--------------------------భగవద్గీత. ------------------------
చతుర్దోధ్యాయః
జ్ఞాన కర్మ సన్యాస యోగము
శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి ।
శబ్దాదీన్విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ।। 26 ।।
ప్రతిపదార్థ:
శ్రోత్ర-ఆదీని — వినికిడి ప్రక్రియ వంటి; ఇంద్రియాణి — ఇంద్రియములు; అన్యే — ఇతరులు; సంయమ — నిగ్రహించి; అగ్నిషు — యజ్ఞాగ్నిలో; జుహ్వతి — సమర్పణ; శబ్ద-ఆదీన్ — శబ్దము మొదలైన; విషయాన్ — ఇంద్రియ తృప్తి నిచ్చే వస్తు-విషయములు; అన్యే — మరి కొందరు; ఇంద్రియ — ఇంద్రియముల; అగ్నిషు — అగ్నిలో; జుహ్వతి — సమర్పణ.
తాత్పర్యము :
మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియనిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు.
వివరణ:
అగ్ని అనేది తనలో సమర్పించబడిన వస్తువుల స్వభావాన్ని మార్చివేస్తుంది. బాహ్యమైన వైదిక కర్మకాండ యజ్ఞంలో, భౌతికంగా తనకు సమర్పించబడిన వాటిని అగ్ని భక్షించివేస్తుంది. అంతర్గత ఆధ్యాత్మిక సాధనలో అగ్ని అనేది సంకేతాత్మకమైనది. ఆత్మ-నిగ్రహం అనే అగ్ని, ఇంద్రియ వాంఛలను దహించివేస్తుంది.
ఇక్కడ, శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉన్న రెండు పూర్తి విరుద్ధమైన మార్గాల తేడాను వివరిస్తున్నాడు. ఒకటి, ఇంద్రియములను తిరస్కరించటం, ఈ పద్ధతిని హఠయోగ అభ్యాసంలో అనుసరిస్తారు. ఈ రకమైన యజ్ఞంలో, అత్యంత ఆవశ్యకమైన శరీర నిర్వహణకి తప్ప, మిగతా అన్ని ఇంద్రియముల క్రియలను ఆపివేస్తారు. సంకల్పబలంతో మనస్సుని పూర్తిగా ఇంద్రియముల నుండి వెనక్కి మరల్చి, అంతర్ముఖంగా ఉంచుతారు.
దీనికి వ్యతిరేకమైనది భక్తి యోగ అభ్యాసము. ఈ రెండవ రకమైన యజ్ఞంలో, ఇంద్రియములను, ప్రతి పరమాణువులో కనిపించే ఆ సృష్టికర్త యొక్క అద్భుతమైన కీర్తిని ఆరాధించటానికి వాడతారు. ఇంద్రియములు ఇక భౌతిక సుఖములు ఆనందించటానికి పనుముట్లగా వాడబడవు; సర్వత్రా భగవంతుని దర్శించటానికే అవి పరిష్కృతం చేయబడతాయి. 7.8వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు అంటాడు, ‘రసోఽహం అప్సు కౌంతేయ ’ అని, ‘అర్జునా, నీటి యందు రుచిని నేనే అని తెలుసుకో.’ ఈ ప్రకారంగానే, భక్తి యోగులు, అన్ని ఇంద్రియముల ద్వారా భగవంతుడిని దర్శించటానికే అభ్యాసం చేస్తారు.- చూసే, వినే, రుచిచూసే, భావించే, ఆఘ్రాణించే అన్నిటిలో కూడా. ఇటువంటి భక్తి యజ్ఞము హఠయోగ మార్గం కన్నా సులువైనది; పాటించటానికి ఆహ్లాదకరమైనది, మరియు ఈ మార్గం నుండి పతనమవటానికి తక్కువ అవకాశం కలది. ఒకవేళ ఎవరైనా సైకిలు తొక్కుతూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్ళటం ఆగటానికి బ్రేకులు గట్టిగా వేస్తే, వారు పడిపోయే అవకాశం ఉంటుంది; కానీ దీనికి బదులుగా సైకిలు తొక్కేవాడు తన హేండిల్‌ని కుడి పక్కకో, ఎడమ పక్కకో తిప్పితే, సైకిలు సునాయాసంగా ముందుకు వెళ్ళటం ఆగిపోతుంది మరియు సమతుల్యత తోనే ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి