30, మార్చి 2026, సోమవారం

వేదముల పవిత్రతను

  శ్రీరామ (121).


        ( వేదముల పవిత్రతను రక్షించుకుందాం)


శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).


                                -----------


 ఒక్క వేద పదమునకు గాని, వేద వాక్యమునకు గాని అర్థం చెప్పాలంటే, శీక్షా, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము,ఛందస్సు, కల్పము, అను ఆరు అంగములతో సహా వేదములను బ్రహ్మచర్య దీక్షతో అధ్యయనం చేసినవారే సమర్థులు.


 శ్లో// షడంగ వేద విదుషాం క్రతు ప్రవర యాజినామ్/

శుశ్రావ బ్రహ్మ ఘోషాన్ స విరాత్రే బ్రహ్మరక్షసామ్//

(షడంగములతో కూడిన వేదవిద్యలందు నిష్ణాతులు, అనేక శ్రేష్టములైన యజ్ఞ యాగాదులు చేసిన వారు, అయిన, ఆ లంకా పట్టణమందలి, రాక్షసజాతికి చెందిన బ్రాహ్మణులు, బిగ్గరగా వేదాధ్యయనము చేయుచుండగా, ఆ వేదఘోషను, హనుమంతుడు వినెను).


ఇది వాల్మీకి రామాయణములోని సుందరకాండ లోని శ్లోకము.

అశోక వనములో సీతాదేవిని చూచిన తరువాత, రాక్షస స్త్రీలు చుట్టూవుండి కాపలా కాస్తున్న ఆమెతో ఎలా సంభాషించాలా అని హనుమంతుడు ఆలోచిస్తున్నాడు.

అది తెల్లవారుఝాము.

అప్పుడు ఆయనకు లంకానగరములో బ్రహ్మరాక్షసులు పఠిస్తున్న మహత్తరమైన వేదఘోష వినపడినది.

ఆ బ్రహ్మరాక్షసులందరు,శీక్షా, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము,ఛందస్సు, కల్పము, అను ఆరు అంగములు కల వేదములను అధ్యయనం చేస్తున్నారు.

రాక్షస జాతికి చెందిన వారు కూడా అంత శ్రద్ధతో షడంగములతో కూడిన వేదాధ్యయనం చేస్తున్నారు, అంటే ఎంత ఆశ్చర్యం!


అందులో ఏ ఒక్క అంగము సమగ్రముగా అధ్యయనం చేయని,మనలో చాలామంది, వేదపండితులుగా చెలామణి అవుతున్నారు.


అంతే కాకుండా వేదవాక్యాలకు తమ మేధాశక్తి ననుసరించి,ఏ విద్యారణ్య భాష్యము, శంకర భాష్యము మొదలైన ప్రమాణములు లేకుండా తమకు తోచిన అర్ధాలు చెబుతున్నారు.


ఆమధ్య నేను పురుష సూక్తం మీద ఒక ప్రసిద్ధి చెందిన ప్రవచనకారుడు, చేసిన ప్రసంగము వినటం తటస్థించింది.

ఆ ప్రసంగం చేసినాయన గొప్ప మేధావి, పండితులు.

చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు.

వారంటే నాకు గౌరవం ఉంది.

కాని ఆయన చదివిన పురుష సూక్తమంతా అపస్వరములతో కూడి ఉన్నది.

దాన్నిబట్టి ఆయన వేదాధ్యయనము చేయలేదని తెలుస్తున్నది.

వేదాధ్యయనం చెయ్యకుండా, ఆయనలాగానే ఈమధ్య చాలామంది, వేదముల మీదా, వేదాంతముల మీదా ప్రవచనములు ఇస్తున్నారు.

వివిధ మార్గాలయిన భక్తి, జ్ఞాన, యోగ, కర్మ, మార్గాలను కలగాపులగం చేస్తూ ప్రజలను,అయోమయానికి గురిచేస్తున్నారు. 

లౌకిక విషయాలతో, రాజకీయాలతో, ఛలోక్తులతో,పురుషసూక్తము యొక్క అర్ధము తనకు తోచిన విధముగా వివరిస్తూ, ఏ ప్రమాణము ఉదహరించకుండా, సాగిన ఆ పండితుని ప్రసంగం విన్నతరువాత, నాకు ఎంతో బాధవేసింది.


భారత, భాగవత, రామాయణాదులు పౌరుషేయములు అనగా పురుషకృతములు.

విభిన్న మనస్తత్వాలతో కూడిన విభిన్న పాత్రలు ఆ గ్రంధాలలో ఉంటాయి.

ఎవరి మేధాశక్తిని బట్టి వారు వ్యాఖ్యానించుకోవచ్చు.

కానీ వేదములు అపౌరుషేయములు.

సాక్షాత్తు భగవంతునినుండి ప్రకటితమయినవి.


అతీంద్రియ విషయములను తెలిపే ఆ వేదవాక్యముల యొక్క అర్థము మన మేధస్సుతో తెలుసుకోలేము.

 కేవలము తపోనిష్ఠా గరిష్ఠులైన మహాత్ములే వాటి అర్థము చెప్పగలరు. 

శంకరభగవత్పాదులవారు,

భగవద్రామానుజులు,

మధ్వాచార్యులవారు,

 విద్యారణ్యస్వామి, 

మొదలైన భాష్యకారులు ఆ కోవకు చెందినవారు.

శ్రీ షణ్ముఖశర్మ గారిలాంటి ప్రవచనకారులు కూడా వారి వాక్యాలనే ఉదహరిస్తున్నారు గాని, వేదవాక్యాలకు తమ స్వంత అర్దాలు చెప్పటము లేదు.

వేదాధ్యయనము తపస్సు. 

స్వాధ్యాయ ప్రవచనములతో కూడిన వేదాధ్యయనము తపస్సు అని మౌద్గల్య మహర్షి చెప్పినట్లు, వేదములోనే ఉన్నది.

" స్వాధ్యాయ ప్రవచనే ఏ వేతి నాకో మౌద్గల్య:/ తద్ధి తపస్తద్ధి తపః// "

"అదే తపస్సు" , "అదే తపస్సు" అని రెండుసార్లు గట్టిగా చెబుతున్నారు మహర్షి.


వేదవాక్యములకు అర్థము చెప్పే ముందు శ్రీ శంకరభగవత్పాదులవారు, కూడా, వినయంగా ఇలా అన్నారు.


శ్లో// యైరిమే గురుభి: పూర్వం పదవాక్య ప్రమాణతః/

వ్యాఖ్యాతా స్సర్వ వేదాంతా స్తాన్నిత్యం ప్రణతోస్మ్యహమ్//

(పద, వాక్య, ప్రమాణ, వివేచనా పూర్వకముగా, ఈ ఉపనిషత్తులన్నింటికీ ఏ గురువులు వ్యాఖ్యానము చేసినారో ఆ గురువులందరికి నేను నిత్యము నమస్కరిస్తున్నాను).


తాము సర్వజ్ఞులైనా శ్రీభగవత్పాదులవారు,తాము స్వంతంగా వేదవాక్యాలకు అర్థం చెబుతున్నాము అని అనలేదు.

 పూర్వ గురువుల వ్యాఖ్యానాన్ని అనుసరించి మాత్రమే తాము భాష్య రచన చేస్తున్నట్లు చెప్పుకున్నారు.


దయచేసి అందరు పై విషయములు దృష్టిలో పెట్టుకొని,

తమకు తోచినట్లు వేదవాక్యములకు అర్థములు చెప్పకుండా, వేద పవిత్రతను కాపాడుతారని ఆశిస్తున్నాను.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

30-3-'26

కామెంట్‌లు లేవు: