శ్రీరామ (94)
శుభోదయం.
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
మనస్సును ప్రాపంచిక విషయముల మీదికి పోకుండా నిగ్రహించి, భగవంతుని మీద లగ్నం చేయటం మనం అనుకున్నంత సులభం కాదు.
మనస్సును నిగ్రహించడం చాలా కష్టం.
సన్యాసం తీసుకుని, విజన ప్రదేశాలకు వెళ్లి, కఠిన నియమాలు పాటిస్తున్నా,
ప్రాపంచిక విషయములపైకి మనస్సు పరుగులు తీస్తూనే ఉంటుంది అంటున్నారు,
శ్రీ భర్తృహరి మహాయోగి:
శ్లో// భిక్షాశ౽నం,తదపి నీరస మేకవారం/
శయ్యా చ భూః,పరిజనో నిజ దేహమాత్రమ్/
వస్త్రం సుజీర్ణ శతఖండమయీ చ కన్థా/
హా!హా! తథా౽పి విషయాన్న జహాతి చేతః//
(అడుక్కుని తెచ్చుకున్న భిక్షాన్నమే ఆహారం.
అదీ నీరసం, అంటే ఏ రసము (రుచులు) లేనిది.
పరుపులు,దిండ్లూ ఏవీ లేకుండా కేవలం కటిక నేలమీదనే శయనించడం.
దాహం వేస్తే మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చే వారు కూడా లేరు.
నా కాళ్ళు, చేతులే నాసేవకులు.
చిరిగిపోయిన గుడ్డ పీలికలతో కూర్చిన బొంతయే నేను కట్టుకున్న వస్త్రము.
హా!హా! మనస్సును నిగ్రహించి, భగవంతుని మీద లగ్నం చెయ్యాలని కఠిన నియమములు పాటిస్తూ ఉన్న ఈ స్థితిలో కూడా,
నా మనస్సు, భగవంతుని గురించి ఆలోచించకుండా,
వదిలేసి వచ్చిన భార్యాపిల్లలు, ఆస్తిపాస్తులు, బంధు మిత్రులు, మొదలైన విషయములపైకే పరుగులు తీస్తోంది కదా!
ఇటువంటి ఈ మనస్సును నిగ్రహించడం ఎలా? ).
మనస్సును నిగ్రహించటానికి గొప్ప ప్రయత్నం చేసి మానవజన్మను సార్థకం చేసుకోవాలని సారాంశం.
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
25-2-'26.
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి