2, మే 2026, శనివారం

శ్రీ కంచి పరమాచార్యులవారు

 శ్రీరామ (133)


ఈరోజు (2-5-'26) వైశాఖ కృష్ణ పాడ్యమి, శ్రీ కంచి పరమాచార్యులవారు, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి 

(1894 మే 20 - 1994 జనవరి 8)

వారి జయంతి.


శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్//

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).


                               ------

  

" శివోహం" ( ఆనంద స్వరూపుడనైన శివుణ్ణి నేను)

 అన్న స్థితిని సాధించి,

జీవన్ముక్తులై, "నడిచే దేవుడు" అని అందరూ పిలిచే శ్రీ కంచి పరమాచార్యులవారి ఒక దివ్య లీలను ఈరోజు వారి జయంతి సందర్భంగా స్మరిద్దాం.


బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యంకాని "అద్వైత స్థితి" మానవులకు సాధ్యం అని ఉపదేశించి, 

శ్రీ శంకర భగవత్పాదాచార్యులవారు, "జగద్గురువులు" అయినారు.


ఈ అద్వైత స్థితి సాధించడం మానవ జాతి అంతిమ లక్ష్యం. 

అయితే ఈ స్థితి భగవంతుని అనుగ్రహం వలన మాత్రమే వస్తుంది అని ఉపదేశించారు శ్రీ శంకర భగవత్పాదులవారు. 


శ్లో// ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసనా/

మహాభయ కృత త్రాణా ద్విత్రాణాం యది జాయతే//


(జన్మ,మరణాది రూప సంసారం గురించిన మహాభయం పోగొట్టి,మోక్షస్థితి కలిగించే అద్వైత భావన, ఏ ఇద్దరు, ముగ్గురికో కలిగిందంటే అది కేవలం ఈశ్వరుని అనుగ్రహం వల్లనే).


అయితే ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎలా లభిస్తుంది ?


 ఆయన ఆజ్ఞలను పాటిస్తే లభిస్తుంది.

ఆ ఆజ్ఞలు ఏవి ? అవి ఎలా పాటించాలి ?


 "సత్యం వద(ఎల్లప్పుడూ సత్యమునే చెప్పుము),

"ధర్మం చర"(ధర్మమునాచరింపుము),

"మాతృదేవో భవ" (తల్లిని దైవముగా పూజింపుము),

"పితృదేవో భవ" (తండ్రిని దైవముగా పూజింపుము)

మొదలైన సత్కర్మానుష్ఠానమే ఆయన ఆజ్ఞలను పాటించడం.


ఈ విధమైన వేద బోధలన్నింటినీ సమన్వయపరిచి మానవజాతి మీద ఉన్న పరమ కారుణ్యంతో,

జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులవారు ,

సంసారసాగరంలో మునిగి గమ్యం తెలియని మనకు మోక్షం అనబడే శాశ్వత సుఖాన్ని ప్రసాదించే సన్మార్గాన్ని అనుగ్రహించారు.


అలా సన్మార్గాన్ని ఉపదేశించిన

శ్రీ భగవత్పాదులవారి అపరావతారమే శ్రీ కంచి పరమాచార్యులవారు.


శ్రీ పరమాచార్యస్వామివారు,

 శ్రీ భగవత్పాదులవారి "అద్వైత" ఉపదేశం పరమ సత్యమని ఉపదేశిస్తూ, అందుకు తామే ఉదాహరణగా నిలిచారు. 


 శ్రీ స్వామివారు బందరులో చాతుర్మాస్యం (1967) చేస్తున్నప్పుడు, అక్కడి ఎల్. ఐ. సి. ఉద్యోగులు ఇతర భక్తులతో కలిసి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.


ఆ కార్యక్రమాలలో శ్రీ స్వామి వారు పాల్గొని తమ మధుర భాషణలతో అనేక వేలమంది భక్తులకు ధర్మబోధ చేశారు. 

వారిలో భక్తి భావాలను కలిగించారు.

విశేషంగా " రామ "నామం,

 " శివ " నామం, 

" శ్రీరామ జయరామ జయజయ రామ " అనే శ్రీరామ త్రయోదశాక్షరీ మహామంత్రము,

తాము బిగ్గరగా అంటూ, భక్తులచేత అనిపించేవారు.

" రామకోటి " పుస్తకాలతో తమకు స్వాగతం ఇవ్వటానికి బందరు పట్టణం పొలిమేరకు వచ్చిన భక్తులను చూసి, ఫర్లాంగు దూరంలోనే పల్లకీ దిగి, వారివద్దకు నడిచి వచ్చి,ఆ రామకోటి పుస్తకాలకు నమస్కరించారు.

రెండు పుస్తకములను శిరస్సు మీద పెట్టుకొని,ఆ పుస్తకాలు ఉన్న పల్లకీ వెంబడి, గొడుగు పేటలోని శంకర మఠం దాకా మూడు మైళ్లు,ఆ వయసులో నడిచి వెళ్లారు.

ఆ విధంగా కేవలం ఉపన్యాసాల ద్వారానే కాకుండా,ఆచరణపూర్వకంగా శ్రీ స్వామి వారు భక్తులకు బోధ చేసే వారు.


శ్రీ స్వామివారు, బందరులో చాతుర్మాస్యం ముగించుకుని, కంచికి తిరుగుప్రయాణం మొదలు పెట్టారు.


అక్కడి ఎల్. ఐ. సి. ఉద్యోగులు ఈ కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహించి,శ్రీ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.


వారందరూ వారి ప్రతినిధిగా తమ సహ ఉద్యోగి

 శ్రీ ఎ.అనంతరావుగారిని స్వామివారి వద్దకు పంపి, తమకు శ్రీ స్వామివారి వీడ్కోలు సందేశం ఇమ్మని ప్రార్థించారు.


శ్రీ స్వామివారు చిరునవ్వు నవ్వుతూ,

 " నేను సర్వత్రా ఉంటూనే ఉన్నాను " అని మీ వాళ్లందరికీ చెప్పండి అన్నారు.



శ్రీ స్వామివారు సర్వజ్ఞులు,సర్వవ్యాపకులు, సాక్షాత్తూ పరమేశ్వరుని అవతారం అని పరోక్షంగా తామే స్వయంగా చెప్పారు.


' అద్వైతం ' సత్యం అనడానికి ఇంతకంటే వేరే తార్కాణం ఏముంటుంది ?


87 చాతుర్మాస్యాలు చేసిన ఒకే ఒక్క యతి శ్రేష్ఠులు శ్రీ కంచిపరమాచార్యులవారు.


వారు సాక్షాత్తూ పరమశివుని అవతారము అని కీర్తిస్తూ వారి ముఖ్యశిష్యులు, శ్రీ జనార్దనానంద సరస్వతీస్వామివారు  

 "శంభోర్మూర్తిః "అనే పేరుతో తాము రచించిన గ్రంధంలో, 

శ్రీ పరమాచార్యులవారిని,ఈ విధంగా స్తుతించారు:


శ్లో౹౹ నమస్త్విషే౽స్తు కస్మై చిన్నమజ్జన తమో ముషే౹

శ్రీ చంద్రశేఖరేంద్ర శ్రీ సరస్వత్యభిధా జుషే౹౹


(నమస్కరించే వారి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామి అనే జ్ఞానరూపమైన తేజస్సుకు నమస్కరిస్తున్నాను)


శ్లో౹౹వృత్తైః స్వీయై ర్మధుర మధురై వాఙనిగుమ్భైర్జనానాం/

ధర్మే మార్గే పరమసుఖదే బోధముత్పాదయన్తీ/

ముక్త్వా మోనం వటవిటపినో మూలతో నిఃసరన్తీ/

శమ్భోర్మూర్తిః చరతి భువనే దేశి కేంద్ర స్వరూపా//


(ధర్మాన్ని ఉద్ధరించాలనుకున్న పరమేశ్వరుడు మౌనాన్ని చాలించాడు. తాను కూర్చున్న వటవృక్షాన్ని విడిచి, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి రూపాన్ని ధరించాడు.

దివ్యమైన తన నడవడి చేతను, మధురాతి మధురమైన తన వాక్కుల చేతను, సమస్త జీవులకు సుఖాన్ని ఇచ్చే ధర్మమార్గమునందు ప్రజలకు జ్ఞానము కలుగజేస్తూ, చంద్రశేఖరేంద్ర సరస్వతీ జగద్గురు రూపంలో ఆ పరమశివుని మూర్తి ఈ భూమి మీద సంచరించింది).


శ్లో//శంభోర్మూర్తి శ్చరతి భువనే ధర్మ సంస్థాపనాయ//

( చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి రూపంలో, పరమశివుడు ధర్మ సంస్థాపన కోసం భూమిమీద సంచరించాడు).


శ్లో//శంభోర్మూర్తిర్హ్యవతరతి సా లోకరక్షార్ధ మద్య//

(లోకరక్షణార్ధం చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి రూపంలో ఆ పరమేశ్వరుడుభూమి మీద అవతరించాడు).


శ్లో//శంభోరుమూర్తిర్హ్యధివసతి సా శాంకరం పీఠమగ్ర్యం//

( శంకరభగవత్పాదులవారు స్థాపించిన అత్యున్నతమైన జగద్గురుపీఠం మీద ఆ పరమశివుడుఅధివశించాడు).


శ్లో//శమ్భోర్మూర్తిర్హ్యధివసతి సా శాంకరం కాంచిపీఠం//

(ఆ పరమశివుని మూర్తి కంచి కామ కోటి శంకర పీఠాన్ని అధిష్టించింది).


శ్లో//శంభోర్మూర్తిః సదయ మధునా భ్రాజతే కాంచిపీఠే//

(ఆ పరమశివుని మూర్తి భక్తుల మీద దయతో కంచి కామకోటి శంకర పీఠం మీద దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తున్నది).


శ్లో//శంభోర్మూర్తేః స్మరత వివిధా భావుకా భవ్య లీలాః//

(చంద్రశేఖరేంద్ర సరస్వతీ రూపంలో వున్న ఆ శివుని మంగళప్రదమైన లీలలు నిత్యము స్మరించండి)


శ్లో//శంభొర్మూర్తి ర్హ్యభయ వరదా భ్రాజతాం మే హృదబ్జే//

(హస్తములలో అభయ ముద్రా,వరముద్రా, ధరించిన ఆ శంభుని మూర్తి నా హృదయ పద్మంలో ప్రకాశించు గాక).


🙏శ్రీ జగద్గురువులకు సాష్టాంగ ప్రణామములు🙏


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

2-5-'26.

కామెంట్‌లు లేవు: