పాటు చేసి పడుకోబెట్టి తను వెళ్లి వస్త్రములు ధరించింది.


త్రిమూర్తులు ముగ్గురు పసిపాపలై పోవడంతో వారినివాసాలైన సత్య లోకం వైకుంఠం, కైలాసం తేజస్సు కోల్పోయాయి. త్రిమూర్తులు లేక పోవడంతో సృష్టి స్థితి లయ కార్యాలు ఆగిపోయాయి. హవిర్భా గాలు స్వీకరించడానికి త్రిమూర్తులు లేకపోవడంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి.


విశ్వం గందరగోళంలో పడింది. ఇంద్రాది దేవతలు త్రిమూర్తులను వెతుకుతూ సత్యలోకం, విష్ణు లోకం, శివలోకం వచ్చి త్రిమాత లైన సరస్వతి లక్ష్మి గౌరికి పరిస్థితి చెప్పి త్రిమూర్తుల ఆచూకి అడిగారు. త్రిమాతలకు అర్థం అయ్యింది. తమ పతులు అన సూయను పరీక్షించబోయి ఆమె వద్దనే బందీలైనారు అని. నారదుడు ఇంద్రాది దేవతలతో కలసి అనసూయ దగ్గరకు వెళ్ళారు.


అత్రి మహర్షి విషయం తెలుసుకుని వాయుమార్గంలో ఆశ్రమం చేరాడు. త్రిమాతలు, ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు, అత్రి మహర్షి ఒకేసారి ఆశ్రమం చేరారు. అక్కడ పసిబిడ్డలుగా నిద్రిస్తున్న త్రిమూర్తులను చూశారు. అందరికి అనసూయాదేవి పాతి వ్రత్యం మహిమ తెలిసి వచ్చింది.


అలజడికి బయటకి వచ్చిన అనసూయను చూసి సరస్వతి లక్ష్మి ఉమాదేవిలు నమస్కరించి "అమ్మా! అనసూయా! నీ పాతివ్రత్య మహిమ అందరికి తెలియ చేయాలనే మా నాథులను నిన్ను పరీక్షించమని పంపాము. నీపాతివ్రత్య శక్తితో ముగ్గురు త్రిమూర్తులను పసిబిడ్డలను చేశావు. సృష్టి స్థితి లయ కార్యాలు నిలిచిపోయాయి. కరుణించి లోకాలను రక్షించడానికి మా భర్తలకు యధా స్వరూపం వచ్చేట్టు చేయి తల్లీ!" అని ప్రార్ధించారు.


అనసూయ భర్త అత్రి మహర్షి వంక అనుమతి కోసం చూసింది. అత్రి మహర్షి మందహాసం చేస్తూ చూపులతోనే అనుమతి ఇచ్చాడు అనసూయ పసిబిడ్ఢలపై మంత్రోదకం సంప్రోక్షణ చేసింది. మరుక్షణం పసిబిడ్డలు బ్రహ్మవిష్ణుమహేశ్వరులుగా తమ యధారూపాలు పొందారు. త్రిమాతలు త్రిమూర్తుల చెంత చేరారు. అక్కడ ఉన్న దేవతలు మహర్షులు ఆనందంతో హర్షధ్వానాలు చేసారు. సృష్టిస్థితి లయ కార్యాలు తిరిగి ప్రారంభమయ్యాయి. యజ్ఞయాగాదులు క్రతువులు మొదలయ్యాయి. విశ్వంలో శాంతి నెలకొంది.


అత్రి అనసూయలు త్రిమూర్తులకు, త్రిమాతలకు భక్తితో నమస్కరించారు. మహావిష్ణువు వారిని చూసి "అత్రి మహర్షీ! అనసూయ మాతా! నేను మీకు పుత్రునిగా జన్మిస్తాను అని వరం ముందే ఇచ్చాను. పసిపిల్లలుగా అనసూయ మాత మాతృ ప్రేమ చవిచూసిన తరువాత బ్రహ్మ మహేశ్వరులు కూడా నాతోపాటు మీకు పుత్రులుగా జన్మించాలని

అనుకుంటున్నారు.


కనుక మీకు బ్రహ్మాంశతో, వైష్ణవాంశతో, ఈశ్వరాంశతో ముగ్గురు కుమారులుగా మేము జన్మిస్తాము. త్రిమూర్తుల కన్న తల్లిదండ్రులుగా శ్వేతవరాహ కల్పాంతము వరకు మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మాతా! అనసూయా! నీవు స్త్రీల కందరికి ఆదర్శమూర్తివై, పతివ్రతా లోకానికి శిరోమణివై ఉంటావు" అని ఆశీర్వదించి త్రిమాతలతో కలసి అదృశ్యమయ్యారు. 


ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షులు అభినందనలు తెలియజేసి తమ నివాసాలకు ప్రస్థానమయ్యారు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: