🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*గురువారం 12 ఫిబ్రవరి 2026*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
1️⃣3️⃣3️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*133 వ రోజు*
*వన పర్వము షష్టమాశ్వాసము*
*కృత్య దుర్యోధనుని పాతాళమునకు తీసుకువెళ్ళుట*```
రాత్రి అయ్యింది. దుర్యోధనుడి నిర్ణయం పాతాళవాసులైన దానవులకు తెలిసింది. వారు దేవతలచే ఓడించబడి పాతాళంలో ఉన్నారు. ఈ నిర్ణయం తమకు నష్టమని భావించి వారు దుర్యోధనుడిని తమ వద్దకు రప్పించుకోవాలని మంత్ర విశారదులైన బృహస్పతి, శుక్రాచార్యులు చెప్పిన మంత్రాలను తగిన విధంగా జపిస్తూ నిశ్చల దీక్షతో యజ్ఞం చేయగా ఆ అగ్ని హోత్రం నుంచి కృత్య అనే భయంకరా కారిణి ఉద్భవించి ‘నేనేమి చేయాలి?’ అన్నది.
అంత ఆ దైత్యులు సుయోధనుడిని పాతాళానికి తీసుకు రమ్మని పంపారు.
కృత్య సుయోధనుని పాతాళానికి తీసుకుని వచ్చింది.
దానవులు అతనిని కౌగలించుకుని కుశల మడిగారు. వారు
“సుయోధనా! శూరుడవై భరతకులోద్భౌడవైన నీవు ఇలా ఆత్మహత్యకు సాహసించడం తగునా. ఆత్మ హత్య చేసుకున్నచో లోకనింద, దుర్గతి, హీనత తప్పదు. నీ వంటి బుద్ధిమంతులకు ఇది తగదు. నీ నిర్ణయం మార్చుకుని ధైర్యమును, ప్రతాపమును చూపి శత్రువులను ఓడించు. నీ జన్మ వృత్తాంతం చెప్తాను వినుము. మేము పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా పరమేశ్వరుడు నిన్ను మాకు ప్రసాదించాడు. నీ శరీరం పైభాగం వజ్రసమానం. ఏ విధమైన అస్త్రములు దానిని ఛేధించలేవు. నీవు కారణ జన్ముడవు. నీకు సాయంగా అనేకమంది దానవులు క్షత్రియులుగా జన్మించారు. వారే భగదత్తుడు మొదలైన వారు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు దేవతాంశలతో జన్మించినా వారి భావనలో రాక్షసాంశ ఉండటం చేత యుద్ధంలో పుత్రులు, పౌత్రులు, మిత్రులు, వృద్ధులు, బాలురు, శిష్యులు అనే భేధం లేక పాండవ సైన్యాలను నాశనం చేస్తారు. అర్జునుడంటే భయపడుతున్నావు. ఏమి భయం లేదు. కృష్ణునిచే సంహరింపబడిన నరకాసురుని ఆత్మను కర్ణునిలో ప్రవేశపెట్టాము. కనుక కర్ణుడు శ్రీకృష్ణునిపై అర్జునిని పై పగబట్టి చంపగలడు. దేవేంద్రుని కుమారుడైన అర్జునిని రక్షించుటకు బ్రాహ్మణ వేషంలో కర్ణుని కవచకుండలాలను దానంగా గ్రహిస్తాడంటే అర్జునుడు కర్ణుని గెలవలేడనే కదా. లక్షల మంది రాక్షస వీరులు సంశక్తులు పేరున జన్మించారు. వారిచే అర్జునుడు ఓడింపబడతాడు. దైన్యం వీడి వెళ్ళు ఈ భూమండలాన్ని నీవు పాలించగలవు” అన్నారు.
కృత్య దుర్యోధనుని తిరిగి స్వస్థానంలో వదిలింది.
సూర్యోదయం కాగానే నిద్రలేచిన దుర్యోధనునికి రాత్రి జరిగినది కలో నిజమో అర్ధం కాకున్నా పాండవులను జయించ గలనన్న ఆత్మ విశ్వాసం కలిగింది.```
*సుయోధనుడు ప్రాయోపవేశ నిర్ణయాన్ని విడచుట*```
కర్ణుడు తిరిగి దుర్యోధనుని దగ్గరకు వచ్చి “సుయోధనా! చచ్చి సాధించేది ఏముంది. బ్రతికి ఉంటే శత్రువులను జయించి సమస్త సౌఖ్యములు పొందవచ్చు. అర్జునిని పట్ల నీకున్న భయం పోగొట్టుకో. అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగిసిన తరువాత నేను అర్జునిని సంహరిస్తానని ఈ ఆయుధంపై ఒట్టేసి చెప్తున్నాను” అన్నాడు.
రాత్రి రాక్షస వీరుల పలుకులు ఇప్పుడు కర్ణుని ప్రతిజ్ఞ దుర్యోధనునిలో కొత్త ఆశలు నింపగా ప్రాయోపవేశ నిర్ణయాన్ని నిలిపి హస్థినకు చేరాడు.
ఒక రోజు భీష్ముడు “సుయోధనా! పెద్దల మాటలు పెడచెవిన పెట్టి ఘోషయాత్రకు వెళ్ళి అవమానం పొందావు. చివరకు ధర్మరాజు వలన బయటపడ్డావు కాని లేకున్న గంధర్వుని చెఱలో మగ్గేవాడివి కదా. అయినా నువ్వు సిగ్గు పడవు. నువ్వు నమ్మిన కర్ణుడు నిన్ను రక్షించ లేదు, నిన్ను నీ తమ్ములను వదిలి పారిపోయాడు. అతని యుద్ధ నైపుణ్యం చూసావు కదా. పాండవులు పరాక్రమ వంతులు. వారి ముందు కర్ణుడు వీసమెత్తు కూడా చెయ్యడు. అతడు మాటల వీరుడు. నీమేలు కోరి చెప్తున్నాను కర్ణుని నమ్మి వంశనాశనం చేసుకొనక పాండవుల్తో సంధి చేసుకుని సుఖంగా ఉండు!” అని హితవు పలికాడు.
సుయోధనుడు భీష్ముని మాటలు లెక్క చేయక శకునితో కలసి నవ్వుకుంటూ వెళ్ళాడు.
భీష్ముడు అవమానంతో సిగ్గుతో కుదించుకుని పోయి తన నివాసానికి వెళ్ళిపోయాడు.
కర్ణుడు దుశ్శాసనునితో కలిసి శకునితో వున్న దుర్యోధనుడితో “భీష్ముడు ఎప్పుడూ మనలను నిందిస్తూ పాండవులను ప్రశంశిస్తూ వుంటాడు. అది నేను సహించలేకుండావున్నాను. నేను సేనను తీసుకుని నలుగురు పాండవులు కలిసి గెలుచుకున్న భూమండలమంతా నేను ఒంటరిగా గెలుచుకుని నీకు సమర్పిస్తాను. అప్పుడు నా బలాన్ని చూసి భీష్ముడు తనను తాను అసహ్యించుకుంటాడు నాకు అనుమతి నివ్వు” అనగా దుర్యోధనుడు పరమానందపడి కర్ణుడి యాత్రకు కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు.
కర్ణుడు సైన్యమును తీసుకుని మహా యుద్ధం చేసి పాంచాలరాజు ద్రుపదుడిని అతడి సామంతులను ఓడించి కప్పం కట్టించాడు. తర్వాత ఉత్తర దిక్కుగా ప్రయాణించి అనేక రాజులను, భగాదత్తుడిని ఓడించాడు. హిమాలయ పర్వత ప్రాంతీయులను ఓడించి కప్పం కట్టించాడు. తూర్పు దిక్కుగా వెళ్లి అంగ, వంగ, కళింగ, శున్దిక,మిధిలా,మగధ దేశాదీశులను ఓడించాడు. తర్వాత దక్షిణ దిక్కుగా వెళ్లి మహారధులు ఎందరినో ఓడించాడు. కేరళ రాజులను, నీల రాజులను మరెందరినో ఓడించి కప్పం గైకొన్నాడు. శిశుపాల సుతుడిని, అవంతీ రాజులను ఓడించి వృష్టి వంశస్తులతో చెలిమి చేసుకుని పశ్చిమ దిశగా ప్రయాణించి అనేక రాజులను ఓడించి హస్తినాపురానికి చేరుకొన్నాడు.
దుర్యోధనుడు ఎంతో ఆడంబరంగా కర్ణుడికి స్వాగతం పలికి పాండవులు, ఇతర రాజులూ నీముందు పదహారవ భాగానికి కూడా సరికారని ప్రశంశించాడు.```
*(సశేషం)*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి