🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*బుధవారం 20 మే 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
*94వ భాగం*
*గయా శ్రాద్ధఫలం -*
*అశ్వత్థ(రావి చెట్టు) వృక్ష మహత్మ్యం*
```
తమపితృదేవతలకుపుణ్యలోకాలు ప్రాప్తి కలగాలంటే గయకు వెళ్లి శ్రాద్ధం పెట్టాలి. పూర్వపుణ్యఫలం ఉన్నవారు గయకు వెళ్లి పితృదేవ తలకు శ్రాద్ధం పెడతారు. వారికి కోటి జన్మల పుణ్యఫలం కలుగు తుంది అంటారు. అంతేకాదు గయలో శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించిన వారిపితృదేవతలు తప్పక వైకుంఠప్రాప్తిపొందుతారు.
గయలో పిండ ప్రదానం ఎవరికి పెడతారో వారు ఎటువంటి వారైనా మోక్షం పొందుతారు అని చెప్పడానికి ఒక కథ ఉంది.
పూర్వం కన్యాకుబ్జంలో చిత్రరథుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆతని భార్య పేరు చిత్రసేన. చిత్రరథుడు మహా ధనవంతుడు కావాలని అనేక పాప కార్యాలు చేసి ధనం, ఆస్తులు సంపాదించారు.. చిత్రరథుడు చేసిన పాపాలకు ఘోర వ్యాధికి గురి అయి చాలాకాలం బాధ పడి మరణించాడు.
యమభటులు అతనిని పాశాలతో కట్టి కొట్టుకుంటూ నరకలోకానికి తీసుకు వెళ్లారు. యముడు చిత్రగుప్తుని చిత్రరథుడు చేసిన పాప పుణ్యాల లెక్కలు అడిగాడు. చిత్రగుప్తుడు చిట్టా చూసి చిత్రరథుడు చేసినవన్నీ భయంకరమైన పాపాలే గాని పుణ్యం ఒక్కటి కూడా లేదని చెప్పాడు.
యమధర్మరాజా అతనిని చేసిన పాపాలు శిక్షగా కుంభీపాక నరకంలో వేసి ఘోరాతిఘోరంగా శిక్షించమని ఆదేశించాడు. యముడి ఆదేశం విని చిత్రరథుడు భయంతో వణికిపోతూ ఏడవ సాగాడు. చిత్రగుప్తుడు చూసి జాలిపడి "నీ కుమారులలో ఒకరు త్వరలో గయకు వెళ్లి శ్రాద్ధ కర్మలు చేస్తాడు. అప్పుడు నీకు కుంభీపాక నరకం నుండి విముక్తి లభిస్తుంది" అని చెప్పాడు.
భూమి పై ఒకరోజు చిత్రరథుని కుమారులలో పన్నెండేళ్ళ ఆఖరివాడు స్నేహితులతో ఆటపాటలలో మునిగి పోయి ఇంటికి భోజనానికి వెళ్లికుండా చాలా పొద్దుపోయిన తరువాత ఆలశ్యంగా ఇంటికి వచ్చాడు. వాడి తల్లి వాడిని నానాతిట్లు తిట్టి కర్ర తీసుకుని దేహశుద్ది చేసింది.
తల్లి మీద కోపం వచ్చి వాడు ఇల్లు, ఊరు వదలి వేసి పారిపోయి దేశమంతా తిరగసాగాడు. ఆ క్రమంలో అనేక తీర్థ స్థలాలు, పుణ్య స్థలాలు దర్శిస్తూ సేవిస్తూ మంచివాడు అయ్యాడు. దేశమంతా తిరుగుతూ గయ క్షేతం చేరాడు. అక్కడకు వచ్చిన వారు తమ పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయడం చూసాడు. తనూ గంగలో స్నానం చేసి పితృదేవతలకు శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మలు చేశాడు.
కుమారుడి గయలో చేసిన శ్రాద్ధకర్మల ఫలంగా, చిత్రరథుడు, అతని పితృదేవతలు కుంభీపాకం మొదలైన నరకాల నుంచి విముక్తి పొంది వైకుంఠ ప్రాప్తి పొందారు" అని గయ మహత్మ్యం చెప్పిన తరువాత సూత మహర్షి అశ్వత్థ వృక్ష మహిమ గురించి చెప్పారు.
*అశ్వత్థ వృక్ష మహిమ*
శ్రీమహావిష్ణువు లోకంలో ప్రజల పాపాలను నశింపచేసి ఉద్దరించడానికి వృక్ష రూపం దాల్చి వెలిశాడు. ఆ వృక్షమే అశ్వత్థ వృక్షము. ఆశ్వత్థ వృక్షాన్ని దర్శించినా, పూజించినా, ప్రదక్షిణం చేసినా, నీరు పోసినా పాపాలన్ని నశిస్తాయి. అంతేకాదు! ఇలా చేసినవారు మహావిష్ణువుని ప్రత్యక్షంగా సేవించిన పుణ్య ఫలం పొందుతారు.
అశ్వత్థ వృక్షము అనగా రావిచెట్టుకి నిత్యం నీళ్లు పోసి పూజించేవారు ధర్మ అర్థ కామ మోక్షాలు తప్పక పొందుతారు. చెట్టు చుట్టూ వేదిక కట్టించిన వారి సకల జన్మల పాపాలు నశిస్తాయి అంటారు. అశ్వత్థ వృక్షంలో శ్రీహారి సదా నివాసము ఉంటాడని పెద్దలు చెబుతారు. ఇందుకు నిదర్శనంగా ఒక పురాతన ఇతిహాసం ఉంది.
త్రేతాయుగంలో సౌరాష్ట్ర రాజ్యంలో ధనంజయుడు అనే బ్రాహ్మణులకు భిక్షాటనతో జీవన యాత్ర చేసేవాడు. అతని భార్య పేరు సుశీల. భార్యాభర్తలిద్దరు విష్ణుభక్తి పరాయణులు. పేదరికంలో ఉన్నప్పటికీ అతిథి అభ్యాగతులను తమ శక్తి మేరకు సేవించేవారు. భిక్ష దొరకని రోజు పస్తులుండి నారాయణ స్మరణ చేస్తూ గడిపేవారు.
చలికాలంలో సరియైన దుస్తులు లేనందు వలన భిక్షాటన తరువాత ధనంజయుడు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి ఇంటిలో మంట వేసుకుని దంపతులు చలి కాచుకునేవారు. ఒకరోజు భిక్షాటన చేసి ఆలస్యంగా రావడం వలన అడవికి వెళ్లే సమయం లభించలేదు. ఆ రాత్రి చలి బాగా ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక ఇంటికి ఎదురుగా ఉన్న రావిచెట్టు యొక్క ఎండిన కొమ్మను గొడ్డలితో కొట్టాడు.
రావిచెట్టు కొమ్మ నేల మీద పడగానే రావిచెట్టు నుండి శ్రీమహావిష్ణువు చతుర్భుజుడై శంఖ చక్ర గదా పద్మాలతో ధనంజయుడు ముందు ప్రత్యక్షమైనాడు. కానీ మహావిష్ణువు శరీరం నుంచి రక్తం కారుతోంది. ధనంజయుడు చూసి భయపడి గొడ్డలి వదిలేసి శ్రీహరి పాదాల పై పడి "నారాయణా! నా మీద దయతో దర్శన భాగ్యం కలిగించావు. కానీ ఈ రక్తం ఏమిటి? దేవాధిదేవుడవు! నిన్ను ఆయుధంతో ఎవరు గాయపరచగలరు?" అని దుఖిస్తూ అడిగాడు.
మహావిష్ణువు చిరునవ్వుతో "ధనుంజయా! నీ వన్నది నిజం! నన్ను ఏ శత్రువు గాయపరచలేడు. కానీ నా భక్తుడు చేసిన పని ఇది. తెలియక చేశాడు. అందుకే సహిస్తున్నాను. నేను ఈ అశ్వత్థ వృక్షంలో నివసిస్తూ ఉంటాను. నీవు గొడ్డలితో కొమ్మ నరికావు కదా! అందుకే గాయమై రక్తం కారుతోంది" అనగానే ధనంజయుడు శ్రీహరి పాదాలను కన్నీళ్లతో అభిషేకం చేస్తూ క్షమించమని ప్రార్ధించాడు.
శ్రీహరి ధనుంజయుని లేవనెత్తి "జరిగినదానికి దుఖపడకు ధనుంజయా! నా భక్తులు ఏమి చేసినా నాకు ప్రియంగానే ఉంటుంది. పైగా ఈ గాయం వలన నీకు నా దర్శనం లభించింది కదా! నీ భక్తి నాకు నచ్చింది. వరం కోరుకో! అనుగ్రహిస్తాను" అన్నాడు. ధనంజయుడు ధన సంపదలు కోరలేదు. "పరమాత్మా! సదా నీ పాదపద్మాలపై నాకు భక్తి ప్రపత్తులు ఉండేటట్టు అనుగ్రహించు!" అని కోరుకున్నాడు.
మహావిష్ణువు ధనుంజయుని నిర్మల భక్తికి ప్రసన్నుడై విశ్వకర్మను పిలిచి ధనంజయుడు నివసించడానికి భవ్యమైన భవంతి నిర్మాణం చేయించాడు. అనంత సంపదలు, సుఖభోగాలు ఇచ్చి మరణానంతరం వైకుంఠం ప్రాప్తి కలిగేటట్టు వరమిచ్చి అదృశ్యమయ్యాడు. ధనంజయుడు, సుశీల అశ్వత్థ వృక్షాన్ని నిత్యం నియమ నిష్టలతో పూజిస్తూ సంతానం పొందారు. సుఖ జీవితం గడిపి వైకుంఠం చేరి ముక్తి పొందారు.
కనుక అశ్వత్థ వృక్షము పరమ పూజనీయం. "మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శ్శివరూపాయ వృక్షరాజాయతే నమః" అని ధ్యానిస్తూ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేయాలి.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి