🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*సోమవారం 25 మే 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
*99వ భాగం*
*శ్రీకృష్ణావతారము2*
*శ్రీకృష్ణ జననం*..```
భూదేవికి, బ్రహ్మాది దేవతలకు, మహర్షులకు అభయం ఇచ్చి పంపిన నారాయణుడు యోగమాయా దేవిని తలచాడు. యోగమాయ రాగానే “దేవీ! నేను భూలోకంలో వసుదేవుని పత్ని అయిన దేవకి గర్భాన అష్టమ పుత్రుడనై జన్మించాలని సంకల్పించాను. దానికి ముందు నీవు చేయవలసిన కార్యాలు ఉన్నాయి. చెబుతాను! విని ఆచరించు..
పాతాళ లోకంలో ‘తండ్రి చేతిలో మరణించాలని’ హిరణ్యకశిపుడి శాపంతో శాపగ్రస్తులైన కాలనేమి ఆరుగురు పుత్రులుగా జన్మించిన ఆత్మలను దేవకి గర్భంలో ఒకరి తరువాత ఒకరిని ప్రవేశపెట్టుము. ఈ జన్మలో వారు కంసుడిగా జన్మించిన కాలనేమి చేతిలో చంపబడి పుణ్యలోకాలు పొందుతారు. తరువాత సప్తమ పుత్రుడిగా ఆదిశేషుడు తన అంశను ప్రవేశపెడతాడు. ఆ సప్తమ గర్భపిండాన్ని దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టుము. ఆదిశేషుడు రోహిణికి సంకర్షణుడు అనే నామంతో జన్మిస్తాడు.
కంసుడు దేవకి సప్తమ గర్భం విచ్ఛిన్నం అయ్యింది అని భావించి అష్టమ గర్భము కోసం ఎదురు చూస్తాడు. నేను దేవకి అష్టమ గర్భంలో ప్రవేశించినప్పుడు నీవు నందుని భార్య యశోద గర్భంలో ప్రవేశించు! ఇక్కడ నేను పుత్రుడుగా, అక్కడ నీవు పుత్రికగా ఒకే సమయంలో జన్మించుదాం. వసుదేవుడు నా ఆదేశం పాటించి నన్ను యశోద దగ్గర ఉంచి నిన్ను దేవకి వద్దకు తీసుకు వస్తాడు.
నిన్ను కంసుడు చంపబోయే సమయంలో ఆకాశంలో యోగమాయగా కంసుని హెచ్చరించి అదృశ్యం అవ్వాలి. ఇక నుంచి భక్తజనులు నిన్ను దుర్గ అంబిక కాళి నామాలతో పాటు హరిసోదరిగా కీర్తిస్తారు" అని ఉపదేశించాడు.
యోగమాయ శ్రీహరిని స్తుతించి తన కర్తవ్య నిర్వహణలో నిమగ్నమయ్యింది. దేవకి గర్భంలో ప్రధమ పుత్రుడిని ప్రవేశపెట్టింది. పుట్టిన తరువాత వసుదేవుడు ప్రమాణం చేసినట్టు శిశువుని తీసుకెళ్లి కంసుడికి అప్పగించాడు. కంసుడు శిశువని చూడకుండా నిర్దాక్షిణ్యంగా సంహరించాడు. అలాగే తరువాత ఐదుగురు మగ బిడ్డలు పుట్టడం, వసుదేవుడు కంసునికి అప్పగించడం, కంసుడు సంహరించడం వరుసగా జరిగిపోయింది.
దేవకి ఏడవ సారి గర్భం ధరించింది. ఆరుగురు శిశువుల సంహారం విన్న రోహిణి ఒకసారి నందుని వెంట వచ్చి రహస్యంగా రాత్రి పూట దేవకి వసుదేవులను కలసింది. ఏకాంతంగా కొంత సమయం వసుదేవునితో గడిపి గోకులం వెళ్ళిపోయింది. యోగమాయ విష్ణువు ఆదేశం పాటించి దేవకి గర్భంలో ఆకారం దాలుస్తున్న ఆదేశేషుడి అంశను దేవకి గర్భం నుంచి తీసి గోకులంలో రోహిణి గర్భంలో ప్రవేశ పెట్టింది. దేవకి సప్తమ గర్భము పోయింది అని కంసుడు భావించాడు. అక్కడ గోకులంలో రోహిణి గర్భవతి అయ్యింది.
దేవకికి పుట్టబోయేవాడు అశరీరవాణి చెప్పినట్టు తనకు మృత్యువు నిచ్చే అష్టమ గర్భుడు అవ్వటంతో కంసుడు కారాగారం చుట్టూ భద్రత పెంచాడు. తనకు నమ్మకస్తులైన రాక్షస వంశజులను కాపాలాగా పెట్టాడు. దేవకి అష్టమ గర్భంలో మహావిష్ణువు అంశ, యశోద గర్భంలో యోగమాయ అంశ ఒకేసారి ప్రవేశించాయి. దేవకి అష్టమ గర్భం దాల్చింది అని తెలియగానే కంసునికి నిద్ర ఆహారాలు పోయాయి. అష్టమ పుత్రుడు పుట్టే క్షణం కోసం ఎదురు చూడసాగాడు.
కంసుడే కాదు, దేవతలు, మహర్షులు, కిన్నెర కింపురుషులు మొదలైనవారు ఊర్ద్వలోకాలవారితో పాటు సమస్త విశ్వము దేవకి ఎనిమిదవ పుత్రుని జననం కోసం ఎదురు చూడసాగింది. అందరు ఎదురు చూసే శుభ క్షణము రానే వచ్చింది. శ్రావణ బహుళ అష్టమి తిథి, అర్థరాత్రి, కృత్తికా నక్షత్రం. జగత్తుతో పాటు కారాగారం కాపాలా కాసేవారు నిద్రదేవి ఒడిలోకి వెళ్లి పోయారు.
ఆకాశంలో దేవతాగణాలు స్తుతిస్తుండగా, దేవదుందుభులు మ్రోగుతుండగా, గంధర్వులు గానం చేస్తుండగా, అప్సరసలు నాట్యం చేస్తుండగా, ఊర్ధ్వలోకాల వారు పూలు కురిపించడానికి సిద్దంగా ఉండగా దేవకీదేవికి సుఖ ప్రసవమైంది. చతుర్భుజుడిగా మహావిష్ణువు దేవకి గర్భం నుంచి శిశువుగా జన్మించాడు.
దేవకి వసుదేవులు జన్మించి అఖండమైన తేజస్సుతో చతుర్భుజుడిగా అవతరించిన కుమారుని చూసి ఆశ్చర్యానందాలు చెందారు. మహావిష్ణువు తన కుమారునిగా జన్మించాడని భావించారు. వారనుకున్నట్టే శ్రీమహావిష్ణువు శంఖచక్ర గదాపద్మాలతో వారి ముందు సాక్షాత్కరించాడు.
వారిరువురిని ప్రసన్న వదనంతో చూసి “దేవకి వసుదేవులారా! పూర్వజన్మలో మీరు తపస్సు చేసి నన్ను కుమారునిగా పొందాలని కోరుకున్నారు. అందుకే ఈ జన్మలో పుత్రునిగా జన్మించాను. నా అవతార రహస్యం ప్రస్తుతం మీరు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచండి” అని వసుదేవుని వంక చూసి..
“వసుదేవా! నీవు అత్యంత రహస్యంగా చేయవలసిన కార్యం ఉంది. నన్ను గోకులంలో యశోద చెంతకు చేర్చి, అక్కడ యశోదకు జన్మించిన ఆడపిల్లను తీసుకు వచ్చి దేవకి వద్ద పడుకోబెట్టుము. యోగమాయ స్వరూపమైన ఆ శిశువుకు ఏమీ జరగదు. భయపడకండి. నేను గోకులంలో పెరిగి సమయం వచ్చినప్పుడు మధుర వచ్చి కంసుని సంహరించి మిమ్మల్ని విడిపిస్తాను” అని చేయవలసిన కార్యం చెప్పాడు.
దేవకి వసుదేవులు మహావిష్ణువుకి ప్రణమిల్లి నమస్కరించారు. మహావిష్ణువు అదృశ్యమయ్యాడు. పుట్టిన పసి బాలుని చతుర్భుజాలు మాయమై మానవబాలునిగా ద్విభుజుడు అయ్యాడు.
వసుదేవుని సంకెళ్లు, కారాగారం తాళాలు, తలుపులు తెరచుకున్నాయి. కాపాలావాళ్ళు అందరు గాఢనిద్రలో ఉన్నారు. గాఢాంధకారంలో జగత్తు అంతా మునిగి ఉంది.
దేవకీదేవి తన కుమారుడిని ముద్దాడి, హృదయానికి హత్తుకుని వసుదేవునికి కన్నీళ్ళ స్రవిస్తుంటే ఇచ్చింది. వసుదేవుడు వెదురు తట్టలో పసిబిడ్డను జాగ్రతగా పడుకోబెట్టి, పైన ఉత్తరీయము కప్పి తలపైకి ఎత్తుకుని గోకులానికి బయలుదేరాడు.
*తరువాత కథ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి