14, మార్చి 2026, శనివారం

భగవంతుడు ఎవడు?

శ్రీరామ (111)

                             శుభోదయం.

🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

 భర్త్రహరి మహాయోగి ఇలా అంటున్నారు:

భగవంతుడు ఎవడు?
ఈ జనన, మరణములేమిటి ?
ఈ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, అనబడే పంచభూతములు ఎలా ఉద్భవించాయి ?
మొదలైనవి  విచారించి సత్యం తెలుసుకొనుటకు వచ్చిన మానవ జన్మను అందుకు వినియోగించకుండా, 
మానవుడు జంతువులాగా,
 ఆహారము, నిద్ర, మైధునము, భయము లతో కూడి, పునరపి జననం, పునరపి మరణం అయిన అంతులేని  ఈ సంసారంలో తలమునకలై పోతున్నాడు.

 శ్లో// రాత్రిస్సైవ పునస్స ఏవ దివసో మత్వా ముథా జన్తవో/
ధావన్త్యుద్యమిన స్తథైవ నిభృత ప్రారబ్ధ తత్తత్క్రియాః/
వ్యాపారైః పునరుక్త భుక్త విషయై రేవం విధేనా మునా/
సంసారేణ కదర్థితా వయమహో మోహాన్న లజ్జామహే// 
( భర్తృహరి )

( రాత్రి గడిచిపోయింది. మళ్లీవస్తోంది.
పగలు వెళ్లిపోయింది. మళ్లీవస్తోంది.
ప్రాణులందరు ఏదో కొంప మునిగి పోతున్నట్లు,  ఆ,యా పనులు ప్రారంభిస్తున్నారు.
 ఆ పనులను గురించి పరుగులు తీస్తున్నారు.
భుజించడము,నిద్రపోవడమువంటి చేసిన పనులే చెయ్యడం,అనుభవించినవే మరల,మరల అనుభవించడం చేస్తున్నారు.
ఆలోచనా శక్తితో కూడిన మానవజన్మను భగవంతుడు మనకు అనుగ్రహించినా "ఇదంతా ఏమిటి? ఎందుకు చేస్తున్నాము? " అనే ఆలోచనే లేకుండా సంసారంలో  పీడింప బడుతున్న మనకు, కనులముందే రోజు రోజుకు ఆయువు తరిగిపోవుచున్నది.
అయినా అజ్ఞానం అనే గాఢాంధకారంలో ఉన్నందువల్ల మనం ఏమాత్రమూ  "సిగ్గు" పడటం లేదు).

శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
14-3-'26.

కామెంట్‌లు లేవు: