శ్రీరామ (19 - A)
( వాల్మీకి రామాయణం - 12 - A )
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
(24-3-'26 ' మధ్యాహ్నం ' పోష్టు తరువాయి భాగము)
తల్లి అయిన అహల్య శాపవిమోచనమంది, తండ్రి అయిన గౌతమునితో చేరినందుకు శతానందుడు అపరిమితానందమును పొందాడు.
ఆయన విశ్వామిత్రుని అనేక విధాలుగా స్తుతించాడు.
రాముని ప్రశంసించాడు.
" ఇటువంటి గురువు దొరికిన, నీకంటే ధన్యుడు ఈ లోకములో ఎవ్వడూ లేడు" అని రాముడితో అన్నాడు.
క్షత్రియుడై జన్మించి తన తపశ్శక్తితో, బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని చరితము నంతయు శతానందుడు అప్పుడు రామ లక్ష్మణులకు సవిస్తరంగా చెప్పాడు.
ఆ కథ క్లుప్తంగా చెప్పుకుందాము.
కుశిక వంశానికి చెందిన "గాధి" మహారాజు కుమారుడైన విశ్వామిత్రుడు ఒక సందర్భంలో వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి ' కామధేనువు ' సహాయంతో తనకు, తన సైన్యానికి వసిష్ఠమహర్షి ఇచ్చిన అద్భుతమైన ఆతిథ్యానికి ఆశ్చర్యపోయాడు.
ఆ "కామధేనువు" ను బలాత్కారంగా అపహరించడానికి ప్రయత్నించి,
కామధేనువు సృష్టించిన సైన్యం చేతిలో ససైన్యంగా ఓడిపోయాడు
అందువల్ల ఏర్పడిన "వసిష్ఠ మహర్షి" మీది స్పర్థతో, శివుణ్ణి గురించి తపస్సు చేశాడు.
శివుని మెప్పించి, ఆయన అనుగ్రహముతో ధనుర్వేదం పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు.
ఆ అస్త్రబలంతో తిరిగి వసిష్ఠమహర్షి ఆశ్రమానికి వచ్చి దివ్యమైన ఆ ఆశ్రమాన్ని తగలబెట్టాడు. వసిష్ఠుని సంహరించడానికి దివ్యాస్త్రాలు ప్రయోగించాడు.
వసిష్టమహర్షి తన "బ్రహ్మదండం"తో
ఆ అస్త్రాలను నిర్వీర్యం చేయగా ఆయన మీద "బ్రహ్మాస్త్రం" ప్రయోగించాడు.
ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా వసిష్ఠుడు బ్రహ్మదండంతో మ్రింగివేశాడు.
బ్రహ్మాస్త్రంతో సహా తన అస్త్రాలన్నీ అలా నిర్వీర్యమవటం చూసి,
బ్రహ్మ బలం ముందు క్షత్రియ బలం ఎందుకూ పనికిరాదని విశ్వామిత్రుడు గ్రహించాడు.
అందువల్ల "బ్రహ్మర్షి" అవడానికి దక్షిణ దిశకేగి తపస్సు ప్రారంభించాడు.
అక్కడ ఇక్ష్వాకు వంశీకుడైన " త్రిశంకువు" ను సశరీరంగా స్వర్గానికి పంపడం కోసం, వసిష్ఠ పుత్రుల శాపంతో "ఛండాలు" డైన, అతని చేత యజ్ఞము చేయించాడు.
ఆ యజ్ఞాన్ని, తనను , ఆక్షేపించిన వసిష్ఠ పుత్రులను, "మహోదయుడు"అనే మహర్షిని శపించాడు.
వేదవిరుద్ధమైనందున ఆ యజ్ఞం విఫలమయింది. హవిర్భాగాలు తీసుకోటానికి దేవతలు రాలేదు.
అప్పుడు తన తపశ్శక్తితో విశ్వామిత్రుడు త్రిశంకువును స్వర్గానికి పంపాడు.
గురుశాపహతుడైనందున త్రిశంకువును
స్వర్గం నుండి ఇంద్రుడు త్రోసివేయగా,
తలక్రిందుగా క్రింద పడబోతున్న
ఆయనను తపోబలంతో మధ్యలో ఆపి,
అతని కోసం విశ్వామిత్రుడు "త్రిశంకు స్వర్గం" నిర్మించి సృష్టికి ప్రతి సృష్టి చేయడం ప్రారంభించాడు.
" ఇంకో ఇంద్రుని సృష్టించేదా ! లేక అసలు ఇంద్రుడనేవాడు లేకుండా చేసేదా !
(అన్యమింద్రం కరిష్యామి, లోకోవాస్యత్ అనింద్రకం)
అని ఆలోచిస్తుండగా భయభ్రాంతులైన దేవతలు విశ్వామిత్రుని శరణుజొచ్చారు.
వారి అభ్యర్థనను మన్నించి విశ్వామిత్రుడు ప్రతిసృష్టి ని నిలిపివేసి, "త్రిశంకువు" "త్రిశంకు స్వర్గం" లో ఇంద్రభోగాలు అనుభవిస్తూ శాశ్వతంగా ఉండేటట్లు దేవతలను అంగీకరింపజేశాడు.
ఆ ప్రదేశంలో తన తపస్సుకు విఘ్నం వచ్చినందువల్ల విశ్వామిత్రుడు ఆ దక్షిణ దిక్కును వదిలేసి, పశ్చిమ దిశలో "పుష్కర" తీర్థము నందు తిరిగి తపస్సు చేయడం ప్రారంభించాడు.
అక్కడ అయోథ్యాధిపతియైన అంబరీషుడు అను రాజు యజ్ఞపశువుగా కొనుక్కొని తీసుకు వెళ్తున్న తన అక్క సత్యవతి కుమారుడైన "శునశ్శేఫుని" రక్షించడం కోసం తన పుత్రులలో ఒకరిని యజ్ఞపశువుగా వెళ్లమని అడిగాడు.
వారు నిరాకరించగా స్వంత కుమారులని కూడా చూడకుండా, " ఆటవిక జాతులలో జన్మించి కుక్క మాంసం తింటూ వేలకొలది సంవత్సరాలు గడపండని " వారిని శపించాడు.
మంత్రోపదేశం చేసి " శునశ్శేఫుని" రక్షించాడు.
తిరిగి గొప్ప తపస్సు చేసి బ్రహ్మ దేవుని చేత
నీవిప్పుడు" రాజర్షి" నుండి, "ఋషి" వి అయినావు అనిపించుకున్నాడు.
అయితే తన లక్ష్యమైన బ్రహ్మర్షి అవడానికి విశ్వామిత్రుడు తిరిగి తీవ్రంగా తపస్సు ఆరంభించాడు.
విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి,
ఇంద్రుని పంపున "మేనక" అనే అప్సరస వచ్చింది.
ఆమె హావభావాలకు లొంగిన విశ్వామిత్రుడు
కామాతురుడై ఒక క్షణం లాగా పది సంవత్సరములు మేనకతో గడిపాడు.
ఒకరోజు హఠాత్తుగా తన తప్పు తెలుసుకొని, ఆమెను త్యజించి,
ఉత్తరదిక్కున ఉన్న హిమాలయములకు వెళ్లి తపస్సు ప్రారంభించాడు.
విశ్వామిత్రుని తీవ్ర తపస్సుకు సంతోషించిన బ్రహ్మ " నీ విప్పుడు మహర్షివి అయ్యావు" అన్నాడు.
"నేను మహర్షిని అయితే, కామ, క్రోధములను జయించినట్లే గదా!"అన్న విశ్వామిత్రునితో
"నీవు ఇంకా కామ, క్రోధములను జయించలేదు, ప్రయత్నము కొనసాగింపుము" అని బ్రహ్మదేవుడు చెప్పాడు.
విశ్వామిత్రుడు తిరిగి తీవ్రంగా తపస్సు కొనసాగించాడు.
అప్పుడు దేవతల పంపున "రంభ" అనే అప్సరస విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి వచ్చింది.
అది గ్రహించి పట్టరాని కోపంతో "రంభ"ను శిలవై పోదువుగాక అని విశ్వామిత్రుడు శపించాడు.
అయితే క్రోధమును జయించ లేక పోయినందుకు పశ్చాత్తాపం చెంది, విశ్వామిత్రుడు ఆ ఉత్తర దిక్కును కూడా వదిలేసి, తూర్పు దిక్కుకు వెళ్లి, పూర్తిగా మౌన వ్రతుడై అక్కడ అతి తీవ్రమైన తపస్సు చేశాడు.
విశ్వామిత్రుని తపస్సుకు జగత్తంతా తపించింది.
దేవతలు, ఋషులు, వెంటరాగా బ్రహ్మ దేవుడు వచ్చి విశ్వామిత్రునితో " నీవు బ్రహ్మర్షి వయ్యావు" అన్నాడు.
విశ్వామిత్రుని కోరికననుసరించి వసిష్ఠమహర్షి కూడా అక్కడికేతెంచి " ఏ సందేహము లేదు. ఇప్పుడు నీవు బ్రహ్మర్షివే " అని సాదరంగా విశ్వామిత్రునితో అన్నాడు.
ఈవిధంగా పవిత్రము, అద్భుతము అయిన విశ్వామిత్ర చరిత్రను శతానందుడు చెప్పగా రామలక్ష్మణులు, జనకమహారాజుతో సహా సభాసదులందరూ పరమాశ్చర్యానికి లోనయ్యారు.
వారందరు విశ్వామిత్రుని పూజించారు.
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.
ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః
(సశేషం)
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు.
24-3-'26
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి