13, జనవరి 2026, మంగళవారం

విజ్ఞాన శాస్త్రము

  *విజ్ఞాన శాస్త్రము - కంప్యూటర్ పరిజ్ఞానము 6 T*


 సభ్యులకు నమస్కారములు.


కంప్యూటర్లు అనేక రంగాలలో ఉపయోగించే బహుముఖ పరికరాలు. కొన్ని సాధారణ ఉపయోగాలు...

1) *విద్య* :- పరిశోధన, అభ్యాసం మరియు విద్యా సామగ్రిని యాక్సెస్ చేయడం కోసం.

2) *వ్యాపారం* :- డేటా ఖాతాలు, కమ్యూనికేషన్ మరియు ప్రెజెంటేషన్‌లను నిర్వహించడం.

3) *కమ్యూనికేషన్* :- ఇమెయిల్‌లు, వీడియో కాల్‌లు, S మీడియా మరియు సందేశం పంపడం.

4) *వినోదం* :- ఆటలు ఆడటం, వీడియోలు చూడటం మరియు సంగీతం వినడం

5) *డేటా నిల్వ*:- పెద్ద మొత్తంలో సమాచారాన్ని నిల్వ చేయడం మరియు నిర్వహించడం.

6) *ప్రోగ్రామింగ్* :- సాఫ్ట్‌వేర్ మరియు అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడం

7) *డిజైన్ మరియు సృజనాత్మకత* :- గ్రాఫిక్ డిజైన్‌లు, ఫోటో ఎడిటింగ్ మరియు వీడియో ప్రొడక్షన్.

8) *ఇంటర్నెట్ యాక్సెస్* :- వెబ్‌సైట్‌లు మరియు ఆన్‌లైన్ సేవలను బ్రౌజ్ చేయడం.


పైన పేర్కొన్న ఉపయోగాలు కంప్యూటర్లు రోజువారీ పనులు, వృత్తిపరమైన పని మరియు విశ్రాంతి కార్యకలాపాలలో ఎలా సహాయపడతాయో హైలైట్ చేస్తాయి.

 *సంక్షిప్తంగా*

కంప్యూటర్లు *కమ్యూనికేషన్* (ఇమెయిల్, వీడియో కాల్స్), *విద్య* (పరిశోధన, ఆన్‌లైన్ లెర్నింగ్), *వ్యాపారం* (డేటా నిర్వహణ, ఫైనాన్స్), *వినోదం* (గేమ్స్, సినిమాలు, సంగీతం) మరియు *సృజనాత్మకత* (డిజైనింగ్ మరియు ఎడిటింగ్) కోసం ఉపయోగించే విభిన్న సాధనాలు. ఈ ఫంక్షన్లన్నీ పనులను ఆటోమేట్ చేస్తాయి, విస్తారమైన డేటాను నిల్వ చేస్తాయి మరియు ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందిస్తాయి, ఇవి సాధారణ పత్రాల సృష్టి నుండి సంక్లిష్టమైన శాస్త్రీయ పరిశోధన మరియు బ్యాంకింగ్ వరకు పనులకు అవసరమైనవిగా చేస్తాయి.

ధన్యవాదములు

టంటట టంట టంట టట టంటట టంటట టంటటమ్మనెన్*

  *టంటట టంట టంట టట టంటట టంటట టంటటమ్మనెన్*

ఈ సమస్యకు నా పూరణ.


గంటల శబ్దముల్ వినెను గట్టున నున్న గురుండు లేచి తాన్


వెంటన వచ్చు శిష్యునికి వేగము నీటిని తెమ్మనంగనే


గుంటన కాలు జారివడ కోవెల మెట్లను చెంబు దొర్లగన్


టంటట టంట టంట టట టంటట టంటట టంటటమ్మనెన్.


అల్వాల లక్ష్మణ మూర్తి

వైకుంఠ ద్వారాలను

  *వైకుంఠ ద్వారముద్ఘాట్య

భక్తానాం కృపయా హరే ।

ఏకాదశ్యాం ప్రసీద త్వం

మోక్షదో భవ సర్వదా ॥*



వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులపై కృప కురిపించే హరే, 

ఈ ఏకాదశి నాడు శ్రీ విష్ణు మూర్తి అనుగ్రహం సర్వదా మీకు కలగాలని మనసారా కోరుకుంటున్న...


వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు


శ్రీ సద్గురు పీఠం తరపున

శ్రీధర్ శర్మ తోటపల్లి..✍

విజ్ఞాన శాస్త్రము - కంప్యూటర్ పరిజ్ఞానం 7 T*

 *విజ్ఞాన శాస్త్రము - కంప్యూటర్ పరిజ్ఞానం 7 T*


సభ్యులకు నమస్కారములు 


కంప్యూటర్ సైన్స్ చాలా విస్తృతమైనది, ప్రాథమిక అల్గోరిథంలు మరియు డేటా నిర్మాణాల నుండి 1) AI (కృత్రిమ మేధస్సు) 2) సైబర్ భద్రత 3) క్లౌడ్ కంప్యూటింగ్ 4) వెబ్/యాప్ అభివృద్ధి డిజిటల్ ఆవిష్కరణల కోసం దాదాపు ప్రతి పరిశ్రమ మరియు ఆధునిక జీవితంలోని అంశాన్ని తాకే గణన యొక్క సిద్ధాంతం, రూపకల్పన మరియు అనువర్తనాన్ని కవర్ చేస్తుంది. AI (కృత్రిమ మేధస్సు) కాకుండా కంప్యూటర్ రంగంలో తాజా అభివృద్ధి *క్వాంటమ్ కంప్యూటింగ్*. క్వాంటం కంప్యూటింగ్ క్వాంటం మెకానిక్స్‌పై ఆధారపడి ఉంటుంది, ఇది క్యూబిట్స్ = క్వాంటమ్ బిట్ = బిట్ అనేది ప్రాథమిక సమాచారం = క్లాసికల్ బిట్ = 0 లేదా 1కి సారూప్యంగా ఉంటుంది.


క్యూబిట్ వ్యవస్థ ఔషధ ఆవిష్కరణ, పదార్థం, శాస్త్రం, కృత్రిమ మేధస్సు మరియు ఆధునిక క్రిప్టోగ్రఫీని విచ్ఛిన్నం చేయడం కోసం ఒకేసారి కీలకమైన అనేక అవకాశాలను అన్వేషించడం ద్వారా క్లాసికల్ కంప్యూటర్ల కంటే ఘాటుగా వేగంగా సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి అనుమతిస్తుంది, *ఇది ఇప్పటికీ ఒక ప్రయోగాత్మక సాంకేతికత*. 


ధన్యవాదములు.

సమస్య పూరణ.

  *వ్యాధి నెఱింగి తగ్గుటకు నౌషధమిచ్చును న్యాయవాదియే*

ఈ సమస్యకు నా పూరణ. 


మేధ మధించి మూలికలు మేటివి మిన్నగ సేకరించుచున్


బాధలు లుప్తమై జవము ప్రాప్తము గాగ భిషగ్వరుండు నీ


వ్యాధి నెఱింగి తగ్గుటకు నౌషధమిచ్చును - న్యాయవాదియే


సాధన శోధనన్ గెలుచు శాస్త్రము తర్కము సొంతమైనచో.



అల్వాల లక్ష్మణ మూర్తి.

దత్తపది

  *అన్న - మిన్న - కన్నె - చెన్ను* (దత్తపది)

సీతా స్వయంవరం.


అన్న ధనువును సౌమిత్రి యందుకొనగ


మిన్న చాపము రామన్న మీదికెత్తి


కన్నెదురుగను విరిచెను కట్టెవోలె


సీత రాముని మెడ వేసె చెన్ను దండ.



అల్వాల లక్ష్మణ మూర్తి

[ *మితము నతిక్రమించి తిన మేలగు నెప్పుడు మానవాళికిన్* 

ఈ సమస్యకు నా పూరణ. 


హితమగునెట్లు భోజనము? హేతువు కాదది చేటు చేయదే?


సతమును ప్రొద్దు పోయి తిన సంబరమంచును రాతిరంతయున్


కృతములు హాని సల్పుగద! కేళిక కాదది దుర్భరంబునౌ, 


మితము నతిక్రమించి తిన మేలగు నెప్పుడు? మానవాళికిన్. 


అల్వాల లక్ష్మణ మూర్తి.

పంచ రంగనాధ క్షేత్రాలు....

 పంచ రంగనాధ క్షేత్రాలు....

 [ ధనుర్మాసం సందర్భంగా]

జలం ఏ పాత్రలోకి ఒంపితే, ఆ రూపాన్ని పొందుతుంది. భగవంతుడు కూడా అంతే! భక్తులు ఏ రూపంలో ఆయనను కొలుచు కోవాలనుకుంటే.... ఆ రూపంలోకి ఇమిడిపోతాడు. అలా ఆదిశేషుని మీద శయనించే విష్ణుమూర్తిని, రంగనాథస్వామిగా కొల్చుకోవడం కద్దు. దక్షిణాదిన ఈ రంగనాథ స్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో పంచరంగ క్షేత్రాల గురించి చెప్పుకోవాల్సిందే. కావేరీ తీరాన వెలసిన ఈ పంచరంగ క్షేత్రాలు తమిళ, కన్నడ ప్రజలకు చాలా ప్రత్యేకం. ఆ పంచరంగ క్షేత్రాల వివరాలు ఇవిగో…

శ్రీ రంగపట్నం:– ఈ పేరు వినగానే మనకు టిప్పు సుల్తాన్‌ కథలే గుర్తుకువస్తాయి. టిప్పు రాజ్యానికి రాజధానిగా సాగిన ఈ పట్నానికి ఆ పేరే అందులోని రంగనాథుని ఆలయం మీదుగా వచ్చింది. ఇక్కడి శ్రీదేవి, భూదేవి సహిత రంగనాథుని ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్‌ సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించినవారే!

 

తిరుప్పునగర్‌:– తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉందీ గ్రామం. ఇందులోని స్వామి పేరు ‘అప్పకుడతాన్‌ పెరుమాళ్‌’. ఇక్కడ ఉభమన్యు అనే రాజుకి విష్ణుమూర్తి ఒక ముసలివాని రూపంలో దర్శనమిచ్చాడట. ఆయనకు ఎంత ఆహారాన్ని అందించినా ఆకలి తీరలేదట. చివరికి పరాశర మహర్షి సూచనతో భక్తితో అప్పాలని అందించినప్పుడే తృప్తి లభించిందట. అప్పటి నుంచి ఈ స్వామికి అప్పకుడతాన్ స్వామి అని పేరు. పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటిగా కూడా ఈ ఆలయాన్ని ఎంచుతారు.


కుంబకోణం:– ఒకప్పుడు హేమ రుషి అనే ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సుని ఆచరించాడట. దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువల నుంచి ఉద్భవించింది. అలా అవతరించిన లక్ష్మీదేవిని కోమలవల్లి అన్న పేరుతో కొలుచుకున్నారు. లక్ష్మీదేవి చెంత ఆ విష్ణుమూర్తి కూడా ఉండాల్సిందే కదా! ఆయన కూడా భువికి అవతరించాడు. ఇలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిల్చుకుంటారు.

 

మయిలదుతురై:– చంద్రుని తపస్సుకి మెచ్చి ఆ విష్ణుమూర్తి అవతరించిన చోటు ఇది. పరాకల్‌ అనే ఆళ్వారుని భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారట. అలా చూసుకున్నా ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు తోస్తుంది. ఇక్కడి స్వామి పేరు ‘పరిమళ పెరుమాళ్‌’. వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటైన ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని చెబుతారు.

 

శ్రీ రంగం:– పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని ఆద్యరంగం (చివరి క్షేత్రం)గా పిలుస్తారు. కానీ అన్నింటిలోకీ ప్రముఖమైనది ఈ ఆలయమే! విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖు రూపంలా తోచే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమైంది. ఇక్కడి మూలవిరాట్టుని సాక్షాత్తు విభీషణుడు ప్రతిష్టించినట్లు చెప్పుకొంటారు. విష్ణుభక్తిలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే! గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది ఇక్కడే! ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించడానికే 300 ఏళ్లకు పైగా సమయం పట్టిందని చెబుతారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురంగా ప్రసిద్ధకెక్కిన ఈ ఆలయాన్ని దర్శించకుంటే సర్వశుభాలూ కలుగుతాయని నమ్మకం.

 

ఇవీ పంచరంగ క్షేత్రాల విశేషం. కొన్ని జాబితాలలో ఇందులోని కుంబకోణం బదులు వటనగరంలోని రంగనాథ పెరుమాళ్‌ ఆలయాన్ని పేర్కొంటూ ఉంటారు.🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ ।

తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ।। 38 ।।


ప్రతిపదార్థ:


సుఖ — సుఖము; దుఃఖే — దుఃఖములో; సమే కృత్వా — సమానముగా భావించి; లాభ-అలాభౌ — లాభ నష్టములు; జయ-అజయౌ — గెలుపు ఓటములు; తతః — అ తరువాత; యుద్ధాయ — యుద్ధమునకు; యుజ్యస్వ — సిద్దుడవు అవుము; న — కాదు; ఏవం — ఈ విధముగా; పాపం — పాపము; అవాప్స్యసి — పొందెదవు.


  తాత్పర్యము :


సుఖ-దుఃఖాలని, లాభ-నష్టాలని మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ, కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు.


 వివరణ:


లౌకిక స్థాయి నుండి అర్జునుడిని ఉత్సాహపరిచిన పిదప, శ్రీ కృష్ణుడు, ఇప్పుడు కర్మశాస్త్ర విషయంలో మరింత లోనికి వెళుతున్నాడు. శత్రువులను సంహరించటం వలన పాపం తగులుతుందని అర్జునుడు భయాన్ని వ్యక్తం చేశాడు. శ్రీ కృష్ణుడు ఈ భయాన్ని పోగొడుతున్నాడు. కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా తన కర్తవ్యాన్నినిర్వర్తించమని అర్జునుడికి ఉపదేశము చేస్తున్నాడు. పని పట్ల ఇలాంటి దృక్పథం అతన్ని తద్వారా వచ్చే ఏదేని పాప ఫలితాల నుండి విముక్తి కలిగిస్తుంది.


స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు, మనం కర్మలను సృష్టిస్తాము. అవి తదుపరి కాలంలో కర్మఫలితాలను (ప్రతిచర్యలు) కలుగచేస్తాయి. మాథర్ శృతి ఇలా పేర్కొంటున్నది:


పుణ్యేన పుణ్య లోకం నయతి పాపేన పాపముభాభ్యామేవ మనుష్యలోకం


‘మంచి పనులు చేస్తే స్వర్గ లోకాలకు పోయెదవు; చెడు పనులు చేస్తే నరక లోకాలకు వెళ్లెదవు; ఈ రెంటి మిశ్రమం చేస్తే మళ్ళీ ఈ భూలోకానికి తిరిగి వచ్చెదవు.’ ఏ విధంగా అయినా మనం కర్మ-ప్రతిఫల బంధాల్లో చిక్కుకుంటాము. ఈ విధంగా లౌకికమైన మంచి పనులు కూడా మనలను బంధిస్తాయి. అవి భౌతికమైన మంచి ప్రతిఫలములను కలుగచేస్తాయి, అవి ఇంకా కర్మ రాశిని పెంచి, ఈ లోకంలో ఆనందం ఉన్నది అన్న భ్రమను మరింత పెంచుతాయి.


కానీ, స్వార్థ ప్రయోజనాలను విడిచిపెడ్తే, ఇక మన చర్యలు కర్మ-ఫలితాలని (కర్మ బంధాలని) సృష్టించవు. ఉదాహరణకు, హత్య చేయటం పాపం, మరియు ప్రపంచంలోని ప్రతి దేశం యొక్క న్యాయ చట్టం దానిని ఒక దండించదగ్గ నేరంగా ప్రకటించింది. కానీ, ఒక పోలీసు, తన కర్తవ్య నిర్వహణలో బందిపోటు దొంగల నాయకుడిని చంపితే అతను దానికి శిక్షింపబడడు. ఒక సైనికుడు శత్రు సైనికుడిని యుద్దంలో చంపితే, దానికి అతను శిక్షార్హుడు కాడు. నిజానికి అతని వీరత్వానికి ఒక పతకం కూడా ఇవ్వబడవచ్చు. ఈ పనులు స్వార్థ ప్రయోజనంతో కానీ, చెడు బుద్ధితో కానీ చేసినవి కాకపోవటం వలన వీటికి శిక్ష ఉండదు; ఆయా పనులు దేశ సేవలో తమ కర్తవ్యముగా చేసినవి. భగవంతుని న్యాయం కూడా ఇలాగే ఉంటుంది. ఎవరైనా అన్నీ స్వార్థ ప్రయోజనాలను విడిచి, కర్మలను భగవంతుని పట్ల కర్తవ్యంగా చేస్తే, అలాంటి పనులు కర్మ ఫలితాలను కలుగచేయవు.


కాబట్టి, అర్జునుడిని ఫలితాల పట్ల అనాసక్తుడై, కేవలం తన కర్తవ్య నిర్వహణ పట్ల మాత్రమే శ్రద్ధ చూపమని శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. జయాపజయాలని, సుఖదుఃఖాలని ఒకలాగే పరిగణిస్తూ సమదృష్టితో పోరాడితే, శత్రువులను సంహరించినా, అతనికి పాపం అంటదు. ఈ విషయం తదుపరి భగవద్గీత 5.10వ శ్లోకంలో కూడా మళ్లీ చెప్పబడింది: ‘తామరాకు నీటిచే తాకబడనట్టుగా, ఎవరైతే తమ కర్మలన్నిటినీ, మమకారము లేకుండా భగవదర్పితముగా చేస్తారో వారికి పాపము అంటదు.’


మమకారాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని గంభీరమైన ముగింపు చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు, తను చెప్పిన దాని వెనుక ఉన్న తర్కము ఆవిష్కరించటానికి, కర్మ శాస్త్రం గురించి మరింత వివరంగా చెప్తానంటున్నాడు.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం - దశమి - విశాఖ -‌‌ భౌమ వాసరే* (13.01.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

12, జనవరి 2026, సోమవారం

వీరుడెవరో తెలుసా

  #మహమ్మద్ గజనీకి 

మృత్యువు దారి చూపిన వీరుడెవరో తెలుసా..?

*****************************************


#గుజరాత్ ఇసుక తిన్నెల్లో ఒక మర్చిపోయిన కథ దాగి ఉంది. మహమూద్ గజనీ వంటి క్రూర పాలకుడు తన జీవితాంతం పశ్చాత్తాపపడేలా చేసిన ఒక అజ్ఞాత హిందూ యువకుడి గాథ ఇది. #సోమనాథ్ ఆలయ విధ్వంసం గురించి అందరికీ తెలుసు, కానీ తన ప్రాణాలను అర్పించి సోమనాథుడికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న ఆ హిందూ యువ వీరుడి పేరు చరిత్రలో ఎవరికీ కనిపించదు. ఇది కేవలం కథ కాదు, విశ్వాసం ప్రతీకార రూపం దాల్చిన ఒక సజీవ సాక్ష్యం..


ఈ కథ సా.శ.1025లో మొదలవుతుంది. మహమూద్ గజనీ తన క్రూరమైన సైన్యంతో గుజరాత్‌పై దండెత్తాడు. 1026 జనవరి ప్రారంభంలో అతడు సోమనాథ్ ఆలయంలోని అపారమైన సంపదను దోచుకోవడమే కాకుండా, పవిత్ర జ్యోతిర్లింగాన్ని కూడా ధ్వంసం చేశాడు. భారతీయ నాగరికత చరిత్రలో ఇది అత్యంత బాధాకరమైన ఘటనలలో ఒకటిగా ఎప్పటికీ నిలిచిపోతుంది..


ఆలయ విధ్వంసం తర్వాత, గజనీ లక్షల దీనార్ల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలను గుర్రాలు, ఏనుగులు, ఒంటెలపై వేసుకుని గుజరాత్ నుండి బయలుదేరాడు. ఎండలు ప్రారంభం అయ్యేలోపు త్వరగా సింధ్ ప్రాంతానికి చేరుకోవాలని అతను కచ్ రణ్ (ఎడారి) మార్గాన్ని ఎంచుకున్నాడు. అది అత్యంత ప్రమాదకరమైన, మండుతున్న ఇసుక మైదానం. అక్కడ చుక్క నీరు గానీ, నీడ గానీ దొరకదు. ఆ సమయంలో ఒక స్థానిక హిందూ యువకుడు గజనీ వద్దకు వచ్చి, తాను మార్గదర్శిగా (Guide) ఉండి దారి చూపిస్తానని చెప్పాడు. ధనాశతోనో లేదా భయంతోనో ఆ యువకుడు దారి చూపడానికి వచ్చాడని గజనీ నమ్మాడు. కానీ ఆ యువకుడికి అది ఒక ధర్మయుద్ధం..


ఆ యువకుడు గజనీ సైన్యాన్ని తీసుకుని రోజుల తరబడి మండుతున్న ఎడారిలో తిప్పాడు. నెత్తిన నిప్పులు కురిపించే సూర్యుడు, అడుగు పెడితే కాళ్లు కాలే ఇసుక. గుర్రాలు, ఒంటెలు అలసిపోయి పడిపోయాయి. సైనికులు దాహంతో అల్లాడిపోయారు. ఎన్ని రోజులైనా నీరు కనిపించకపోయేసరికి గజనీ ఆ యువకుడిని పిలిచి నీరు ఎక్కడ అని నిలదీశాడు. ఆ యువకుడి ముఖంలో భయం లేదు, పైగా ఒక చిన్న చిరునవ్వు ఉంది..


ఆ యువకుడు శాంతంగా ఇలా సమాధానం ఇచ్చాడు: “నా ప్రాణం ఎప్పుడో సోమనాథుడికి అంకితం అయిపోయింది. నేను బతికినా చచ్చినా నాకు పట్టింపు లేదు. కానీ నువ్వు నా దేవుడిని, నా ఆలయాన్ని అవమానించావు. ఆ పాపానికి శిక్ష ఈ ఎడారిలోనే నీకు లభిస్తుంది. మిమ్మల్ని అందరినీ దాహంతో తల్లడిల్లి చనిపోయేలా చేయడానికే నేను కావాలని మిమ్మల్ని ఈ ఎడారి నడిబొడ్డుకు తీసుకువచ్చాను..”


ఈ మాటలు విన్న గజనీ ఆగ్రహంతో ఊగిపోయి తన కత్తితో ఆ యువకుడి శిరచ్ఛేదం చేశాడు. 'జై సోమనాధ్' అంటూ ఆ వీరుడు ప్రాణాలు వదిలాడు కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గజనీ సైన్యంలోని వేలాది మంది సైనికులు ఆ ఎడారిలో దాహంతో అల్లాడి ప్రాణాలు విడిచారు. గజనీ స్వయంగా ప్రాణాలతో బయటపడ్డా, తన సైన్యాన్ని మరియు అహంకారాన్ని ఆ ఇసుకలోనే వదిలేయాల్సి వచ్చింది..


చరిత్ర ఆ వీరుడి పేరును నమోదు చేయలేకపోయినా, అతని త్యాగం అమరమైంది. ఎటువంటి సైన్యం, ఆయుధాలు లేకపోయినా కేవలం తన సంకల్పం మరియు విశ్వాసంతో ఒక గొప్ప ఆక్రమణదారుని గర్వాన్ని అతను అణచివేశాడు. ఈ ఘటన గురించి పర్షియన్ చరిత్రకారుడు మిన్హాజ్-ఎ-సిరాజ్ జుజ్జాని రాసిన ‘తబకాత్-ఎ-నాసిరి’ పుస్తకంలో ప్రస్తావించబడింది. ఇటీవలే సోషల్ మీడియాలో సావిత్రి ముముక్షు (@MumukshuSavitri) చేసిన పోస్ట్ ద్వారా ఈ వీరగాథ మళ్ళీ వెలుగులోకి వచ్చింది..


జై శ్రీరామ్ 🚩🙏


(సేకరణ పోస్టు)