25, ఫిబ్రవరి 2026, బుధవారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 25 ఫిబ్రవరి 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*               

                   *8వ భాగం*    


     *భూగోళ ఆవిర్భావం*


 బ్రహ్మోపదేశం - చతుర్వేద సంపుటి 

```

శ్రీ మహావిష్ణువు మధుకైటభుల విన్నపం మన్నించి వారికి సదా చరితార్థులై బ్రహ్మాండంలో ఉంటారు అని వరమిచ్చి,  తన ఊరువులపైకి తీసుకుని చక్రంతో శిరస్సులు ఖండించాడు. 


శిరస్సులు తెగిన మధుకైటభుల మొండాల నుండి రక్తం పొంగి ప్రవహించింది. కొంతసేపటి తరువాత ఖండించబడిన ఇరువురి శిరస్సుల నుండి నల్లని పదార్ధం వెలువడి నీటిలోకి పొంగి ప్రవహించి ఒక్కటై గుండ్రటి పదార్థంగా మారసాగింది.


విష్ణువు వెంటనే తన ఊరువుల పరిమాణము కుదించి మాములుగా చేసాడు. ముధు కైటభుల మేధస్సు నల్లని పదార్ధముగా  ఒక్కటై బంతి ఆకృతిలో గుండటి ముద్దగా మారింది. నారాయణుని వక్షస్సులో నివసిస్తున్న లక్ష్మీదేవి చూసి "నాథా! ఏమిటీ నల్లని గోళ పదార్థము? ఎందుకు మధు కైటభుల శిరస్సుల నుండి ప్రవహించి నల్లని గోళంగా మారింది" అని విస్మయంగా అడిగింది.


విష్ణువు "లక్ష్మీ! మధు కైటభుల మేధస్సు అది. నారాయణ నామ స్మరణతో పవిత్రమై "మేధిని" గా మారి భూగ్రహం అవుతుంది. పద్నాలుగు లోకాలకు మూలమైన భూలోకంగా మారి నవగ్రహాలలో ఒకటవుతోంది. 

నా జగత్ సృష్టికి,  జగత్ లీలలకు ఈ భూమి మూలం కాబోతుంది. ముల్లోకాలకు పుణ్యభూమిగా, కర్మ భూమిగా ఈ భూగ్రహము తయారవుతుంది" అని పలికాడు.


లక్ష్మీదేవి ఆశ్చర్యపడి "మధుకైటభుల మేధతో ఏర్పడిన నల్లటి మట్టిముద్దకు ఇంతటి గౌరవం, ఆదరం లభిస్తోందా!" అని ప్రశ్నించింది.  


నారాయణుడు నవ్వుతూ "లక్ష్మీ! ఇది సాధారణ మట్టి ముద్ద కాదు. మహామాయ నన్ను ఆవహించినప్పుడు, నా స్పర్శతో ఋతు స్నాత అయ్యింది. ఆ మలినమే నా సంకల్పంతో మధు కైట భులుగా మారారు. వారు మరణించాక వారి మేధ మేధినిగా మారి భూమి రూపం పొందింది.


మహామాయ మేధినిగా మారి ప్రకృతిగా అవతరించి సృష్టికి క్షేత్రము అవుతుంది. అష్టాక్షరి మహామంత్రం పుణ్య ఫలం ఈవిధంగా సృష్టికి కేంద్రం అవుతుంది. నిజానికి ఇదంతా మాయ. ఈ మహామాయ ప్రభావంతో మహాశూన్యంలో అండపిండ బ్రహ్మాండాలు,లోకాలు,లోకాధిపతులు, జీవరాశులు ఆవిర్భవిస్తాయి. 

ఇదే శాశ్వతం, సర్వస్వం అనే మాయలో సకల చరాచర ప్రాణులు ఉంటారు. జనన మరణ చక్రంలో బంధీలు అవుతారు. స్వర్గ నరక భూలోకాల మధ్య తిరుగాడుతుంటారు. 


జ్ఞానము పొంది ఇది అంతా మిధ్య, మాయ,అశాశ్వతం అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నన్ను శాశత్వుడని గ్రహిస్తారు. అప్పుడు నన్ను చేరుకుని నాలో లీనమవుతారు. దీనినే మోక్షం అంటారు. పరబ్రహ్మ లీలగా నా చేత ఈ మాయా ప్రపంచం కల్పించబడుతుంది, రక్షించబడు తుంది. చివరికి లయం చెంది నాలో లీనమై పోతుంది. ఇదే నేనాడే లీలావినోద జగన్నాటకం" అనడంతో లక్ష్మీదేవి సంతృప్తురాలైంది.


మధుకైటభుల మరణంతో భయం తొలగిన బ్రహ్మదేవుడు కనపడని శ్రీమన్నారాయణునికి నమస్కరించి "తండ్రీ! నా కర్తవ్యం ఉపదేశించండి" అని అడిగాడు. 


"సృష్టి చేయి! సృష్టి చేయి!" అన్న శబ్దం వినిపించింది.  


చుట్టూపరికించిచూశాడు.అంతా నీరు, నీటి మధ్యలో ఒక మట్టి గోళం కనిపించింది. ఆ మట్టిగోళం నీటితో తడిగానే ఉంది. గట్టి పడలేదు. ఈ మృత్తికాగోళం నీటిపై ఎంత సేపు నిలబడుతుంది? మునిగిపోతుందేమో?  నేను ఏమి సృష్టించాలి? ఎక్కడ సృష్టించాలి? ఎలా సృష్టించాలి?


ఈ ప్రశ్నలకు సమాధానం బ్రహ్మదేవుడికి తట్టలేదు. మనస్సులో నారాయణుని తలచి "నీ ఆదేశం పాటించి సృష్టి ఏమి చేయాలో తెలియడం లేదు. నాకు సృష్టించడానికి శక్తి ప్రసాదించండి" అని ప్రార్థించాడు. 


ప్రసన్నుడైన మహావిష్ణువు బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమై "చతుర్ముఖా! నీకు మొదట ఉపనయనం చేసి బ్రహ్మోపదేశం చేస్తాను" అని సంకల్పం చేశాడు.


వేదమంత్రాలు వేదబ్రహ్మ ఆదేశంతో ప్రతిధ్వనించ సాగాయి. లక్ష్మీదేవి సువర్ణ యజ్ఞోపవీతం సృష్టించి విష్ణువుకి ఇచ్చింది. బ్రహ్మ మెడలో యజ్ఞోపవీతం వేసి ఉపనయనం పూర్తి చేశాడు. విష్ణు సంకల్పంతో మహాసరస్వతి అక్కడకు వచ్చింది. బ్రహ్మకు పరిచయం చేస్తూ "ఈమె పరబ్రహ్మమైన కృష్ణుడి నుంచి ఆవిర్భవించింది. సమస్త జ్ఞాన స్వరూపిణి, జ్ఞానానికి అధిదేవత. ఈ సరస్వతి అంశరూపంగా గాయత్రీదేవి ఇక్కడ ఉద్భవిస్తుంది" అనగానే సరస్వతి నుండి అంశారూపంగా గాయత్రీదేవి ఉద్భవించింది.


“బ్రహ్మదేవా! నాలుగు ముఖాలతో నీవు పలికిన ఓంకారానికి అధిష్ఠాన దేవత ఈ గాయత్రీదేవి. సమస్త మంత్రాలకు ఈమె మూలము అవుతుంది. ఈ గాయత్రీదేవిని నియమ నిష్టలతో త్రి (మూడు) కాలములలో ఆచరిస్తే సకల శుభాలు కలుగు తాయి" అని బ్రహ్మదేవుడి కుడి చెవిలో మూడు పాదాలు, ఇరవై నాలుగు అక్షరాలు గల గాయత్రీ మంత్రం ఉపదేశం చేశాడు.


బ్రహ్మదేవుడు స్వీకరించి తన నాలుగు ముఖాల ద్వారా    ఆరేసి అక్షరాల చొప్పున గాయత్రి మంత్ర జపం చేశాడు. ఫలితంగా గాయత్రీదేవి వచ్చి బ్రహ్మ వాక్కు లో స్థిర నివాసం ఏర్పర చుకుంది. ఇరవైనాలుగు అక్షరాల గాయత్రి జప ఫలంగా వేదము నాలుగు భాగాలై బ్రహ్మ నాలుగు ముఖాల నుండి వెలువడింది.  నాలుగు వేదాలు చతుర్వేద సంపుటిగా మారి బ్రహ్మదేవుని హస్తాన్ని అలంకరించాయి. గాయత్రీదేవి వాక్కులో స్థిర నివాసం ఉండటం, వేదాలలోని సమస్త జ్ఞానం లభించడం వలన బ్రహ్మ పరబ్రహ్మ జ్ఞానము పొందాడు. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించాడు.

 

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*

 ``

*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: