5, ఏప్రిల్ 2026, ఆదివారం

రామాయణం - 26 )

 శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 26 )

                (పరశురాముడు- 3)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

                              ----


(4-4-'26 పోష్టు తరువాయి భాగము)

పరశురాముని చరిత్ర చెప్పుకుంటున్నాము.


కార్తవీర్యార్జునుడు, తనకు ససైన్య పరివార సహితంగా జమదగ్ని మహర్షి ఇచ్చిన అద్భుతమైన ఆతిథ్యానికి సంతోషించే బదులు ఈర్ష్యాగ్రస్తుడైనాడు.

జమదగ్ని ఐశ్వర్యానికి కారణమని తాను భావించిన కామధేనువును,దూడను బలాత్కారముగా తన పట్టణమైన మాహిష్మతీ పురానికి తరలించాడు.


ఆ విషయం తెలుసుకున్న పరశురాముడు అగ్రహోదగ్రుడై మాహిష్మతికి వెళ్ళాడు.


జటాజూటముతో,

లేడి చర్మమును వస్త్రముగా దాల్చి,

భుజముపై గండ్రగొడ్డలి, చేతిలో ధనుర్బాణాలూ ధరించి,

పాదచారియై ఒంటరిగా తనపై యుద్ధానికి వస్తూన్న పరశురాముని చూచి, కార్తవీర్యుడు అవహేళనగా నవ్వాడు.

 అతనిని బంధించడానికి భటులను పంపాడు.

వచ్చినవారిని వచ్చినట్లు పరశురాముడు సంహరించాడు.

ఆశ్చర్యానికి లోనైన కార్తవీర్యుడు క్రమ క్రమంగా అధికాధిక సైన్యాన్ని పంపాడు.

అమిత తేజశ్శాలి అయిన భార్గవుడు ఆ సైన్యాన్నంతా ఒంటరిగానే మట్టుబెట్టాడు.


శ్లో// అచోదయద్ధస్తి రథాశ్వ పత్తిభిర్గదాసి బాణర్ ష్టి శతఘ్ని శక్తిభిః/

అక్షౌహిణీస్సప్త దశాతి భీషణా స్తా రామ ఏకో భగవానసూదయత్//

(అప్పుడు కార్తవీర్యార్జునుడు హస్తి,రథ,హయ,పదాతులతో కూడినవి,

గదలు, బాణములు, ఈటెలు, కత్తులు మొదలైన ఆయుధములతో కూడినవి,

భయంకరమైనవి అయిన

పదిహేడు అక్షౌహిణుల సైన్యాన్ని క్రమంగా రాముని మీదకు పంపాడు.

 పరశురామ భగవానుడు,ఒంటరిగానే ఆ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేశాడు).


అప్పుడు కార్తవీర్యుడు స్వయముగా తన వేయి చేతులతో ఒకేసారి ఐదువందల ధనస్సులు ధరించి యుద్ధం చేశాడు.


పట్టరాని క్రోధంతో పరశురాముడు, ఆ వెయ్యి చేతులను తన గండ్రగొడ్డలితో ఖండించాడు.


తరువాత పర్వత శిఖరంలాగా ఉన్న కార్తవీర్యుని శిరస్సును ఖండించాడు.


ఆ విధంగా కార్తవీర్యార్జునుని ససైన్యంగా సంహరించి భార్గవరాముడు అప్పుడు శాంతుడయ్యాడు.

కార్తవీర్యుని పుత్రులు పదివేలమంది,తమ తండ్రి మరణం చూచి పారిపోయారు.

 కామధేనువును, దూడను తీసుకుని, పరశురాముడు ఆశ్రమానికి వెళ్ళాడు.

అయితే ఈ కార్యానికి పరమశాంతుడైన జమదగ్ని మహర్షి సంతోషపడలేదు.

రాజును సంహరించడము " పాపము " అన్నాడు. 


శ్లో// రామ రామ మహాబాహో భవాన్ పాప మకారషీత్/

అవధీన్నర దేవం యత్సర్వ దేవమయం వృథా//


(ఓ రామా! రామా! నీవు గొప్ప భుజశక్తి కలవాడవు.

కానీ ధర్మం తెలుసుకోలేక పోయావు.

ప్రజాపాలన కోసం సకల దేవతలు తమ తమ అంశలను"రాజు" లో ఉంచుతారు.

అయ్యో! అటువంటి నరపతిని సంహరించి నీవు పాపము చేశావు ).


"బ్రాహ్మణులకు సహనమే ఉత్తమ గుణము.

నీవు వెంటనే పాప పరిహారార్ధం తీర్థ యాత్రలు చేసిరావలసినది"

అని పరశురామునితో అన్నాడు.

తండ్రి ఆజ్ఞను శిరసావహించి, భక్తి శ్రద్ధలతో ఒక సంవత్సరము దీక్ష చేపట్టి, పరశురాముడు తీర్థ యాత్రలు ముగించి, తిరిగి తండ్రి ఆశ్రమానికి వచ్చాడు.


(సశేషం)


                     శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                       ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః

శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

5-4-'26

కామెంట్‌లు లేవు: