175f4;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀9️⃣0️⃣
*శ్రీ మహావిష్ణు పురాణం*
➖➖➖✍️
90 వ భాగం
*ఋషభ అవతారం* ``` స్వాయంభువ మనువు తరువాత అతని కుమారుడు ప్రియవ్రతుడు భూమిని పరిపాలించాడు. ప్రియవ్రతుని పుత్రుడు అగ్నీధ్రుడు లక్ష సంవత్సరాలు జంబూద్వీపానికి రాజై పరిపాలించాడు. అగ్నీధ్రుని పుత్రుడు నాభి మహారాజై రాజ్యపాలన చేపట్టాడు.
నాభి విష్ణుమూర్తి వంటి కుమారుని పొందాలని తలచాడు. మహారాణి మేరుదేవితో కలసి విష్ణువు అనుగ్రహం పొందడానికి మహర్షులను ఋత్వికులుగా చేసుకుని పెద్ద యజ్ఞం చేశాడు. యాగం సమాప్తి సమయంలో విష్ణువు ఋత్వికులకు కనపడి "ఏ ఫలం పొందడానికి రాజు చేత ఈ యాగం చేయిస్తున్నారని" అడిగాడు.
ఋత్వికులు విష్ణువుని అనేక విధాలుగా స్తుతించి "నారాయణా! నాభి మహారాజు నీవంటి పుత్రుడు కావాలని
ఈ యజ్ఞం చేస్తున్నాడు. ఆయన కోరిక తీరేటట్టు చేయడమే ఈ యాగానికి ఫలము. ఆయనకు మీ వంటి పుత్రుని ప్రసాదించండి" అని ప్రార్ధించారు.
విష్ణువు చిరునవ్వుతో "ఋత్వికులారా! నాతో సమానమైనవాడు మరొకరు ఎక్కడ ఉన్నారు? లేరు కదా! కనుక నేనే మీ మహారాజుకి కుమారుడుగా జన్మిస్తాను" అని ఋత్వికులు చూస్తుండగానే మాయమై మహారాణి గర్భంలో ప్రవేశించాడు. నవమాసాలు నిండిన తరువాత మహారాణి తేజస్వి అయిన పుత్రునికి జన్మ నిచ్చింది.
నాభి మహరాజు రాజ్యమంతా ఉత్సవాలు జరిపి జాత కర్మలు ఘనంగా చేసి కుమారునికి "ఋషభుడు" అని నామకరణం చేసాడు. ఋషభుడు నారాయణాంశ సంభూతుడని బాల్యం నుంచి తన నడవడిక, ప్రవర్తనతో లోకానికి తెలియ జేశాడు. ఋషభునికి యుక్తవయసు రాగానే పట్టాభిషేకం చేసి నాభి మహారాజు భార్యతో వానప్రస్థానికి బదరికాశ్రమం చేరాడు. అక్కడే శేష జీవితం గడిపి స్వర్గస్థుడు అయ్యాడు.
ఋషభుడు విష్ణువాంశ అని తెలిసిన దేవేంద్రుడు వియ్యం కోరి జయంతిని అనే కన్యను తీసుకు వచ్చి కన్యాదానం చేసి వివాహం చేశాడు ఆ దంపతులకు భరతుడు మొదలైన నూరుగురు కుమారులు జన్మించారు. అంతవరకు "అజనాభం" అనే పేరు గల దేశానికి "భరత వర్షము" అని పేరు వచ్చింది.
మానవులందరికి ఆదర్శంగా నిలవాలని ఋషభుడు వేదోక్త కర్మలు చేయసాగాడు. బ్రాహ్మణులకు విధేయుడై గృహస్థాశ్రమంలో ఉంటూ అనేక యాగాలు చేశాడు. బ్రాహ్మణుల ఉపదేశం పాటించి ఒక్కొక్క క్రతువును నూరు సార్లు చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. ప్రజారంజకంగా పాలన చేసాడు.
తన పుత్రులలో వర్తుడు అని పేరు చివర పిలువబడే కుశావర్తుడు మొదలైన తొమ్మిదిమందిని వారి పేర్లతో పిలువబడే కుశావర్తం, ఇలావర్తం మొదలైన తొమ్మిది దేశాలకు రాజులను చేశాడు. కవి, హరి, అంతరిక్షుడు మొదలైన తొమ్మిదిమంది కుమారులు భాగవత ధర్మ ప్రకాశకులు, ప్రచారకులు అయ్యారు. మిగిలిన ఎనభై ఒక్కమంది శ్రోత్రియులు, యజ్ఞశీలురు, కర్మనిష్ఠులు అయిన బ్రాహ్మణోత్తములు అయ్యారు.
ఋషభుని పాలనలో ప్రజలందరు బ్రహ్మజ్ఞానం కలవారై ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తి లేకుండా జీవించ సాగారు. చాలా కాలం ప్రజారంజకంగా పాలన చేసిన ఋషభుడు సంసార బంధనాల నుండి విముక్తి పొందదలచాడు. బ్రహ్మావర్త దేశానికి మంత్రులతో వెళ్లి అక్కడి మహర్షులతో ఒక సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో తన నూరుగురు పుత్రులను ఉద్దేశించి
"కుమారులారా! నేను సంసార బంధనాల నుండి విముక్తి పొంది సన్యాస దీక్ష తీసుకోదలచాను. నాకు వారసులైన మీరందరు తపస్వులు, జ్ఞానులు, పెద్దలను సేవిస్తూ ఉండండి. దీనులను రక్షించండి. విషయాసక్తులు కాకండి. మనం చేసే కర్మలే మన పునఃజననానికి కారణం అవుతాయి. కనుక కర్మత్యాగం చేయండి.
సదా శ్రీహరిని ధ్యానిస్తూ పూజిస్తూ లౌకిక వాంఛలకు దూరంగా ఉండండి. మోక్ష మార్గం చూపని తండ్రి తల్లి గురువు బంధువు చివరికి దైవం కూడా మీకు హితులు కారు. మీ శ్రేయస్సు కోరి ఉపదేశం చేస్తున్నాను. నా తరువాత జేష్ఠుడైన భరతుని నన్ను గౌరవించినట్లే గౌరవించండి.
ఈ జంతు జీవ వృక్ష సృష్టిలో మానవులు శ్రేష్ఠులు. ఇంద్రాది దేవతలు మానవుల కన్నా శ్రేష్ఠులు. దేవతల కన్నా బ్రహ్మదేవుడు శ్రేష్ఠుడు. సృష్టిలో దేవాధిదేవుడైన శ్రీమహావిష్ణువు అందరి కన్నా శ్రేష్ఠుడు. అటువంటి శ్రీహరికి వేదనిరతులైన మునులు, బ్రాహ్మణులు అత్యంత ప్రియమైన వారు. కనుక వారిని మీరు గౌరవించండి. బ్రాహ్మణ పూజ వలన శ్రీహరి సంతృప్తి చెందుతాడు. విష్ణు ప్రియులైన బ్రాహ్మణులను, విష్ణుభక్తులను పూజించేవారు విష్ణుమాయను దాటి మోక్ష మార్గము చేరగలుగుతారు"
అని ఉపదేశించాడు. అవధూత మార్గం లోకానికి తెలియజేయాలని ఋషభుడు దిగంబరుడై అవధూతగా దేశ సంచారం చేస్తూ దక్షిణ దేశం వెళ్లాడు. అక్కడ దేహత్యాగం చేయాలని వనంలోకి అజగర వ్రతం పాటిస్తూ ప్రవేశించాడు. దైవ ప్రేరితమైన దావానలం వనాన్ని. దహించసాగింది. ఆ దావానలాగ్నిలో ఋషభుడు దేహత్యాగం చేశాడు.
మహావిష్ణువు యొక్క ఈ ఋషభావతారం రజోగుణ రహితులైనవారికి ధర్మమార్గం చూపించడానికి ఏర్పడింది. సకల వేదలోక దేవ బ్రాహ్మణులకు, గోవులకు పరమగురువు, భగవంతుడు అయిన ఋషభ చరిత్ర విన్నవారికి పాపచరిత్ర పోయి శుభము కలుగుతుంది.✍️
*[తరువాత కధ రేపటి భాగంలో చదువుకుందాం..
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..
సేకరణ:పెండ్యాల ఉపేంద్రరావు```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి