20, మార్చి 2026, శుక్రవారం

వాల్మీకి రామాయణం - 4 )

 శ్రీరామ (11)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


             ( వాల్మీకి రామాయణం - 4 )


         " 20-3-'26, ఉదయం పోష్టు తరువాయి భాగం "

                                ----------


శ్రీరామచంద్రుని శుభ గుణములను నారదమహర్షి, వాల్మీకి మహర్షికి ఇంకా ఇలా తెలియజేస్తున్నారు.


13. శ్లో// ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః /

రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా //


14. శ్లో// రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా /

వేదవేదాంగ తత్త్వజ్ఞో ధనుర్వేదేచ నిష్ఠితః //


15. శ్లో// సర్వ శాస్త్రార్థ తత్త్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ /

సర్వలోక ప్రియః సాధు రదీనాత్మా విచక్షణః //



33.ఆ రాముడు సాక్షాత్తూ సృష్టికర్త అయిన బ్రహ్మదేవునితో సమానుడు (ప్రజాపతి సమః).


34.మరియు, సకల లోకములను మించిన ఐశ్వర్యము కలవాడు (శ్రీమాన్).


35. రాముడు సకల లోకములను పోషించే వాడు (ధాతా).


36.ధర్మవిరోధులను నశింపజేసేవాడు (రిపునిషూదనః)..


37. జీవులందరినీ రక్షించే వాడు (రక్షితా జీవలోకస్య).


38.ధర్మాన్ని బాగుగా రక్షించే వాడు (ధర్మస్య పరిరక్షితా)


39.రాముడు ఎల్లప్పుడు తనవంశాచారాలను కాపాడుకునే వాడు (రక్షితా స్వస్య ధర్మస్య).


40. తన బంధు, మిత్రులందరినీ కాపాడుకునే వాడు (స్వజనస్య చ రక్షితా).

(అత్యాసన్నం పరిత్యజ్య మునేర్దత్తం తు 

నిష్ఫలమ్ = దగ్గర బంధువును,లేదా ఆశ్రితుని, కాదని మునీశ్వరునికి దానం చేసినను అది నిష్ఫలమే, అను ధర్మశాస్త్రము ననుసరించి ఆశ్రిత బాంధవులను విశేషించి రక్షించువాడు అని అర్థం)



41. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము, అనే ఆరు అంగములతో కూడిన వేదము సంపూర్ణంగా అధ్యయనం చేసిన వాడు.

ఋక్,యజుస్,సామ,అథర్వము లనే నాలుగు వేదములు తెలిసిన వాడు. 

 వేద, వేదాంగముల అర్థమే గాకుండా, వాటి తత్త్వము కూడా తెలిసిన జ్ఞాని 

(వేద వేదాంగ తత్త్వజ్ఞః).


42. ధనుర్వేదమునందు విశేషమైన ప్రతిభ కలవాడు (ధనుర్వేదే చ నిష్ఠితః)


43. .సమస్త శాస్త్రములు తెలిసినవాడు.

ఆ శాస్త్రములయొక్క అర్థము, ఆ శాస్త్రములయొక్క ప్రయోజనము, ఏ ఉద్దేశముతో శాస్త్రము అలా చెబుతున్నది? అనే విషయములతో కూడిన శాస్త్రము యొక్క తత్త్వము బాగా తెలిసినవాడు.

(సర్వ శాస్త్రార్థ తత్త్వజ్ఞః).


44. తెలిసిన విషయములన్నీ ఎప్పుడూ జ్ఞప్తిలో ఉంచుకునే వాడు ( స్మృతిమాన్).


45. ఆ తెలిసిన విషయములను దేశ, కాలములకు అనుగుణంగా ఆచరణలో పెట్టే ప్రతిభ (యుక్తి) కలవాడు.

(ప్రతిభానవాన్).


46. తన ప్రవర్తన వల్ల సమస్తజీవులకు ఇష్టమైన వాడు.

( సర్వలోక ప్రియః).


47. తనకు, అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసే సాధు పురుషుడు (సాధుః).


48. ఎన్ని కష్టములు వచ్చినా,దీనత్వము పొందని, ఆత్మవిశ్వాసము కలవాడు (అదీనాత్మా - Abundant Self confidence)


49. దేశ కాల పరిస్థితులను అవగాహన చేసుకుని,ఎప్పుడు 

 ఏమి చేయవలెను, ఏమి చేయగూడదు, అనే విచక్షణా జ్ఞానం కలవాడు.

( విచక్షణః).




(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

20-3-'26

కామెంట్‌లు లేవు: