🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*శుక్రవారం 1 మే 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
*74వ భాగం*
*మాధాంత వంశము - సగర చక్రవర్తి జననం*```
మాంధాత కుమారుడు అంబరీషుడు. అంబరీషుడి కుమారుడు యువనాశ్వుడు. యువనాశ్వుడి కుమారుడు హరిషుడు. వీరి సంతతి అంతా అంగిరసులు అనే ఆరు కోట్ల గంధర్వులుగా వృద్ధి చెందారు. వీరు పాతాళానికి వెళ్లి నాగజాతితో యుద్ధం చేసి చెదరకొట్టి వారి వద్ద నున్న రత్నాలు మణులు అపహరించారు.
నాగులు శ్రీమన్నారాయణుడి వద్దకు వెళ్లి అంగిరసులు అనే గంధర్వులు తమ లోకం పై దాడి చేసి తమ రత్నాలు మణులు అపహరించడం గురించి విన్నవించి రక్షించమని ప్రార్ధించారు. విష్ణువు వారికి అభయమిస్తూ "నాగులారా! భూమి పైన పురుకుత్సుడు అనే రాజు రాజ్యం చేస్తున్నాడు. అతనికి నా శక్తి రక్షణగా ఉంది. మీరు వెళ్ళి ఆ రాజుని ప్రార్ధించండి గంధర్వులను సంహరించి మీకు రక్షణ ఇస్తాడు" అని ఉపాయం చెప్పాడు.
నాగులు తమలోకం తిరిగి వెళ్లి పురుకుత్సుడు దగ్గరకు ఎవరిని పంపుదాము అని చర్చిస్తుండగా అక్కడ తపస్సు చేస్తున్న ముని వచ్చి "పురుకుత్సుడికి నర్మద (నది) అంటే చాలా ఇష్టం. నర్మదకు కూడా పురుకుత్సుడి పై ప్రేమ ఉంది. నర్మద చెబితే పురుకుత్సుడు కాదనడు. మీ పక్షాన యుద్దం చేసి శత్రువులను సంహరిస్తాడు. మీరు ఆమెను ప్రార్ధించండి" అని సూచించాడు.
నాగులు నర్మదానది వద్దకు వెళ్లి ప్రార్ధించగా ఆమె దివ్యకాంతగా దర్శనమిచ్చింది. నాగులు శ్రీమహావిష్ణువు పురుకుత్స మహారాజు గురించి చెప్పినది చెప్పి ఆ రాజుని తమకు సహాయం చేసేటట్టు చేయమని ప్రార్ధించారు.
నర్మద అంగీకరించి పురుకుత్సునికి విషయం చెప్పి నాగుల వద్దకు తీసుకువచ్చింది.
నాగులు స్వాగతించి సత్కరించి "మహారాజా! మహావిష్ణువు వాక్కుని నిజం చేయండి. మాకు సహాయంగా యుద్ధం చేసి శత్రువులైన గంధర్వులను సంహరించండి" అని ప్రార్ధించారు.
నర్మద కూడా నాగులకు సహాయం చేయమని చెప్పింది.
నర్మద చెప్పడంతో వెంటనే పురుకుత్సుడు గంధర్వులతో యుద్ధం చేసి వారిని సంహరించి నాగులకు భయం తొలగించాడు.
తమకు ఉపకారం చేసిన నర్మదకు నాగులు "ఎవరైతే "ఓం నర్మదా నమః" అని ఉభయ సంధ్యలలో భక్తితో స్మరిస్తారో వారికి సర్పవిషం సోకదు. నర్మద నామం పలికి భోజనం చేసేవారికి విషము పెట్టినా అమృతం అవుతుంది" అని వరం ఇచ్చారు.
నర్మద వరం తీసుకుని ఆనందంగా తన మాట నిలబెట్టిన పురుకుత్సుని వరించి వివాహం చేసుకుంది.
పురుకుత్సునికి నర్మదకు త్రసదస్యుడు అనే కుమారుడు కలిగాడు. అతని కుమారుడు అనరణ్యుడు యజ్ఞం చేస్తుండగా రావణుడు వచ్చి యజ్ఞం భగ్నం చేసి అనరణ్యుని చంపి వెళ్లి పోయాడు.
అనరణ్యుని కుమారుడు హర్యాక్షుడు. హర్యాక్షుని కుమారుడు ప్రియారణుడు. ప్రియారణుని కుమారుడు సత్యవత్రుడు.
సత్యవ్రతుడు వసిష్టుని శాపం పొంది త్రిశంకుడు అనే నామంతో ఛండాలుడై అడవుల్లో ఉండసాగారు. విశ్వామిత్రుడు కుటుంబాన్ని ఆశ్రమంలో వదలి తపస్సుకి వెళ్లినప్పుడు భయంకరమైన కరువు వచ్చింది. తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేక జనులు చనిపోసాగారు. త్రిశంకుడు అడవిలో మృగాలను చంపి మాంసం తెచ్చి ఇచ్చి విశ్వామిత్రుడి భార్య పిల్లలు మరణించకుండా కాపాడాడు.
విశ్వామిత్రుడు వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని, తన కుటుంబాన్ని కాపాడిన త్రిశంకుడు కోరినట్లు యాగం చేసి సశరీరంగా స్వర్గానికి పంపాడు.
ఇంద్రుడు క్రిందకు తోసివేస్తే త్రిశంకుడు స్వర్గం మధ్యలో సృష్టించి ఉంచటంతో ఇంద్రుడు భయపడి స్వర్గంలోకంలో ఉండటానికి అనుమతించారు.
త్రిశంకుడి కుమారుడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి వచ్చిన కలలో ఇచ్చిన మాటకు కట్టుబడి విశ్వామిత్రునికి సకల సంపదలు, రాజ్యం ఇచ్చేసి భార్య కుమారుడితో కాశికి వెళ్లి పోయాడు. అక్కడ భార్యాబిడ్డలను అమ్మి కాటికాపరిగా పని చేసి విశ్వామిత్రుడి ఋణం తీర్చాడు. సత్య పరీక్షకు నిలబడి గెలిచి సత్య హరిశ్చంద్రుడు అయ్యాడు. స్వర్గలోకంలో ఇంద్రునితో సమానంగా సింహాసనం అధిష్టించాడు.
హరిశ్చంద్రుని కుమారుడు లోహితాస్యుడు. అతని కుమారుడు హరిషుడు. హరిషుని కుమారుడు చంచుడు. చంచునికి విజయుడు, వసుదేవుడు అనే ఇద్దరు కుమారులు. విజయుని కుమారుడు రురుడు. రురుని కుమారుడు వృకుడు. వృకుని కుమారుడు బాహుడు.
బాహుడు రాజ్యం చేస్తున్న సమయంలో హైహయులు ఆకస్మత్తుగా దాడి చేసి రాజ్యం ఆక్రమించారు. బాహుడు భార్యలతో కలిసి అడవులలో గల ఔర్వ మహర్షి ఆశ్రమానికి వెళ్లి శరణు కోరి ఆశ్రయం పొందారు. అప్పుడు పట్టపురాణి గర్భవతిగా ఉంది. సవతి అసూయ చెంది పట్టపురాణికి భోజనంలో విషం కలిపి పెట్టింది. ఆ విషము గర్భాన్ని స్తంభింప చేసింది.
అలా ఏడు సంవత్సరాలు గడచిపోయాయి. రాజ్యం కోల్పోయిన విచారంతో బాహుడు మరణించాడు. గర్భవతియై గర్భం రాని పట్టమహిషి భర్తతో కలిసి సహగమనం చేయాలని చితి మీద కూర్చుంది. ఔర్వ మహర్షి తెలిసి అక్కడకు వచ్చి పట్టపు రాణిని వారిస్తూ "తల్లీ! నీ గర్భం నుంచి బలపరాక్రములు కలిగిన మహావీరుడు జన్మిస్తాడు. శత్రువులను ఓడించి చక్రవర్తిగా రాజ్యం చేస్తాడు. సహగమనం విరమించు" అని పలికాడు.
పట్టపురాణి మహర్షి మాటలు గౌరవించి సహగమనం మాని భర్తకు అంత్యక్రియలు చేసింది. ఔర్వ మహర్షి చెప్పినట్లు కొంతకాలం తరువాత గరముతో (విషముతో) కుమారుడు కలిగాడు. విషము భరించి పుట్టాడు కనుక ఔర్వ మహర్షి ఆ బిడ్డకు "సగరుడు" అని పేరు పెట్టాడు. జాతకర్మాదులు చేసి, ఉపనయనం చేసి విద్యాభ్యాసం ప్రారంభించాడు. అస్త్రాశస్త్రాలు, ధనుర్విద్యలు నేర్పించాడు.
*సశేషం*
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి