17, మే 2026, ఆదివారం

*సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*744 వ రోజు*

అశ్వమేధ పర్వము చతుర్ధాస్వాసం

చిత్రాంగద దుఃఖించుట

చిత్రాంగదకు అర్జునుడు, బభ్రువాహనుడు నేలకొరిగిన విషయము తెలిసి పరుగు పరుగున యుద్ధభూమికి తరలి వచ్చింది. ఉలూపీ కూడా యుద్ధభూమికి వచ్చింది. ఉలూపీణీ ఛుసిన చిత్రాంగద " ఉలూపీ ! నీ వలన ఎంత ఘోరము జరిగిందో చూసావా ! తండ్రి కొడుకులను యుద్ధానికి పురికొలిపిన ఫలితంగా వారిరువురు ఇలా అచేతనులయ్యారు. నీవూ పతివ్రతవు కాదా ! నీకు ధర్మము తెలియదా ! నీవు ఈ పసివాడిని తండ్రిమీద ఎందుకు యుద్ధానికి పురికొల్పావు. నీవె మనభర్త అర్జునుడిని పునరుజ్జీవితుడిని చెయ్యాలి. నీ వలననే ఈ ఘోరము జరిగింది కనుక అర్జునుడిని పునరుజ్జీవితుడిని చేయవలసిన బాధ్యత నీదే " అన్నది చిత్రాంగద. తరువాత చిత్రాంగద అర్జునుడిని చూసి " నాధా మహావీరా ! ఎందరి ప్రాణాలనో కాపాడిన నీవిలా నీ ప్రాణాలు కాపాడ లేక పోయావు. ప్రాణనాధా ! ఎన్ని రోజులైంది నిన్ను చూసి. కళ్ళు తెరచి చూడండి నేను మీ చిత్రాంగదను వచ్చాను. మీరు మీ అన్న గారి యాగాశ్వమును కాపాడాలి. లేవండి యాగాశ్వము వెంట వెళ్ళండి " అని శోకించింది చిత్రాంగద. మరలా ఉలూపిని చూసి ఇతడు మన ఇద్దరికి భర్త. నాకుమారుడి చేతిలోనే నా భర్త ప్రాణాలు పోయేలా చేసావు. నీవు ముందు నా భర్తను బ్రతికించక పోయినచో నేను ప్రాయోపవేశము చేస్తాను " అని దృఢంగా చెప్పింది.

బభ్రువాహనుడు విలపించుట

ఇంతలో మూర్చ నుండి లేచిన బభ్రువాహనుడు ఏడుస్తున్నా చిత్రాంగదను చూసి " అమ్మా ! నీవు శోకించడము నేను ఎన్నెడూ చూడ లేదు. ఇది కూడదు తగదు అని చూడక కన్నతండ్రిని యుద్ధములో చంపిన మహాపాపిని నేను. నా పాపానికి నిష్కృతి లేదు " అని తల్లి పక్కన కూర్చుని బభ్రువాహనుడు విలపించసాగాడు. ఇంతలో అక్కడకు వచ్చిన యాజ్ఞవల్క్య శిష్యులు మిగిలిన బ్రాహ్మణులు అక్కడకు వచ్చారు. వారిని చూసిన బభ్రువాహనుడు " అయ్యో ! ఈ బ్రాహ్మణులు అర్జునుడిని అనుసరించి వచ్చారు. ఇక్కడ అర్జునుడు విగతజీవుడై పడి ఉన్నాడు " అని శోకించసాగాడు. తిరిగి ఉలూపిని చూసి " అమ్మా ! నీ మాట మీద నిన్ను సంతోషపరచాలని కదా నా తండ్రి అర్జునుడితో యుద్ధము చేసాను. నా తండ్రి మరణానికి నేనే కారణమయ్యాను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ! తండ్రినిచంపిన నా పాపానికిక నిష్కృతిలేదు. నాకిక మనశ్శాంతి లేదు ఉత్తమలోక ప్రాప్తిలేదు " అని విలపించసాగాడు. తరువాత పైకి లేచిన బభ్రువాహనుడు తల్లి చిత్రాంగద అక్కడ చేరిన జనులు వినేలా " నా తండ్రి లేని లోకంలో నేనిక బ్రతుకలేను. నేనిక నా తండ్రితో కలసి ప్రాయోపవేశము చేస్తాను. వీరుడు, రాజు, ధార్మీకుడు, మీదు మిక్కిలి నా తండ్రి అయిన అర్జునుడిని చంపిన నాకిక ప్రాయోపవేశమే గతి " అని నేల మీద మౌనంగా కూర్చున్నాడు.



*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: