25, మే 2026, సోమవారం

పోతనగారి పద్యరాజము🙏

 🙏పోతనగారి పద్యరాజము🙏


అమ్మలఁ గన్నయమ్మ,ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె

ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా

యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.... . . . భా-1-10-ఉ.




తాత్పర్యం

దుర్గాదేవి తల్లు లందరికి తల్లి సప్తమాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూల మైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురా లైన మహాతల్లి, రక్కసి మూకలను అడ్డగించిన యమ్మ, నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

వ్యాఖ్యానం

అమ్మల గన్న యమ్మని తలచి ప్రారంభించిన తెలుగీకరింపబడిన శ్రీమద్భాగవత రచన అజరారమరం, మధురాతి మధురం, మహా మహిమాన్వితం అయింది.

దుర్గమ్మని స్తుతించే ఈ మహాద్భుత పద్యం అమ్మ గురించీ అంటూ అడగటం మొదలు పెట్టడం ఆలస్యం మనసులో మెదులుతుంది. ఎంతటి పండితులైనా తలచుకోకుండా ఉండలేని మధురమైన పద్యం యిది. పోతన గారు తన యసమాన ప్రతిభతో అమ్మ అన్న తియ్యని పిలుపుని మహామంత్రంగా మలిచిన ఈ దుర్గాదేవి స్తోత్రం తెలుగువారికి అందిన అమూల్య వర ప్రసాదం. భక్తుడికీ, భగవంతుడికీ మధ్య దూరాన్ని చెరిపేసిన కమ్మటి ప్రార్థన. ఇలా "దుర్గ మాయమ్మ" అని ఆర్తిగా, ప్రేమగా పిలుచుకునే భావన్ని, భాగ్యాన్ని ప్రసాదించిన ఆ మహానుభావుడి పాదాలకు ఎన్ని శతకోటి వందనాలు చేసినా తక్కువే. ఎప్పుడో ఒకప్పుడు ఈ పదాలు నోట్లో మెదలని తెలుగువాడు ఉండడు. నిత్యపూజలో కాని ఏ శుభారంభంలో కాని ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని మంత్రాలు జపించినా “అమ్మ” పూజ మొదలెట్ట దగ్గది ఈ తియ్యటి పిలుపు లాంటి ఈ మహామంత్రం. సర్వ శుభాలని సకల విజయాలు సమకూరతాయి


ఆవిడ అమ్మల గన్న యమ్మ ముగు రమ్మల మూలపు టమ్మ – అవును అసలు స్త్రీ దేవత లంతా దుర్గనుండే పుట్టిన వారే. త్రిమూర్తుల భార్యలు లక్ష్మీ, సరస్వతీ, పార్వతులు ముగ్గురితో సహా సర్వులు దుర్గమ్మ అంశతో పుట్టిన వారే. అసలు ఈ సృష్టి మొత్తం స్త్రీ, పురుష లక్షణం కలదిగా విభాగింప దగ్గది. పురుష లక్షణం గల దేవత లందఱు విష్ణువునుండి గాని, శివుడినుండి గాని పుట్టినట్లు చెప్తారు. కాని కాళీ, దుర్గ, లలిత, మహేశ్వరి, పార్వతి, లక్ష్మి, సరస్వతి మొదలైన దేవతలు; వారాహి, చండీ, బగళా మొదలైన మాతలు; రేణుక ఇత్యాది శక్తులు; చివరకు గ్రామదేవతలు అంతా శ్రీమహాదుర్గా దేవతాంశ సంభూతులు గానే చెప్పబడతారు.


ఈ సర్వసృష్టి కూడా స్త్రీ నుండి సంభవిస్తోంది. పురుషుడు ప్రాణప్రదాత, స్త్రీ శరీరదాత్రి. ఈ కార్యకారణ సంఘాత మంతా పంచభూతాలనుండి పుడుతుంది. చేతన రూప మైన పురుషుడు ప్రధాన చైతన్యం యొక్క లక్షణం. అతడు పైనుండి నడిపేవాడు. కాని ఈ సృష్టి అంతా స్త్రీ స్వరూపం. అంతా ఒక ముద్ద. ఎక్కడ ఎప్పుడు ఎలా పుట్టినా పంచభూత సమాహార మై, పంచేంద్రియ లక్షణ భూత మై పుడుతోంది. (పంచభూతాలు = భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం. (పంచేంద్రియాలు = చూసే కళ్ళు, వాసనలు పీల్చే ముక్కు, రుచినీ తెలిపే నాలుక, శబ్దాలని వినిపించే చెవులు, స్పర్శని తెలియ జేసే చర్మం) ఈ ఐదిటి వల్లే మనోవికారాలన్నీ కలుగుతాయి. కాని జీవలక్షణం కలిగిన చైతన్యం ప్రతి జీవికీ భిన్నంగా ఉంటుంది. అది కర్మను పోగు చేసుకుంటూ ఉంది. బహుజీవులుగా పుడుతుంది, చస్తుంది, మళ్ళా జన్మిస్తుంది. కాని పంచభూతాలకి ఆ లక్షణం లేదు. అది సర్వదా ఒక్కటే శక్తి. రూపాన్ని బట్టి, దేశ కాల పరిస్థితులని బట్టీ భిన్న మౌతుంది, కాని చైతన్య స్వరూపాన్ని బట్టీ, కర్మని బట్టి మారదు. అదే మహాశక్తి. ఆమే దుర్గ. మాతృత్వ గుణానికి కారణ భూతురాలు.


ఆవిడ చాల పెద్దమ్మ. ఆమె సనాతని. ఇప్పటిది అని చెప్పలేము. ఎప్పటిదో కూడా చెప్పలేము. ఈ సృష్టి ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా ఆమె ఉంది.


ఆవిడ సురారు లమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ. ఈ రెండు పదాలూ కలిపి చదివితే ఒకలాగా, విడదీసి చూస్తే ఒకలాగా అర్థాన్నిస్తాయి. కలిపి చదివితే. (అ) రాక్షసులు (సురారులు దేవతల = శత్రువులు). వారి తల్లి దితి. వాళ్ళవల్ల ఆ తల్లికి కడుపు చేటు, బాధ. మరి ఆ రాక్షసుల్ని చంపి ఆ తల్లి కడుపాఱడి తీర్చింది అమ్మల గన్న యమ్మ దుర్గమ్మ. (ఆఱడి = గాయం, బాధ), (పుచ్చుట = మాన్పటం) ; (ఆ) విడదీసి చదివితే సురారు లమ్మ ఆ తల్లి దేవతలకే కాదు, రాక్షసులకి కూడా తల్లే మరి. మంచివాళ్ళకీ, చెడువాళ్ళకీ, ఈ సృష్టి అంతటికీ అమ్మే కదా. కడుపు ఆఱడి పుచ్చిన యమ్మ మనకి ఏ బాధ వచ్చినా, ఏ కష్ట మొచ్చినా కడుపులో ఆకలి తీర్చే తల్లిలా తీర్చ గలది, తీర్చేది ఆ అమ్మె (కడు = మిక్కలి).


ఆవిడ తన్ను లోనమ్మిన వేల్పు టమ్మల మనంబుల నుండెడి యమ్మ . తనని లోనుగా తలచెడి వారు (లోనమ్మిన) వేల్పు టమ్మలు = సర్వ దేవతా మూర్తుల యందు నిలిచి ఉండెడి మాతృతత్వం. సకల జీవులలోను ఉండే సహజ దయాస్వభావం. మాతృ దేవతలు. ఆ తత్వాన్ని వారి మనసులలో నిద్రలేపి అనుగ్రహం అందించే తల్లి ఆమె.


కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అలాంటి అమ్మవు, మా యమ్మవు నీవు మాకు సర్వ సంపదల్నీ (మహత్వం కీర్తి ధనం, విద్య కవితా శక్తి, పటుత్వం శక్తి సామర్థ్యాలు = సంపదలు అన్నీ) సముద్ర మంత కృపతో ప్రసాదించు తల్లీ.


అమ్మల గన్న యమ్మ అని ప్రార్థిస్తూ ఇలా ప్రారంభించిన భాగవత ఆంధ్రీకరణ అలా అత్యద్భుతంగా శాశ్వతత్వాన్ని సర్వామోదాన్ని అందుకుంది. మాతృత్వం అంత మధుర్యాన్ని అందుకుంది

విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియక కాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాన్ని ఇచ్చేస్తాయి. మంత్రంము, బీజాక్షర యుక్తముగా ఉంటే మనము, కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే లేదా గురుముఖతా ఉపదేశము పొంది ఉంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేము. ఉచ్ఛారణా దోషాలు లేకుండా జాక్షరములను ఉపాసన అందరూ చెయ్యలేరు . అది కష్టం. కానీ పోతనగారు ఈ దేశమునకు, మనకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.

""అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు.


అమ్మలగన్నయమ్మ’– అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు ? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. ’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపము బ్రహ్మాండములనన్నిటినీ సృజించి, ధరించి వ్యాపించి పోషించే బ్రమ్హాన్డభాన్డోదరి ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం, దయ, దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

అండపిండ బ్రహ్మాండములనన్నిటి యందు నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.

’సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.

’తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?

బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి

చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి

మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.

ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

 "రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతామ్ "",  

అని అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.

’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ, కవిత్వ, పటుత్వ, సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చేయ్యాలి.

అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.

ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ *’శ్రీమాత్రేనమః’*

మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా.

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ –అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు.

మీరు అస్తమాననూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.

ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు, లేదా గురువు ముఖతా ఉపదేశము లేదు కదా,,, 

కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ 

అనడానికి కష్టం ఏమిటి ?

ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి తెలుగు వారందరికీ ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి,, నిజానికి మనకాలానికి "బ్రహ్మర్షి "అందుకని మనకు ఈ పద్యమును అనుగ్రహించినారు.....


                 || ఓం శ్రీ మాత్రే నమః |

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: