22, డిసెంబర్ 2022, గురువారం

శ్రీమద్భగవద్గీత

 *🧘‍♂️01 శ్రీ భగవన్ ఉవాచ🧘‍♀️*

🕉️🌞🌏🌙🌟🚩

*☀️శ్రీమద్భగవద్గీత☀️* 

*💥 శ్రీ జ్ఞాన అవధూత సూర్య నారాయణ స్వామి మఠం 💥*


*తొలి పలుకు*


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ | దేవీ సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్ ॥ 


ఈ గ్రంథము పేరు *భగవాన్ ఉవాచ.* 


సర్వవేదములు పరబ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మకు బోధించుటవలన అవి భగవాన్ ఉవాచ అయినవి. భారతములోని భీష్మపర్వంలో 25వ అధ్యాయము నుండి 42వ అధ్యాయము వఱకు చెప్పినవాటిలో శ్రీకృష్ణ ఉవాచ అనిగాక భగవాన్ ఉవాచ అని కలదు. కావున ఈ గ్రంథమునకు 'భగవాన్ ఉవాచ' అను పేరు నిర్ణయించడమైనది. పైన చెప్పిన అధ్యాయములలో అధ్యాత్మ విషయములు సంక్షిప్తముగా చెప్పబడినవి. కావున వీటిని వేదములలోని ఉపనిషత్తులు, రామాయణ, భారత, భాగవతములద్వారా గ్రహించవలసి ఉండును. అందువలన భగవాన్ ఉవాచలోని శ్లోకములకు ఉపనిషత్తులు, రామాయణాది పురాణములద్వారా విషయములు విశదీకరించబడినవి.


*వేదములు :-* వేదములు అపౌరుషేయములు. ఏది తెలిసిన ఈ సర్వమూ తెలియునో అది జ్ఞానము. అట్టి జ్ఞానమును తెలుపునవి వేదములు. వేదము అపరవిద్య, పరవిద్యల సమ్మేళనము అయిన బ్రహ్మవిద్యను చెప్పినది. ఇహలోక, పరలోకములకు సంబంధించిన సర్వవిషయములు బ్రహ్మవిద్యలో ఉండును. అనగా దేశము ఎలా ఉండాలి? రాజు ఎలా ఉండాలి? రాజ్యపాలన ఎలా ఉండాలి? జాతిధర్మములు, ఆశ్రమధర్మములు ఏమిటి? ధర్మార్థకామములు, వర్ణనలు, ఆత్మ, అధ్యాత్మతత్త్వము, సృష్టి, దేహి, దేహముల విచారణ, జీవుడు ఈశ్వరుడగు సాధన విధానము ఉండును. జీవన సంగ్రామమును దేవ దానవ-సంగ్రామముగా వర్ణించిరి. అయితే వేదములలో ఒకేచోటగాని, ఒక వరుసక్రమంలోగానీ ఈ విషయములు ఉండవు. వీటిని క్రోడీకరించి ఒక వరుసక్రమంలో చదువవలసి వుండును. వేదము అర్థబాహుళ్యము, భావబాహుళ్యము గలది. కావున వేదములు చదివి, విషయమును గ్రహించుట కష్టము.


కావున ఋషులు వీటిని రామాయణ, భారత, భాగవతములుగా మనకు అందించిరి. వీటిలో కథ అప్రధానము. కథలద్వారా అందించిన సందేశము ప్రధానము. సామాన్యులకు రామాయణములో రాముని కథ, భారతములో కౌరవ-పాండవుల కథ, భాగవతములో ప్రహ్లాదచరిత్ర, వామన చరిత్ర, శ్రీకృష్ణుడు గోపికల కథలు మొదలయిన కథలు ఉండునని భావింతురు. వేదజ్ఞుల దృష్టిలో ఇవి బ్రహ్మవిద్యను బోధించు గ్రంథములు. కావున వీటిని అధ్యయనము చేసి, సాధన చేసిన జీవుడు ఈశ్వరుడగును. అమృతత్త్వమును పొందును.


*రామాయణము:-* వాల్మీకిమహర్షి ఆశ్రమమునకు నారదమహర్షి వచ్చి బ్రహ్మవిద్యను రహస్యముగా బోధించినాడు. ఆ తర్వాత బ్రహ్మ వచ్చి నారదోక్త ప్రకారము రామాయణమును రచియించమని ఆదేశించెను. రామాయణము వేదోపబృంహణార్థము రచియింపబడినది. ఆవిధముగా


*సర్వశ్రుతి మనోహరమ్* - వేదసారమును


*ధర్మకామార్థ సహితం* - ధర్మ అర్థ కామములను


*విచిత్రపదమ్* - నానార్థములతో


*నానాచిత్రకథా* - అనేక కథలతో సమాన సంధియోగములతో రామ-అయనమును రచించెను. ఈ సమాససంధులు భాషాపరమైనవి కావు.


*అహో గీతస్య మాధుర్యం శ్లోకానాం చ విశేషతః* (బాలకాండ-4వ సర్గ-17)


శ్లోకములు మాధుర్యముగా ఉన్నవి. విశేషించి గీతయొక్క అర్థము మాధుర్యముగా ఉన్నది. ఈ శ్లోకములో గీత అని, శ్లోకము అని రెండు పదములు ప్రయోగింపబడినవి. కేవలము కథాభాగమును తెలుపునవి శ్లోకములు. అటులనే కథాభాగములో వేదాంతార్థమును సంధిచేసి సమాసములతో చెప్పునది గీత అని భావము. కావున ‘గీత’ అను పదమునకు వేదాంతార్థ ప్రతిపాదితమైన వస్తువు అని అర్థము.


వేదము చెప్పిన సర్వవిషయములు రామాయణములో కలవు. స్థూలదేహములోని అవయవములను రావణపరివారముగా, సూక్ష్మశరీరములోని అవయవములను దేవతాంశలుగా జన్మించిన వానరులుగా, సత్త్వగుణయుతుడైన జీవుని రామునిగా, రజోగుణయుతుడైన జీవుని రావణునిగా, తమోగుణయుతులైన జీవులను ఇతర రాక్షసులుగా చిత్రీకరించి రాముడు రావణాది రాక్షసులను సంహరించి, శాంతిని పొంది, జీవన్ముక్తుడై బ్రహ్మను దర్శించి, దేహసామ్రాజ్యపట్టాభిషిక్తుడైన విధము, దేహత్యాగానంతరము అనగా సీతాపరిత్యాగానంతరము ఆత్మలో ఏకీభూతుడై, ఆత్మయై విరాజిల్లిన విధము వర్ణింపబడినది.


వేదములో చెప్పిన దేవ దానవ యుద్ధమునే రామ రావణ సంగ్రామముగా రామాయణములో వివరింపబడినది. 'రామ' శబ్దమునకు ఆత్మ అని అర్థము. సృష్ట్యాదియందున్న ఆత్మ సృష్టిలో అంతరాత్మగా, విరాట్పురుషునిగా జీవునిగా వచ్చినాడు. ఇది ఆత్మయొక్క ప్రయాణము. కావున రామ-అయనము అయినది. ఆత్మస్థానము అనే అయోధ్యనుండి బయలుదేరిన రాముడు అనేక మజిలీలను దాటి రావణసంహారానంతరము తిరిగి అయోధ్య చేరినాడు. ఇది రాముని ప్రయాణము. కావున *రామ - అయనము* అయినది. ఆవిధముగా పైన చెప్పిన సర్వవిషయములను ఇటు కథాభాగము, అటు అధ్యాత్మభావనలను సంధిచేసి, సమాసములతో వాల్మీకిమహర్షి రామాయణమును రచియించినారు. యోగరహస్యములను బాలకాండలో విశ్వామిత్రమహర్షి రామునికి కథలుగా వివరించినారు. అటులనే వివిధ సాధన పద్దతులను మిగిలిన కాండలలో వివరించినారు. ఈ రామాయణమును రామునికే రాముని సభలో లవకుశులు వినిపించిరి.


ఈ రామాయణమును


*ధర్మకామార్థసహితం శ్రోతవ్యమనసూయయా* (బాలకాండ - 5వ సర్గ -4) ధర్మ అర్థ కామములనే పురుషార్థములతో కూడిన ఈ రామాయణమును అసూయాది అసురసంపదలు లేకుండా వినవలయును. విని ఆచరించవలయును. ఆచరించినవాడు ఆత్మయగును. ఇదే రామాయణ ప్రయోజనము.


వాల్మీకిమహర్షి బాటసారులను దోచుకొనే దొంగ అనిగాని, వల్మీకము అనగా పుట్టనుండి పుట్టినట్లుగాని, రామాయణ, భారత, భాగవతములలో లేదు. ఈ అపభ్రంశము లోకములో ప్రచారంలో ఉండుటకు కారణము కలియుగ లక్షణం. అటులనే వాల్మీకి రామాయణంలో చెప్పని అనేక విషయములు లోకములో ప్రచారములో ఉన్నవి. వీటన్నింటికి కారణము కలియుగమే.


*భారత, భాగవతములు* - వ్యాసమహర్షి మొదట భారతమును రచియించి, ఆ తర్వాత భాగవతమును రచియించెను. కాని మొదట అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తునకు శుకబ్రహ్మ భాగవతమును వివరించెను. ఆ తర్వాత పరీక్షిత్తు కుమారుడైన జనమేజయునకు వైశంపాయనుడు జనమేజయుడు చేయుచున్న సర్పయాగ సందర్భమున భారతమును వినిపించెను. అనగా మొదట భాగవతము, ఆ తర్వాత భారతము వ్యాప్తిలోనికి వచ్చినవి.


*భాగవతము* - బ్రహ్మమానసపుత్రుడైన నారదమహర్షిచే ప్రేరేపింపబడి వ్యాసమహర్షి భాగవతమును రచించెను. రామాయణములో వివరించిన సర్వవిషయములు భాగవతములో కలవు. భాగవతము వేదమనే కల్పతరువు నుండి జాఱిపడిన ఫలము. ఈ భాగవతము చదివి -


*“సమస్తంబుఁ గాకయు నయ్యునుండు*


*వస్తు వెఱుఁగంగఁదగు భాగవతమునందు"*


(భాగవతము - ప్రథమస్కంధము - 36) సమస్తము అయ్యు – అనగా ఈ సర్వస్థావర జంగమములు విరాట్ స్వరూపమే. సమస్తంబు గాకయు - అనగా ఈ సర్వస్థావర జంగమములు ఆత్మ కావు. ఆత్మలో ఈ సర్వజగత్తు ఉండదు. ఈ భాగవతము చదివి సృష్టికారకుడైన విరాట్పురుషుని, సృష్టి ఎలా వచ్చినది గ్రహించి సాధనచే ఆత్మ (వస్తువు)ను తెలియవలయును. ఆవిధముగా ఆత్మను దర్శించిన


మోక్షకామునకు మోక్షంబు సిద్ధించు

భవభయంబులెల్ల బాసిపోవు 


(భాగవతము - ద్వితీయస్కంధము - 7) 


జననమరణవలయములో తిరుగాడుట అనే భవభయమ్ము తొలగిపోయి, మోక్షార్థికి మోక్షంబు సిద్ధించు. ఉపనిషత్తులలో చెప్పిన విషయములకు ఉదాహరణలుగా అనేక కథలు భాగవతమున చెప్పబడినవి.


భాగవతము - ఏకాదశస్కంధములో శ్రీకృష్ణుడు ఉద్దవునికి చెప్పినది 'ఉద్ధవగీత’గా ప్రచారంలో ఉన్నది.


*భారతము* - వ్యాసభగవానుడు తను రచింపబోవు విషయములు గుఱించి ఆలోచించుచుండగా -


తత్రాజగామ భగవాన్ బ్రహ్మా లోకగురుః స్వయమ్ । 

ప్రీత్యర్థం తస్య చైవర్షేః లోకానాం హితకామ్యయా I


(భారతము - ఆదిపర్వము - ప్రథమాధ్యాయం - 57) 


సర్వలోకములకు హితంబు చేయు తలంపుతో సర్వలోకములకు గురువు, ప్రభువు భగవంతుడు అయిన బ్రహ్మ వ్యాసమహర్షికి సంతోషము కలుగజేయుటకు స్వయముగా వచ్చెను. వ్యాసమహర్షి తన ఆలోచనలు బ్రహ్మకు విన్నవించగా ఈ గ్రంథమును వ్రాయుటకు గణపతిని ప్రార్థింపమని చెప్పి బ్రహ్మ తన లోకమునకు వెళ్లెను. వ్యాసమహర్షి తన గ్రంథము వ్రాయుటకు గణపతిని ప్రార్థింపగా గణపతి వచ్చి వ్యాసభగవానుడు చెప్పు శ్లోకములు వ్రాసెను.


| వేదైశ్చతుర్భిః సంయుక్తం - వేదరహస్యం - వేదార్థాౖర్భూషితం । 


సాంగోప నిషధాం - సూక్ష్మార్థ న్యాయయుక్తం || 

- విచిత్రపద పర్వణః - విచిత్రార్థాః - గ్రంథ గ్రంథి |


(భారతం - ఆదిపర్వము)


అనగా భారతము నాలుగు వేదముల సారము. విచిత్రపదములు అనగా నానార్థములతో కూడి గ్రంథ గ్రంథి అనగా సంధిసమాసములతో రచియింపబడినది.


అష్టాశ్లోకసహస్రాణి అష్టా శ్లోక శతాని చ | 

అహం వేద్మి శుకో వేత్తి సంజయో వేత్తి వా న వా ||


(ఆదిపర్వం - ప్రథమాధ్యాయం - 81)


 8,800 శ్లోకములు, గ్రంథగ్రంథితో చెప్పబడినవి. అనగా కథాభాగమును వేదాంతార్థముతో సంధి చేసి సమాసములతో చెప్పబడినవి. ఇందలి గూఢార్థములు శుకబ్రహ్మకు తెలుసు. వైశంపాయనునికి తెలుసు. సూతమహర్షినైన నాకు తెలుసు. సంజయునికి తెలుసునో, తెలియదో తెలియదు. ఈ భారతము కేవలము కథాభాగముగా గాక కథాభాగములతో అపరవిద్య, పరవిద్యల సమ్మేళనముతో రచియింపబడినది. కావున సంజయునికి తెలుసునో, తెలియదో అని అంటే మిగిలినవారి గుఱించి ఏమి చెప్పాలి?


భారతములో ఆది, సభా, వన, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేథ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ అనే పదునెనిమిది (18) పర్వములు కలవు.


వేదములోగల సర్వవిషయములు భారతములో కలవు. అనగా వర్ణనలు, దేశము, రాజు, రాజ్యపాలన, చాతుర్వర్ణములు, పౌరులు, జాతిధర్మములు, ఆశ్రమ ధర్మములు, లోకాచారములు, ధర్మార్థకామములు, పుణ్యకర్మానుష్ఠానము, యోగము, భక్తి అనే కర్మయోగము, సాంఖ్యమైన జ్ఞానయోగము అటులనే ఆత్మ, అధ్యాత్మము, విరాట్, సృష్టి, జీవుడు, జీవుడు ఆత్మస్వరూపుడగు విధము మొదలైన విషయములు వర్ణింపబడినవి. అటులనే భారతములో


ఉతథ్యగీత - వాసుదేవగీత - ఋషభగీత - షడ్డగీత - శంపాన గీత - మంకిగీత - బోధ్యగీత - హారీతగీత - వృత్రగీత - పరాశరగీత - హంసగీత - మొదలైన గీతలు శాంతిపర్వంలో కలవు. అటులనే భీష్మపర్వంలో ఒక గీత కలదు. (భాగవతములో ఉద్ధవ గీత కలదు.) ఇవిగాక వసిష్ఠగీత మొదలైనవి అనేక గీతలు కలవు.


సశేషం

🕉️🌞🌏🌙🌟🚩

భారతీయ సంస్కృతి , వారసత్వాన్ని

 🙏🚩

ఇంగ్లాండ్‌లో మొదటి పాఠశాల 1811లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 7,32,000 గురుకులములు ఉన్నాయి.

మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో,  గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో తెలుసుకుందాం.

గురుకుల సంస్కృతిలో (సనాతన సంస్కృతిలో)  ఈ క్రింది విషయాలను బోధించారు.

01 అగ్ని విద్య (లోహశాస్త్రం)

02 వాయు విద్య (గాలి)

03 జల్ విద్య (నీరు)

04 అంతరిక్ష విద్య (స్పేస్ సైన్స్)

05 పృథ్వి విద్య (పర్యావరణం)

06 సూర్య విద్య (సౌర అధ్యయనం)

07 చంద్ర మరియు లోక్ విద్య (చంద్ర అధ్యయనం)

08 మేఘ విద్య (వాతావరణ సూచన)

09 ధాతు ఉర్జా విద్య (బ్యాటరీ శక్తి)

10 దిన్  రాత్ విద్య.

12 శ్రద్ధా విద్యా (అంతరిక్ష పరిశోధన)

13 ఖాగోళ విజ్ఞానం (ఖగోళ శాస్త్రం)

14 భుగోళ విద్య (భౌగోళిక)

15 కాల విద్యా(సమయ అధ్యయనాలు)

16 భూగర్బ విద్య (జియాలజీ & మైనింగ్)

17 రత్నాలు మరియు లోహాలు 

18 ఆకర్షణ విద్య (గురుత్వాకర్షణ)

19 ప్రకాశ విద్య (శక్తి)

20 సంచార విద్య (కమ్యూనికేషన్)

21 విమాన విద్య (విమానం)

22 జలయన్ విద్య (నీటి నాళాలు)

23 అగ్నియా ఆస్ట్రా విద్య (ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి)

24 జీవవిజ్ఞాన విద్య (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం)

25 యజ్ఞ విద్య

ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ. ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి తెలుసుకుందాం!

26 వ్యాపార్ విద్య (వాణిజ్యం)

27 కృషి విద్య (వ్యవసాయం)

28 పశు పాలన విద్య (పశుసంవర్ధక)

29 పక్షి పాలన (బర్డ్ కీపింగ్)

30 యాన విద్య (మెకానిక్స్)

32 వాహనాల రూపకల్పన

33 రతంకర్ (రత్నాలు & ఆభరణాల రూపకల్పన)

36 కుమ్హార్ విద్యా (కుమ్మరి)

37 లఘు (లోహశాస్త్రం & కమ్మరి)

38 తక్కలు

39 రంగ్ విద్యా (డైయింగ్)

40 ఖాట్వాకర్

41 రజ్జుకర్ (లాజిస్టిక్స్)

42 వాస్తుకర విద్యా (ఆర్కిటెక్చర్)

43 ఖానా బనానే కి విద్యా (వంట)

44 వాహన్ విద్యా (డ్రైవింగ్)

45 జలమార్గాల నిర్వహణ

46 సూచికలు (డేటా ఎంట్రీ)

47 గౌషాలా మేనేజర్ (పశుసంవర్ధక)

48 బాగ్వానీ (హార్టికల్చర్)

49 వాన్ విద్యా (అటవీ)

50 సహోగీ ( పారామెడిక్స్)

ఈ విద్య అంతా గురుకులం లోనే బోధించబడింది, కాని కాలంతో పాటు, గురుకులాలను  అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటిని కనుమరుగయ్యేలా చేశారు! ఇది మెకాలేతో ప్రారంభమైంది. ఈ రోజు, మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత  భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతోంది.

భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది?

కాన్వెంట్ విద్య పరిచయం గురుకులాన్ని నాశనం చేసింది. భారతీయ విద్యా చట్టం 1835 లో ఏర్పడింది (1858 లో సవరించబడింది). దీనిని 'లార్డ్ మెకాలే' రూపొందించారు.

మెకాలే ఇక్కడ విద్యావ్యవస్థపై ఒక సర్వే నిర్వహించగా, చాలా మంది బ్రిటిషర్లు భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలను ఇచ్చారు. బ్రిటిష్ అధికారి ఒకరు జి.డబ్ల్యు. లూథర్ మరియు మరొకరు థామస్ మున్రో! వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలను వేర్వేరు సమయాల్లో సర్వే చేశారు. ఉత్తర భారతదేశం (ఉత్తర భారత్) ను సర్వే చేసిన లూథర్, ఇక్కడ 97% అక్షరాస్యత ఉందని, దక్షిణ భారతదేశం (దక్షిణ భారత్) ను సర్వే చేసిన మున్రో ఇక్కడ 100% అక్షరాస్యత ఉందని రాశారు.

భారతదేశం (భారత్) శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే, దాని ′ ′ *దేశీయ మరియు సాంస్కృతిక విద్యావ్యవస్థ*  పూర్తిగా కూల్చివేయబడాలి మరియు దాని స్థానంలో ′ ′ ఆంగ్ల విద్యా విధానం  ఉండాలి అని మెకాలే స్పష్టంగా చెప్పారు మరియు అప్పుడే భారతీయులు శారీరకంగా భారతీయులు అవుతారు , కానీ మానసికంగా ఇంగ్లీష్ వారు అవుతారు. 

వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు, వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు పని చేస్తారు.

మెకాలే ఇలా చెప్పాడు -  ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా దున్నుతున్నట్లే, దానిని దున్నుతూ ఆంగ్ల విద్యావ్యవస్థలో తీసుకురావాలి.  అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు. అప్పుడు అతను సంస్కృతాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించి గురుకుల వ్యవస్థకు నిప్పంటించాడు, అందులో ఉన్న ఉపాధ్యాయులను కొట్టి జైలులో పెట్టించాడు.

1850 వరకు భారతదేశంలో '7 లక్షల 32 వేల' గురుకుల & 7,50,000 గ్రామాలు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామంలో గురుకులము ఉంది మరియు ఈ గురుకులములన్నీ  'ఉన్నత విద్యా సంస్థలు' గా ఉండేవి.  గురుకులములు  ప్రజలు మరియు రాజు చేత  కలిపి నడుపుబడేవి.

విద్యను ఉచితంగా ఇచ్చారు.

గురుకులాలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది. ఆ సమయంలో దీనిని 'ఉచిత పాఠశాల' అని పిలిచేవారు. ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం & మద్రాస్ విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి. ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి!

మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశారు. ఇది చాలా ప్రసిద్ధ లేఖ, అందులో అతను ఇలా వ్రాశాడు: " కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకువస్తాయి కాని వారి మెదడు ఇంగ్లీషు భావజాలంతో నిండి ఉంటుంది

మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు. వారి సంస్కృతి గురించి వారికి ఏమీ తెలియదు, వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి జాతి గురించి వారికి తెలియదు, అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు, బ్రిటిష్ వారు వెళ్లినా, ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు".  ఆ సమయంలో రాసిన లేఖ లో ఉన్న నిజం ఈనాటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం మరియు మన స్వంత సంస్కృతిని చూసి సిగ్గుపడటం, మనల్ని మనం తక్కువగా భావిస్తున్నాము. 

మాతృభాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరియు ఇది మెకాలే యొక్క వ్యూహం! నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు. భారతీయ సంస్కృతిని గొప్పతనం తెలుసుకోండి.

మన భారతీయ సంస్కృతి , వారసత్వాన్ని   తిరిగి పొందే సమయం ఇది.🙏

*🇮🇳 జైహింద్ 🇮🇳*

21, డిసెంబర్ 2022, బుధవారం

చదువులు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

     *🌷నేటి చదువులు🌷* 

తెలుగు పేపర్లు దిద్దాల్సివచ్చింది ఐదో తరగతి పిల్లలవి! 


అసలే మన ఇంగ్లీష్ మీడియం పిల్లలకు తెలుగు సవ్యంగా  రాకూడద ఉన్ని కదా రూలు! కాబట్టి వచ్చీరాని తెలుగులో ముద్దుముద్దుగా రాసారు  పరీక్ష ! 

కరెక్షన్ ఒక ఎత్తయితే ,ఆనక పేరెంట్స్ వచ్చి మార్కుల కోసం తగువులాడటం మరీ రసవత్తర ఘట్టం ! 


ఇదీ ప్రశ్న : లంకాధిపతి రావణుని చంపినది ఎవరు? (3మార్కులు)


నా బోటి కుర్రాడు "భీముడు " అని వ్రాశాడు సమాధానం .

నే కొట్టేశా. మార్కులివ్వలేదు.


తరవాత ఆ బాబు వాళ్ల తల్లిదండ్రులు వచ్చి కనీసం రెండు మార్కులైన ఇవ్వాలి..attempt చేసాడు కదా అని వాదిస్తారు.


అసలెలా ఇస్తామండి? ఒక పదం సమాధానం ..అది తప్పు పూర్తిగా అని నేనంటే...


ఆవిడ జవాబు : 

రాముడు అనే మూడక్షరాల పదానికి 3 మార్కులైతే ,మా వాడు రాసింది భీముడు అంటే ఒకే అక్షరం తప్పు.


ము,డు రెండూ కరెక్టైనపుడు రెండక్షరాలకు రెండు మార్కులెందుకివ్వరు? చేసిన తప్పే కనిపిస్తోంది కానీ-రాసిన ఒప్పును ఒప్పుకోలేని మీరూ ఓ టీచరేనా ???😳😳😳 నేటి కాలం తల్లిదండ్రులు ఇలా కూడా ఉంటారు అనేందుకు ఓ చిన్న కథ.


😃🤣😊

కుమరేశన్ మామ మనల్ని కాలచక్రంలో

 జనవరి 8 1994, మధ్యాహ్నం 2:58


కుమరేశన్ మామ మనల్ని కాలచక్రంలో ఆరోజుకు తీసుకునివెళ్తున్నాడు.


“జనవరి 7 ఏకాదశి కావడంతో పరమాచార్య స్వామివారు పూర్ణ ఉపవాసం ఉన్నారు. కాని, మేము బలవంతం చేసి కొద్దిగా గంజి ఇచ్చాము. అప్పటికే కొద్ది కాలంగా మహాస్వామివారి ఆరోగ్యం క్షీణించడంతో అ రాత్రంతా స్వామివారికి డ్రిప్స్ ఇచ్చారు. స్వామి వారు డ్రిప్స్ పై ఉండడంతో రాత్రంతా వారి చెయ్యి పట్టుకునే ఉన్నాను. డాక్టర్ శ్రీధర్ మరియు భాస్కర్ కూడా అక్కడే ఉన్నారు.


మరుసటిరోజు ద్వాదశి, అనుషం(స్వామివారి జన్మ నక్షత్రం). ఉదయం మూడు గంటలకు లేచారు స్వామివారు. ఎన్నడూ లేని విధంగా బలంగా, పెద్ద స్వరంతో ఉన్నారు. అందరినీ పేరుపేరునా గుర్తిస్తున్నారు. ఆకలిగా ఉందని చెప్పడంతో కొద్దిగా గంజి ఇచ్చాము. మహాస్వామివారికి నమస్కరించడానికి జయేంద్ర స్వామి, బెంగళూరు హరి వచ్చారు. పూజ పూర్తయ్యిందా అని జయేంద్ర స్వామిని అడిగారు స్వామివారు. 


చెయ్యడానికి వెళ్తున్నానని బదులిచ్చారు జయేంద్ర స్వామివారు. పూజ చేస్తూ ఉండమని, ఆపవద్దని ఆదేశించారు. బెంగళూరు హరి వెండి పాదుకలను, పరమాచార్య స్వామివారి పూర్వాశ్రమ తల్లితండ్రుల చిత్రపటాన్ని తెచ్చాడు. శ్రీ చంద్ర పాదుకలను స్వామివారి పాదాలకు ఉంచి, పటాన్ని స్వామివారికి ఇచ్చాడు. కాని స్వామివారు దాన్ని గుర్తించలేదు. అప్పుడు నేను చదువ కళ్ళజోడుని తీసి మామూలు కళ్ళజోడు పెట్టుకోవడానికి సహాయం చేశాను. స్వామివారు చిత్రపటాన్ని చూసు దగ్గరగా పెట్టుకున్నారు.


తరువాత పాదుకల గురించి అడుగగా, స్వామివారి పాదాలకే ఉన్నాయని చెప్పాను. అప్పటిదాకా వదులుగా ఉన్న స్వామివారు పాదాలు, పాదుకలు కాళ్ళకు ఉన్నాయని తెలియగానే పాదాలను బిగించారు. ఎంత గట్టిగా బిగించారు అంటే, స్వామివారే వదిలేదాకా మేమెవ్వరమూ తీయడానికి కాలేదు.


బెంగళూరు హరి వెళ్ళవలసి ఉండడంతో పాదుకలను వదిలారు. పాదుకలను, చిత్రపటాన్ని హరికి ఇచ్చారు. తరువాత వీటిని ఎచ్చంగుడిలో(పరమాచార్య స్వామివారి తల్లిగారైన మహాలక్ష్మమ్మ గారి గ్రామం) ఉంచారు.


జయేంద్ర స్వామి పూజ పూర్తిచేసి పరమాచార్య స్వామి వద్దకు వచ్చారు. శంకర విజయేంద్ర స్వామితో కలిసి చెన్నైలో హిందూ మిషన్ సమావేశానికి వెళ్ళాల్సి ఉంది. స్వామివారు ఆరోగ్యంగా ఉండడంతో, సెలవు తీసుకుని ఇద్దరో వెళ్ళిపోయారు.


తరువాత మేము స్వామివారికి స్నానం చేయించి, భక్తుల దర్శనానికి వీలుగా ఈజీ చయిర్ లో కూర్చోబెట్టాము. ఆరోజు అనుషం కావడంతో, ప్రదోషం మామ, వారి భార్య, మెచేరి పట్టు శాస్త్రి వచ్చారు అనుషం ప్రసాదంతో. మహాస్వామి వారే తీర్థాన్ని తలపై చల్లుకుని, రక్షను నుదుటిపై ఉంచుకున్నారు. పట్టు శాస్త్రిని శంకర జయంతి ఏర్పాట్లు, మరికొన్ని విషయాలను అడిగి, వాళ్ళను ఆశీర్వదించి పంపారు. వారు సంతోషంతో మఠం నుండి వెళ్ళిపోయారు.


ఆరోజు ద్వాదశి కావడంతో స్వామివారు మంచిగా ఆహారం స్వీకరించారు. నేను, శ్రీ కంఠన్ తయారుచేసిన వంటకాల్ని(పాయసం, బాదాం హల్వా, పచ్చి అరటి ఇడ్లి) ఒక్కొక్కటి అడిగి మరీ స్వీకరించారు. భిక్ష ముగించగానే, లఘుశంకకు వెళ్ళాలని చెప్పారు. మేము స్వామివారిని మోసుకునివెళ్ళడానికి సిద్ధమయ్యాము. వైతా మామ, అరక్కోణం బాలు స్వామివారి కాళ్ళు పట్టుకోగా, బాలు జబ్బ పట్టుకున్నారు. స్వామివారిని కూర్చోపెట్టబోతుండగా స్వామివారు కాలు విదిలించడంతో, ముగ్గురూ కింద పడిపోయారు.


అప్పుడే స్వామివారి ఆత్మ దేహం నుండి విడివడింది. డాక్టర్ భాస్కర్ స్వామివారిని పడుకోబెట్టమన్నారు. ఇతర వైద్యులు వచ్చి, స్వామివారిని పరీక్షించి, పరమాచార్య స్వామివారు సిద్ధి పొందినట్టు ధ్రువీకరించారు.

మేము తట్టుకోలేకపోయాము. కాని మమ్మల్ని ఏడవద్దని అందరూ వారించారు ఎందుకంటే స్వామివారు పరమేశ్వరులు కాబట్టి.


వార్త తెలిసిన వెంటనే జయేంద్ర స్వామి, విజయేంద్ర స్వామి వచ్చారు. జయేంద్ర స్వామి అస్సలు తట్టుకోలేకపోయారు. మహాస్వామి వారి పాదాలపై పడి ఏడ్చారు. వారిని సముదాయించడం ఎవరివల్లా కాలేదు. అందుకే దాదాపు అరగంట పాటు వారిని అలాగే స్వామి వారి వద్దనే వదిలేసాము. తరువాత విజయేంద్ర స్వామి వచ్చి వారిని స్థిమితపరచి వారి గదిలోనికి తీసుకునివెళ్ళారు.


పట్టు శాస్త్రి చెన్నై చేరుకోగానే, ఈ విషయాన్ని ఒక ఆటో డ్రైవరు తెలిపాడు. అప్పుడే స్వామివారిని దర్శించి ఉండడంతో వెంటనే ఆగ్రహోదగ్ధుడై అతణ్ణి కొట్టారు. కాని ఇంటికి వెళ్ళగానే, నిజం తెలిసింది. వెంటనే కుటుంబంతో సహా కాంచీపురానికి ప్రయాణమయ్యారు.


పరమాచార్య స్వామివారి చివరి దర్శనం కోసం ప్రజలు ఉప్పెనలా కాంచీపురానికి వచ్చారు. జాతి, కుల, మతాలకు అతీతంగా విచ్చేశారు.

శ్రీవారు పరమేశ్వరుడే అనడానికి నిదర్శనాలు అవసరం లేదు. ప్రదోషం, ద్వాదశి, అనుషం, కృష్ణపక్షం, ఉత్తరాయణ పుణ్యకాలంలో చివరి సంస్కారాలు జరిగాయి”


--- కుమరేశన్ మామ తమిళ ఇంటర్వ్యూ నుండి


https://youtu.be/Fn8sEIlsVo0


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శ్రీకృష్ణపరమాత్మబోధించినభగవద్గీత

 హరిః ఓమ్, హరిః ఓమ్.

🕉️  *మన తలరాత మార్చే గీత*శ్రీకృష్ణపరమాత్మబోధించినభగవద్గీత*దాని విశేషాలు*🕉️

                 ➖➖➖

♦️ *మన లోపల ఒకడు నిగూఢముగా ఉన్నాడు.... అసలైన వాడు.*♦️

▪️ *కానీ వాడిదగ్గరికి వెళ్ళాలి అంటే  6 గురు  దొంగలు అడ్డుగా ఉన్నారు..*

 అవే *కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యo అనే 6 గురు  దొంగలు..!*

▪️ *ఈ 6 గురిలో 4 గురు దొంగల నుండి సులభంగా తప్పించు కోవచ్చు, కానీ ఇద్దరు దొంగలనుండి తప్పించు కోవడం చాలా చాలా కష్టం..*

▪️ *ఆ ఇద్దరూ పెద్ద రౌడీలు. వాళ్ళే కామం, క్రోధం....ఈ ఇద్దరు రౌడీలు ఎక్కడ దాక్కొని ఉంటా రు అంటే - రజో గుణం అనే ఇంట్లో..*

▪️ *" కామ ఏష క్రోధ ఏష రజో*

  *గుణ సముద్భవహ "* 

▪️ *ఈ కామం, క్రోధం అనేవి రజో గుణం నుండి ఉద్భవిస్తు న్నాయి అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు..*

▪️ *కాబట్టి రజో గుణం అనే ఇంట్లో ఈ ఇద్దరు దొంగలు ఉంటారు*.

▪️ *ఈ దొంగలను పట్టుకోవాలి అంటే - రజో గుణం అనే ఇంటికి తాళం వేయాలి. అంతే, ఇంక వాళ్ళు బయటికి రాలేరు.. అయితే, ఈ రజో గుణం అనేది First floor....ఇంకా మనం First floor కు రాలేదు.....మనం Ground floor లో ఉన్నాం.*

▪️ *మనలో ఉండే తమో గుణమే ఆ Ground floor.*

▪️ *అంటే మనం తమో గుణంలో ఉన్నాం.*

▪️ *బద్దకం, అతి నిద్ర, ఆలస్యం, నిర్లక్ష్యం ఇవే తమో గుణలక్షణాలు ..... ఇలాంటి తమో గుణంలోనే మనలో చాలా మందిమి వుంటున్నాం..... అంటే,  ఇంకా Ground floor లోనే ఉన్నాం.*

▪️ *ఈ Ground floor నుండి పైకి వెళ్ళా లంటే చాలా కష్టం. అలాoటి ఈ Ground floor నుండి పైకి వచ్చి, First floor కు వెళ్లి అక్కడ ఉండే 6 గురు  దొంగలను తప్పించుకొని ఇంకా పైకి వెళ్తే అప్పుడు Second floor వస్తుంది.*

♦️ *ఆ floor పేరు  ‘సత్వ గుణం..’*

 *ఈ floor చాలా పెద్దగా ఉంటుంది....హాయిగా ఉంటుంది......*

▪️ *ఎక్కడ చూసినా వెలుగే ఉంటుంది..*

▪️ *అయితే చిన్న సమస్య....... ఇక్కడ ఒకే ఒక దొంగుంటాడు. భయపడకండి*...... 

▪️ *వాడు...*

*మంచి దొంగ.....వాడు మీకు మంచి మాటలే చెబుతూ  ఉంటాడు . మీకు Third floor కు దారి చూపిస్తాడు...     ఆ floor పేరు శుద్ధ సాత్వికం.... ఇదే చివరిది..... ఇక్కడే మీకు  అఖండమైన వెలుగులో కలిసిపోయింది.... ఆ అఖండమైన వెలుగే 🕉️పరమాత్మ..🕉️*

▪️ *అది వెలుగులకు వెలుగు, మహావెలుగు.*

▪️ *చివరిగా ఒక good news ఏమిటంటే మనం Ground floor నుండి third floor వరకు వెళ్ళడానికి ఒక  Lift*   ఉంది.

♦️ *ఆ Lift పేరే "భగవద్గీత".*

▪️ *గీతను చదువుతూ ఉంటే:  తమో గుణం నుండి రజో గుణానికి-  రజో గుణం నుండి సత్వ గుణానికి- సత్వ గుణం నుండి విశుద్ధ సత్వం వరకు మనం ప్రయాణం చేసి, చివరికి గుణ త్రయాతీత స్థితికి - ఆపైన శాశ్వతమైన స్థానానికీ చేరుకోవచ్చు.*

▪️  *అక్కడ చాలా ప్రకాశం గా వుంటుంది. అక్కడ సూర్యుడు, చంద్రుడు, అగ్నిని కూడామించిన వెలుగులు, చల్లదనం, వేడిమి వెద జల్లుతూ వుంటాయి*


♦️ *అక్కడకు చేరుకుంటే - ఆకలిబాధ , దప్పిక బాధలు, జన్మ భయం, వార్ధక్య భయం, రోగ భయం, మృత్యు భయం వుండవు*  *అంతా అభయమే*


🕉️ *అక్కడ కు చేరుకుంటే - మళ్ళీ గర్భస్త నరకం-  పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు.*.


🕉️ *అదే మన తలరాత మార్చేభగవద్గీత* 

                 ➖➖➖

▪️ఆ గీత పుట్టిన దేశం ఈ భారత్ దేశం.


♦️నా దేశం భగవద్గీత!,

నాదేశం అగ్ని పునీత సీత!,

 నా దేశం కరుణాంత రంగ!,

నా దేశం సంస్కార గంగ!.


హరిః ఓమ్.

అత్యద్భుతమైన శక్తి

 మానవజన్మ తరించడానికి - మహా మంత్రం.!!


తన్మేమనశ్శివసంకల్పమస్తు.!!


ఓం నమః శివాయ...


సాంబా... అని పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి శివదీక్ష ఇస్తూ...


నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే...

య ఇదం కీర్తయేన్నిత్యం శివసాయుజ్యమాప్నుయాత్ 


అనే మంత్రాన్ని ఉపదేశించారు. ఇది శివపురాణంలో కూడా  వస్తుంది. ఇది చాలా గొప్ప మంత్రం. నమశ్శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే. నాలుగు నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది.


1) నమశ్శివాయ...


(శివాయనమః) మహాపంచాక్షరీ మంత్రం. శివభక్తులకు నిరంతర జప్యమైన పంచాక్షరీ మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి.


 అ, ఉ, మ, బిందు, నాద అనే పంచ అవయువాలతో కూడిన  ఓంకారం సూక్ష్మప్రణవం.. న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాల శివమంత్రం స్ధూలప్రణవం.  పంచాక్షరీని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధం.


2) సాంబాయ...


అమ్మతో ఉన్నవాడు. ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే  కావలసినవి అన్ని సమృద్ధిగా పొందవచ్చును.


3) శాంతాయ...


ఆయనని తలంచుకొంటే వచ్చేది శాంతం. జీవితానికి కావలసింది కూడా శాంతమే. "ప్రపంచోప శమం శాంతం అద్వైతం మన్యంతే" అని ఉపనిషత్తు చెప్పింది. అలజడులు అన్నీ అణగిన తరువాత వచ్చే శాంతం అది.


4) పరమాత్మనే నమః...


చిట్ట చివరికి పొందవలసినది పరమాత్మ తత్త్వమే... అన్నిటిని కలిపి నాలుగు నామాలతో పొదిగిన మంత్రరాజం  ఈ శ్లోకం.


ఈ శ్లోకాన్ని అర్థానుసంధానంగా మననం చేసినవారు శివసాయుజ్యాన్ని పొందుతారు అని ఉపమన్యు  మహర్షి స్వయంగా చెప్పారు.!! స్వస్తి.!!

20, డిసెంబర్ 2022, మంగళవారం

షడైశ్వైర్యాలు

  1) భగ కలిగిన వాడు:  మనము అదృషవంతుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, బలవంతుడు అనే మాటలు వుంటూ ఉంటాము.  అంటే ఏది ఉంటే వానికి ఉన్నదాని ప్రక్కన వంతుడు అని పెట్టి అది అలిగినవాడుగా మనం పేర్కొంటాము.  ఉదా : ధనం వున్నవానిని ధనవంతుడు అని అదృష్టం వున్నవానిని అదృష్టవంతుడు ఇలా మనం ఉపయోగిస్తూవుంటాము. మరి భగవంతుడు" అంటే ఎవరు? భగ అనే ఆరుగుణాలు వున్నవాడు క్రింది శ్లోకాన్ని చుడండి

"మాహాత్మ్యస్య సమగ్రస్య ధైర్యస్య యశస శ్రియఃజ్ఞాన వైరాగ్యయేశ్చైవ షణాం - భగ, ఇత్యుక్త భగోzస్యాస్తీ తి భగవాన్ " అని శాస్త్ర నిర్వచనం .అంటే

1) మాహాత్మ్యం 2) ధైర్యం 3) యశస్సు4) సంపద5) జ్ఞానం 6) వైరాగ్యం ఈ ఆరింటిని షడైశ్వైర్యాలు అంటారు.వీటికే "భగ" అని పేరు. ఈ ఆరు ఐశ్వైర్యాలను సంపూర్ణంగా కలిగి ఉండడం వల్లనే "భగవంతుడు" అని పేరు.

మన మహర్షులు వారి అత్యంత గొప్ప మేధసుక్తితో మనకు భగవంతుని స్వరూపాన్ని ఆవిష్కరింప చేశారు.  వారు పేర్కొన్న జ్ఞ్యాన బాండాగారం మనకు ఉపనిషత్తుల రూపంలో లభ్యమవుతున్నది. అతి సామాన్యమైన విషయంతో అనన్తమైన బ్రహ్మపదారధాన్ని తెలుసుకోవటం ఒక అసామాన్యమైన జ్ఞ్యానం అనాలి. 

భగవంతుడు: మన మహర్షులు భాగావంతునికి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి అని చెప్పారు. 

1) త్రిగుణాతీతుడు. మనుషులమైన మనము సత్వ, రజో తమో గుణాలలో ఏదో ఒక గుణం కలిగి ఉంటాము. కొన్ని సందర్భాలలో ఒక గుణం ఇంకొక గుణంతో మిళితమై లేక అధిగమించి గోచరించవచ్చు. ఏది ఏమైనా గుణాలలో మాత్రమే మనిషి కనపడతాడు.  కానీ భగవంతునికి ఏ రకమైన గుణం ఉండదు అంటే ఆయనకు రాగ ద్వేషాలు వుండవు. 

2) కాలాతీతుడు: ఈ భూమి మీద వున్న ప్రతిదీ అది నిర్జీవమైనది కావచ్చు లేక జీవమైనది కావచ్చు ఒక కాలంలో ఉద్బవించి (జన్మించి) కొంత కాలం వుంది తరువాత నశించి పోతుంది. ఉన్నంతకాలం మార్పు చెందుతూ ఉంటుంది. కానీ భగవంతుడు కాలములో లేడు ఆయన త్రికాలలో ఉంటాడు అంటే భూతకాలంలో వున్నాడు, వర్తమానంములో వున్నాడు భవిష్యత్తులో ఉంటాడు. అందుకే భగవంతుని నిత్యుడు అని అన్నారు. 

3) రూప రహితుడు: మనకు ఈ భూమి మీద ప్రతిదీ ఏదో ఒక రూపంలో కనబడుతూ వున్నది. అందుకే మనం వాటిని గుర్తించగలుగుతున్నాము. కానీ భగవంతుడు ఏ రూపం లేకుండా ఉంటాడు. అందుకే ఆయన కాలంలో లేడు . 

4) నామరహితుడు: అంటే పేరులేని వాడు.  ఏదైనా రూపం ఉంటేనే పేరు ఉంటుంది.  రూపమేలేనప్పుడు ఇక పేరు అనే సమస్యే లేదు. 


_తిరుప్పావై నాల్గవరోజు పాశురం*_

 _తిరుప్పావై నాల్గవరోజు పాశురం*_

 

 

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 

 

*🌴4. వ పాశురము:🌴*


    *ఆళి మళైక్కణ్ణాః ఒన్ఱు నీ కైకర వేల్*

     *ఆళి యుళ్ పుక్కు మగన్ధు కొడార్ త్తేఱి*

    *ఊళి* *ముదల్వనరువమ్ పోల్ - మెయ్ కఱుత్తు*

    *పాళి య న్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్*

    *ఆళి పోల్ మిన్ని వలమ్బురి పోల్ నిన్ఱ దిర్ న్దు*

    *తాళాదే శార్ ఙ్గం ముదైత్త శరమళై పోల్*

    *వాళ వులగినిల్ పెయ్ దిడాయ్ - నాజ్గళుమ్*

    *మార్ గళి నీరాడ్ మాగిళ్ న్దేలో రెమ్బావాయ్.*


*🌳భావము :🌳*


ఓ పర్జన్య దైవమా ! వర్షమును కురిపించుటలో లోభత్వమును జూపకుము. నీవు సముద్రములోని నీటి నంతను కడుపు నిండుగ త్రాగుము , అటుపిదప నీవు పైకెగసి , సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపురంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించుము. మేమందరము యీ వర్ష ధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగ జేసికొనుటకై ఇక ఏ మాత్రమూ ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామీ !


  *☘️అవతారిక :☘️*

   


సర్వవ్యాపాకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని యెరిగి ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి 3వ పాశురంలో గోదాదేవి వెల్లడించింది. అట్టి పరమాత్ముని యేమరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావలెనన్న ముందు శారీరక శుద్ధి , ఆపై అంతర్ శుద్ధి అవసరం కదా ! అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థంచి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నదీ పాశురంలో.


*🌹4. వ మాలిక🌹*


    (ఉదయరవిచంద్రిక రాగము -ఆదితాళము)


ప.    వెనుదీయబోకుమా ! వర్జన్యమా !

    కనికరముంచుమ ! వర్షాధిదైవతమ !


అ. ప.    పానము చేయుమ ! సాగర జలముల

    ఘనమౌ గర్జన చేయగరమ్మా !


1 చ.    ఆకాశమున కెగసి లోకకారణుని

    పోకడి తిరుమేని నలుపు నలదుకొనుమ


2 చ.    విశాల సుందర భుజ పద్మనాభుని    

    అసదృశమగు చక్రమువలె మెరసి

    ఆశనిపాత శంఖముగ గర్జించి

    ఆ శార్జపు శరములుగ వర్షింపుమా


3 చ.    ఆశల , లోకము సుఖముల నొందగ

    మాస మార్గళిని మాకై వర్షింపుమా

    వెనుదీయబోకుమా ! పర్జన్యమా !





_

తిరుప్పావై ప్రవచనం‎ - 4 వ రోజు*_

 _*తిరుప్పావై ప్రవచనం‎ - 4 వ రోజు*_ 


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*భగవంతుని నాలుగో స్థానం - అంతర్యామి*


 


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*పాశురము*


*ఆళి మళైక్కణ్ణాః ఒన్ఱు నీ కైకర వేల్*

     *ఆళి యుళ్ పుక్కు మగన్ధు కొడార్ త్తేఱి*

    *ఊళి* *ముదల్వనరువమ్ పోల్ - మెయ్ కఱుత్తు*

    *పాళి య న్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్*

    *ఆళి పోల్ మిన్ని వలమ్బురి పోల్ నిన్ఱ దిర్ న్దు*

    *తాళాదే శార్ ఙ్గం ముదైత్త శరమళై పోల్*

    *వాళ వులగినిల్ పెయ్ దిడాయ్ - నాజ్గళుమ్*

    *మార్ గళి నీరాడ్ మాగిళ్ న్దేలో రెమ్బావాయ్.*


మనిషిని మనిషిగా తీర్చిదిద్దే వ్రతం ఇది. మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కల్గితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి. దేవతలంతా సహకరిస్తారు. మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్య తత్వాన్ని నారాయణ అని అంటారు. ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీసుఖుడు ఇట్లా అంతటా దైవన్ని దర్షించుకొనేవాడట. దేనిపై పెద్దగా వ్యామొహం లేనివాడవటంచే అలా  వెల్లి పోతుంటే , పుత్రవ్యామోహంచే వేదవ్యాసుడు అతని వెంట పరుగెత్తేవాడట. పుత్రా అని తన పిలుపులకు ఆయన స్పందించకపోయే సరికి చెట్లు , పక్షులు ఓయ్ అని పలికేవట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే శ్రీసుఖునిలో ఉన్న తత్వమే అన్నిటిలోనూ ఉంది కనకనే అలా స్పందించాయి. ప్రతి వస్తువులోను అది ఉండి నిలబెడుతుంది. దాన్ని మనం చూడగలగాలి , కాని కంటికి కనబడదు. కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి.  


ఆండాళ్ తల్లి మనిషిలోని మంచి తనాన్ని మేల్కొల్పటానికి ధనుర్మాస వ్రతం చేసింది , మనల్ని అట్లానే ఆచరించమంది.  అందరితో కలిసి ఆచరించాలి అని చెప్పింది. అందరితో కలిసి చేస్తేనే అనుభవ యోగ్యం అవుతుంది. అందరికి సాముహికంగా క్షేమం కల్గాలని అని మనం చేస్తున్నాం , అలాంటి వాన్ని ముముక్షువు అంటారు. మనం ఒక ముముక్షువుగా బ్రతక గలగాలి. తత్వన్ని అంతటా చూడగలగాలి. తీపికి రుపం ఎమిటి , వివిద పదార్థాల లోనే చూడగలం. అలాగే పరమాత్మ తత్వాన్ని మనం కంటితో చూడలేము కనక , మనవంటి వారికి ఇష్టమయ్యే మనవంటి రూపాన్నే ధరించి మన ఆరాధనలు అందుకోవటానికి చేరుతుంది ఆ బ్రహ్మ తత్వం. కాని అది మాత్రమే ఆయన రూపం కాదు. 


సామాన్యంగా భగవంతుడు తన పరివారం అందరితో కల్సి ఉంటాడు , లోకంలో ఒక్కొక్క  ప్రయోజనం కోసం వివిద దేవతలను ఆశ్రయిస్తారు. కాని ఒక్కరిని ఆరాధించి సకల ఫలితాలు పొందాలంటే ఏదైన సాధన ఉందా అంటే - అది నారాయణుని ఆశ్రయం తప్ప ఏది లేదు ఎందుకంటే సకలఫలప్రదోహి విష్ణు:  అనేది మనకు ఋషివాక్కు. మిగతావరంతా *"ఏకైక లభాయ:"* కాని  *"సర్వ లాభాయ కేశవ"* అంటారు.  ఒక్క పరమాత్మను మనం ప్రసన్నం చేసుకొంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు. 


అందరూ భయపడే యముడు చెప్పినమాటలు ఏమిటంటే , విష్ణువు భక్తుల జోలికి తన దూతలను వెల్లవద్దని. భగవత్ ప్రేమ కల్గి విష్ణువుకే అంకితమయ్యే వాల్లంటే యముడు కూడా భయపడుతుంటాడు. నారాయణ స్మరన చేయటంచే యమదూతలు అజామయున్ని వదిలివెళ్ళుతారు. విష్ణుదూతలు అతన్ని తీసుకుపోతారు. భారతంలో అజామయుడి సన్నివేషంలో  ఇది చెప్పబడి ఉంది. అలాగే ఏదేవతను కొలిచినా , ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చెది నేనే నయా అని  భగవద్గీత ఏడవ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఒక్క శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకొంటే మిగతాదేవతలు తామంతట తామే సహకరిస్తారు.


అలా వచ్చిన దేవతల్లో ముఖ్యుడైన వర్ష దేవునికి ఆండాళ్ చేసిన విన్నపం ఇలా ఉంది. *ఆళి మళైక్కణ్ణా! -* సముద్రమ్లో నుండి నీల్లను గ్రహించి నిర్వహించేవాడా - వానదేవా - పర్జన్యా. *ఒన్ఱు నీ కై కరవేల్ -* ఏ మాత్రం నీవు చేయి దాచుకోవద్దు - ఉదారంగా ఇవ్వు , *ఆళి ఉళ్ పుక్కు -* సముద్రం అట్టడుగు లోపలి దాకా వెల్లి , *ముగందు కొడార్ త్తేఱి -*  పిల్చుకో , ముందు నీవు తృప్తిగా కడుపు *నిమ్పుకోని -* చాలా ఎత్తుకు వెల్లాలి. 


*ఊళి ముదల్వన్ -* సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలి కాంతి తరంగాలు కల్గి ఉంటాడో , *ఊరువం పోళ్  మెయ్ కఱుత్తు -* అట్లాగే  నీ  ఆకారాన్ని సరిదిద్దుకో , *పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్  ఆళిపొల్ మిన్ని -* బీటలువారి ఉన్న ఈ భూమికి ఒక్క సారిగా కురవకూడదు ,  మొదటగా మెరవవలె , తర్వాత ఉరమవలె , తరువాత కురవవలె. 


ఆ  మెరవడం ఎట్లా అంటే సుదర్షణచక్రం మెరుస్తున్నట్లుగా ఉండాలి. *వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు -* ఎట్లా ఉరమాలి అంటే శ్రీపాంచజన్యంలా - శంఖం ద్వనిలా  ఉరుమవలె. ఆ ద్వని ద్వారా భగవంతున్ని ద్వేషించేవాల్లు కూడా భక్తులుగా మారేట్లు గా ఉండాలి. తాళాదే శారుంగం ఉదెత *శరమళైపోల్ వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ -* ఇక కురవడం స్వామి వేసే భాణాలవలె కురవాలి , అందరు సుఖించెందుకు uవర్షించు. ఆంగళుం *మార్గళి నీరాడ మగిళుంద్* - మార్గశీర్ష స్నానం కోసం మాకు సరిపడేంత నీరు ఉండేలా వర్షించు.

అన్నకోశం – అష్టాదశ పురాణాలు

 అన్నకోశం – అష్టాదశ పురాణాలు


పరమాచార్య స్వామివారు చెన్నైలో కొన్ని నెలలపాటు మకాం చేసారు. అక్కడినుండి బయలుదేరి వారు పూనమల్లె రోడ్డులో ఉన్న నూమ్బల్ లో ని ఇటుక పెంకుల తయారి కర్మాగరంలో మకాం చేస్తున్నారు. ఒకరోజు సాయింత్రం నేను కలకత్తా నుండి వచ్చిన ఒక సేఠ్ తో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళాను. అతను కలకత్తాలో పెద్ద ధనవంతుడు మరియు పరోపకార బుద్ధి కలవాడు. మామూలుగా నేను స్వామివారికి సాష్టాంగం చేసాను. ఆ సేఠ్ కూడా అలాగే చేసాడు. ఇద్దరము స్వామివారికి నమస్కరిస్తూ నిలబడ్దాము. 


స్వామివారు ఒక్కసారిగా మావైపు చూసి తలెత్తి నాతో, “అప్పుడు నాకు ఒకసారి చెప్పావు. . . అది ఇతని గురించేనా?” అని అడిగారు. జ్ఞాపకం ఉంచుకోవడంలో అంచనా వెయ్యడంలో స్వామివారి శక్తి అమోఘం. నేను వారు అడిగినదానికి ఏకీభవిస్తూ “చాలాకాలంగా ఇతడు నన్ను ఒత్తిడి చేస్తుండడం వల్ల ఇక్కడికి తీసుకుని వచ్చాను” అని వినయంగా బదులిచ్చాను. 


ఇతని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ సేఠ్ చాలా ధార్మికుడు. కలకత్తాలో ప్రతిరోజు నేను చెప్పే రామయాణ, మహాభారత ఉపన్యాసాలకు వచ్చేవాడు. నేను హిందీలో కూడా వ్యాఖ్యానించడం వల్ల చాలామంది ఉపన్యాసాలకు వచ్చేవారు. ఉపన్యాసం ప్రారంభించి ప్రార్థనా శ్లోకాల తరువాత కంచి పరమాచార్య స్వామి వారి గురించి చెప్తూ, వారి తపశ్శక్తి, వారి అపారమైన మేధస్సు గురించి ఉదాహరణలతో సహా చెప్పేవాడిని. తరువాతే అసలు ప్రవచనం చెప్పేవాడిని. ఇలా చాలా సంవత్సరాలనుండి పాటిస్తున్నాను. 


భగవంతుడు ఆ సేఠ్ కు అన్నిరకాల భోగభాగ్యాలను ఇచ్చాడు కానిఇ వాటితో పాటు ఒక పెద్ద బాధను ఇచ్చాడు. అతడు నోటి ద్వారా ఆహారం స్వీకరించలేకపోవడం అతడి దురదృష్టం. అతని అన్ననాళం (నోటి నుండి కడుపుకి ఆహారం వెళ్ళే మార్గం) పనిచెయ్యదు. కడుపు పైన ఒక రంధ్రం చేసి దాని గుండా ఆహారాన్ని కడుపులోకి పంపాలి. ఎంతటి నరకం అది. దాన్ని అనుభవిస్తూ రోజులు వెళ్ళదీస్తున్నాడు. 


ఆ సమస్యను నివారించుకోవడానికి అతను చెయ్యని పని లేదు. వైద్యశాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వారిని కూడా కలిసాడు. వెళ్ళని దేవాలయం లేదు. మొక్కని దేవాలయం లేదు. ప్రార్థనలు, పూజలు, యంత్రాలు, తంత్రాలు అన్నిటిని చేసాడు. కాని ఏ ఒక్కదాని వల్ల ప్రయోజనం లేదు. నేను చెప్పే ఉపన్యాసాల్లో కంచి పరమాచార్య స్వామి వారి గురించి విని ఒక్కసారి వారిని కలవాలని చివరైకి వారైనా తనకు ఈ బాధనుండి విముక్తి కలిగిస్తారేమోనని అతని ఆశ. 


ఒకసారి నాతో ఇద్దరము కలిసి చెన్నై వెళ్ళవలసిందే అని పట్టుబట్టాడు. కాని పరమాచార్య స్వామివారి అనుమతి లేకుండా అతణ్ణి తీసుకుని వెళ్ళడం నాకు చాలా ఇబ్బంది. నేను చెన్నై వెళ్ళి స్వామివారిని అడిగి చెప్తాను అని చెప్పాను. వెంటనే నాకు చెన్నైకి విమానం టికెట్ తిసిచ్చాడు. నేను చెన్నై వెళ్ళగానే పరమాచార్య స్వామి వారికి విషయమంతా చెప్పి అతణ్ణి తీసుకుని రావడానికి వారి అనుమతి కోరాను. నా ప్రవచనాల గురించి అడిగారు కాని దాని గురించి ఏ విషయము చెప్పలేదు. ఆ విషయం మళ్ళా గుర్తుచెయ్యగా ఖండితంగా “ఇప్పుడు కాదు” అని అన్నారు. ఈ విషయం ఆ సేఠ్ కి చెప్తే బాధపడతాడని నా ప్రవచనాలు అయిపోయాక తీసుకుని వెళ్తానని చెప్పాను. 


స్వామివారి అనుమతి లేకున్న ఇప్పుడు అతణ్ణి తీసుకుని రావాడం నా తప్పే, కాని సేవాభావంతో అతణ్ణి తీసుకుని వచ్చాను. మనకు జరిగి ప్రతి మంచి చెడు మన పూర్వజన్మ పాప పుణ్యాల ఫలమే. ప్రతి మనిషి వాటిని అనుభవించవలసిందే. వాటి ఫలితాన్ని అనుభవిస్తేనే పాపం తగ్గుతుంది. అలా వరుస కష్టాలు అనుభవిస్తున్నమంటే మన పాపం అంతా పోతున్నట్టే. వాటిని భగవంతుడిపై విశ్వాసంతో అనుభవిస్తే దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇటువంటి మంచిచెడ్డల విషయంలో పరమాచార్య స్వామివారి వివరణలు చాలా స్పష్టంగా ఉంటాయి. 


మనుషులు వాటిని ఖచ్చితంగా అనుభవించాలి అనే స్పృహ లేకుండా వాటిని పరిహరించమని కోరుకుంటారు. అందుకే వారిని కలావడానికి స్వామివారు ఇష్టపడరు. నేను స్వామికి కొంచం దూరంగా నిలబడి వారికి పదే పదే గుర్తుచేస్తున్నాను. కాని స్వామివారు ఏమి చెప్పలేదు. రాత్రి అయ్యేటప్పటికి సెలవు తీసుకుని ఉదయం రావడానికి వారిని సమీపించాను. వారు నా భావన గ్రహించి “అతని విషయంలో ఏమి చెయ్యలేము. అతణ్ణి తీసుకుని వెళ్ళు. దేవునిపై భక్తితో, మంచి పనులు చేస్తూ ఉండమను. ఆ దైవమే అతణ్ణి రక్షించగలదు” అని చెప్పారు.


నేను కొంచం సాహసించి స్వామివారితో, “చలా ఏళ్ళుగా అతను ఎన్నో మంచిపనులు చేస్తున్నాడు. దీనికి పరిహారమే లేదా? ప్రతిదానికి ఒక పరిహారం అంటూ ఉంటుంది కదా? శాపగ్రస్తులకి, పాపాత్ములకి మన ధర్మశాస్త్రాలు విమోచనం చెప్పలేదా? భగవంతుడి సృష్టిలో ప్రతిదానికి పరిహారం ఉండదా? మీరు దయతో అతణ్ణి అనుగ్రహించండి” అని ఆ సేఠ్ పరుపున వాదించాను. 


పరమాచార్య స్వామివారు అంతావిని కొద్దిసేపు మౌనంగా ఉండి నన్ను దగ్గరకు రమ్మని చెప్పారు. “నేను ఏమి చెప్తే అది అతను చేస్తాడా?” అని అడిగారు. 


”ఖచ్చితంగా చేస్తాడు. చెయ్యమని నేను చెప్తాను”


“ఒకవేళ అతను చెయ్యకపోతే?”


“చేస్తే మంచి జరుగుతుంది, లేకపోతే అనుభవిస్తాడు” అన్నాను. ”నేను చెప్పేది చెయ్యలంటే చాలా ధనం ఖర్చు అవుతుంది. అంత ఖర్చు చెయ్యగలడా?”


“అతను కోటీశ్వరుడు. మొత్తం ఆస్తి అంతా ఖర్చుపెడతాడు ఆరోగ్యం కోసం” అన్నాను నేను. 


”సరే. అలాగైతే మన వేదశాస్త్రాల్లోని మొత్తం పద్దెనిమిది పురాణాలను మంచి పేపరుపై, మంచి అచ్చుతో సంస్కృతంలో భాగాలుగా అచ్చువేయించి, అన్ని భాగాలను అర్హులైన వేదపండితులకు ఉచితంగా ఇవ్వాలి. అతను చేస్తాడా? చెయ్యగలడా?” అని అడిగారు. 


”చెయ్యగలడు. చెయ్యమని నేను చెప్తాను” అని అన్నాను. 


”పద్దెనిమిది పురాణాలు నీకు తెలుసా? ఏవి పేర్లు చెప్పు”


నేను వాటిని “1.మత్స్య పురాణం, 2.మార్కండేయ పురాణం, 3.భవిష్య పురాణం, 4.భాగవత పురాణం, 5.బ్రహ్మాండ పురాణం, 6.బ్రహ్మ వైవర్త పురాణం, 7.బ్రహ్మ పురాణం, 8.వామన పురాణం, 9.వరాహ పురాణం, 10.విష్ణు పురాణం, 11.వాయు పురాణం, 12.అగ్ని పురాణం, 13.నారదీయ పురాణం, 14.పద్మ పురాణం, 15.లింగ పురాణం, 16.గరుడ పురాణం, 17.కూర్మ పురాణం, 18.స్కంద పురాణం” అని చెప్పి నా వాదన వల్ల మంచి జరిగినందుకు సాంతోషించాను.


నేను సేఠ్ ని పిలిచి విషయం అంతా వివరించాను. అతను చాలా సంతోషంతో “అవును నేను చేస్తాను” అని కన్నీళ్ళతో పరమాచార్య స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించాడు. మహాస్వామి వారు ఆశీర్వదించి ప్రసాదం ఇవ్వమని శిష్యులకు చెప్పారు. 


అతను తన స్వస్థానం చేరగానే మొదట ఈ పని మొదలుపెట్టాడు. అతని పెద్ద కార్యాలయ భవంతిలో ఒక అంతస్థు మొత్తం ఈ కార్యక్రమానికి వినియోగించాడు. చాలా రాష్ట్రాల నుండి వైదిక పండితులను, పురాణాలాలో నిష్ణాతులను పిలిపించాడు. అందరిని సంప్రదించి వారి సలహాలు సూచనల మేరకు మంచి కాగితంపై, మంచి నాణ్యతతో పెద్ద పుస్తకాలను అచ్చువేయించి స్వామి వారి ఆజ్ఞమేరకు అర్హులైన పండితులకు పంచాడు. ధర వేసే చోట “ప్రేమతో” అని రాయించాడు. 


అతని అనారోగ్యం తగ్గుతోందా? అసలు తగ్గుతుందా లేదా? అన్నది కూడా పట్టించుకోకుండా, కనీసం ఇసుమంతైనా అనుమానం లేకుండా పూర్తిగా ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు. మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం పదిహేడు పురాణాలు గ్రంధాలుగా వచ్చాయి. కాని అతను అనారోగ్యం మాత్రం సరిపోలేదు. ఇంత మహత్కార్యం జరగుతున్నప్పుడు కూడా మునుపటి లానే ఆహారం తీసుకునేవాడు. 


ఇక చివరగా స్కాంద పురాణం పని మొదలుపెట్టగానే హఠాత్తుగా అందరిలాగే నోటితో తినడం మొదలుపెట్టాడు. అతని నాలుకకు రుచి తెలుసుకునే శక్తి వచ్చింది. ఈ జన్మలో జరగదు అనుకున్న వింత జరిగింది. ప్రతిరోజూ ప్రతిక్షణం అనుభవించిన బాధ స్వామి వారి అనుగ్రహంతో పోయింది.


నాకు ఆ విషయం తెలియగానే స్వామివారిని కలిసి, “స్వామివారి శక్తియే శక్తి. మీరు అనుగ్రహించిన వరం వల్ల సేఠ్ కి మళ్ళా పునర్జన్మ లభించింది. ఇది కేవలం మీ అనుగ్రహమే. మీరే అతణ్ణి కాపాడారు. మీరే భగవంతుడు” అని వారిముందు నిలబడి కన్నీళ్ళు కారుస్తున్నాను. 


అప్పుడు ఆ మహాశక్తి నాతో పలికిన మాటలు విని నాకు కళ్ళ ముందు భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నాను అని అనిపించింది. "మన దేశ ధర్మశాస్త్రాలకు ఉన్న శక్తి అతణ్ణి కాపాడింది. కాదా?" అని అన్నారు. 


నేను కాని, ఇంకెవ్వరూ కాని ఈ సంఘటనకు నేనే కారణం అని స్వామివారు చెప్పుకున్నట్టు ఎవరూ వినలేదు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన విన్నతరువాత పాశ్చాత్యులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు.


[పద్దెనిమిది పురాణాలను సులభంగా గుర్తు పెట్టుకోవడానికి ఈ శ్లోకం 


”మ” ద్వయం ”భ” ద్వయం చైవ “బ్ర” త్రయం “వ” చతుష్టయం |

“అ” “నా” “ప” “లిం” “గ” “కూ” “స్కా” ని పురాణాని ప్రచక్షతే || 


‘మ’ ద్వయం – ‘మ’ తో రెండు మత్స్య, మార్కండేయ

‘భ’ ద్వయం – ‘భ’ తో రెండు భవిష్య, భాగవతం 

’బ్ర’ త్రయం – ‘బ్ర’ తో మూడు బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త

‘వ’ చతుష్టయం – ‘వ’ తో నాలుగు వాయు, విష్ణు, వామన, వరాహ


‘అ’ ‘నా’ ‘ప’ ‘లిం’ ‘గ’ ‘కూ’ ‘స్కా’ – ఒక్కొక్కటి అగ్ని, నారదీయ, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణాలు] 


--- ముక్కూర్ శ్రీనివాస వరదాచార్యర్ స్వామిగళ్, అష్టలక్ష్మి దేవస్థానం, చెన్నై. “పరమాచార్యర్” పుస్తకం నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం