4, జూన్ 2026, గురువారం

మామాట సరిగా వినలేదని

 మనలో చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలు మామాట సరిగా వినలేదని బాధ పడుతుంటాం. వీరి అల్లరి భరించలేకున్నాం. తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తే గాని వీడికి బుద్ధి రాదు., ఇలాంటి మాటలు అసహనంతో మాట్లాడుతూ వుంటాం. అన్నీ సరిగా తెలిసిన వాడిని మనం దగ్గరుండి చూసుకోవలసిన అవసరం లేదు.


వాడిని వాడు ఉద్ధరించుకోగలడు. అందుకు మంచి ఉదాహరణ ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి మొదలైనవారు.


తండ్రి పక్కన ఉండి కూడా సక్రమంగా పెంచలేక పోయాడు అనేందుకు మంచి ఉదాహరణ... దృతరాష్ట్రుడి సంతానం దుర్యోధనుడు.


మనం పిల్లలతో ఏం మాట్లాడుతూ ఉంటే వాటినే వారు అలవాటు చేసుకుంటారు. మన మాటలైనా, మన ప్రవర్తన అయినా, మనం చేసే పనులు అయినా ఏమైనా సరే మనల్ని పిల్లలు అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించాలి.


అందుకే గురుకులం లోని గురువులు చదువు వచ్చే వారికంటే చదువు రాని వారి పైనే శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు. అందుకు మంచి ఉదాహరణ పరమానందయ్య శిష్యులు.


మన శరీరంలో కూడా కొన్ని అనవసరంగా పెరిగేవి వున్నాయి. ముఖ్యంగా గోర్లు, వాటిని పెంచుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు... కాబట్టి వాటిని కత్తిరిస్తు వుంటాం. అలాగే మనలో కానీ మన పిల్లల్లో కానీ పెరిగే చెడు ఆలోచనలను తొలగించే ప్రయత్నం చేయాలి. అంతేకానీ జీవితంలో మరి ఎప్పుడూ వెనక్కి తీసుకోలేనంత ‘పెద్ద శిక్షలు’ మనకు మనం కానీ అలాగే మన పిల్లలకు కాని ఎప్పుడు వెయ్యకూడదు.


ఆలోచించాలి.. ఆచరించాలి.. నేర్పించాలి.. అప్పుడే మనం మార్గదర్శకులు అవుతాం!


కొందరు జన్మతః తెలివైన వారుగా ఉంటారు, మరికొందరు అనుభవం చేత తెలివైన వారు గాను, జ్ఞానవంతులు గాను మారుతారు. మార్పు అన్నది తద్యం, అది ఎప్పుడు సంభవిస్తుంది అని చెప్పడం కష్టం.


అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలి, వచ్చిన తరవాత చేసి చూపించాలి...!


బోయవాడు వాల్మీకి గా మారినట్లు, గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లు, కష్టనష్టాల్లో ఉన్న మన జీవితం కూడా అందరికీ వెలుగును, ఆనందాన్ని పంచే గొప్ప మలుపు వున్న రోజును తీసుకొని వస్తుందని ఎదురు చూద్దాం

.

కామెంట్‌లు లేవు: