🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*మంగళవారం 7 ఏప్రిల్ 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
`` *50వ భాగం*```
*దత్తాత్రేయ అవతార కథ ప్రారంభం*
*అనసూయాదేవి పాతివ్రత్య మహత్మ్యం*``*
సూత మహర్షి శ్రీ మహావిష్ణు పురాణంలో శ్రీమన్నారాయణుని దత్తాత్రేయ అవతార కథను శౌనకాది మునులకు వినిపిస్తున్నారు..
“శౌనకాది మునులారా! శ్రీమన్నారాయణుడు దత్తాత్రేయుడిగా అత్రి మహర్షి అనసూయాదేవి దంపతులకు జన్మించాడు. సప్తమహర్షులలో ఒకరైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు. ఈయన వివాహం కర్దమ ప్రజాపతి కుమార్తె అయిన అనసూయతో జరిగింది. బ్రహ్మదేవుడు కుమారుని, కోడలిని ఆశీర్వదిస్తూ..
“కుమారా!అత్రీ! నీ భార్య అనసూయ కారణ జన్మురాలు. మహాసాధ్వి. ఈ సౌభాగ్యవతితో దాంపత్యం నిన్ను లోక పూజ్యుడిని చేస్తుంది. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో మీకు కుమారుడు జన్మించి, సమస్త జనులను దత్తత తీసుకుని వారికి గురువై దత్తదేవుడిగా కీర్తి పొందుతాడు.ఇందుకు మీదంపతులు ఇరువురు నారాయణనామ జపంతో తపస్సు చేయండి" అని పలికాడు.
అత్రి అనసూయలు బ్రహ్మ దేవుని ఆదేశం పాటించి, నిర్వింధ్యా నది సమీపంలో గల ఋక్ష పర్వతము పై శ్రీమన్నారాయణ నామస్మరణ చేస్తూ తపస్సు చేశారు. నూరు సంవత్సరాలు కఠోర తపస్సు తరువాత నారాయణుడు ప్రసన్నుడై అపూర్వ దివ్య రూపంలో బాలుడిగా దర్శనమిచ్చాడు.
ఆ బాలుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముఖాలు గల మూడు శిరస్సులు, శంఖ చక్ర గదా పద్మ త్రిశూల కమండలాలు ధరించిన ఆరు చేతులు, పీతాంబరం ధరించి కంఠంలో దివ్యాభరణాలు కలిగి వేయి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అత్రి అనసూయలు ఆ దివ్య రూపానికి తన్మయత్వంతో అంజలి ఘటించి నమస్కరించారు.
బాలరూపుడైన నారాయణుడు అత్రి అనసూయలను చూసి చిరునవ్వుతో “పుణ్యదంపతులారా! మీ తపస్సుకి ప్రసన్నుడయ్యాను. మీ కోరిక తీరుస్తూ త్వరలో మీకు ఈ రూపంతో త్రిముఖ త్రిమూర్తిగా జన్మిస్తాను. నన్ను మీకు దత్తత చేసుకుంటూ దత్తాత్రేయుడిగా అవతరిస్తాను. మీరు తపస్సు ముగించి మీ ఆశ్రమానికి వెళ్లండి" అని పలికి అదృశ్యమయ్యాడు.
బాలదత్తావతారంలో శ్రీమన్నారాయణుని దర్శించి ధన్యులైన అత్రి అనసూయలు పరమాత్ముడు తమకు పుత్రుడిగా జన్మించబోతున్నాడు అనే ఆనందంతో తమ ఆశ్రమానికి వెళ్లి ఆశ్రమవిధులలో లీనమయ్యారు. శ్రీమహావిష్ణువు అత్రి మహర్షి దంపతులకు త్రిముఖ త్రిమూర్తి రూపంలో దర్శనమిచ్చి వారికి దత్తాత్రేయుడుగా జన్మించబోతున్నాడు అన్న విషయం ముల్లోకాలలో వ్యాపించింది.
ముల్లోకాలలో చర్చ మొదలైంది. భగవంతుని పుత్రుడిగా పొందే విశిష్టత ఆ దంపతులకు ఎలా లభించింది. అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు కాబట్టి భగవంతనికి తండ్రి అయ్యే అర్హత ఉంది. అనసూయ కేవలం కర్దమ ప్రజాపతి కూతురు, అత్రి మహర్షి భార్య. భగవంతునికి తన గర్భంలో జన్మనిచ్చేటంత గొప్పదనం ఆమెలో ఏముంది? అంత మహా పాతివ్రత్యం గలదా?
ఈ చర్చలకు ముగింపు పలికి అనసూయాదేవి గొప్పదనం లోకానికి చాటాలని దేవర్షి నారదుడు అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. బ్రహ్మమానస పుత్రుడైన నారదునికి అగ్రజుడు (అన్నగారు) అత్రి మహర్షి అవుతాడు. అన్నగారి భార్య అనసూయాదేవి వదిన మరియు మాతృసమానురాలు. అందుకే నారదుడు అనసూయాదేవి పాతివ్రత్య మహిమ లోకానికి తెలియజేయాలి అనుకున్నాడు.
అత్రి మహర్షి నారదుని అర్ఘ్యపాద్యాదులతో సాదరంగా ఆహ్వానించాడు. అనసూయ మరిదైన నారదుని పుత్ర వాత్సల్యంతో చూసి "నాయనా! రాకరాక మా ఆశ్రమానికి వచ్చావు. మధ్యాహ్నం అవుతోంది. మీ అన్నగారితో పాటు భోజనం చేసి వెళ్ళు" అని ఆప్యాయంగా పలికింది.
నారదుడు "అలాగే తల్లీ! ముల్లోకాలు తిరుగుతుంటాను కదా. నా భోజనానికి అవసరమైన గుగ్గిళ్లు వెంట తెచ్చుకున్నాను. వీటిని నాకు వండి వడ్డించుము. అన్నగారితో కలసి తింటాను" అని తన మూట విప్పి గుగ్గిళ్లను ఆమె ఇచ్చిన పాత్రలో వేశాడు.
అవి ఇనుపగుగ్గిళ్లు. అనసూయకు వాటిని చూడగానే అర్ధమైంది నారదుడు తనను పరీక్షించడానికి వచ్చాడని.
భర్త అత్రి మహర్షి వంక చూసింది. అత్రి మహర్షి ప్రశాంతంగా మంద హాసం చేస్తూ వండమన్నట్టు చూశాడు.
నారదుడు గమనించి అనసూయతో "ఈ గుగ్గిళ్లు వండటానికి నీకేమన్నా అభ్యంతరమా తల్లీ!" అని అడిగాడు.
అనసూయ నవ్వుతూ "అతిథి కోరినట్లు ఆతిథ్యం ఇవ్వాలి కదా! అభ్యంతరం ఏమి ఉంటుంది. ఇప్పుడే వండి తెస్తాను" అని ఇనుప గుగ్గిళ్లు తీసుకుని వంటింట్లోకి వెళ్లింది.
ఇనుప గుగ్గిళ్లు ఉన్న పాత్రలో తగినన్ని నీరు పోసి పొయ్యి మీద పెట్టి నారాయణుని ప్రార్థించింది.
"నారాయణా! అగ్నిస్వరూపా! సకల జనులలో ఉన్నట్టే నా ఇంటికి వచ్చిన నారదునిలో ఉన్నావు. అతిథిగా వచ్చిన నీకు నీవు కోరిన గుగ్గిళ్లను వండించి నీకు పెట్టే భాగ్యం నాకు కలిగించు! నా నిర్మల పతిభక్తిని, పాతివ్రత్యాన్ని నిరూపించు" అన్నది.
అగ్నిదేవుడు కట్టెలు లేని పొయ్యిలో ఉద్భవించి ప్రజ్వరిల్లాడు. పాత్రలోని ఇనుప గుగ్గిళ్లు ఆ అగ్ని జ్వాలలకి చూస్తుండగానే నిమిషాలలో ఉడికి పక్వమయ్యాయి. అనసూయ తెచ్చి నారదునికి విస్తరిలో వడ్డించింది. చక్కగా తిన్న నారదుడు.
అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ప్రశంసిస్తూ "తల్లీ! భూమండలం పతివత్రా శిరోమణులకు, సాధ్వీమణులకు నిలయం అని నిరూపించావు. భర్తనే ప్రత్యక్ష దైవముగా భావించి త్రికరణశుద్ధిగా సేవించే పతివ్రతకు సాధ్యం కానిది ఏది లేదని నీవు ఇనుప గుగ్గిళ్లను వండి నిరూపించావు. ముల్లోకములలో నీవంటి మహా సాధ్విమణి లేదు" అని ప్రశంసించి వెళ్ళాడు.
ముల్లోకాలలో ఈ విషయం తెలిసి అనసూయాదేవి మహా పతివ్రత అని అంగీకరించారు. త్రిమూర్తుల పత్నులైన సరస్వతి, లక్ష్మీదేవి, ఉమాదేవిలకు ఈ విషయం తెలిసి తమను కలవ డానికి వచ్చిన నారదునితో "నారదా! భూలోకంలో మాత్రమే పతివ్రతలు ఉంటారా? నీకు ఇంకెక్కడా కనిపించలేదా!" అని విమర్శించారు.
నారద మహర్షి నవ్వి "దేవలోకాలు సుఖ భోగాలకు నెలవు. భోగాలకు అలవాటు పడ్డ ఈ సువర్లోకాలలో పరమ సాధ్వీమణులు ఎవరున్నారు? అదే భూలోకంలో అయితే ఇంటింటా పతివ్రతలు ఉన్నారు. ధన కనక వస్తు వాహనాలు, సుఖభోగాలు వదిలి పతిసేవయే మహాభాగ్యంగా భావించి ఉండే నారీమణులు అనేకులు భూమి పై ఉన్నారు.
ఉదాహరణకి పరమ సాధ్విమణి అయిన సుమతి కథవినిపిస్తాను.. బ్రాహ్మణ వంశంలో పుట్టి కర్మల ఫలంగా కుష్ఠురోగంతో బాధపడే కౌశికుడి పత్ని అయిన సుమతి పాతివ్రత్యాన్ని గురించి చెబుతాను. వినండి" అని ‘సతీ సుమతి’ కథ చెప్పసాగాడు..
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి