*🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏*
*🦚పంచాంగం🦚*
*పంచాంగం అనగా ఐదు అంగములు కలది, అవి తిధి, వారం, నక్షత్రం, కరణం, యోగం.*
*శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*
*తేదీ ... 20 - 03 - 2026*
వారం ... భృగువాసరే
*( శుక్రవారం )*
*శ్రీ పరాభవ*
నామ సంవత్సరం,
*ఉత్తరాయణం*
*వసంత ఋతువు*
*చైత్ర మాసం*
*శుక్ల / శుద్ధ పక్షం*
*తిథి* : *విదియ* తె4.11 వరకు,
*నక్షత్రం* : *రేవతి* తె4.10 వరకు,
*నక్షత్రాధిపతి*. : *బుధుడు*
*యోగం* : *బ్రహ్మం* రా11.52 వరకు,
*కరణం* : *బాలువ* సా4.58 వరకు,
*తదుపరి* :*కౌలువ* తె4.11 వరకు,
*వర్జ్యం* : సా4.36 - 6.09,
*దుర్ముహూర్తము* : ఉ8.40 - 9.27,
*మరల* : మ12.34 - 1.21,
*అమృతకాలం* : రా1.51 - 3.24,
*రాహుకాలం* : ఉ10.30 - 12.00,
*యమగండం / కేతుకాలం* : మ3.00 - 4.30,
*సూర్యరాశి : మీనం*
*చంద్రరాశి : మీనం*
*సూర్యోదయం : 6.09*
*సూర్యాస్తమయం : 6.07*
*🦜నేటి విశేషం🦜*
*🙏చైత్రమాసం ప్రారంభం - విశిష్టత🙏*
*ఋతూనాం కుసుమాకరాం*
*అని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న, వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం.*
*సంవత్సరానికి తొలి మాసం కూడా, చైత్రమాసం అనగానే మనకి ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి.*
*అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం, వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.*
*అలా "చైత్ర మాసం" సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక , పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా.*
*ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు.*
*సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.*
*॥ చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది ॥*
*ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది.*
*చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక, సౌరమానాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈ రోజు నుండీ సంవత్సరాదిని జరుపుకుంటారు.*
*ఉగాది నాడు కొన్ని పనులను చేయాలని పెద్దలు చెప్పారు.*
*అవి ఏమిటంటే, ఉగాది నాడు తైలాభ్యంగన స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించాలి.*
*ప్రతీ గృహమునందు ధ్వజారోహణం, లేదా జయకేతనం ఎగురవేయాలి.*
*సృష్టి మొదలు అయిన రోజున (యుగాది) సృష్టిని చేసిన మహావిష్ణువుని పూజించాలి.*
*ఉగాది నాడు షడ్రుచులతో కూడిన పచ్చడిసేవనం (నింబకుసుమ భక్షణం) పంచాంగ శ్రవణం, తెలుగు వారికే ప్రత్యేకమైన అవధానం, వంటివి పండుగకే శోభనిస్తాయి.*
*॥ చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది నుండి చైత్రశుద్ధ నవమి వరకూ "వసంత" నవరాత్రులు ॥*
*సంవత్సరంలో మనం మూడు సార్లు నవరాత్రులు జరుపుకుంటాము.*
*మొదటిది చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు, రెండవది భాద్రపదమాసంలో వచ్చే గణపతి నవరాత్రులు, మూడవది ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు.*
*సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.*
*ఈ తొమ్మిది రోజులూ రామాయణాన్ని పారాయణ చేసి, నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి, చూసి తరిస్తారు.*
*రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం వుంది.*
*రామాయణంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి.*
*రాముడు జన్మించినది మొదలు, వనవాసానికి వెళ్ళటం, దశరథుని మరణం, సీతాపహరణం, రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం, శ్రీరామ పట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి.*
*॥ చైత్ర శుద్ధ విదియ ॥*
*విదియ నాడు బాలచంద్రుడిని బాలేందు వ్రతం అని పూజిస్తారు.*
*చంద్రునికో నూలుపోగు అని విదియ నాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగు అని సమర్పిస్తారు.*
*చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకీ నూలుపోగు సమర్పించి, మనకి జ్ఞానాన్నిమ్మని కోరుతారు.*
*॥ చైత్ర శుద్ధ తదియ ॥*
*డోలాగౌరీ వ్రతం (సౌభాగ్య గౌరీ వ్రతం) సౌభాగ్య శయన వ్రతం, ఆ రోజున పార్వతీ పరమేశ్వరులను దమనంతో పూజించి, డోలోత్సవం నిర్వహిస్తారు.*
*చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు.*
*పార్వతీ దేవి శివుడిని భర్తగా పొందటం కోసం తపస్సు చేసినప్పుడు, చైత్ర శుద్ధ తదియ నాడు ఆ తపస్సు ఫలించింది.*
*సౌభాగ్యాన్ని, పుత్ర పౌత్రాదులను, భోగ భాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు.*
*॥ ఈ రోజు మరో విశేషం - మత్స్య జయంతి ॥*
*శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకుణ్ణి వధించి, వేదాలను రక్షించిన రోజు.*
*॥ చైత్ర శుద్ధ పంచమి ॥*
*లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈ రోజు పూజించాలి.*
*అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ , మహాపద్మ, అనే మహానాగులను పూజించి, పాలు, నెయ్యి నివేదించాలి.*
*అశ్వములను (గుర్రాలను) కూడా ఈ రోజు పూజించాలి.*
*శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవావతారం కూడా ఒకటి.*
*ఈ రోజు శ్రీరామ రాజ్యోత్సవం, అనగా రాముల వారికి పట్టాభిషేకము జరిగిన రోజు.*
*మనమందరం శ్రీరామ పట్టాభిషేకము చేయించడం మంచిది.*
*ఒకవేళ చేయలేకపోయినా శ్రీరామాయణంలో రామపట్టాభిషేకము ఘట్టము పారాయణము చేయడం మంచిది.*
*॥ చైత్ర శుద్ధ అష్టమి ॥*
*భవాని దేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టమి అంటారు.*
*ఆరోజు భవాని మాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి, అశోకవృక్షం చిగురుని సేవిస్తే గర్భశోకం కలుగదని శాస్త్రము చెప్పింది.*
*॥ చైత్ర శుద్ధ నవమి ॥*
*శ్రీరామనవమి. శ్రీమహావిష్ణువు తన పూర్ణావతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు.*
*ఈ రోజు ఊరూరా, వాడవాడలా శ్రీసీతారాముల కళ్యాణం చేస్తారు.*
*నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు.*
*వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం.*
*॥ చైత్ర శుద్ధ ఏకాదశి ॥*
*వరూధిన్యేకాదశి , కామద ఏకాదశి అని అంటారు.*
*॥ చైత్ర శుద్ధ పౌర్ణమి ॥*
*స్త్రీలు చిత్రవర్ణాలు గల (రక రకాల రంగులు) వస్త్రాలను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది.*
*ఈ రోజు, చిత్రగుప్తుని వ్రతం చేయడం మంచిది.*
*ఉత్తర భారతదేశంలోని వారు హనుమజ్జయంతిని జరుపుకుంటారు.*
*॥ చైత్ర బహుళ త్రయోదశి ॥*
*యజ్ఞవరాహ జయంతి. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి యజ్ఞ వరాహమూర్తి అవతరించిన రోజు.*
*ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు, ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్ర మాసం.*
*ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు.*
*మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకుని, రామాయణ సారాన్ని గ్రహించి, సీతారాముల కళ్యాణం చూసి తరించి, సనాతన ధర్మాచరణకై పాటుపడడం ఉత్తమం...*
*🪷శుభమస్తు.🪷*
*🙏సమస్త లోకా సుఖినో భవంతు.🙏*
*🦚జై శ్రీకృష్ణ.🦚*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి