30, మార్చి 2026, సోమవారం

వాల్మీకి రామాయణం - 20)

  శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 20)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

       (29-3-'26 పోష్టు తరువాయి భాగము)


పరశురాముడు, దశరథరాముడితో ఇంకా ఇలా అన్నాడు.

ఒకానొకప్పుడు దేవతలందరు శివ, విష్ణువుల బలాబలములను గురించి బ్రహ్మదేవుని అడుగగా ,

అతడు, శివ విష్ణువులకు మిథ్యావైరము కల్పించెను.

అంతట పరస్పర జయాభిలాషులైన శివుడు, విష్ణువుల మధ్య భయంకరమైన పోరాటము జరిగెను.

శ్లో // తదా తు జృంభితం శైవం ధనుర్భీమ పరాక్రమమ్ /

హుం కారేణ మహాదేవః స్తంభితో ౽ థ త్రిలోచనః //

( అప్పుడు విష్ణువు ' హుం ' కారము చేయగా భయంకరమైన పరాక్రమము గల శివధనస్సు జృంభితం = ఆవులించినది, అనగా జడప్రాయమైనది.

త్రిలోచనుడైన శివుడు కూడా, స్తంభితః = కదలలేక పోయెను)

శివుడు తెప్పరిల్లి తిరిగి యుద్ధసన్నద్ధుడవగా దేవతలు ప్రళయం సంభవిస్తుందని భయపడి శివ, విష్ణువు లిరువురిని ప్రార్థించి శాంతింపజేసిరి.


శ్లో// దేవైస్తదా సమాగమ్య సర్షిసంఘైః సచారణైః /

యాచితౌ ప్రశమం తత్ర జగ్మతుస్తౌ సురోత్తమౌ //

(అప్పుడు దేవతలు, ఋషులు, చారణులు, వచ్చి ప్రార్థింపగా ఆ దేవతాశ్రేష్ఠులైన శివ విష్ణువులు శాంతించిరి)

విష్ణువు యొక్క ' హుం ' కారమునకు శివధనస్సు జడమై పోవుటవలన దేవతలు, విష్ణువు అధికుడని భావించిరి.

యుద్ధంలో జడత్వం పొందినందుకు కోపించినవాడై, శివుడు ఆ ధనస్సును బాణసహితంగా విదేహవంశములోని 'దేవరాతు'నికి ఇచ్చివేసెను.

విష్ణువు కూడా తన ధనస్సును భృగువంశీయుడైన ఋచీక మహర్షికి న్యాసముగా ఇచ్చెను.

ఋచీకుడు ఆ ధనస్సును తన కుమారుడైన జమదగ్ని మహర్షికి ఇచ్చెను.

నా తండ్రియైన జమదగ్ని నుండి ఆ ధనస్సు నాకు సంక్రమించినది.


క్షత్రియ జాతికి చెందిన కార్తవీర్యార్జునుని పుత్రులు, తపోబలసంపన్నుడైన నా తండ్రి అస్త్రసంన్యాసము చేసి తపమొనర్చుచుండగా అతనిని చాలా దారుణంగా, శిరస్సు ఖండించి చంపివేసిరి.


దానికి ప్రతీకారంగా నేను వారందరినిసంహరించాను.

అంతేకాదు,పుట్టిన ప్రతి క్షత్రియుడిని కూడా సంహరించాను.

ఈ భూమినంతా కశ్యపునకు దానమిచ్చి, మహేంద్ర పర్వతముమీద నివసిస్తున్నాను.


నీవు చేసిన శివ ధనుర్భంగం గురించి విని నీతో ద్వందయుద్ధం చేయడానికి ఇప్పుడు వచ్చాను.


క్షత్రియ ధర్మాన్ని అనుసరించి, నీవు ఈ వైష్ణవ ధనస్సును స్వీకరించి ఎక్కుపెట్టు.

నీవు అలా ఎక్కుపెట్టగలిగితే నీతో ద్వందయుద్ధం చేస్తాను" అన్నాడు పరశురాముడు.



శ్రీరాముడు, సహజముగా మితభాషి.

మహారాజు,తండ్రి, అయిన దశరథుడు దగ్గర వుండుటచే, ఆయనమీద ఉన్న గౌరవముతో ఇంకా మితముగా మాట్లాడుతూ, పరశురామునితో ఇలా అన్నాడు.


శ్లో// శ్రుతవానస్మి యత్కర్మ కృతవానసి భార్గవ/

అనురుంధ్యామహే బ్రహ్మన్ పితురానృణ్యమాస్థితమ్//


(ఓ భార్గవా!నీవు చేసిన పనులను వింటిమి. తండ్రి విషయమున స్వధర్మము నిర్వహించి ఋణవిముక్తుడవైన నిన్ను అభినందించుచున్నాము).


(సాటి క్షత్రియజాతిని నాశనం చేసినందుకు,పరశురాముని మీద రామునకు కోపం రాలేదు సరికదా!తన ధర్మం తాను నిర్వహించినందుకు, ఆయనను అభినందిస్తున్నాడు రాముడు.

ధర్మం ముందు స్వ, పర, పక్షపాత బుద్ధి ఉండకూడదు.

" రామో విగ్రహవాన్ ధర్మః " అనే నానుడికి ఈ శ్లోకం ఒక చక్కటి ఉదాహరణ).


రాముడు ఇంకా ఇలా అన్నాడు.

"నన్ను క్షత్రియధర్మం పాటించగల సమర్ధత లేనివానిగాను,పరాక్రమం లేని వానిగాను,భావిస్తూ నీవు నన్ను అవమానిస్తున్నావు".


శ్లో// ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో భార్గవస్య శరాసనమ్/

శరంచ ప్రతి జగ్రాహ హస్తాల్లఘు పరాక్రమ://


(ఇట్లు పలికి రాముడు శీఘ్రమైన పరాక్రమముతో,పరశురాముని చేతిలోనుండి 

ఆ విష్ణుధనస్సును, బాణమును గ్రహించెను).



(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

30-3-'26

కామెంట్‌లు లేవు: