*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*644 వ రోజు*
అనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము
శునస్సఖుడు
ఇదంతా విన్న శునస్సఖుడు " ఈ తామరతూండ్లు దొంగకు ఇవ్వడం వేదవేదాంగములు చదివిన బ్రాహ్మణోత్తముడికి తనపుత్రికను దానం ఇవ్వడం వంటిది " అన్నాడు. ఆ మాటలకు అందరూ ఆశ్చర్య పోయారు. అదేమిటి నువ్వు ధర్మవచనాలు పలుకుతున్నావు. అంటే తామరతూడులు దొంగిలించినది నువ్వే అన్న మాట. ఆకలితో అల్లాడి పోతున్నాము. దయచేసి ఆ తామరతూండ్లు మాకు ఇవ్వు " అని అడిగాడు. శునస్సఖుడు " అయ్యా ! నిజం చెప్తున్నాను. ఈ తామరతూండ్లు కనిపించక పోతే మీరు ఏమి అనుకుంటారో అని తెలుసుకోవడానికి ఈ తామరతూండ్లను దాచి పెట్టాను. ఇవిగో తీసుకుని మీ ఆకలి తీర్చుకోండి " అని తాను దాచిన తామరతూండ్లను తెచ్చి ఇచ్చి " మహానుభావులారా ! మీ మీద కోపించి వృషాదర్భి మిమ్మల్ని చంపడానికి హోమం చేసి హోమగుండం నుండి కృత్తి అనే రాక్షసిని సృష్టించి మీ మీదకు పంపాడు. అది తెలిసిన నేను ఆ రాక్షసిని చంపాను. ఇక ఎందుకు దాపరికం నేను దేవేంద్రుడను. మీరంతా లోభత్వం వదలడం వలన మీకు పుణ్యలోకాలు సిద్ధించాయి. రండి పుణ్యలోకాలకు పోదాము " అని దేవేంద్రుడు సప్తఋషులను, అరుంధతిని పుణ్య లోకాలకు తీసుకుపోయాడు. ధర్మనందనా ! ఇదంతా వారు ఇతరులకు ఇచ్చినది పుచ్చుకొనక పోవడం, లోభం విడిచిపెట్టడం వంటి సద్గుణాల వలన జరిగింది. కనుక నీవు కూడా లోభమును విడిచి పెట్టు. ఒకరి సొత్తుకు ఆశించకు " అని భీష్ముడు చెప్పాడు.
పితృకార్యము గొడుగులు చెప్పులు
ధర్మరాజు " పితామహా ! పితృకార్యములలో గొడుగులు, చెప్పులు దానంగా ఇస్తారు కదా ! అలా ఎందుకు ఇస్తారు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఈ సందర్భంలో జమదగ్నికి సూర్యుడికి జరిన సంవాదం వినిపిస్తాను. ఒక సారి జమదగ్ని తన భార్య రేణుకాదేవితో కలిసి ఆశ్రమం వదిలి దూరంగా వెళ్ళి విహరించసాగాడు. అప్పుడు జమదగ్ని విల్లు పట్టుకుని ఉన్నాడు. రేణుకాదేవి అంబుల పొది పట్టుకుని ఉంది. జమదగ్ని ఆరుబయట బాణములు వదులుతున్నాడు. రేణుకాదేవి ఆబాణములు తిరిగి తెచ్చి జమదగ్నికి ఇస్తుంది. ఇలా మధ్యాహ్నం అయింది. సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చాడు. ఒక సారి రేణుకదేవి బాణములు తీసుకు రావడంలో ఆలస్యం జరిగింది. జమదగ్ని రేణుకాదేవిని చూసి " ఇంత ఆలస్యం జరిగిందేమి ? " అని అడిగాడు. రేణుకాదేవి " నాధా ఎండవేడిమి ఎక్కువగా ఉంది. అందుకని కొంతసేపు చెట్టునీడన నిలబడ్డాను. అందుకని ఆలస్యం అయింది " అని బదులు చెప్పింది రేణుక. జమదగ్ని కోపించి " ఏమీ ఆ సూర్యుడు నీకు తాపం కలిగించాడా ? ఉండు సూర్యుడికి తగిన బుద్ధి చెప్తాను. నా బాణములతో సూర్యమండలం కప్పి వేస్తాను " అని అన్నాడు. ఆ మాటలు సూర్యుడు విని బ్రాహ్మణ వేషంలో జమదగ్ని వద్దకు వచ్చి " అయ్యా సూర్యుడి మీద కోపం మానండి " అని వేడుకున్నాడు. జమదగ్ని " నువ్వు మాట్లాడకు పక్కకు పో నేను ఈ సూర్యుడిని కాల్చి వేస్తాను " అని అన్నాడు. సూర్యుడు " మునీంద్రా తాపసులైన మీరు కోపిస్తే ఎలాగా ! సూర్యుడి తాపము చేతనే కదా జలములు వేడెక్కి మేఘములుగా మారి వర్షరూపంలో లోకాలకు నీరు లభిస్తుంది. దానివలన మనకు ఓషధులు, పంటలు లభిస్తాయి కదా ! మరి సూర్యకిరణాలు తపించక పోతే ఎలాగ " అని అన్నాడు. అప్పటికి జమదగ్ని శాంతించ లేదు. సూర్యుడు నిజస్వరూపంతో జమదగ్ని ముందు నిలిచి " మునీంద్రా ! నా వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే క్షమించండి " అని వేడుకున్నాడు. ఆ మాటలకు జమదగ్ని శాంతించాడు. వెంటనే సూర్యుడు గొడుగు చెప్పులు సృష్టించి జమదగ్నికి ఇచ్చి " మహర్షి ఈ సాధనము ఇంతకు ముందు లేవు. ఈ గొడుగు వేసుకుంటే సూర్యతాపము సోకదు, ఈ చెప్పులు వేసుకుంటే ఎండవేడిమికి కాళ్ళు కాలవు. ఈ గొడుగును, చెప్పులను బ్రాహ్మణులకు దానంచేస్తే పుణ్యం లభిస్తుంది " అని అన్నాడు. ఆ వస్తువులను స్వీకరించిన జమదగ్ని సంతోషించాడు. ధర్మరాజా ! గొడుగు, చెప్పులు సూర్యుడి చేత సృష్టించబడ్డాయి. వాటిని దానంగా ఇస్తే పుణ్యలోకాలు లభిస్తాయి " అని భీష్ముడు చెప్పాడు
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి