20, మార్చి 2026, శుక్రవారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*గురువారం 19 మార్చి 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం* 

 `` *30వ భాగం*``


*మత్స్యావతార కథ*```


మానససరోవరంలోని రాజహంస నారదుని కోరికపై శ్రీహరి మత్స్యావతార కథ చెబుతోంది. 


బ్రహ్మకు రోజులో పగలు పూర్తి అయ్యి రాత్రి వచ్చే సమయం అవుతోంది. బ్రహ్మదేవుడు సృష్టి ఆపి రాత్రి సమయంలో నిద్రిస్తాడు. సృష్టికర్త శయనించగానే భూమిపై జలప్రళయం వస్తుంది. భూమి పైన నివసించే వారికి ఈ సంగతి తెలియదు. సకల రాజ్యాలలో ప్రజలు ధర్మ మార్గం అనుసరిస్తూ సుఖశాంతులతో ఉన్నారు. 

అలా సుఖశాంతులు కలిగి ఉన్న దేశాలలో ద్రవిడ దేశం ఒకటి. 

ఆ రాజ్యానికి సత్యవ్రతుడు మహారాజుగా ఉన్నాడు.


సత్యవ్రతుడు శ్రీమహావిష్ణువు భక్తుడు. తన రాజ్యంలో అనేక వైష్ణవాలయాలు నిర్మించి నారాయణుడి విగ్రహాలు ప్రతిష్టించి నిత్య పూజలు ఘనంగా చేయడానికి తగిన ఏర్పాట్లు చేశాడు. 

తన రాజభవనానికి ఎదురుగా వైష్ణవాలయం నిర్మించి ప్రతిష్టించిన శ్రీమహావిష్ణువు విగ్రహానికి స్వయంగా నిత్యాభిషేక అర్చనలు చేసేవాడు.


ప్రతిరోజూ ప్రాతఃకాలంలో లేచి నగర సమీపాన గల'కృతమాలిక" అనే నదిలో స్నాన సంధ్యలు పూర్తిచేసి నారాయణునికి జలతర్పణం ఇచ్చేవాడు. 

నిత్య పూజలతో, అర్చనలతో, అభిషేకాలతో, తర్పణాలతో సత్యవత్రుడు విష్ణువుకి అత్యంత ప్రియభక్తుడు అయ్యాడు. శ్రీహరి తన ప్రియభక్తుని రాబోయే జల ప్రళయం నుండి రక్షించడానికి సంకల్పించాడు.


రాబోయే జల ప్రళయాన్ని సూచిస్తూ ఆకాశమంతా దట్టమైన మేఘాలతో నిండిఉంది. సత్యవ్రతుడు ప్రతిరోజు లాగానే తెల్లవారుజామునే లేచి కృత మాలికనదిలో స్నానసంధ్యాదులు పూర్తి చేసి శ్రీహరికి జలతర్పణం ఇవ్వడానికి ‘ఓం నమోనారాయణాయ’ మంత్రం జపిస్తూ దోసిలిలోకి నీరు తీసుకుని కన్నులు మూసుకుని వదలబోయాడు.


అప్పుడు సత్యవ్రతుడికి "మహారాజా! ఆగుము! శరణు కోరే నా విన్నపం వినుము" అన్న మాట వినిపించింది. 


కన్నులు తెరచి చుట్టూ చూసాడు. ఎవరు కనపడలేదు. దోసిలి లోని నీటిలో కలకలం ఏర్పడింది. దోసిలి వంక చూస్తే నీటిలో ఒక చిన్న చేప పిల్ల కనిపించింది. ఉలిక్కిపడి ఆ చేపను దోసిలి నీటితో సహా నదిలోకి వదల బోయాడు.


ఆ చిన్న చేపపిల్ల మానవభాషలో "రాజా! నదిలోకి నన్ను వదలద్దు. నేను చెప్పే మాట వినుము" 

అని అరిచింది. 


సత్యవ్రతుడు ఆశ్చర్యంతో దోసిలి నీటిలో 

ఉన్న చేపపిల్ల వంక చూశాడు.


"సత్యవ్రత మహారాజా! నన్ను రక్షించి కాపాడుము. ఈ నదిలోని పెద్ద చేపలు నాలాంటి చిన్న చేపలను పట్టుకుని తినేస్తాయి. ఆ పెద్ద చేపలనుంచి తప్పించుకుని జీవించినా జాలరులు తమ వలలు విసిరి పట్టుకుని ప్రాణం తీసి తినడానికి అమ్మేస్తారు. నా ప్రాణాలు కాపాడుకోవడానికి నీ దోసిలిలోకి వచ్చాను.


నీవు శ్రీమన్నారాయణుని మహాభక్తుడివి. నిత్యం తర్పణాలు, పూజలు చేస్తావు. నారాయణుడు సకల జీవుల పై సమాన కరుణ చూపించి కాపాడుతాడు. ధర్మమూర్తివైన నీవు దేవాధిదేవుడు శ్రీహరిలాగా చిన్నచేపపిల్లనైన నన్నురక్షింపుము. నీ శరణుకోరుతూ వచ్చాను" అని దీనంగా అడిగింది.


సత్యవ్రతుడు చేపపిల్ల మాటలకు జాలిపడి దానిని తన కమండలం లోని నీటిలోకి విడిచాడు. తర్పణాలు పూర్తి చేసుకుని కమండలంతో రాజభవనానికి వెళ్లాడు. రాత్రి గడిచేసరికి ఆ చేపపిల్ల కమండలం పట్ఠనంత ఎదిగింది. సత్యవ్రతుడు పొద్దున చూసి ఆశ్చర్యపోయాడు. రాజుని చూసిన చేపపిల్ల తనను కమండలం నుంచి పెద్ద పాత్రకు మార్చమని కోరింది.


చేపపిల్ల కోరిక మన్నించి సత్యవత్రుడు ఆ చేపను అంతపురంలో గల పెద్ద నీటిబానలో జారవిడిచాడు. మూడు ఘడియల సమయం అయ్యే సరికి ఆ చేప నీటిబానలో ఇమడలేనంతగా పెరిగింది. మరింత ఆశ్చర్యం చెందిన సత్యవ్రతుడు చేపను తీసుకుని చిన్న సరస్సులో వదిలాడు. 

మరో ఘడియ గడిచేసరికి చేప మడుగంత పెరగటంతో నదిలోకి తీసుకెళ్లి వదిలాడు.


మరి కొంత సమయం గడిచేసరికి నది విస్తీర్ణం దాటి చేప ఎదిగింది. విస్తుబోయన సత్యవత్రుడు జాలిపడి ఆ మహామత్స్యాన్ని తీసుకెళ్లి సముద్రంలో వదిలేశాడు. అప్పుడు ఆమహామత్స్యం సత్యవత్రుని చూసి "రాజా! నన్ను ఇంతవరకు కాపాడి ఇప్పుడు మహాసముద్రంలో వదిలేశావు. ఇక్కడ ఉండే మొసళ్ళు, తిమింగలాలు నన్ను వెంటాడి వేటాడి చంపి తినేస్తాయి. నీకు న్యాయమా!" అని అడిగింది.


చేప మాట్లాడిన మాటలకు, ఆకారానికి పొంతన లేకపోవడంతో సత్యవత్రుడు విస్మయం చెందుతూ "మత్స్యమా! నీవు ఒక్క రోజులో నూరు యోజనాల పొడవు పెరిగావు. నీ లాంటి మత్స్యాన్ని ఇంతవరకు చూడలేదు, వినలేదు. ఇంత ఆకారం ఉండి నీవు దీనంగా మాట్లాడిన మాటలు వింతగా ఉన్నాయి. నీవు మామూలు చేపవి కావు. తప్పకుండా నన్ను పరీక్షంచడానికి వచ్చిన 

నా దైవం నారాయణుడవే నీవు!


ఈ మత్స్యావతారం ధరించి నన్ను పరీక్షించడం దేనికి? కారణం ఏమిటి? నన్ను అనుగ్రహించి బోధపరచుము!" అని ప్రార్ధించాడు. 


కరుణించిన శ్రీమహావిష్ణువు మత్స్య రూపం వదలి శంఖ చక్ర గదా పద్మ ధరుడైన చతుర్భుజ రూపంలో దర్శవమిచ్చాడు. సత్యవ్రతుడు దివ్య నారాయణమూర్తి దర్శనంతో తన్మయుడై శ్రీహరిని అనేక విధాలుగా స్తుతించాడు.


ప్రసన్నుడైన నారాయణుడు చిరునవ్వుతో "సత్యవ్రతా! నేటికి ఏడవ రోజున బ్రహ్మదేవుడి పగటి కాలం అంతమై రాత్రి ప్రారంభమవుతుంది. జల ప్రళయం సంభవించి భూమండలం జలరాశిలో మునిగిపోతుంది. భూమి పై గల సమస్త ప్రాణులు అంతరించి పోతాయి. ఒక నావ మాత్రం జలధిలో తేలుతూ వస్తుంది. ఆ నావలో సప్త ఋషులు పునఃసృష్టికి కావలసిన జీవ జంతువులు, ధాతువులతో ఉంటారు. మహర్షుల తేజస్సు నీకు అంధకారంలో కాంతిపుంజం వలె కనిపిస్తుంది.


పునఃసృష్టి కావలసిన అన్ని రకాల ధాన్య, ఫల, ఆహార పదార్థాలు విత్తనాలు సేకరించి నీవు ఆ నావలోకి చేర్చుము. నీవు నావ ఎక్కి కూర్చున్న తరువాత నేను ఈ మత్స్య రూపంలో వచ్చి నావను నాతో తీసుకు వెళతాను. 

నా మత్స్యావతారం నీకు చూపించడం వెనుక గల ఉద్దేశం ఇదే! నీవు సిద్దంగా ఉండుము" అని అదృశ్యమయ్యాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: