ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
19, అక్టోబర్ 2025, ఆదివారం
ఐదు పండుగల కథ !
* త్రయోదశి:* వాడుకలో ధన త్రయోదశి అంటూ, ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం.
కానీ ఈ రోజు "ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన "ధన్వంతరీభగవాన్"
జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృతభాండంతో అవతరించాడు.
2. *నరకచతుర్దశి:*
నరకయాతనల నుండి రక్షించ మని యముడి ప్రీతి కొరకు, పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి, మిగతా ఐఅన్ని దీపాలను వెలిగించాలి.
నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు.
ప్రాగ్జ్యోతిషపురం (నేటి అస్సాం) ను పాలించిన 'నరకుడు' నరరూప రాక్షసుడు దేవీ ఉపాసకుడు.
కానీ దేవికి వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అద్భుశక్తులను
సంపాదించి దేవతలను కూడా ఓడించాడు.
వాడు ప్రతీ *అమావాస్య*- *పౌర్ణమికి* నవయౌవన లైన రాజ కన్యలను దేవికి బలి ఇచ్చేవాడు. కాముకత్వంతో అనుభవించేవాడు. నరకుని చెఱసాలలో వేలాది అందమైన మహిళలు (రాజకన్యలు) బందీలుగా వుండేవారు. ఆది వరాహమూర్తికి - భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు. తామస ప్రవృత్తితో జనించాడు.
శ్రీకృష్ణభగవానుడు - సత్యభామ (భూదేవి అవతారం) తో కలసి గరుడారూఢుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి (సత్యభామ) సహకారంతో సంహరించాడు. నరకుని పీడ విరగ డైంది కావున ఇది 'నరక చతుర్దశి.'
3. *దీపావళి:*
రావణసంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభసందర్భంగా దీపావళి జరుపు కోవటం, నరకుని బాధలనుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం.
దీపం - లక్ష్మీ స్వరూపం - ఐశ్వర్య స్వరూపం - జ్ఞానస్వరూపం. అందుకే మనం దీపావళిరోజు లక్ష్మీపూజలు చేస్తాము.
వ్వాపారులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు.
4. *బలిపాడ్యమి:*
వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని 'మూడు అడుగుల' నేలను దాన మడిగాడు.
వామనవటువుకు దాన మిచ్చాడు బలి, "ఇంతింతై వటుడింతై నభోరాశిపై నల్లంతై" అన్నట్లుగా ఒక పాదంతో భూమిని, ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన 'త్రివిక్రముడు,' వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు! సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి, మన మంతా సుఖశాంతులతో వుండా లని ఆశీర్వదించి వెళతా డట . ఇదీ ఆయనకు వామను డిచ్చిన వరం.
5. *యమ ద్వితీయ:*
సూర్యభగవానునికి యముడు, శనిదేవుడు ఇద్దరు పుత్రులు, యమున అనే ఒక పుత్రిక.
యముడు - యమున ఇద్దరూ అన్నాచెల్లెళ్లు కదా ! తన పని (జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశంతో ఈడ్చుక వచ్చి వారి వారి కర్మానుసారం వారి వారికి తగిన శిక్షలు విధించే పని) లో పడి పాపం చెల్లె లింటికి వెళ్లటం లేదు యముడు.
చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా! అని. కార్తిక శుద్ధ విదియ {మంగళవారం} రోజు తీరిక చేసుకుని తన చెల్లె లింటికి వెళ్లి హాయిగా కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు.
చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది యమున - ఎవరైతే ఈ రోజు చెల్లెలి ఇంటికి వెళ్లి చెల్లెలికి కట్నం, కానుక లిచ్చి వాళ్లింట్లో భోజనం చేసి వస్తారో, వారికి యముని బాధలు లేకుండా చేయి అని.
ఈ యమునమ్మే యమునానది! కృష్ణ భక్తురాలు! *భగినీహస్తభోజనం* పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ
ఇప్పటికీ జరుపుకుంటారు. దీన్నే రామ ద్వితీయ, భ్రాతృ ద్వితీయ అనీ అంటారు.
ఇదీ ఐదు పండుగల కథ !
సాక్షాత్కరింపం
శా॥
ఆలింజూడగ రాజుకూతురట దివ్యైశ్వర్యసామ్రాజ్ఞి నీ
కేలా? నివ్విధి ప్రేతభూమినివస మ్మీ భస్మలేపమ్ములున్
కాలాహీపరిభూష లీ దిసమొలల్ కాత్యాయనీవల్లభా!
చాలించంగదె నీదు నాటకమికన్ సాక్షాత్కరింపం దృటిన్
*~శ్రీశర్మద*
16, అక్టోబర్ 2025, గురువారం
అవధాన పుష్కరిణీ
ఓం శ్రీ మాత్రే నమః
అవధాన పుష్కరిణీ* మాసపత్రిక నవంబర్ 2025 సంచిక కొరకు పంపించిన పూరణలు
సమస్య:-
*గణపతి పుత్రి పెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌనులున్ సురల్*
కణము కణమ్మునం దనను కాంతునిగా గను దీక్ష నెన్ని స
ద్గుణమతి చంద్రశేఖరుడు తోయజ నేత్రిని చేత పట్టు ప
ర్వణి దగు సంబరమ్ము కనులం గను వేడుక నా ధరాధరా
గణ పతి పుత్రి పెండ్లిఁ గనఁగాఁ జనుదెంచిరి మౌనులున్ సురల్
ధరాధరా గణ పతి=పర్వతముల సమూహానికి రాజైన హిమవంతుడు
దత్తపది
*జనవరి - మార్చి - మే - జులై*
ఈ పదాలను ప్రయోగిస్తూ రామాయణార్థంలో తేటగీతి ఛందస్సు లో
స్వర్ణ హరిణమ్ము వెదకగా భర్తయు 'జన
వరి'క లను సీత 'మార్చి' విపన్న జూచె
గాని, 'మే'లును యోచింప లేని యట్టి
జింక మో'జు లై'దువ నట చేర్చె
లంక
వరిక = ఒక జాతి పక్షి విశేషము మార్చి=మార్చి మార్చి
అభివందనములతో
డా.రఘుపతి శాస్త్రుల,
విశ్రాంత ప్రాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల
15, అక్టోబర్ 2025, బుధవారం
శరత్తులో జగత్తు*
*శరత్తులో జగత్తు*
ఉ॥
వెండిని రంగరించి వరిపిండిని పర్వినయట్లు తోచగా
కొండల మంచుతోడ సమకూరిన సౌరుల భూతల
మ్ముండగ చంద్రు డంత ధవళోన్నతచంద్రిక నుల్లసిల్లగా
నిండెను చిత్తజాతుసుమనృత్యరవంపుశరత్తు నందమై
ఉ॥
చంద్రికలందమై మెఱయ సారెకు సారెకు కన్నుకుట్టి తా
సాంద్రపయోధరాళిని ప్రశంసల ముంచుచు క్ష్మాకు నంపగా
నింద్రుడు మేఘమాలికలు నింతలుగా ౘదలంత క్రమ్మగా
చంద్రుడు మూగవోయెనట శారదరాత్రుల ఖిన్నుడైసనెన్
కం॥
వెన్నెల నిండెడి వేళల
మిన్నగ వానలు వరించె మేదినినెల్లన్
క్రొన్నెలతాల్పుని యందము
తిన్నగ చూడమి జనులును దీనతనందెన్
*~శ్రీశర్మద*
మోక్షప్రాప్తి
శ్రీ
ఆదిశంకరుల గ్రంధాలు అన్నిటిలోనూ 'వివేక చూడామణి' ప్రత్యేక స్థానాన్ని అలంకరించింది.
ఆత్మ జ్ఞాన విషయం ఇంతకంటే సులభరీతిన మరే గ్రంధం లోనూ చెప్పబడలేదేమోనని పెద్దల అభిప్రాయం. 580 శ్లోకాలతో ఉన్న ఈ గ్రంధం వేదాంత విజ్ఞాన ఆకాశంలో ప్రకాశిస్తున్న ధ్రువ తార.
ఇందులో ఎన్నో విషయాలు ప్రతిపాదింప బడ్డాయి. మనం ఈ రోజు బ్రహ్మోపాసనకు సోపానమైన 'సాధనాచతుష్టయం' గురించి తెలుసుకుందాం.
బ్రహ్మోపాసనకు నాలుగు సాధనాలు చెప్పబడినవి. ఈ సాధన చతుష్టయం బాగా అభ్యసించినవాడే బ్రహ్మ విద్యకు అధికారి. అవి ఏమిటో చూద్దాం.
1. వివేకం
2. వైరాగ్యం
3. షట్సంపత్తి
4. ముముక్షత్వం
వివరణ:
వివేకమనగా నిత్య అనిత్య వస్తు నిర్ణయం. బ్రహ్మమే సత్యమని, జగత్తు మిధ్య అని ధృడ విశ్వాసం కలిగి ఉండటమే వివేకం.
ఇంద్రియాల ద్వారా అనుభవించదగిన సమస్త భోగ వస్తువులు అశాశ్వతాలు అని ఎరిగి వాటి మీద కోరిక లేకపోవటమే వైరాగ్యం.
ఇక షట్సంపత్తి అనగా ఆరు సంపదలు. అవి ఏమిటో చూద్దాం;
- శమం
- దమం (ఉపరతి)
- తితీక్ష
- శ్రద్ధ
- సమాధానం
- ముముక్షత
ఇక వీటి వివరణ చూద్దాం:
అసంఖ్యాకమైన ఇంద్రియ విషయాలలోని దోషాలను ఎరిగి వాటినుండి మనసు మరల్చి, గమ్యమైన ఆత్మ సాక్షాత్కారం పై స్థిరంగా లగ్నం చెయ్యటాన్ని శమం అంటారు.
జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను నిగ్రహించి పరబ్రహ్మం మీద ద్రుష్టి ఉంచడాన్ని దమం అంటారు. బాహ్య ఆకర్షణలకు లొంగక మనస్సు ను అంతర్ముఖం చెయ్యడాని ఉపరతి అంటారు.
శీతోష్ణాలు, ఆకలి దప్పికలు మొదలైన ఈతి బాధలను ఓర్చుకుంటూ, ఇతురులు చేసే అపకారాలను క్షమించి వాటి వలన బాధపడకుండా ఉండటాన్ని తితీక్ష అంటారు.
శాస్త్ర వాక్యాలలోనూ , గురు వాక్యాలలోనూ పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండటం శ్రద్ధ అంటారు.
ఏకాగ్రతతో బుద్ధిని పరబ్రహ్మం నందు నిలపడాన్ని సమాధానం అంటారు.
అజ్ఞానం వలన కలిగే దేహభావం, అహంకారం - వీటివలన కలిగే ఇతర బంధాలను తెంచుకుని సస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మ సాక్షాత్కారం ద్వారా ముక్తిని పొందాలనే తపన ను 'ముముక్షుత' అంటారు.
ఆది శంకరాచార్యుల వారు
‘వివేక చూడామణి’ లో
“సాధనా చతుష్టయం” గురించి ప్రస్తుతించారు
సాధనలో నాలుగు అంశాలు వున్నాయి –
1. వివేకం 2. వైరాగ్యం 3. షడ్ సంపత్తి 4. ముముక్షుత్వం
నిత్యానిత్య వస్తు విచక్షణా జ్ఞానమే “వివేకం”,
ఇహ, ఆముత్ర కర్మ ఫల భోగ అనాసక్తే “వైరాగ్యం”
మోక్షప్రాప్తి కోరే తీవ్రసాధకుడి గుణగణాలే “షడ్ సంపత్తి”
షడ్ + సంపత్తి = ఆరు సంపత్తులు
అవి దమము, సమము, తితీక్ష ఉపరతి, శ్రద్ధ, సమాధానాలు
బహిరేంద్రియ నిగ్రహం అన్నదే “దమం”
అంతరేంద్రియ నిగ్రహం అన్నదే “సమం”
బాధలను నోర్చుకునే గుణమే “తితీక్ష”
‘కామం’ నుంచి కొంత, సందర్భానుసారంగా, వైదొలగడమే “ఉపరతి”
త్రికరణశుద్ధి + దీక్ష = “శ్రద్ధ”
ద్వంద్వాలలో సమంగా చలించకుండా వుండడమే “సమాధానం “
ముక్తిని సదా, తీవ్రంగా, కోరుకోవటమే “ముముక్షుత్వం”
* ఒకానొక సాధకుడికి వివేకం, వైరాగ్యం, షడ్ సంపత్తి, ముముక్షుత్వం అనే నాలుగు
లక్షణాలు ఉన్నప్పుడే మోక్షప్రాప్తి అవుతుంది” ..అన్నదే ఆదిశంకరాచార్యుల బోధ
సీతాఫలం చెట్టు
సీతాఫలం చెట్టు ఉపయోగాలు -
* మంచిగా పండిన సీతాఫలం తీసుకోవడం వలన రక్తం వృద్ది చెందును
* శరీరం నందు మాంస శాతాన్ని పెంచును. బక్కపలచగా ఉండువారు ఈ పండు తీసుకోవడం వలన మంచి కండ పొందగలరు.
* శరీరం నందు వేడిని హరించును .
* సీతాఫలం చెట్టు యెక్క ఆకు రసం 3 నుంచి 4 చుక్కలు దంత రంధ్రములో వేసిన క్రిములు ఊడిపడును.
* ఈ చెట్టు ఆకురసం పుండ్లపై పూసి పిమ్మట ఆ ఆకును ముద్దగా నూరి పుండ్లపైన వేసి కట్టు కట్టిన పుండ్లు మానును .
* ఈ పసరు పుండ్లపై పూయుట వలన పురుగులు పట్టిన పుండ్లు లలో పురుగులు చచ్చిపోయి పుండ్లు శీఘ్రంగా మానును .
ఈ యోగాన్ని పశువుల పుండ్లుపై నేను ప్రయొగించాను . చాలా మంచిఫలితాలు వచ్చాయి . రసాన్ని పుండుపై పిండి ఆకువేసి కట్టాను .
* దీని గింజలు రుబ్బి తలకు పట్టించిన పేలు పోవును .
* శీతాఫలం చెట్టు యొక్క లేత ఆకుల కషాయం ఇచ్చునచో చిన్న పిల్లల లో పేగు మలద్వారం నుంచి బయటకి వచ్చు సమస్య తీరిపోవును .
* శీతాఫలం చెట్టు కాండం పైన ఉన్న చెక్క కషాయం ఇచ్చినచో జ్వరం , ఉబ్బసం ద్వారా వచ్చే దగ్గు మానును
* శీతాఫలం తీసుకోవడం వలన గుండెకు అద్బుత బలం చేకూర్చును .
* శీతాఫలం యొక్క పండు గుజ్జు గడ్డలపైన వేసి కట్టినచో గడ్డలు పగులును .
* దీనిఆకు పసరు గజ్జి , తామర నయం చేయును .
* దీని విత్తనాల పొడిని పేపర్లో కొంచం కట్టి బట్టల మధ్యలో పెడితే బట్టలకు పురుగుల సమస్య ఉండదు.
శీతాఫలం ఎక్కువ తీసుకోవడం వలన కలుగు దోషాలు -
* శరీరంలో శ్లేష్మము పెంచును.
* కొద్దిగా పైత్యం చేయును .
* జీర్ణక్రియ సరిగ్గా లేనివారికి జ్వరం తెచ్చును
* అతిమూత్ర వ్యాధి కలిగినవారు దీనిని వాడరాదు.
* గర్భిణి స్త్రీలు దీనిని అసలు తినరాదు. దీనికి గర్భస్రావం కలిగించే గుణము కలదు .
మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
. కాళహస్తి వేంకటేశ్వరరావు
. అనువంశిక ఆయుర్వేద వైద్యులు
. 9885030034



