*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*649 వ రోజు*
అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము
దేవతారాధన పూజకు తగిన పూలు
ధర్మరాజు " పితామహా ! దేవతలను దీప ధూప నైవేద్యములతో ఆరాధిస్తారు కదా ! ఆవిశేషములు ఏమిటో చెప్పండి " అని అడిగాడు. భీష్ముడుసువర్ణుడు అనే మహామునికి, సువర్ణుడు నారదుడికి, నారదుడు నాకు చెప్పారు. నేను ఇప్పుడు నీకు చెప్తాను. ఈ భూమిమీద ఓషధులు అత్యత్తమమైనవి. ఓషధీవృక్షాలలో పూలుపూసే చెట్లు ఇంకా ఉత్తమమైనవి. ఆ పుష్పములతో దేవతలను అర్చించిన మానవులకు శుభములు మనస్సు వర్ధిల్లుతాయి. అందు వలన పూలను సుమమనస్సులు అని అంటారు. పూలతో దేవతలను అర్చించిన దేవతలుహర్షించి మన కోరికలు తీరుస్తారు. అందువలన దేవతలను సుమమనస్కులు అని అంటారు. మంచిసువాసన కలిగి, మంచిరూపము కలిగి, తెలుపువర్ణము కలిగి ముళ్ళులేని చెట్లకు పూచినపూలు దేవతారాధనకు మేలైనవి. అటువంటి పూలను దేవతలు ప్రీతితో స్వీకరిస్తారు. తామరలు, సన్నజాజులు, తులసీదళాలు, దేవతలకు మిక్కిలి ఆనందాన్ని ఇస్తాయి. యక్షులకు నీటిలోపుట్టిన పూలు అధిక ఆనందం కలిగిస్తుంది. ముళ్ళ చెట్లకు పూసినవి, ఎర్రనివి, ఘాటైనవాసనకలిగిన పూలు శత్రువులను చంపడానికి అధర్వణ వేదములో చెప్పబడిన మంత్ర, తాంత్రిక పూజలు, ప్రయోగాలలో వినియోగిస్తారు. ఘాటైనవాసన కలిగిన పూలు రాక్షసులను, భూతగణములను ఆకర్షిస్తాయి. నలుపు, తెలుపు కలిగిన మంచి పరిమళాలను వెదజల్లు పూలు మానవులు ఇష్టపడతారు. దేవాలయములలో, పితృవనంలో పూసిన పూలను స్త్రీలు అలంకరించుకొన కూడదు. పూలవాసనతో దేవతలు, పూలనుచూసినంతనే యక్షులు, పూలవాసన ఆస్వాదిస్తూ సర్పములు ఆనందిస్తాయి. మంచిపూలతో దేవతలను అర్చించిన దేవతలు తృప్తిపొంది మానవుల కోరికలు తీరుస్తారు.
ధూపము
ఇక ధూపము గురించి చెప్తాను. సల్లకీ అనే చెట్టునుండి తీసినపొడితో వచ్చే ధూపము దేవతలకు ప్రీతి కరమైనది. అగరు ధూపము యక్షులకు, గంధర్వులకు నాగజాతికి ప్రీతికరమైనది. అన్నింటి కంటే శ్రేష్టమైనది కర్పూరముతో వేసే ధూపము. తియ్యనివాసన వచ్చే ధూపము దేవతలకు ప్రీతికరం. ఘాటైనవాసన వచ్చే ధూపం రాక్షసులకు ప్రీతికరం. కారమైన ధూపం అంటే కళ్ళ మండి నీళ్ళు వచ్చే ధూపము యక్షులకు ప్రీతికరం. కనుక దేవతలకు ప్రీతికరమైన వేసిన ధూపము మానవులకు పరమపుష్టిని ఆయుష్షును పెంచుతుంది. అలాగే యక్షులు, రాక్షసులు, నాగులు మానవులు వేసిన ధూపముతో తృప్తి చెంది వారి కోరికలను తీరుస్తారు. మంచిగంధము అగరు ధూపములు మానవుల మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి.
దీపారాధన
దేవతలను పూజించే సమయంలో దీపారాధన చేయాలి. దాని వలన అక్కడ ఉన్న భూతములు, రాక్షసులు మొదలైన కుత్సితమైన జాతులు పారిపోతాయి. దీపం వెలిగిస్తే బాహ్య అంతర చీకట్లు తొలగిపోతాయి. దీపారాధన వలన చీకట్లు తొలగి జ్ఞానజ్యోతి వెలుగుతుంది. మనసు ధర్మచింతన వైపు మరలుతుంది. ప్రమిదలో నెయ్యి తక్కువ ఉండకూడదు. వత్తి సన్నగా ఉండకూడదు. సగం సగం వెలిగించ కూడదు. దీపారాధన చేసిన చక్కటి వెలుగు రావాలి. చీకట్లు పూర్తిగా తొలగి పోవాలి. దేవుడి వద్ద ఉన్న దీపము దొంగిలించిన వాడికి కళ్ళుపోయి గుడ్డివాడు ఔతాడు. నలుగురు కూర్చొను చావడి లోను, కొండమీద, దేవుడిగుడిలో దీపము వెలిగించిన వాడు ఐశ్వర్యవంతుడు ఔతాడు. ఆవునెయ్యి దీపము ఆత్యంత శ్రేష్టము. తరువాత' బర్రె, మేకల నెయ్యితో కూడా దీపము పెట్టచ్చు. జంతువుల కొవ్వుతోను, ఎముకలరసము తోను, మాంసమురసముతో దీపము వెలిగించిన మహాపాపము. దీపములను దానం చేసిన వాడికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి