26, నవంబర్ 2022, శనివారం

నా ప్రథమ దర్శనం

 నా ప్రథమ దర్శనం : శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి


నేను పరమాచార్య స్వామివారిని, పుదు పెరియవాను వారివురు సతారాలో మకాం చేస్తున్నప్పుడు చూశాను. ఒకరోజు సాయంత్రం దీపా నంస్కారం ఏర్పాటు చేశారు. పాదుకలకు ఒక ఏనుగు చామరం వీచింది. ఆ ఏనుగు నిలబడ్డ చోటు కాస్త వాలుగా ఉండడంతో, ఏనుగు వెనుక కాళ్ళు కాస్త జారడంతో అది పెద్ద ఎత్తున శబ్ధం చేసింది. అప్పప్పా! అందరూ భయకంపితులయ్యారు. నేను వొణికిపోయాను.


మరొకరోజు మహాసవామి వారు ఒక మూలన కూర్చున్నారు. పుదు పెరియవా హాలు మధ్యలో కూర్చుని ఉపన్యసిస్తున్నారు. హఠాత్తుగా ఉపన్యాసాన్ని ఆపి, లోపలకు వెళ్ళిపోయారు. అలా ఎందుకు వెళ్లిపోయారో నాకు అర్థం కాలేదు. కొద్దిసేపటి తరువాత మహాస్వామి వారి ఆజ్ఞమేరకు లోపలకు వెళ్లారు అని ఎవరో చెప్పగానే కారణం అర్థం అయ్యింది కాని, అది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది.


పరమాచార్య స్వామివారు చంద్రమౌళీశ్వర పూజ చేసేటప్పుడు నేను దగ్గరగా కూర్చుని పూజ చూసేవాడిని. ఒక అబ్బాయి, స్వామి నైవేద్యానికి కొబ్బరికాయ కొట్టడం, దీపంలో నెయ్యి వెయ్యడం వంటివి చేస్తుండేవాడు. అతను చేస్తున్న పనులన్నీ నేను శ్రద్ధగా గమనించేవాణ్ణి.


తరువాత నాకు ఒకసారి అవకాశం వచ్చింది. గుల్బర్గలో మహాస్వామి వారిని దర్శించుకున్నాను. అంత పెద్ద వయస్సులో కూడా స్వామివారు అంత వేగంగా నడవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. గుల్బర్గా నుండి బ్రహ్మపురి పనప్పూరి అనే చోటుకు గుర్రపు బగ్గీలో వెళ్ళాను. అక్కడ ఉన్న శివాలయంలోని శివుని పేరు పాతాళేశ్వరుడు. పూజ సమయంలో అక్కడ నన్ను రెండురోజులు ఋగ్వేదం పఠించమని చెప్పారు. నేను పఠించాను, తరువాత అడుగగా తొట్టకాష్టకం కూడా చదివాను. ఒకరోజు కొందరు భక్తులు మహాస్వామి వారి వద్దకు వచ్చి వెల్లూరు జలకంఠేశ్వర స్వామి ఆలయ కుంభాభిషేక పనుల గురించి చర్చిస్తున్నారు.


అప్పట్లో నేను పరమాచార్య స్వామివారు చేసే దండ తర్పణాన్ని, అనుష్టానాన్ని సునిశితంగా గమనించేవాణ్ణి. ఆ సమయంలో స్వామివారు కొన్ని మంత్రాలు చదివేవారు. గంటసేపు కళ్లుమూసుకుని స్వామివారు చేసే జపం చూడడం నాకు చాలా అద్భుతంగా తోచేది. వేద పారాయణం చేసే వారికి ఎవరైనా ధనం ఇవ్వడం. ఇవన్నీ చూడడం నాకు చాలా కొత్తగా ఉండేది.


ఒకరోజు ముసలాయన ఒకరు వచ్చి పరమాచార్య స్వామివారు నన్ను పిలుస్తున్నారని చెప్పారు. అప్పుడు స్వామివారు ఒక ఫర్లాంగు దూరంలో ఉన్నారు. నేను అక్కడకు వెళ్ళాను. స్వామివారు నాకు ఒక పుస్తకాన్ని ఇచ్చారు. అది తైత్తరీయ మంత్రకోశం. తన పక్కన కొర్చోమని చెప్పారు. స్వామివారు పుస్తకంలో పేజీలను తిప్పుతున్నారు. తరువాత ఎడమవైపున ఉన్న ఒక పేజీలోని చివరి అయిదు లైన్లు చదవమన్నారు. తరువాత “శ్రియేజతం”తో మొదలయ్యి, “య ఏవం వేద”తో అంతమయ్యే మంత్రాన్ని అయిదు సార్లు చదవమన్నారు. నేను అలాగే చేశాను. “సమిత మిత మితత్రాన్” అని అంతమయ్యే భాగం ఆ పుస్తకంలో ఎక్కడ ఉందో చూడమన్నారు. నేను సరిగ్గా చెప్పగానే, స్వామివారు ఋగ్వేదము, ఐతరేయ బ్రాహ్మణము పుస్తకాలను అడిగారు. అవి రాలేదు. అప్పుడు నేను స్వామివారితో, “నేను విద్యారణ్య భాష్యం చదివానట్టుగా నాకు గుర్తు. తండలంలో ఒకరి వద్ద తెలుగు ప్రతి ఉండడంతో నాకు వీలు కుదిరినప్పుడల్లా వారి వద్ద నేర్చుకునేవాణ్ణి” అని చెప్పాను.


కొద్దిసేపటి తరువాత స్వామివారు నాతో, “ఈ మంత్రంలో “వశత్కృత్యమ్ సంతత్యం” లేదా “వశత్కృత్యాయి సంత్యాయి” అన్నదాంట్లో ఏది సరైనది?” అని అడిగారు. రెండవదే సరైనదని నేను చెప్పాను. తరువాత నన్ను తత్వశాస్త్రం చదవమని, తెలుగు భాష చదవడం, వ్రాయడం నేర్చుకొమ్మని కూడా చెప్పారు.


ఒకరోజు మ్హాస్వామివారు పాతేళేశ్వర దేవాలయంలో ఒక చిన్న స్థలంలో కూర్చున్నారు. ఋగ్వేద పరీక్షకోసం పదమూడు మంది విద్యార్థులు ఉన్నారు. నన్ను రమ్మనడంతో నేను అక్కడకు వెళ్ళాను. నాకు ఒక పుస్తకాన్ని ఇచ్చి చివరి పేజీలో ఒక మంత్రాన్ని వ్రాయమని చెప్పారు. ఏ మంత్రం రాయాలో నాకు తోచక నేను మిన్నకుండిపోయాను. పుదు పెరియవా తరచుగా నన్ను దీపారాధన మంత్రాన్ని చెప్పమని ఎన్నోసార్లు అడిగేవారు. నేను ఆ మంత్రాన్ని చెబుతున్నప్పుడు స్వామివారు నన్ను ఆసక్తిగా గమనించేవారు. ఇప్పుడు ఇలా దాన్ని చదివి వ్రాయమని చెప్పారు మహాస్వామి వారు. పుదు పెరియవా స్వామివారికి నా గురించి ఏమీ చెప్పలేదు. నేను తురీయాశ్రమంలోకి వచ్చిన తరువాతనే ఈ సంఘటన యొక్క ప్రాముఖ్యం నాకు అవగతమైంది.


1983 మేలో ఒకరోజు నన్ను పరమాచార్య స్వామివారి సన్నిధికి తీసుకునివెళ్లారు. అప్పుడు స్వామివారు మహబూబ్ నగర్ లోని ఒక కాటన్ మిల్లులో మకాం చేస్తున్నారు. నేను సన్యాసాశ్రమం తీసుకోవాల్సిన రోజు దగ్గర పడుతోంది. నన్ను అక్కడకు తీసుకునిరావడానికి గల కారణం తెలిసిన కొందరు అన్నీ సకల మర్యాదలతో స్వామివారి వద్దకు తీసుకునివెళ్లారు. అప్పుడు పరమాచార్య స్వామివారు, చుట్టూ ఉన్నవారితో ధర్మశాస్త్ర కోవిదులైన పోలగం సుందర శాస్త్రి గారి గురించి మాట్లాడుతున్నారు. నేను అప్పుడు దర్శనానికి వచ్చిన విషయం గురించి తెలిపారు. నేను అక్కడి నుండి హైదరాబాదుకు తరువాత తిరుపతికి వెళ్ళాలి. అది ఆలోచిస్తూ స్వామివారి అనుగ్రహం కోసం స్వామి వారివైపు చూస్తూ నిలబడ్డాను. తరువాత ఆచార్యులవారు కూడా నావైపే చూశారు. తరువాత నేను బయలుదేరాను.


తరువాత నాకు తెలిసిన విషయం, త్వరలోనే నీవు మువ్వురు ఆచార్యులను చూస్తావు అని స్వామివారు అక్కడున్న ఒక భక్తునితో అన్నారు.


మా పరమాచార్య స్వామివారు సత్యసంధులు. వారి జ్ఞాపకశక్తి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సర్వజనులను ఆదరించడంలో స్థిరచిత్తులు. వారిని ద్వేషించేవారికి కూడా సహాయం చెయ్యడం, సహాయం చేస్తున్న వారిని అభినందించడం వారికి అత్యంత ఆనందదాయకం. వర్ణాశ్రమ పరిరక్షణ, సామరస్యం మెండుగా కలవారు. విద్యాసక్తులు, సూక్ష్మ వివేచన గలవారు. ఇతరులకు బోధించిన రీతిన వారు సంచరిస్తారు. వారిని వరదలను నివారించే ఒక ఆనకట్టతో పోల్చవచ్చు.


--- మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సాకారం - నిరాకారం

 సాకారం - నిరాకారం

****🙏🏻🙏🏻******


భగవంతుని విగ్రహం ముందుకు వెళ్ళగానే నమస్కారం పెట్టడానికి రెండు కన్నులు మూసుకుంటాం... ఎందుకు....???


కొందరు భగవంతుని ఉపాసనను ఒక విగ్రహాన్ని ముందుంచుకొనో, ఒక పఠాన్ని పెట్టుకొనో చేస్తారు.

అంటే ఒక రూపాన్ని దర్శిస్తూ చేస్తారు. ఇలా చేయటంలో ఆ విగ్రహమే పరమాత్మ అనే భావం అనుకోకుండానే వచ్చేస్తుంది. ఆ విగ్రహాన్ని భగవంతునిగా భావించి సేవలు చేస్తారు.

ఎలాంటి భావం వస్తుందనో ఏమో.. భగవంతుని విగ్రహం ముందుకు వెళ్ళగానే నమస్కారం పెట్టడానికి రెండు చేతులు జోడించటంతో బాటు రెండు కన్నులు మూసుకుంటాం. ఎందుకు... నిజంగా భగవంతుడు ఆ విగ్రహం కాదు, ఆయన నీలోనే ఉన్నాడు.

కన్నుల ముందున్న విగ్రహాన్ని గాక నీలోనే ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి, గ్రహించటానికి కన్నులు మూసుకొని బుద్ధిని(జ్ఞాననేత్రాన్ని) తెరువు అని చెప్పటమే...


మనం కొలిచే రూపమే పరమాత్మయనే నమ్మకం ప్రబలటంతో కొన్ని రూపాలను ద్వేషించే స్థితి కూడా వస్తుంది. మూఢత్వం పెరిగిపోతున్నది. నిజంగా పరమాత్మకు ఆకారం లేదు. రూపం లేదు. అది నిరాకారం. నిరాకార తత్త్వాన్ని కన్నులు చూడలేవు కనుక కన్నులు చూడగల రూపాన్ని కన్నుల ముందుంచుకొని ఉపాసన చెయ్యటం ఒక ఉపాయంగా మనకు పురాణాలలో సూచించారు....


కాని ఎల్లకాలం అదే పట్టుకు ప్రాకులాడ కూడదు, మనం నదిని దాటటానికి పడవను ఏర్పాటు చేశారు.

కాని ఎల్లకాలం ఆ పడవను మనతో తీసుకు వెళ్ళాలనుకో రాదు. నది దాటేంత వరకే దాని అవసరం, అలాగే నిరాకార నిర్గుణ పరమాత్మ తత్త్వాన్ని గ్రహించేంత వరకే ఈ సాకారోపాసన చెయ్యాలి గాని అదే లక్ష్యంగా చెయ్యరాదు.

నీ దృష్టి విగ్రహం మీద నుండి నిరాకార పరమాత్మ వైపుకు మళ్ళాలి.


వినాయకచవితి నాడు నిరాకారమైన మట్టికి ఒక ఆకారం కల్పిస్తాం. ఆ విగ్రహాన్ని పత్రితో పూజిస్తాం, మరునాడు జలధిలో కలుపుతాం. ఎందుకు... నిరాకార తత్త్వాన్ని సాకారం చేసి పూజించి, తిరిగి నిరాకారంగా మార్చేందుకే. నిరాకారమే నిత్యం, సత్యం...


సేకరణ...

శివుడికి జలుబు చేసింది*

 

*శివుడికి జలుబు చేసింది*


నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా. కనీసం మాతో మాట్లాడే టైమ్ కూడా లేదు నెల నుంచి. అంతలో ఏమైంది? అడుగు తూనే చెయ్యి పట్టుకుని చూసింది పార్వతీ దేవి. కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది. జలుబు తో వణికి పోతున్నాడు శివుడు.😖😞😤


నెల రోజుల బట్టి మొత్తుకుంటున్నా! చెబితే విన్నారు కాదు. ఏదిబడితే అది. పండా, కాయా, రేషన్ చెక్కరా, కల్తీ తేనె....ఏమీ చూడకుండా.. అభిషేకాలు చేయించుకున్నారు. ఇప్పుడు అవస్థ పడుతున్నారు..🤨😙


పాపం భక్తులు.... ప్రేమతో పోస్తున్నారు కదా అని........ఏమీ అనలేకపోయాను.😌


"భక్తులు ప్రేమతో కాదు. TV ఛానెళ్లల్లో ఏది చెబితే అది పోస్తున్నారు. వింటుంటే నాకే భయమేస్తుంది. ఒక్కొక్క పండుకి ఒక బెనిఫిట్ ఇస్తారట గా మీరు? నవ్వుతూ అంది అమ్మవారు.


" నేనెప్పుడూ ఆ మాట చెప్పలేదు. భక్తి తో నన్ను తలుచుకుంటే చాలు. ఈ స్కీం లు నావి కావు. అప్పటికీ చాగంటి చేత, గరికపాటి చేత చెప్పిస్తున్నా ఎవ్వడూ వినిపించుకోవట్లేదు.😟😟


"కనీసం కన్నెర్ర చేయొచ్చు కదా."


'ఆ పని కూడా చేశా. కళ్ళల్లోకి పోయి ఇంకాస్త మండుతున్నాయి.' ఇంకా వణుకుతూనే అన్నాడు శివుడు.


"సర్లేండి. ఈ కషాయం తాగండి".  ఇచ్చింది పార్వతి.


ఇదంతా చూస్తున్న నారదుల వారు, వెళ్లి వైకుంఠంలో చెప్పాడు.


వెంటనే TV ఆన్ చేసిన అమ్మవారికి...షాక్ తగిలింది. విశాఖ, కనక మహాలక్ష్మి గుడి చూపిస్తున్నారు. పాలప్యాకెట్లు, కుంకుమ పొట్లాలు అమ్మవారి మీద కు *భక్తి* తో విసిరేస్తున్నారు. పాపం అది చూసి అమ్మవారు ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అసలే చలికాలం.


అది చూసి, విష్ణువు పకపకా నవ్వసాగాడు.


" మరీ సంబర పడిపోకండి. ధనుర్మాసం కూడా వస్తుంది. మాకూ నవ్వే అవకాశం వస్తుంది"అంటూ, ఎందుకైనా మంచిది ఆ కషాయం కొంచెం మనకు కూడా ఉంచమని చెప్పు నారదా అంది మహాలక్ష్మమ్మ.


భక్తి తో...🙏

25, నవంబర్ 2022, శుక్రవారం

క్రమశిక్షణ లేకపోతే ఎలా

 డు,ము,వు,లు ప్రధమా విభక్తి,

నిన్,నున్,లన్,కూర్చి, గురించి......ద్వితీయా విభక్తి.


తెలుగు మాస్టర్ గారి పాఠం సాగిపోతోంది. సూది మొన పడినా వినపడేంత నిశ్శబ్దం క్లాస్ రూమ్ లో. తెలుగు మాస్టర్ గారంటే ఆ క్లాస్ కే కాదు, స్కూల్ మొత్తం భయం. క్రమశిక్షణకు మారుపేరు మాస్టారు. అల్లరి చేసిన వాడి వీపు వంచి గుల్ల దెబ్బ ఒక్కటి వేసేరంటే చాలు, స్కూలు మొత్తం వినపడేది. ఆ శబ్దానికే పిల్లలకు చచ్చేంత భయం.కర్ర విరగాకూడదు, పాము చావాకూడదు అనేది ఆయన సిధ్ధాంతం.దెబ్బ తగిలేదు కాదు కానీ, ఆ శబ్దానికే బిక్క చచ్చి పోయేవారు కుర్రాళ్లంతా. 

 

నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరిపడతది.....

నేను ఈల వేస్తే గోలకొండ అదిరిపడతది....... 

దివికి దివికి దిమాడి.....గుబుకు గుబుకు గుమాడి.....దివికి దివికి దిమాడి ....గుబుకు గుబుకు గుమాడి.......

అంటూ పెద్దగా ఈల వేసుకుంటూ,ప్లే గ్రౌండ్ లో వున్న ఉసిరి చెట్టెక్కి కోసిన ఉసిరికాయలు ఒక ముచ్చికవర్ లో వేసుకుని, క్లాస్ రూమ్ లోకి అప్పుడే ఎంటర్ అయిన శీను గాడు. 


పాఠం చెబుతున్న తెలుగు మాస్టర్ గారిని చూసి గతుక్కు మన్నాడు. భయంతో బిక్క చచ్చిపోయేడు. వాడిపై ప్రాణాలు పైనే పోయేయి. తెలుగు మాస్టర్ గారు ఆరోజు సెలవు, స్కూల్ కి రారు అనుకున్న శీను గాడికి పాపం మాస్టర్ గారు లీవ్ క్యాన్సల్ చేసుకుని క్లాస్ కి వచ్చేరన్న విషయం తెలీదు. ఎంచక్కా తెలుగు పీరియడ్ ని ఉసిరి కాయలకోసం కేటాయించుకున్నాడు. 


ఒరేయ్..ఇలా రారా!మాస్టారి కళ్ళు చింత నిప్పుల్లా వున్నాయి. 

భయంతో ఉసిరికాయలన్నీ అక్కడే కిందన పడేసాడు. 

పిల్లలంతా ఒకింత భయంతోనూ, ఒకింత 

ఆతృతతోను చూస్తున్నారు , ఏం జరగబోతుందా అని. 


అంతలోనే ధామ్...ధామ్  అంటూ గట్టిగా రెండు శబ్దాలు వినపడే సరికి శీను గాడి పని అయిపోయిందివాళ అనుకున్నారంతా. 


వెధవా......నీ తల్లి, తండ్రి అంతంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తుంటే,  నువ్వు చేసే ఘన కార్యం ఇదా? చదువు లేకపోయినా ఫర్లేదు, క్రమశిక్షణ లేకపోతే ఎలా? పెద్దయ్యాక ఏం సాధిద్దామని? అంట్లు  తోముకుని బతుకుదామని అనుకుంటున్నావా? మాస్టర్ గారి తిట్ల సునామీ కి అడ్డుకట్టలేదు. అంత కోపం అతనిలో మునుపెన్నడూ చూడలేదు ఎవరూ. పిల్లలు క్రమశిక్షణ లేక చెడిపోతున్నారన్న బాధ, ఆయన కళ్ళల్లో రౌద్రమై తాండవిస్తోంది. శీను గాడు అది చూసి తట్టుకోలేకపోయేడు. ఒహటే ఏడుపు. 


ఇంతలో మిగిలిన క్లాస్ టీచర్స్, హెడ్ మాస్టర్ గారు వచ్చి తెలుగు మాస్టర్ గారిని శాంతింప చేయడంతో పరిస్థితి కుదుటపడింది. 


తుఫాన్ తరువాత ప్రశాంతత ఎలా ఉంటుందో ఆ క్లాస్ 

రూమ్ ని చూస్తే అర్ధం అవుతుంది. కానీ ఈ సంఘటన తరువాత మాస్టర్ గారు అన్యమనస్కంగా వున్నారు. మిగిలిన పాఠం చెప్పే మూడ్ లేక,పిల్లలికి ఏదో వర్క్ ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయేరు. 


ఈ ఘటన జరిగి చాలా రోజులైనా, శీను గాడికి మాత్రం మాస్టర్ గారిపై కోపం తగ్గలేదు. ఆయన అంటే బాగా అయిష్టం పెంచేసుకున్నాడు. అతనికి కనిపించకుండా తిరుగుతూ జాగ్రత్త పడుతుండేవాడు. ఏదో విధంగా టెన్త్ పరీక్షల్లో పాస్ అనిపించుకుని, స్కూల్ చివరి రోజున కూడా మాస్టర్ గారికి కనిపించకుండా, కనీసం పలకరించకుండా వచ్చేశాడు. 


ఆ తరువాత శీను వాళ్ళ నాన్న గారికి వేరే వూరు బదిలీ అవడంతో,ఆ వూళ్ళో కాలేజీలో చేరిపోయేడు.


రోజులు గడిచి పోతున్నాయి. క్యాలెండర్లు మారిపోతున్నాయి. అవి రోజులా....లేక కళ్ళాలు లేని గుర్రాలా అన్నట్టున్నాయి. 


తెలుగు మాస్టారి చిన్న అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. తను పనిచేసే రోజుల్లో యేవో లోన్లు అవీ పెట్టి మెల్లగా పెద్దమ్మాయి పెళ్లి చేసేరు. ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లి కోసం,తను జాగ్రత్త చేసి కొనుక్కున్న కొంత భూమిని అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు.


కానీ తను, తనతో పాటు కొంతమంది కలిసి కొన్న ఆ జాగా వున్న ఏరియాలో యేవో కొన్ని వివాదాల కారణంగా భూమిని అమ్మడానికి ప్రభుత్వ పరంగా కొన్ని అడ్డంకులు వున్నాయి. ఆ అడ్డంకులు తొలిగితే కానీ తాను అమ్మే పరిస్థితి కానరాకపోవడంతో, తెలిసిన వ్యక్తుల సలహా మేరకు జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే పని జరగొచ్చు అని చెప్పడంతో కలెక్టర్ ని కలవడానికి అప్పోయింట్మెంట్ తీసుకున్నారు మాస్టర్ గారు. 


అబ్బే.....కుదరదండి.రూల్స్ ఒప్పుకోవు. ఇప్పుడున్న కండిషన్స్  ప్రకారం అస్సలు కుదరదండి అంటూ పంపేశారు కలెక్టర్ గారు. రెండు, మూడు సార్లు అతని చుట్టూ తిరగవలసి వచ్చింది మాస్టారికి.

మీరు ఎన్ని సార్లు నా దగ్గరికి వచ్చినా ప్రయోజనం లేదు సార్! ఈ విషయంలో నేను ఏమీ చెయ్యలేను. నా పరిధి దాటిపోయింది. మీ వలన అవుతుంది అంటే వెళ్లి మంత్రి గారిని కలవండి. ఏమైనా  చెయ్యగలిగితే ఆయనే చెయ్యగలడు. దయచేసి వెళ్లిపోండి.......అంటూ ఖరాఖండి గ చెప్పేసేడు కలెక్టర్ శ్రీనివాస్.


చేసేది లేక మాష్టారు,మంత్రి గారి అప్పోయింట్మెంట్ కోసం ప్రయత్నిచసాగేరు. ఎట్టకేలకు తనకు వున్న ఆ కాస్త పరిచయాల ద్వారా మంత్రి గారి అప్పోయింట్మెంట్ సాధించారు. 


సర్....ఎవరో రిటైర్డ్ తెలుగు మాస్టర్ గారంట. ఈ జాగా విషయమై అడ్డంకులు తొలగడానికి మీ అనుమతి కావాలంటున్నారు..కుదరదంటే వినిపించుకోవట్లేదు. అమ్మాయి పెళ్లి అంట..ఎలాగైనా మిమ్మల్ని కలవాలంటున్నారు. ఇదిగో ఇవి అతని వివరాలు.....అంటూ ఆ ఫైల్ ని మంత్రి గారి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయేడు సెక్రటరీ. 


కాసేపు ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాస్టర్ గారిని లోపలికి పంపించ వలసిందిగా ఫోన్ చేసి సెక్రటరీ కి చెప్పారు మంత్రిగారు.


రండి....కూచోండి. మీ వివరాలన్నీ చూసాను. అంటూ  మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానించారు మంత్రివర్యులు. ఈ భూమి విషయమై కొన్ని అడ్డంకులు వున్న మాట వాస్తవమయినా, మీ కేసు జెన్యూన్ కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాను. మరేమీ ఫర్లేదు...మీరు నిశ్చింతగా ఉండొచ్చు, అంటూ ఫైల్ మీద సంతకాలు పెట్టి, సెక్రటరీని పిలిచి, త్వరగా క్లియర్ చెయ్యమంటూ ఆదేశాలు జారీ చేసారు మంత్రిగారు. 


మాస్టారు ఉప్పొంగిపోయేరు. గత మూడు నెలలనించీ తిరుగుతున్నా పని కాలేదు. 

మీ దయ వలన ఇప్పుడు పూర్తయ్యింది. అంటూ  కృతఙ్ఞతా పూర్వకంగా నమస్కరించబోయేరు మాస్టర్ గారు. 


అయ్యో.....మీరు పెద్దవారు. మీరు నమస్కరించరాదు. మీ బోటి వారికి సేవ చెయ్యడమే మా లక్ష్యం అంటూ మాస్టర్ గారిని వారించారు మంత్రి గారు.


కృతఙ్ఞతా పూర్వకంగా ఆశీర్వదించి వెనుదిరిగి తలుపు తీసుకుంటూ వెళ్లబోయారు  తెలుగు మాస్టారు. 


చేతన్, చెన్, తోడన్, తోన్.. చేతనైన చేయూతనందించి తోడుగా నిలవడం....

తృతీయా విభక్తి...!


కొఱకున్, కై ......

ప్రజల కొరకు,ప్రజల కోసం పోరాడటం.....

చతుర్ధీ విభక్తి ...!


వలనన్, కంటెన్, పట్టి.....

ప్రజల వలన ఎన్నుకోబడిన నేను,వాళ్ళ కంటే గొప్పవాడినేమీ కాను, పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించటమే.....

పంచమీ విభక్తి ....!


కిన్, కున్, యొక్క,లోన్, లోపల.....

వ్యవస్థ లోపల వున్న కలుపు మొక్కల్ని ఏరి పారేసి, సంఘం యొక్క మేలు కోరడమే.....

షష్టీ విభక్తి...!


అందున్, నన్.......

అందుకు కట్టుబడి వుంటాను, ఆ విధంగా నన్ను నేను మలుచుకుంటాను.....

సప్తమీ విభక్తి...!


ఇదే మాకు మా గురుదేవులు నేర్పిన  పాఠం.....అందుకే మా తెలుగు మాస్టారంటే మాకు అమితమైన భక్తి !!! ఆయన నేర్పిన క్రమశిక్షణే మాకు యెనలేని శక్తి!!!!


అమాంతం వెనక్కి తిరిగి చూసిన తెలుగు మాస్టారి కళ్ళు నీటి కుండల్లా వున్నాయి. 


అవును మాస్టారు.....నేనే చిన్నప్పటి మీ శీను గాణ్ణి......అన్నాడు మంత్రి శీనయ్య!!!


నీటి పొరలు కప్పేయడం వలన ఏమో, ఒకరికొకరు మసక, మసకగా కనపడుతున్నారు. తన శిష్యుడి ఉన్నతి చూసి మురిసిపోయేరు మాస్టారు. గట్టిగా కౌగిలించుకున్నారు. 


కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటిగా జీవితం పాఠాలను నేర్పసాగింది మాస్టారు.....అప్పుడు తెలిసి వచ్చింది మీరు క్రమశిక్షణపై ఎందుకు అంత శ్రద్ధ వహించేవారో,మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడేవారో! ఆ నాడు మీరు నేర్పిన పాఠాలను నెమరు వేసుకుంటూ.....

నా బతుకు చిత్రాన్నేమార్చుకున్నాను. ప్రజాసేవ చేస్తూ దేశానికి ఎంతో కొంత ఋణం తీర్చుకోవాలనుకున్నా.....

చూస్తున్నారుగా......ఇపుడిలా


మీరేమీ అనుకోక పోతే అమ్మాయి పెళ్లి కి నాకు చేతనైనంత సహాయం చేసి, మీకు గురుదక్షిణగా చెల్లించుకుంటా.......

ఆ భూమిని మాత్రం అమ్ముకోవద్దు. 

మీ జీవిత భద్రత కోసం మీ దగ్గరే అట్టే పెట్టుకోండి .....

ఇది నా విన్నపం. కాదనకండి....అంటూ అభ్యర్ధించాడు మంత్రి శీనయ్య  ఉరఫ్ శీను.


గురుభక్తిని కాదనలేకపోయారు తెలుగు మాష్టారు. తన శిష్యుడు అంత ఎత్తుకి ఎదిగినందుకు సంబర పడిపోయారు.


సార్ .....మీ మొబైల్ అందుబాటులో లేనట్టుంది. మేడం గారు ఫోన్ చేసేరు. మీ చిన్నబ్బాయి స్కూల్ లో ఉసిరి చెట్టెక్కి కాయలు కోయబోతూ కింద పడ్డాడంట. మరేమి ఫరవాలేదు ....హి ఈస్ ఆల్రైట్ అని ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి చెప్పారంట .....అంటూ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు క్షమాపణలు చెప్తూ .....వచ్చి చెప్పాడు సెక్రటరీ.


మరేమీ ఫర్వాలేదు ప్రిన్సిపాల్ గారిని వాడికి ఇంకో నాలుగు తగిలించమను.మరీ బుద్ధి లేకుండా తయారవుతున్నాడు ఈ మధ్య  అంటూ ......తెలుగు మాస్టర్ గారి ముఖం లోకి చూసారు సదరు  మంత్రి గారు.


ఆ ఇద్దరూ అంతలా పకా,పకా ఎందుకు నవ్వుతున్నారో ఓ పట్టాన అర్ధం కాలేదు సెక్రటరీ కి.......


అలాంటి ఉపాధ్యాయుల్ని, విద్యార్ధుల్ని చూపించమంటే చూపగలను కానీ అలాంటి మంత్రులను చూపమని అడగొద్దు. అసాధ్యం.

🙏🙏🙏శుభోదయం🙏🙏🙏

A Collection from

Admin

Brahmana samaykhya

ఋతుశూల

 ఋతుశూల హరించుటకు నేను ప్రయోగించిన సులభ ఔషధ యోగం  - 


    ఈ ఋతుశూల అనునది చాలామంది స్త్రీలలో కనిపిస్తుంది. దీనిని ముట్టునొప్పి అనికూడా అంటారు. ఇది చాలా భయంకరమైన నొప్పితో కూడుకొని ఉంటుంది. ఇది కేవలం బహిష్టు సమయంలో వస్తుంది. కొంతమంది తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడతారు. మరికొంతమందికి ఈ ముట్టునొప్పి ఉండటం వలన సంతానం ఉండదు.  


      ఇప్పుడు మీకు నేను చెప్పబోయే చికిత్స నా అనుభవపూర్వకం . మరియు అతి సులువు అయినది. దీనిని ఉపయోగించి చాలమంది సమస్య నివారించగలిగాను . 


    ముట్టునొప్పి ఉన్నవారు తెల్లజిల్లేడు పాలు 5 చుక్కలు చక్కెరకేళి అరటిపండులో గుంటలా చేసి అందులో వేసుకొని ఉదయం పూట మాత్రమే 4 రోజులు సేవించినచో ఋతుశూల తగ్గిపోవును . 


 మరియొక నా అనుభవ యోగం  - 


    ముదురు చింతచెట్టు బెరడు తెచ్చుకొని ఆ బెరడుని కాల్చి బూడిద చేయవలెను.   వేరే కర్రపుల్లలు వాడరాదు . ఆ బూడిదని జల్లించి ఆ పొడిని భద్రపరచుకొని ఇంకో రెండు రోజుల్లో బహిష్టు అవుతారు అనగా ఆ బూడిదని ఒక గ్రాము మోతాదుగా ఉదయం పూట కొంచెం నిమ్మరసంలో కలిపి తీసికొనవలెను . మరలా సాయంత్రం పూట ఒక గ్రాము తేనెతో కలిపి సేవిస్తూ ఉండాలి . బహిష్టు మూడు రోజులు కూడా ఇలాగే సేవించాలి . దీనివల్ల ముట్టునొప్పి పూర్తిగా తగ్గును. సంతాన యోగ్యత కలుగును. 


   పైన సూచించిన రెండు యోగాలతో చాలా మందికి చికిత్స చేశాను . వీటిలో మీకు ఏది సులభంగా అనిపిస్తే దానిని పాటించండి.


    ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

గోరుచుట్టుకు సిద్ద యోగం

 గోరుచుట్టుకు నేను ప్రయోగించిన రహస్య సిద్ద యోగం  - 


      చాలా మంది గోరుచుట్టు రాగానే నిమ్మకాయ కి రంధ్రము చేసి వేలికి తొడుగుతారు . మరికొంతమంది గేద పేడ వేసి కట్టడం మరియు ఉల్లిగడ్డ వేసి కడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం మరియు తీవ్రమైన బాధని కలుగచేస్తుంది . క్రమేణా రక్తం , చీము బయటకి వెలువడి శస్త్రచికిత్స కూడా అవసరం అగును. 


        ఇటీవల ఒక వ్యక్తి గోరుచుట్టు తో తీవ్రవేదనతో నన్ను కలిశాడు . అతనికి నేను చేసిన చికిత్స వివరాలు తెలియచేస్తున్నాను .


     మొదట 100 గ్రాములు గుల్లసున్నం తీసుకుని సీసాలో వేసి నీరుపోసి బాగా కలిపాను. కొంతసేపటికి సున్నం అంతా కిందికి చేరుకొని పైన తేరుకున్న నీటిని వేరొక సీసాలో పోసి ఆ నీటికి సమానంగా ఆముదం ఆ నీరు గల సీసాలో పోసి బాగా కదిపాను . 15 నిమిషముల తరువాత నీరు మరియు ఆముదం కలిసి తెల్లని రంగు గల ద్రవం ఏర్పడినది . 


                ఆ ద్రవాన్ని దూదిపైన వేసి వాపు ఉన్నంతవరకు రాసి కట్టుకట్టాను . కేవలం 3 రోజుల్లో గోరుచుట్టు కరిగిపోయింది. బాధ కూడా తగ్గిపోయింది . 


 గమనిక  -  


      నిమ్మకాయ సరాసరి గోరుచుట్టు ఉన్న వేలికి పెట్టరాదు . నిమ్మకాయలో సున్నం మరియు పసుపు కలిపిన పారాణి ముద్ద పెట్టిన తరువాతే నిమ్మకాయ పెట్టండి . లేదా నిమ్మకాయ లేకుండా ఆ పారాణి ముద్దని కట్టండి. 


    

      మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     

24, నవంబర్ 2022, గురువారం

చండీశ్వరుడు

 🕉🌺 ఆధ్యాత్మికం🌺🕉 @aadyaatmikam360°:

🎻🌹🙏 శివుడు - చండీశ్వరుడు..!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో ‘యచ్చదత్తనుడు’ అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు.


🌿ఆయనకు ‘విచారశర్మ’ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు.


🌸గోవులు, దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి ‘నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను.


🌿నీవు ఈ ఆవులను కొట్టవద్దు, 'తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు.


🌸బ్రాహ్మణుడు, బ్రహ్మచారి.. వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా... అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు.


🌿ఈ పిల్లవాడు వేదమంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు.


🌸వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు.


🌿ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి. రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి.


🌸ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలువిడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకము చేయదలచాడు.


🌿రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించినవారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి.


🌸అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి, ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు.


🌿అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటిని ఇసుకలో పోసేస్తున్నాడు. ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు.


🌸చెప్తే..అది విన్న యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. ‘రేపు నేను చూస్తాను’ అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టిక్కి కూర్చున్నాడు.


🌿పూర్వకాలం కౄర మృగములు ఎక్కువ. అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు.కాసేపయింది,


🌸కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు.


🌿తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు.


🌸అవును అతడు చెప్పింది నిజమే. వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తు కుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు.


🌿ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది ఛిన్నాభిన్నమయింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది.


🌸తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు.


🌿ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలులేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి రెండు కాళ్ళు తొడలవరకు తెగిపోయి, క్రిందపడిపోయాడు.


🌸నెత్తుటి ధారలు కారిపోతున్నాయి, కొడుకు చూశాడు. ‘శివలింగమును తన్నినందుకు నీవీ ఫలితం అనుభవించవలసిందే’ అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు.


🌿ఆశ్చర్యంగా అక్కడ ఛిన్నాభిన్నమయిన సైకత లింగం లోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు.


🌸మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుండి నీవు మా కుటుంబంలో అయిదవవాడవు.


🌿నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. అయిదవ స్థానం చండీశ్వరుడిదే, నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు.


🌸ఇకనుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచి పెట్టిన దానిని పత్నీ భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు బడితే వారు తినెయ్యకూడదు.


🌿భార్యకొక్క దానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్నీభాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహించాడో చూడండి.


🌸పార్వతీ... నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా. నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూంటాడు. వేరొకరు తినరాదు’ అన్నాడు.


🌿ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు.

బయట పడలేక పోతున్నాను

 చెడు చేయకపోయినా చెడు ఆలోచనల నుండి నేను బయట పడలేక పోతున్నాను ! ఎలా ?"*


*"సాధకుడు మోహంతో కూడిన ఆలోచనలు ఏవీ చేయకూడదు. మన అవసరాలను గుర్తించి దైవమే నెరవేస్తుంది. అవసరం కోసం ఆలోచన కావాలి కానీ ఆలోచనలతో అవసరాలు వెదకనక్కర్లేదు. చెడు అలవాట్లే కాదు వాటి తాలూకా ఆలోచనలు కూడా మనసును కలుషితంచేస్తాయి. శారదా మాతను ఒక భక్తుడు ఇలా ప్రశ్నించాడు - అమ్మా ఈ జనం ఎందుకు చెడు గుణాల నుండి బయట పడలేకపోతున్నారు ? మాత సమాధానమిస్తూ 'తప్పు నాన్నా, చెడు గుణాలన్న మాటకూడా మంచిది కాదు.. కీడు చేస్తుందని హెచ్చరించారు.' మనం ఎదుటివారిలో ఒక లోపం చూస్తున్నామంటే అది అప్పటికే మనలో ఉందని అర్థం ! వీటన్నింటిని అధిగమించటం కోసం గురువును ఆశ్రయించాలి. ఆ తర్వాత కూడా భ్రష్టులమైతే అది గురుద్రోహమే అవుతుంది. ఫ్యాషన్ల పేరుతో ముందుకి వెనక్కి ఊగే ఈ ప్రపంచంతో పరుగులు పెట్టకుండా అవసరాల వరకు గుర్తించి ముందుకుసాగాలి. సద్గురువు మనకి మంత్రం చెప్పాల్సిన పనిలేదు ! ఆయన జీవనమే మనకు మహామంత్రం కావాలి. గురువు అందరి కష్టాలు ఎలా తీరుస్తున్నారని వెతుకులాట కాకుండా అంతటి కష్టంలో కూడా గురువు ఎలా నిర్మలంగా ఉంటున్నారో చూసి నేర్చుకోవాలి !"*

మానవ సంబంధాలు

 *పలచబడి పోతున్న మానవ సంబంధాలు* 


 గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు లో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాము .

          పెద్దగా ఆస్తులు..చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు.. సమాజంలో హోదా.. సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చక్కగా (చిక్కగా )వుండేవి..

               ఒకరికి ఒకరు చేదోడుగా.. నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు..

          వున్నంతలో తృప్తిగా వున్నారు.. కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం.. అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా వుండేది..

               కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు..

               మా మనవడు లేదా మనవరాలు..అని తాతలు.. మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు..

             కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి priority ఇవ్వడం మొదలైందో.. ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో..ఈ సంబంధల్లో కూడా compitetion మొదలైంది... పిల్లలో ఈర్ష్య, పెద్దల్లో అసూయ..


             మొదట్లో success అయిన వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసే వారు.. మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించే వారు.. తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడ్డారు..


             కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో.. వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో..

              అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు.. పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది.... అంతా కమర్షియల్ అయిపోయింది 

              ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు..  కొన్న ఆస్తులు.. చేయించుకున్న నగలు.. వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్.. వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప..

               వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించు కోవడమే తగ్గిపోయింది..పలకరించుకున్నా ఏదో మొక్కుబడిగానే...


                ఆనాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా..శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి వుండేవారు..

              తరువాత కూడా ఇంకో వారం రోజులు వుండేవారు..

            రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకుని పొద్దుబోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వారు..

               ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా.. చేసే వారు కూడా ఆప్పో సొప్పో చేసి పక్క వాడి కన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ మన వాళ్ళను దగ్గరగా నిలుపుకుందాము అని మర్చిపోతున్నారు..


                అటెండ్ అయ్యే వారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి.. తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న ప్రయారిటీ..

             పారదర్శక సంబంధాలు కి ఇవ్వడం లేదు.. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు హజరులు మిగిలిపోతున్నాయి..

           అందరికి పిల్లలు దూరంగా వుంటున్నా.. ఇరుగు పొరుగు నే వుంటున్న రక్త సంబంధీకులు తో కూడా ఆత్మీయ అనుబంధాలు వుంచుకోవడం లేదు..

            నిష్కారణంగా చిన్న చిన్న కారణాలు తోనే విపరీతమైన అహం అతిశయం తో వ్యవహరిస్తూ.. అందరికి అందరూ గిరిగీసుకుని బతకడానికి అలవాటు పడుతున్నారు..


          వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు..

         నూటికి 90% కుటుంబాలలో పిల్లలు దూరంగానే వుంటున్నారు.. వీళ్లకు పెద్ధతనం.. ఒంటరి తనం.. అనారోగ్య సమస్యలు.. మనిషి తోడు అవసరం..

            అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో వుండడం లేదు.. విపరీతమైన స్వార్థం పక్క వాడి నీడ కూడా సహించడం లేదు..

దగ్గరి వాళ్ళ మధ్య కూడా గొడవలు.. మాట్లాడుకోక పోవడం.. షరా మాములు అయిపోయింది...

ఈ సందర్భంలోనే ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమా కోసం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రాసిన ఓ డైలాగ్‌ గుర్తుకు వస్తుంది...

‘"మనం బాగున్నప్పుడు లెక్కలు చూసుకుని... కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు"

వీలైతే  మనం బాగున్నప్పుడు కూడా అందరితో కలిసి ఉండాలి మన వారికీ అవసరమైన సహాయం అందించాలి.

       చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు..

            వలసలు పుణ్యాన.. గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది.. 

        దానికి తోడు కేవలం కూడూ గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు పర్యవసానం..

                బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వేళ పిల్లలు కజిన్స్ మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా..రిలేషన్స్ లో ఎమోషన్ వుంచుకుందాము అనుకున్నా మెజారిటీ కుటుంబాలలో పెద్ద వాళ్ళు దూరిపోయి అగాధం పెంచుతున్నారు..

           చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి..

              నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో..

      రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని..  మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాము..

        నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు? నా ఇంటికి వస్తె ఏమి తెస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి..

           అందరూ కొద్దిగా ఆలోచించండి.. మన కుటుంబాల్ని మనమే ఎడం చేసుకుంటూ.. మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము..

               ఎవ్వరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి.. మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము? 

           ఇప్పటికే చాలా మంది పెద్దవారు వెళ్ళిపోయారు.. మనకి ఎంత టైం వుంటుందో తెలియదు..

           మనం సక్రమంగా ఆరోగ్యంగా వున్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గర అయినా పనికిమాలిన అహం, అతిశయం, వదిలి వెద్ధాము....


ఒక్కడై రావడం... ఒక్కడై పోవడం...

ఈ నడుమ అయినా అందరితో కలసి మెలసి ఉందాం... 🙏🙏

పరమాచార్యుల దుఃఖం

 పరమాచార్యుల దుఃఖం


పరమాచార్య స్వామివారు ఒకరోజు ఉదయం చెన్నైలోని మ్యూసిక్ అకాడమి నుండి పశ్చిమంగా నడుచుకుంటూ వస్తున్నారు. అది బహుశా 1964 - 1965 ప్రాంతం అనుకుంటా. మహాస్వామి వారితో పి.జి. పాల్ & కొ నిలకంఠ అయ్యర్, శ్రీమఠం శివరామ అయ్యర్, పానాంపట్టు కణ్ణన్, శ్రీకంఠన్, రోయపురం బాలు మరియు నేను ఉన్నాము. దారిలో పది ఇరవై మంది దాకా భక్తులు మాకు తోడయ్యారు.


గోపాలపురం వైపు వెళ్ళే మలుపులో స్వామివారు నన్ను పిలిచి, “వెనుక అక్కడ కిరాణా కొట్టు దగ్గర తలపై శిఖతో నోటినుండి పొగ వదులుతూ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు కదా చూశావా? అతని వద్దకు వెళ్లి పరవాక్కరై శ్రౌతిగళ్ గురించి అడిగి రా” అని చెప్పారు. నేను అతని వద్దకు పరిగెత్తాను. అతను ఆ కొట్టుకు వేలాడదీసిన తాడు చివరన ఉన్న నిప్పుతో బీడి అంటించుకుంటున్నాడు. అతని వద్దకు వెళ్లి అడిగాను,


“ఓయ్! నీకు పరవాక్కరై శ్రౌతిగళ్ తెలుసా?” అని.


అతను కాస్త కంగారు పడి, చేతిలోని బీడి క్రింద పడేసి “మీరు ఎవరు? ఎందుకోసం అడుగుతున్నారు?” అని అడిగాడు.


“ఆచార్య స్వాములు కనుక్కోమన్నారు. . .”


“పెరియవా? ఎక్కడా?”


“అక్కడ” అని నేను చేయి చూపించే సరికి అతను పరుగు లంకించుకుని అటువైపుగా వెళ్ళిపోయాడు. నేను కొద్దిసేపు వేచిచూసి, స్వామివారికి చెప్పాను “నేను అతణ్ణి అడిగాను. ఏమి బదులు చెప్పకుండా పారిపోయాడు” అని.


స్వామివారు మౌనంగా గోపాలపురం వైపు కదిలారు. కొద్దిదూరంలో, ప్రహరీ అవతల చక్కని పందిరి వేసి తోరణాలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని పూర్ణకుంభంతో స్వాగతించారు. పెద్ద భవంతి ముందర ఉన్న నాలుగు మెట్లు ఎక్కగానే వరండా మూలలో స్వామివారు ఆసనం వేయించుకుని కూర్చున్నారు.


భక్తులు స్వామివారికి నమస్కరించి సెలవు తీసుకున్నారు. కార్యాలయాలకు వెళ్ళాలి కాబోలు! స్వామివారు లేచి లోపలి పోయేంతలో నుదుటిపై విభూతి రేఖలతో, చేతులు ఎదపై ఎలాపడితే అలా పెట్టిన విభూతితో, నడుముకు ఒక టవల్ చుట్టుకుని వచ్చిన ఒక వ్యక్తి వచ్చి స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డాడు.


స్వామివారు మరలా కూర్చుని నన్ను చూపిస్తూ, “ఎవరతను?” అని అడిగారు. “కొద్దిసేపటి క్రితం పరమాచార్య స్వామివారే ఈ వ్యక్తి ద్వారా నాకు పరవాక్కరై శ్రౌతిగళ్ తెలుసేమో కనుక్కుని రమ్మని పంపారు”. “అవును నేను పరవాక్కరై శ్రౌతిగళ్ మనవడిని. నా పేరు ప్రణతార్థి”


“ప్రణతార్థి అని పలకవద్దు. అది స్వామివారి పేరు. ప్రణతార్థి హరణ్ లేదా హరణ్ అని చెప్పు. తనని నమస్కరించిన వారి పీడలను పోగొట్టే స్వామీ ఆయన. అది ఆ నామము యొక్క అర్థము”


“అందరూ నన్ను ఇలాగే పిలుస్తారు. అలవాటయిపోయింది”


“నువ్వు ఇలా ఉండడానికి కారణం ఏంటి? అధ్యయనం(వేదాధ్యయనం) చేశావా?”


“తాత గారు సామము నేర్పించారు”


ఒక సామవేద పన్నమును ఉదాహరిస్తూ “ఏది ఈ సామ పన్నం చెప్పు” అన్నారు. రెండు మూడు వాక్యాలు చెప్పగలిగాడు. అతని సామగానము పెద్ద కంఠంతో మంచి సమ్మోహన శక్తితో చాలా దివ్యంగా ఉంది.


“తరువాత గుర్తులేదు” అన్నాడు.


“నీ తోడబుట్టిన వారు పెద్దవారా? చిన్నవారా?”


“ఇద్దరూ పెద్దవారు. వారు ఇంగ్లిషు చదువులు చదివి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. నా స్వరం బావుండడంతో తాత గారు సామవేదం నేర్పారు. నాకు అది ఇష్టం లేదు అందుకే ఇంటి నుండి పారిపోయాను”


“ఇప్పుడు ఏమి చేస్తున్నావు?”


“నేను పోలీసులకు సహాయపడుతుంటాను”


“పోలీసులకు సహాయమా? ఏమి సహాయం చేస్తావు?”


“వారు నన్ను న్యాయస్థానాలకు తీసుకుని వెళతారు. నేను సాక్ష్యం చెబుతాను. వారు డబ్బులిస్తారు. . .”


“ధూమపానం ఎలా అలవాటు అయ్యింది?”


“వాళ్ళతో వెళ్ళినప్పుడు ఎక్కువ మోతాదులో కొంటారు. నాకు రెండు మూడు ఇచ్చేవారు”


“నువ్వు చూసినవాటినే న్యాయస్థానంలో చేబుతుంటావు. అవును కదా?”


“నేను ఏమి చూడలేదు. వారు ఇలా చెప్పమని చెబుతారు. నేను అదే చెప్తాను”


“న్యాయవాదులు ఎక్కువ ప్రశ్నలు వేస్తారు కదా!”


“అవును. అందుకే పోలీసులు నన్ను హత్య జరిగిన స్థలానికి తీసుకుని వెళ్లి అది ఎలా జరిగిందో విపులంగా చెబుతారు. నేను ఇక్కడ నిలబడ్డాను; ఇంతమంది ఉన్నారు; నేను చూస్తున్నాను; హంతకుడు తూర్పు వైపుగా పరిగెత్తి వెళ్ళాడు; చేతిలో కొడవలి ఉంది; అందులో నుండి రక్తం కారుతోంది; ఇలా నాకు నేర్పిస్తారు. ఎన్నో కేసుల్లో సాక్ష్యం చెప్పాను కాదా. నాకు అనుభవం ఉంది. లాయరు నన్ను ఎంత తికమక పెట్టినా, నేను అంతే తెలివిగా సమాధానం ఇస్తాను. రెండు మూడు సార్లు మాట తడబడ్డాను. అప్పుడు నన్ను పోలీసులు బాగా కొట్టారు”


“కోర్టుకు వెళ్ళేటప్పుడు చొక్కా అవి వేసుకుంటావా?”


“లేదు లేదు. దానికి పోలీసులు ఒప్పుకోరు. నేను పెద్ద పెద్ద విభూతి పట్టలు పెట్టుకోవాలి. సబ్బు పెట్టి నా యగ్నోపవీతాన్ని తెల్లగా ఉంచుకోవాలి. నడుముకు తుండు కట్టుకోవాలని కూడా ఆదేశిస్తారు”


“ఇలా సాక్షిగా మారడం తప్పు కాదా?”


“అవును పాపమే. నాకు బాగా తెలుసు. కాని నాకు ఇక దారి లేదు”


“అలాగా! మరి ఒక దారి చూపిస్తాను. చేస్తావా?”


“దయచేసి సెలవివ్వండి”


“మైలాపూర్ లో కపాలీశ్వర దేవాలయం ఉంది. సాయింత్రాలు అక్కడకు వెళ్ళు. పడమర గోపురం దగ్గర రోజూ చత్త ఊడ్చి, నీళ్ళు చెల్లు. నీకు పది రూపాయలు, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయిస్తాను”


“ఈ ఊడిగాలు, ప్రసాదాలు అవన్నీ నాకు పడవు”


“దేవాలయ ప్రసాదం కాదు. రోజుకొక భక్తుని ఇంట నీ భోజనం ఏర్పాటు చేస్తాను. నువ్వు ఆ పది రూపాయలతో రాత్రిపూట తిను”


“నాకు అవన్నీ సరిపడవు. నావల్ల కుదరదు”


“అంత ఆత్రుత ఎందుకు? మఠంలో రెండు రోజులు ఉండు. చంద్రమౌళిశ్వర పూజ చూడు. పూజ అయిన వెంటనే నీకు ఆహారం ఏర్పాటు చేయిస్తాను. తరువాత ఆలోచించి చెప్పు”


“ఈరోజు నాకు కుదరదు. ఎగ్మోర్ కోర్టులో ఒక పెద్ద కేసు ఉంది. నేను అక్కడకు సాక్ష్యం చెప్పడానికి వెళ్ళకపోతే, నా వీపు విరగ్గొడతారు. నన్ను వెళ్ళనివ్వండి” అని అతను వెళ్ళిపోయాడు.


ఆ ప్రహరి దాటి వెళ్లిపోఏంతవరకు అలా చూస్తుండిపోయారు. తరువాత స్వామివారు లేచి లోపలకు వెళ్ళారు. నిలకంఠ అయ్యర్, నేనూ వెనకాతలే వెళ్ళాము. స్వామివారు తిరిగి చూశారు. నిలకంఠ అయ్యర్ చిన్నగా అన్నారు, “మహాస్వామి వారు అంతగా చెప్పినా అతను వినిపించుకోలేదు”


“అలాగే ఉండని. జనాలకు తప్పుడు సాక్ష్యం చెప్పడం అలవాటు చేశారు ఈ పోలీసులు” అన్నారు స్వామివారు.


అందుకు నిలకంఠ అయ్యర్ “వారు మాత్రం ఏం చేస్తారు? పట్టపగలే అంతమంది ముందు ఒక హత్య జరిగినా కూడా ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకురారు. అది ఎవరు చేశారో తెలిసి కూడా ఎవరూ సాక్షిగా రావడానికి ఒప్పుకోరు. అందరికి వాళ్ళ వాళ్ళ పనులు ఉన్నాయి. పోనీ అలా వెళ్ళినా ఈ లాయర్లు వారిని పదే పదే కోర్టుల చుట్టూ తిప్పుతారు. తీరా నిందితుడే ఒప్పుకున్నా, సాక్ష్యం లేదని కేసు కొట్టేస్తారు. తరువాత పొలిసు వ్యవస్థ సరిగా లేదని. కనుక వారికి తప్పుడు సాక్ష్యం చెప్పించడం తప్ప వేరే దారి లేదు”


“ఓహో! నేరం చెయ్యడం మొదటి తప్పు. చూసి కూడా సాక్ష్యం చెప్పడానికి రాకపోవడం రెండవ తప్పు. చూడనివారిని సాక్ష్యంగా తయారుచెయ్యడం మూడవ తప్పు. ఈ తప్పులను సమర్తిచడం మరొక తప్పు”


“మహాస్వామి వారు నన్ను మన్నించాలి. ప్రపంచంలో జరుగుతున్నడి నేను తెలిపాను అంతే”


“ఇది మరీ బాధాకరం. ఇదంతా ఒక బ్రాహ్మణుని విషయంలోనా! తప్పుడు సాక్ష్యం చెప్పినా ఒక బ్రాహ్మణుడు చెబుతున్నాడు అంటే కోర్టు కూడా నమ్ముతుందనే కదా పోలీసులు ఇలా చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ! ఆ శ్రౌతి మనుమడు ఇలా . . .”


“మహాస్వామి వారు చేప్పినదేదీ అతని చెవిన పడలేదు”


“చెప్పాడు కదా. కోర్టుకు వెళ్ళకపోతే పోలీసులు కొడతారు అని. అతడెంచేస్తాడు”


“పరమాచార్యుల వారు చాలా క్లేశ పడుతున్నారు. మేమేమైనా చెయ్యగలమా?”


“ఒక సన్యాసి తన మనస్సులో సుఖదుఖాలకు కష్టనష్టాలకు తావివ్వకూడదు అని మీకు తెలుసు కదా” అని స్వామివారు స్నానానికి వెళ్ళిపోయారు.


మధ్యాహ్నం మూడు గంటలప్పుడు పూజగది పక్కన ఉన్న వరండాలో నేను పడుకుని ఉన్నాను. “రామా!” అని అరుపు వినబడడంతో లేచి వచ్చాను. మేలూర్ మామ - రామచంద్ర అయ్యర్ - మహాస్వామి వారి పూజా పర్యవేక్షకులుగా ఉన్నారు. చాలా సంప్రదాయం పాటించే మనిషి. పూజ సహాయకులకు ఆయన సింహస్వప్నం. పూజకట్టులో చిన్న పొరపాటును కూడా సహించరు. దేవతా మూర్తులను లోపల పెట్టి తాళం వేసిన తరువాత కూడా వాటిని పర్యవేక్షిస్తుంటారు.


వారు లోపల నుండి పెద్ద ఇత్తడి గిన్నెతో బయటకు వచ్చారు. నన్ను అక్కడ చూసి రమ్మని సైగ చేశారు. 


“ఉదయం పరమాచార్య స్వామివారితో పాటుగా వచ్చావా?” అని అడిగారు.


“అవును వారితోపాటే వచ్చాను”


“అప్పుడు ఏమైనా జరిగిందా?”


“ఏమిలేదు”


“లేదు. ఏమో జరిగింది. మహాస్వామి వారు ఈరోజు పూజ చెయ్యలేదు”


“అలాగా! అది ఏం జరిగిందంటే. . .” అని పరవాక్కరై శ్రౌతిగళ్ మనవడి గురించి మొత్తం జరిగినదంతా చెప్పాను. చేతిని నుదిటిపై బాదుకుంటూ ఆయన చలించిపోయారు. అప్పుడే స్వామివారు అటువైపుగా వచ్చారు. నేను నమస్కరించాను. 


“మేలూర్ మామ ఏం చెప్పాడు. చూస్తె ఈరోజు భోజనం చేసినట్టు లేదు. ఏమైనదో కనుక్కున్నావా?” అని అడిగారు.


నేను కళ్ళు తుడుచుకున్నాను. “నాతో ఎదో చెప్పాలని అనుకుంటున్నావు కదా! చెప్పు మరి”


“నేనేమి చెప్పగలను పెరియవా! శ్రీధర అయ్యవాళ్ శ్లోకం ఒకటి స్ఫురించింది”


“అయ్యవాళ్ శ్లోకమా? భక్తి రసంలో ముంచుతుంది. ఏది చెప్పు ఒకసారి”


“త్వన్ నామధ్యేయ రసికాః తరుణేందు మౌళే

దుఃఖం న యాన్తి కిమపీతి హి వాదమాత్రం

దేశమీకిల స్వవిపతీవ వహంతి దుఃఖం

త్రుకోకరీభవతి దుఖాని జంతుమాత్రే”


“మరొక్క సారి చెప్పు!” నేను మరలా చెప్పాను. “అర్థం కూడా చెప్పు చూద్దాం”


“తలపై నెలవంకను ధరించిన స్వామి ఎవరో ఆ స్వామి పేరు శివా శివా అని తలచిన వారికి దుఃఖము కలగదు అని. కాని వారు కూడా ఇతరుల కష్టములను చూసి చలించిపోతారు. అదేదో ఆ కష్టము వారికే వచ్చింది అన్నట్టుగా”


“సరిగ్గా చెప్పావు. ఇందులో నువ్వు ఒకటి గమనించావా?”


“దేని గురించి? నాకు తెలియదు”


“ఇక్కడ “తరుణేందు మౌళే” అని అంటున్నాడు. అది మన చంద్రమౌళీశ్వరుడే. వారి గురువు అయిన బోధేంద్ర సరస్వతీ పూజించిన చంద్రమౌళీశ్వరుని పైనే ఇలా కీర్తించాడు” అని చెప్పి స్వామివారు తాదాత్మ్యం చెందారు.


నేను స్వామివారికి ఒక విషయం చెప్పదలచుకున్నాను. అది చెప్పి ఉంటే అది అపచారము అయ్యి ఉండేదేమో. అందుకే ఇక్కడ చెబుతున్నాను.


వేరొకరి బాధలకు చలించిపోయే మాహామనీషి పుట్టబోతున్నాడని మూడువందల యాభై సంవత్సరాల క్రితమే శ్రీధర అయ్యవాళ్ చంద్రమౌళీశ్వరునికి చెప్పుకున్నాడు. 


--- వి. విశ్వనాథ ఆత్రేయన్, మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం