5, సెప్టెంబర్ 2020, శనివారం

అమ్మే మొదటి గురువు

అమ్మే మొదటి గురువు 
ఈ గురుపూజోత్సవం నాడు మనం ముందుగా స్మరించాలిసిన గురువు కన్నా తల్లి. కన్న తల్లి తరువాతే ఈ ప్రపంచంలో ఏ గురువైన. నవ మాసాలు మోసి రక్త మాంసాలతో ఈ భూమిమీదకు తీసుకోవచ్చిన మహానుభావురాలు తల్లి. అంతే కాదు మనిషి పుట్టినప్పుడు ఏమి రాదు, ఏమి తెలియదు కేవలం ఏడవటం, కళ్ళు చేతులు కదిలించటం మాత్రమే తెలుసుకున్న మనిషికి తన చనుమొనను నోటికందించి పాలిచ్చి పాలించే దేవతే తల్లి. 
పశువులకు పుట్టిన వెంటనే కళ్ళతో లేచి నిలబడి తల్లి చనుబాలు తాగగలుగుతాయి కానీ మనిషికి ఆ శక్తి లేదు ఈ విషయాన్నీ కంప్యూటరు భాషలో మీకు అర్ధమియట్లు చెపుతాను. మనం కంప్యూటర్లో రెండు రకాల మెమరీలు చూస్తాం అవి ఒకటి ROM రెండు RAM వీటిని తెలుసుకుందాం. 
ROM means Reed only Memory అంటే కంప్యూటర్ ఆన్ చేయగానే మన ప్రాయం లేకుండా తనంత తానుగా అమలు చేసుకునే ప్రోగ్రాం. అదే . CMOS అది కంప్యూటర్లోని విషయాలను ముందుగా రెకార్డ్ చేసి ఉంచినది. ఇక రెండోవది 
RAM ఇది మనం సాధారణంగా ఉపయోగించే మెమొరీ ఇది సిమ్సలో ఉంటుంది. 
మనుషులకు పుట్టుకతో ROM లేకుండా పుట్టుతారు అందుకే ప్రతిదీ నేర్చుకోవాలి. కానీ పశుపక్షాదులు కొంత ROM కలిగి పుట్టుతాయి అందుకే అవి పుట్టిన వెంటనే వాటి అవసరాలను తీర్చుకోగలుగుతాయి. 
ఇక పక్షుల విషయానికి వస్తే వాటి ROM లో గూడు కట్టే టెక్నోలోజి కలిగి ఉంటాయి అందుకే ఒక జాతికి చెందిన పక్షి ఒకే రకమైన గూటిని కట్ట గలదు. అదే విధంగా సాలె పురుగు తన గుండుని కూడా కట్టుకోగలదు. చీమలు తమ పుట్టలను తామే నిర్మించుకోగలుగుతాయి.  దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే మనిషి నేర్చుకోకుండా కనీసం పాలుకూడా తాగలేడు. 
ఈ విషయాలు ఏవి మనం గుర్తించం. 
ఇంకా వుంది 

🌼🌿 గరికకు లొంగిపోయే గణేశుడు 🌼🌿



          గణేశుడు భక్తసులభుడు. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు. ఆ మాటకు వస్తే అసలు పుష్పాలే లేకున్నా ఫర్వాలేదు. ఒక నాలుగు రెబ్బలు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసు లోని కోరికలను నెరవేరుస్తాడు. గణేశునికి గరిక అంటే అంత ప్రీతి కాబట్టి ఆయనను దూర్వాగణపతి అని కూడా పిలవడం కద్దు. దూర్వాయుగ్మమ్‌ అంటే గరిక కదా! వినాయకునికీ గరికకీ మధ్యన పొంతన కుదిర్చేందుకు చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం ఈ రెండే...
తాపాన్ని ఉపశమించేందుకు :-
పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే పేరుగల కుమారుడు పుట్టాడు. అతను అగ్నిస్వరూపుడు. తన కంటికి ఎదురుగా వచ్చిన దేనినైనా బూడిద చేయగల సమర్థుడు. ఆ సామర్థ్యంతోనే అతనిలో రాక్షసప్రవృత్తికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఓసారి ఏకంగా ఆ స్వర్గలోకాన్నే బూడిదచేసేందుకు బయల్దేరాడు అనలాసురుడు. అనలాసురుని బారి నుంచి తప్పించుకునే మార్గా లన్నీ మూసుకుపోగా, దేవేంద్రుడు వినాయకుని శరణు కోరాడు. తన తండ్రి పరమేశ్వరుడు సాక్షాత్తూ గరళాన్ని మింగినట్లుగానే, వినాయకుడు ఆ అనలాసురుని ఓ ఉండలా చేసి మింగేశాడు. కానీ తన ఉదరంలోకి చేరిన అనలాసురుని అగ్నితత్వంతో విపరీతమైన తాపాన్ని అనుభవించాడు. ఎన్ని ఔషధిలు వాడినా ఆ తాపం తగ్గలేదు. చివరికి శివుని సలహా మేరకు 21 గరికలను ఆయన శరీరం మీద కప్పడంతో ఆ తాపం తగ్గిందన్నది ఒక కథ.
శివపార్వతుల పాచికలు:-
శివపార్వతులు ఒకసారి సరదాగా పాచికలు ఆడుతున్నా రు. వారి ఆటకు న్యాయనిర్ణేతగా ఎవరుండాలన్న ప్రశ్న వచ్చినప్పుడు, ఒక గరికతో బొమ్మను చేసి సాక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ గరికబొమ్మ ఎంతసేపూ శివుని పక్షమే వహించడంతో కోపం వచ్చిన పార్వతీదేవి, అతడిని కుంటివాడివి కమ్మని శపించింది. తన కుర్రచేష్టలను మన్నించి శాపవిమోచనం కలిగించమని ఆ గరికబొమ్మ వేడుకోగా... వినాయకచవితినాడు అక్కడికి వచ్చే నాగకన్యల నుంచి గణేశుని పూజావిధానాన్ని తెలుసుకుని, ఆచరిస్తే అతని అవిటితనం దూరమవుతుందంటూ శావిమాచనాన్ని ప్రసాదించింది పార్వతీదేవి. అప్పటి నుంచి గరిక గణేశు ని పూజలో భాగమయ్యిందంటారు.
*🌷ఔషధి తత్వం:*
గణేశుని పూజలో వాడే పత్రిలో గరికకే అధికప్రాధాన్యం. కొందరైతే ఆయనకు వాడే ఏకవింశతి పత్రాలకు బదులుగా కేవలం గరికనే వాడతారు. తమిళనాట వాడవాడలా కనిపించే గణేశుని ఆలయాలలో, భక్తులు స్వామివారికి గరికనే అర్పిస్తారు. సంప్రదాయ వైద్యంలో ఈ గరికకి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. గరికకు త్రిదోషాలనూ హరించే గుణం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. రక్తస్రావాన్ని అరికట్టడంలోనూ గరికకు సాటిలేదు. అందుకనే దెబ్బలు తగిలినప్పుడు, ఇప్పటికీ గరికను అప్పటికప్పుడు నూరి గాయానికి పట్టించేవారు పెద్దలు. ఇక మూత్రంలో కానీ, విరేచనాల ద్వారా కానీ రక్తం పోతున్నప్పుడు గరికతో చేసిన కషాయం వాటిని అరికట్టి తీరుతుందని విశ్వసిస్తా రు. మన ప్రాచీన వైద్యంలో అతిసారం మొదలుకొని వడ దెబ్బ వరకూ గరికను సర్వరోగాలను ఉపశమనంగా వాడటం కనిపిస్తుంది. మొత్తానికి గరిక ప్రకృతికి, నిరాడంబరతకు చిహ్నం. అందులోని ఔషధి గుణాలు జీవానికి చిహ్నం. అంతటి గరిక ఆ గణేశునికి చేరువకావడంలో తప్పేముంది.
(సేకరణ)

గురు వందనం

ఈరోజు (5-9-2020) *ఆంధ్రపత్రిక* సంపాదకీయం🌹 *గురు వందనం*// "మాతృదేవోభవ, పితృదేవోభవ,ఆచార్య దేవోభవ" అన్నది ఆర్యోక్తి. నవమాసాలు మోసి పెంచిన తల్లి, చెయ్యి పట్టి నడిపించిన తండ్రి తర్వాత, తత్ తుల్యులుగా భావించి, గుండెగుడిలో నిలుపుకొని పూజించవలసిన వ్యక్తులు గురువులు. గురు "దేవుడు" అన్నారు. తల్లి, తండ్రి, గురువు ముగ్గురూ దైవంతో సమానం, వారిని గౌరవించాలి, పూజించాలి, వారి బోధనలు ఆలకించాలి, ఆచరించాలని తరతరాలుగా పెద్దలు చెబుతున్న మాట. విద్యతో పాటు బుద్ధులు చెబుతూ, మార్గదర్శనం చేసినవాడే నిజమైన గురువు. అలా సమాజాన్ని తీర్చిదిద్దినవారందరూ గురుస్థానీయులు. పల్లె నుండి ప్రపంచస్థాయికి ఎదిగి, పేదరికం నుండి ప్రాభవానికి ప్రగతి ప్రయాణం చేసిన గురూత్తముడు ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ.వారి జయంతిని "జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా" గురుపూజోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. కేవలం సభలు చేసి సంబరపడిపోతే సరిపోదు. ఆచరణలో, వ్యవస్థలో గురుస్థానానికి గౌరవం దక్కినప్పుడు, దక్కించుకున్నప్పుడే ఈ ఉత్సవాల ప్రయోజనం. విద్యాభ్యాసం గురుముఖతా జరిగిన కాలం నుండి ఆన్ లైన్ ముఖంగా సాగుతున్న కాలానికి వచ్చేశాం. గురుదేవుడిగా పూజించబడిన దశ నుండి, కీచకగురువు అనిపించుకునే దశకు వచ్చాం. అధ్యాపకుడు వేరు. గురువు వేరు. పాఠం చెప్పిన ప్రతి అధ్యాపకుడు గురువు కాదు. అధ్యాపకులందరూ కీచకులు కారు. ఎక్కడో, ఎవ్వరో కొందరి వల్ల వృత్తికి చెడ్డపేరు వస్తూ ఉంటుంది. కొందరు మహోన్నతులైన ఉపాధ్యాయుల వల్ల ఆ వృత్తికి అపారమైన గౌరవం పెరుగుతుంది. పాఠ్యాంశాలతో పాటు, జీవిత పాఠాలు, విద్యాబుద్ధులు చెప్పిన మార్గదర్శకులందరూ గురుదేవులే. ఈ భరతభూమిపై ఎందరో ఉత్తమ అధ్యాపకులు, ఆచార్యులు, గురువులు సమాజాన్ని విజ్ఞానం వైపు, వికాసం వైపు నడిపించారు, నడిపిస్తున్నారు. విజ్ఞానంతో పాటు విలువలు పంచుతున్నారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయుడు-విద్యార్థి బంధాలు మారుతున్నాయి. తగ్గుతున్నాయి. ఎంత పాశ్చాత్య పోకడ, ఎంత ఆధునిక నడవడిక వచ్చి చేరినా, గురువును గౌరవించే, పూజించే సంస్కృతి ఈ పుణ్యభూమిపై ఇంకా పచ్చగా ఉంది. ఎందరో పెద్దలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులను అలంకరించారు.ఎందరో మేధావులు, ప్రతిభామూర్తులు మన దేశంలోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులుగా (వైస్ ఛాన్సలర్లు) గా పనిచేశారు.వీరెవ్వరికీ దక్కని ప్రత్యేక గౌరవం సర్వేపల్లి రాధాకృష్ణకు దక్కింది.ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా, గురుపూజోత్సవంగా ప్రభుత్వం నిర్ణయించిందంటే, మనం జరుపుకుంటున్నామంటే, అది సర్వేపల్లివారి సర్వోన్నత సంస్కారానికి, సమర్ధతకు ప్రేరణకు,నడవడికకు, మార్గదర్శనానికి గొప్ప ఉదాహరణగా చెప్పాలి. విద్వాన్ సర్వత్ర పూజ్యయేత్, అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం సర్వేపల్లి రాధాకృష్ణ.ప్రతి సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయులను, గురువులను తలచుకొని కొలుస్తున్నాం. దీనికి ప్రేరణగా, ఉపాధ్యాయ పదానికి పర్యాయపదంగా, అధ్యాపక వృత్తికి అమేయమైన గౌరవం నిలిపిన సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం, జీవనం కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచ మానవాళికి మార్గదర్శనం చేసే వెలుగుదివ్వెలు. ఆచార్యుడు, తత్త్వవేత్త, విజ్ఞానఖని, వివేకధుని సర్వేపల్లి. రెండు సార్లు ఉపరాష్ట్రపతి అయ్యారు. అత్యున్నతమైన రాష్ట్రపతి స్థానంలోనూ కూర్చొని, ఆ పదవికి, గురువు అనే పదానికి, భారతదేశానికి అనుపమానమైన ఖ్యాతి తెచ్చిపెట్టిన సర్వేపల్లి రాధాకృష్ణ అక్షరాలా తెలుగువాడు. తమిళనాడులోని తిరుత్తణి గ్రామానికి వలస వెళ్లిన తెలుగు దంపతుల గారాలపట్టి. తిరుత్తణి, తిరుపతి, నెల్లూరు, మద్రాస్ లో విద్యాభ్యాసం సాగించారు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలతో ఉత్తమ విద్యార్థిగా మన్ననలు పొందారు.అతిపిన్న వయస్సులో 21సంవత్సరాలకే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఉపన్యాసకుడి పదవిని పొందారు. తత్త్వశాస్త్రంలో సర్వేపల్లి ప్రతిభకు అచ్చెరువు చెందిన మైసూర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్ వి నంజుండయ్య మైసూర్ విద్యాలయానికి ఆహ్వానించి ప్రొఫెసర్ గా నియమించి గౌరవించారు. సర్వేపల్లి ప్రతిభా ప్రయాణం అంతటితో ఆగలేదు. అప్రతిహతంగా సాగింది. రవీంద్రనాథ్ ఠాగూర్, అశుతోష్ ముఖర్జీ వంటి మహామహులు సర్వేపల్లిని కలకత్తా విశ్వవిద్యాలయానికి ఆచార్యునిగా ఆహ్వానించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయానికి కట్టమంచి రామలింగారెడ్డి తర్వాత వైస్ ఛాన్సలర్ గా పదవిని చేపట్టి, విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను జగద్విదితం చేశారు. సుప్రసిధ్ధ ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు గౌరవ ఆచార్యుడిగా అమెరికా, చైనా మొదలైన దేశాల్లో తత్త్వశాస్త్రంపై అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చి, ఆ దేశ విద్యార్థులతో పాటు , ఆచార్యులను కూడా చైతన్య పరిచారు. సర్వేపల్లి కేవలం విజ్ఞానఖని కాదు, అద్భుతమైన ప్రసంగకర్త. తెలుగు, తమిళం, ఇంగ్లీష్ ఏ భాషలో మాట్లాడినా, ఆ ప్రసంగం పరమ ఆకర్షణీయం. ఏ విషయం స్పృశించినా స్ఫటిక సదృశమైన స్పష్టతతో ఆ ఉపన్యాసం సాగేది. విశ్వవిద్యాలయంలో పాఠం చెప్పిన సందర్భాల్లో 20నిముషాల సేపు మాత్రమే గంభీరంగా పాఠ్యాంశం చెప్పేవారు. పీరియడ్ లోని మిగిలిన సమయంలో అనేక అంశాలు, విషయాలు విద్యార్థులకు స్నేహపూర్వకమైన వాతావరణంలో సలలితంగా చెప్పేవారు. దీని వల్ల విద్యార్థులకు పాఠ్యాంశంతో పాటు అనేక లౌకిక, అలౌకిక అంశాలు తెలిసేవి. వ్యక్తిత్వ సంపూర్ణ వికాసానికి సర్వేపల్లి ఉపన్యాసాలు మూల స్థంభాలై, పునాదులై నిలిచేవి. మానవుని మెదడు 20నిముషాలకు మించి సీరియస్ గా ఒక అంశాన్ని విని గ్రహించలేదనే మనస్తత్వశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని, సర్వేపల్లి రాధాకృష్ణ పాఠాలు చెప్పేవారు. తత్త్వశాస్త్రంతో పాటు మనస్తత్వ శాస్త్రం ఎరిగి, విద్యా పరమైన మనోవిజ్ఞానశాస్త్రం (ఎడ్యుకేషనల్ సైకాలజీ) తెలిసి, బోధనలో ఆచరించిన సర్వోత్తమ ఆచార్యుడు సర్వేపల్లి. ప్రపంచ తత్త్వశాస్త్రాలన్నీ అద్భుతంగా అధ్యయనం చేయడమేకాక, భారతీయ తాత్త్విక చింతనను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు. వివేకం, తర్కం ఇమిడి ఉన్న భారతీయ తాత్త్వికతను అర్ధం చేసుకోవడమంటే, సాంస్కృతిక చికిత్సను పొంది, దివ్య ఔషధాన్ని స్వీకరించి, శరీరాన్ని, మనసును తేజోమయం చేసుకోవడంగా భావించి, అనుభవించి, ఆ అనుభవ సారాన్ని ప్రపంచ మానవులకు పంచిన విశ్వ ఆచార్యుడు సర్వేపల్లి. సర్వేపల్లి జీవితం నుండి ప్రతి ఒక్కరూ పాఠాలు నేర్చుకోవచ్చు. ఎంతో పేదరికం అనుభవించారు. అనాసక్తిగానే తత్త్వశాస్త్రం తీసుకున్నప్పటికీ, దాన్ని హృదయంలోకి మలచుకొని, తత్వశాస్త్రానికి మరోరూపంగా అవతరించిన సర్వేపల్లి మానసిక ప్రయాణం చాలా గొప్పది. కాలమాన పరిస్థితులను అర్ధం చేసుకొని, అన్వయం చేసుకొని, వ్యతిరేక పరిస్థితుల్లో కూడా స్వయం ప్రేరణ పొంది, అనుకూలమైన మానసిక వాతావరణాన్ని కల్పించుకుని, గెలుపు సాధించిన గొప్ప సాధకుడు సర్వేపల్లి. తండ్రికి చదివించే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో, ఒక దశలో చదువు మాన్పించి పూజారిగా చేరిపొమ్మన్నారు. చదువంటే ఉండే అమిత ఇష్టంతో కష్టపడి చదివి, ఉపకారవేతనాలతోనే విద్యాభ్యాసం మొత్తం కొనసాగించిన గొప్ప ప్రేరణామూర్తి సర్వేపల్లి. అరిటాకు కూడా కొనలేని స్థితిలో నేలను శుభ్రం చేసుకొని, భోజనం చేసిన రోజులు కూడా రాధాకృష్ణ జీవితంలో ఉన్నాయి. రాష్ట్రపతిగా వైభవమైన సౌధాల్లో జీవించే కాలం వచ్చినా, నేలను, గతాన్ని మర్చిపోలేదు. వైభవం, వైరాగ్యం సమానంగా తీసుకొని, వాటికి అతీతంగా మనసును ఉన్నత స్థితిలో నిలుపుకొని, నిరాడంబరమైన జీవితం గడిపిన నిజమైన తత్త్వవేత్త సర్వేపల్లి. విద్యార్థులకు విద్యాబుద్ధులతోపాటు ప్రేమను పంచిన అనురాగమూర్తి. చైనా, పాకిస్తాన్ తో యుద్ధాలు జరుగుతూ భారతదేశం అత్యంత క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రులకు చక్కని మార్గాలు చూపించిన మార్గదర్శకుడు. నిరంతర జ్ఞానచింతనాపరుడు. గొప్ప చదువరి. సొగసరి కూడా. అధ్యాపకుడుగా విద్యార్థులను, ఉపకులపతిగా విశ్వ విద్యాలయాలను, రాష్ట్రపతిగా దేశ ప్రధానులను, విశ్వవిజ్ఞానఖనిగా తాత్త్విక విశ్వాన్ని మార్గదర్శనం చేసిన మహోన్నతమైన గురువు. సాధారణ ఉపాధ్యాయుడి దశ నుండి రాష్ట్రపతిగా, విశ్వవిద్యా గురుపీఠాధిపతిగా విశిష్ట గురుస్థానాన్ని పొందిన సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకొని, ప్రేరణగా నిలుపుకొని విద్యార్థులు, గురువులు, పాలకులు, బోధకులు తమ యాత్రనుసాగిస్తూ, తమ పాత్రను పోషించడమే సర్వేపల్లికి మనం సమర్పించే నిజమైన నివాళి. గురువులను తలుచుకోవడం, కొలుచుకోవడం, విద్యావ్యవస్థకు గౌరవాన్ని కాపాడడమే ఈ ఉత్సవాన్ని జరుపుకోవడంలో జరిగే ఒరిగే నిజమైన ప్రయోజనం.భారతీయఆత్మ సర్వేపల్లి. ఈ మహనీయుని దివ్యస్మృతికి నీరాజనాలు పలుకుదాం-మాశర్మ🙏

మంత్ర పరిశీలన

వక విశేషమైన మంత్ర పరిశీలనలో ' హ్వయాం అగ్నిం ప్రధాన స్వస్తయే హ్వయామి మిత్రా వరుణా వి హావసే హ్వయామి రాత్రీం జగ తో నివేశనీం హ్వయామి దేవం సవితాః అమూతయే అని మనం రోజూ సూర్యరశ్మిని చంద్ర కాంతిని ఎందుకు దర్శించి వీటి వలన మానవ నిర్మాణానికి ఫలమేదైనను కలదా. పరిశీలించిన అది ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యంచ, అని అదే సాయం సమయంలో ఆకృష్ణేన అని వక చిన్న తేడా మంత్రంలో సత్యము బదులుగా అనగా చూసిన కిరణ శక్తి సత్యమే, అది సాయం సమయంలో కృష్ణేన అని మిగిలిన మంత్రం అంతా వకటే. సూర్యుని కిరణ లక్షణము అనగా చైతన్య మైనది సత్యమని తెలియును. కాని దాని లక్షణము చంద్రకాంతివలననే అనగా స్స్వీకరించినగాని,లేక అనుభవించినగాని అగ్ని లక్షణము చంద్ర దర్శనమువలన మానవ జీవ వుత్పత్తికి మూలమని తెలియును. యిది ఏ రోజుకు ఆరోజే దాని లక్షణం వివిధ రకములుగా యుండును అదే ప్రకృతిని ఆశ్వాదించుట. నిజంగా ప్రకృతిలో లేదు. అది మనలోనే ఉదయమే సూర్యుని నుండి నిల్వ చేయబడి చంద్ర దర్శనం అవగానే దాని లక్షణము మనస్సుకు తెలిసి ప్రేరణ అందుకే కృష్ణేన అనగా చీకటిలోనే తత్వం తెలియుటకై అలాగని చీకటి కాదు కొంత వెన్నెల రూపంలో. అనగా ప్రకృతిని సమ పాళ్ళలో ఆశ్వాదించుట జీవ లక్షణమని తెలియును. సూర్యకిరణాలు వలన మనలో యున్న శక్తి చార్జి చేయబడి చంద్ర కాంతి దానికి ఇగ్నీషియమ్గా పనిచేయును. అప్పుడే మనస్సు అహ్లాదకరమైన ప్రకృతి లక్షణమును ఆశ్వాదించుట. యిది యే పై మంత్రం సారాంశం. తెలుసుకుంటూనే ఉందాం. ఆచరిస్తూనే ఉందాం.

మొగలిచెర్ల అవధూత

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
అన్నదానం..ఆశీర్వాదం.

"రాబోయే ఆదివారం నాడు మేము అన్నదానానికి సరుకులు తెస్తాము..మా పేరుతో అన్నదానం చేయండి.."అన్నారా దంపతులు..వాళ్ళు ఇంతకుముందు కూడా చాలా సార్లు శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదానం చేశారు..అసలు వాళ్లు మొదటిసారి మందిరానికి వచ్చినప్పటి నుంచీ..అన్నదానం గురించే ప్రస్తావన వచ్చింది..

"పదేళ్ల క్రిందట మేము మొదటిసారిగా ఈ గుడికి వచ్చాము..అప్పటినుండి ప్రతి ఏడూ రెండుసార్లు ఈ స్వామి దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకొని వెళ్లడం అలవాటుగా మారింది..నాకు పెళ్ళైన ఆరేళ్ల దాకా పిల్లలు పుట్టలేదు..మా ఆయన నేనూ ఇక్కడికి వచ్చాము..ఆ స్వామికి మ్రొక్కుకున్నాము..ఇదిగో ఈ ఇద్దరూ స్వామి దయవల్ల పుట్టారు.." అని తన తొమ్మిదేళ్ల వయసున్న కూతురిని, ఏడేళ్ల కుమారుడిని చూపించింది సుశీలమ్మ..వాళ్ళది కనిగిరి దగ్గర పల్లెటూరు..

"వచ్చే ఆదివారం అన్నదానానికి సరుకులు తీసుకొస్తాము..ప్రతి ఏటా ఇక్కడ ఒక ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేస్తున్నాము కదా..ఈసారికూడా అన్నదానం చేయిస్తాము.." అని మళ్లీ గుర్తు చేస్తున్నట్లు చెప్పింది..సరే అన్నాను..

మొదటిసారి సుశీలమ్మ తన భర్తతో కలిసి వచ్చినప్పుడు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తువున్నాయి..సంతానం కోసం ఆ దంపతులు శ్రీ స్వామివారి వద్ద కోరిక కోరుకున్నారు..మందిరం లోనే ఉన్న చెట్టుకు ముడుపు కూడా కట్టుకున్నారు..అప్పుడు నా దగ్గరకు వచ్చి.."అయ్యా..ఇక్కడ ఒక శనివారం కానీ ఆదివారం నాడు కానీ అన్నదానం చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుందీ.." అని అడిగారు..ఒక్కొక్కపూటకు సుమారు మూడు నాలుగు వందల మందికి సరిపడా అన్నదానం చేయాలంటే (ఇది పదేళ్ల క్రిందటి లెక్క..ఇప్పుడు ఒక్క శనివారం రాత్రికే సుమారు వెయ్యిమందికి తయారు చేయాలి) ఎంత అవుతుందో వివరంగా చెప్పాను..సరే నని తలవూపి వెళ్లారు..

ఆ తరువాత ఒక గంట గడిచింది..సుశీలమ్మ భర్త వచ్చి.."వచ్చే వారమే మేము అన్నదానం చేస్తాము..మీరు సరుకుల లెక్క ఇవ్వండి.." అన్నాడు..సహజంగా ఎవరైనా తాము కోరిన కోర్కె తీరిన తరువాత తమ మ్రొక్కు చెల్లించుకుంటారు..ఈ దంపతులు ముందుగానే అన్నదానం చేస్తామని చెపుతున్నారు..నా మనసులో మాట గ్రహించారో ఏమో.."అయ్యా..నేను కూడా సంతానం కలిగిన తర్వాత సంతోషంగా అన్నదానం చేద్దామని చెప్పాను..కానీ తాను మాత్రం ఇప్పుడే చేయాలని పట్టు బడుతున్నది.." అన్నాడు..

"ఆదివారం మధ్యాహ్నం కనీసం మూడు నాలుగు వందల మందికి మనం ఆహారం అందిస్తే..ఆకలి తీరిన అంతమందిలో ఎవరో ఒక్కరన్నా మనలను తృప్తిగా దీవిస్తారు కదా..ఆ దీవెనలు..శ్రీ స్వామివారి ఆశీస్సులు.. ఫలించి మా కోరిక త్వరగా తీరుతుందేమోనని ఆశ!..మొగలిచెర్ల లో సిద్ధిపొందిన ఈ స్వామివారి వద్ద అన్నదానం చేస్తే విశేష ఫలితం అని చాలామంది ఇక్కడ అనుకోవడం విన్నాను..అందుకోసం వచ్చే వారం అన్నదానం చేద్దామని అనుకున్నాను.." అన్నది సుశీలమ్మ..

నిజమే అనిపించింది..ఎవరి ఆశీర్వాదం లో ఎంత బలమున్నదో ఎవరికి తెలుసు?..ఈ ఆలోచనకు ఆమె భర్త కూడా ఒప్పుకున్నాడు..అనుకున్న విధంగానే ఆ పై వారం ఆ దంపతులు అన్నదానం చేశారు..

మరో సంవత్సరానికి మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది..ఇంకో రెండేళ్లకు కుమారుడు కలిగాడు..ఆ దంపతులు మాత్రం ప్రతిసారీ అన్నదానం చేయడం మర్చిపోలేదు..ఎప్పుడన్నా తమకు వీలులేకపోతే..ఒకటి రెండు వారాలు ముందుగానే వచ్చి..తాము అనుకున్న రోజుకు అన్నదానం జరపమని మాకు చెప్పుకొని వెళుతుంటారు..ఏనాడూ కూడా తాము అన్నదానం చేస్తున్నట్లుగా బహిరంగంగా ప్రకటన వద్దని కోరుకుంటారు..తాము పేరు కోసం చేయటం లేదనీ..తమ కర్తవ్యంగా భావించి చేస్తున్నామనీ చెప్పుకుంటారు..ఇలాటి ఆలోచన గల వాళ్ళు తక్కువ మంది ఉంటారు..

మందిరం వద్దకు వచ్చే అందరు భక్తులూ ఒక లాగా వుండరు..ఒక్కొక్కరివి ఒక్కక్క విధమైన ఆలోచనలు..అందరి కోర్కెలు తీర్చి..వాళ్ళ వాళ్ళ తాహతును బట్టి..ఒక్కొక్క కార్యక్రమాన్ని వాళ్లకు అప్పచెప్పి..మధ్యలో మమ్మల్ని కర్తలుగా నిర్ణయించి..ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిపిస్తుంటారు శ్రీ స్వామివారు..

సర్వం..
శ్రీ దత్తకృప.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

*** గురువు ***


''''''’''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
అక్షర లక్షణ తత్త్వము తెలిసిన
   జాగృత రూపమె గురువు.
అక్షర మయమౌ జీవన ఉపాధి
  ప్రాప్తికి మూలము గురువు.

  మనిషి మేధస్సు ప్రక్షాళనకు
    అక్షరాయుధుడె గురువు.
మనను సులక్షణ పథమున నడిపే
    విధ్వత్ జ్ఞానమె గురువు.

ఆకలి ఎఱుగని బ్రతుకు తెరువునకు
   రైతు సాధనలు కారణము.
మనసు ధన్యమౌ బ్రతుకు బాటకు
   గురు బోధనలే ప్రేరణము.

   డాక్టరులైనా యాక్టరులైనా
    కండక్టరులు కలెక్టరులైనా
  ఇలలో ఏ మేధావులుయైనా
గురువుల మానస పుత్రులు కాదా !

గురువే బ్రహ్మా, గురువే విష్ణు,
గురువే ఈశ్వరుడనుట ప్రతీతి.
గురువే ఇహమున కనబడు దైవము
    జ్ఞాన ప్రకాశక అతిథి !

భావి జీవితము సుఖమయ మగుటకు
    ప్రభావితము ఈ గురువు.
చివరకు దేవుని ఎఱిగి నడుచుకొను
      ముక్తి కారకుడు గురువు.

 అందుకె గురువును సేవించు !
 చక్కని జ్ఞానము సంపాదించు !
 చక్కని మనుగడ కొనసాగించు !
 చక్కని కీర్తిని ఆస్వాదించు !

       *********************
రచన :--రుద్ర మాణిక్యం .

రామాయణమ్. 52


...
రామా! నీవు నాకు పుట్టకపోయినా బాగుండేదిరా
నాయనా ఈ శోకం తప్పేది! నాకు దుఃఖము కలిగించటానికే పుట్టావు నాయనా నీవు .గొడ్రాలికి ఒకటే శోకం ! పిల్లలులేరే అని ! .
.
మీ తండ్రి గారి ఏలుబడిలో నేను ఏ మంగళముగానీ ,సుఖముగానీ ఎరుగను నీ అధికారములో అవి అనుభవించవచ్చులే అని నా ఆశ!.
.
నా కేం తక్కువ? అయినా సవతులచేత మాటలుపడ్డాను.కైక పెట్టిన అవమానములు భరించాను ,ఆవిడ మాటలు విని నీ తండ్రి నన్ను చిన్న చూపు చూసినా అన్నీ నీవున్నావులే అనే ఆశతో సహించాను ! ఓపిక పట్టాను ! ఇక ముందు నా గతి ఏమి కాను ? భరతుని చూసి భయముతో అందరూ నన్ను కనీసం పలకరించనైనా పలకరించరు!
.
రామా ఈ వార్త విని నా గుండె బ్రద్దలవటం లేదేమిరా,ఇంత రాయి అయినదేమిరా నాయనా ఇది!.నాకు యమలోకములో కూడా చోటులేదు!అని అంటూ కొడుకుకు కలిగిన కష్టాన్ని తలుచుకుంటూ పరిపరి విధాలుగా రోదించి రోదించి కంట కన్నీరు కూడా ఇంకిపోయిందామెకు!.
.
పెత్తల్లి రోదనలు వింటున్న లక్ష్మణుడు దీనంగా ,అన్నా ! ఒక ఆడుదాని మాటకు గౌరవమిచ్చి నీవు అడవులకు వెళ్ళటమెందుకు?.
.
ముసలివాడైన రాజుకు ఇంకా కోరిక చావక కామంతో కళ్ళుమూసుకుపోయి అనాలోచితంగా అనుచితమైన కోరిక కోరాడు.
.
బుద్ధిగలవాడెవెడయినా సద్గుణాలప్రోవు అయిన కుమారుడిని పోగొట్టుకుంటాడా! మతిభ్రమించిన రాజాజ్ఞ ను నీవు పాటించనక్కరలేదు!.
.
అన్నా పద ! ఇప్పుడే ఈ క్షణమే ఈ రాజ్యాన్ని మనము చేజిక్కించుకుందాము!
.
రాజా! బూజా! తరాజా! ఎవడైననేమి? వాడి అంతు చూద్దాము! అవసరమయితేబుద్ధిలేనిరాజునువధించనయినావధిస్తాను.
.
భరతుడి పక్షము వారెవరెవరయినా అడ్డువస్తే చీల్చి చెండాడతాను ! అనుజ్ఞ ఇవ్వన్నా!
.
ఏ బలం చూసుకొని రాజు నీతో వైరం పెట్టుకున్నాడు ఎదిరించి నిలువగలడనేనా?.
.
నా ధనుస్సుమీద,సత్యముమీద, నేను చేసిన దానయజ్ఞాలమీద అవిచ్చిన ఫలాల మీద ఒట్టు పెట్టి చెపుతున్నాను. రాముడు అగ్నిలో దూకాల్సివస్తే ఆయన కన్నా ముందే దూకుతాను.
.
రాముని కష్టాన్ని తొలగించలేని నా పరాక్రమము బూడిదలో పోయటానికా!
.
తీవ్రమైన ఆగ్రహావేశాలతో కన్నుల నుండి విస్ఫులింగాలు రాలుతున్నాయి. ముఖము కందగడ్డలా మారిపోయింది! క్రోధంతో ఊగిపోతున్నాడు లక్ష్మణుడు.
.
 కానీ ఆయన క్రోధ సముద్రము రాముడు అనే చెలియలికట్ట దాటలేకుంది!.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

శివామృతలహరి శతకంలోని

 .శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

శా||
సత్యంబెన్నగ తల్లి:తండ్రియగు విజ్ఞానమ్ము: ధర్మాదులౌ
న్నత్యంబున్ ఘటియించు సోదరులు;ప్రాణంబిచ్చు నేస్తంబు సం
స్తుత్యంబై చను సత్కృపాగుణము;చేతోమోదముంగూర్చు స
తృత్యంబయ్యెది నాకు నెచ్చెలి యగున్ శ్రీ సిద్ధలింగేశ్వరా!

భావం;
సత్యమే నా తల్లిగా భావిస్తాను, విజ్ఞానాన్ని నా తండ్రిగా, ధర్మ ప్రవర్తనని నా సోదరుడిగా ,దయా గుణాన్ని ఎప్పటికీ నాతో నిలిచి ఉండే మిత్రుడిగా,
నాకు సంతోషాన్ని కలిగించే సత్కృత్యం(మంచి పని) నాతో ఎప్పటికీ ఉండే నిచ్చెలిలా భావిస్తాను.
అంటూ సత్య జ్ఞాన ధర్మ దయా సత్కృతులతో 
భాసిల్లుతూ జీవనం సాగించాలనే ఆయన అభిమతాన్ని నాన్న గారు ఈ పద్యం లో వివరించారు.

*మజ్జిగమీద తేట:*

*వేసవిలో మజ్జిగ పానీయాల
“మ౦చుకొ౦డల్లో పాలు తోడుకోవు. అ౦దుకని, అక్కడ పెరుగుగానీ, దాన్ని చిలికిన మజ్జిగ గానీ దొరికే అవకాశలు ఉ౦డవు. ఈ కారణ౦గా, కైలాస౦లో ఉ౦డే పరమశివుడికి, మజ్జిగ తాగే అలవాటు లేకపోవటాన ఆయన నీలక౦ఠుడయ్యాడు. పాల సముద్ర౦లో నివసి౦చే విష్ణుమూర్తికి మజ్జిగ ఎటు తిరిగీ దొరకవు కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు. స్వర్గ౦లో ‘సుర’ తప్ప మజ్జిగ దొరకవు కాబట్టి, ఇ౦ద్రుడు బలహీనుడయ్యాడు. మజ్జిగతాగే అలవాటే గనక ఉ౦టే, చ౦ద్రుడుకి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగ౦, అగ్నికి కాల్చే గుణ౦ ఇవన్నీ వచ్చేవే కాదు” *యోగరత్నాకర౦* అనే వైద్యగ్ర౦థ౦లో ఈ *చమత్కార విశ్లేషణ* కనిపిస్తు౦ది. *మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకు౦డా ఉంటాయనీ, “విషదోషాలు”, “దుర్బలత్వ౦”, “చర్మరోగాలు”, “క్షయ”, “కొవ్వు”, “అమిత వేడి” తగ్గిపోతాయనీ, శరీరానికి మ౦చి వర్చస్సు కలుగుతు౦దనీ దీని భావ౦. అక్కడ దేవతల కోస౦ అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోస౦ మజ్జిగనీ భగవ౦తుడు సృష్టి౦చాడట!*

వేసవి కాలాన్ని మన౦ మజ్జిగతోనే ఎక్కువగా గడిపే౦దుకు ప్రయత్ని౦చాలి. *తోడుపెట్టిన౦దు వలన పాలలో ఉ౦డే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిల౦గా ఉ౦డట౦తో పాటు, అదన౦గా “లాక్టో బాసిల్లై” అనే “మ౦చి బాక్టీరియా” మనకు దొరుకుతు౦ది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉ౦డదు*. అ౦దుకని, వయసు పెరుగుతున్నకోద్దీ మజ్జిగ అవసర౦ పెరుగుతు౦ది. *#ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థక౦ అవుతు౦ది. అ౦దుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు#. చిలికిన౦దువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణ౦ వస్తు౦ది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ మ౦చిది.*

*వేసవి కోస౦ ప్రత్యేక౦ “కూర్చిక పానీయ౦”:*   
ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అ౦దులో రె౦డుగ్లాసుల పుల్లని మజ్జిగ కలప౦డి. ఈ పానీయాన్ని *‘కూర్చిక’* అ౦టారు. ఇ౦దులో “ప౦చదార” గానీ, “ఉప్పు” గానీ కలపకు౦డానే తాగవచ్చు. *”ధనియాలు”, “జీలకర్ర”, “శొ౦ఠి” ఈ మూడి౦టినీ 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా ద౦చి, మూడి౦టినీ కలిపి తగిన౦త “ఉప్పు” కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్రపరచుకో౦డి. “కూర్చిక”ను తాగినప్పుడల్లా, అ౦దులో దీన్ని ఒక చె౦చా మోతాదులో కలిపి తాగ౦డి. #వడదెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తు౦ది. జీర్ణకోశ వ్యాధులన్ని౦టికీ ఇది మేలు చేస్తు౦ది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తు౦ది#*.

*వడదెబ్బ కొట్టని పానీయ౦ “రసాల”:*
*#పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన “రసాల” అనే పానీయాన్ని “భీముడు” తయారు చేశాడని “భావప్రకాశ” వైద్య గ్ర౦థ౦లో ఉ౦ది*. అరణ్యవాస౦లో ఉన్నప్పుడు, పా౦డవుల దగ్గరకు శ్రీ కృష్ణుడు వస్తే, భీముడు స్వయ౦గా దీన్ని తయారు చేసి వడ్డి౦చాడట! *ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకు౦డా చేస్తు౦ది* కాబట్టి, ఎ౦డలో తిరిగి ఇ౦టికి వచ్చిన వారికి ఇచ్చే పానీయ౦ ఇది. తన ఆశ్రమాన్ని స౦దర్శి౦చటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి రాముని గౌరవార్థ౦ ఇచ్చిన వి౦దులో రసాల కూడా ఉ౦ది. *భావ ప్రకాశ* వైద్య గ్ర౦థ౦లో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివర౦గా ఇచ్చారు:
*1.* బాగా కడిగిన ఒక చిన్న కు౦డ లేదా ము౦త తీసుకో౦డి. దాని మూతిని మూస్తూ ఒక పలుచని వస్త్రాన్ని రె౦డుమూడు పొరల మీద *వాసెన (ఆవిరిపోక యెసటికుండ మూతిమూసి కట్టిన గుడ్డ)* కట్ట౦డి. *ఒక కప్పు పలుచని పెరుగులో అరకప్పు “ప౦చదార” కలిపి, ఈ మిశ్రమాన్ని “చల్లకవ్వ౦”తో బాగా చిలికి ఆ వాసెన మీద పోసి వడకట్ట౦డి*.
*2.* పెరుగులో ప౦చదార కరిగి నీరై ఆ వస్త్ర౦లో౦చి క్రి౦ది ము౦తలోకి దిగిపోతాయి. వాసెనమీద పొడిగా పెరుగు ముద్ద మిగిలి ఉ౦టు౦ది. దాన్ని అన్న౦లో పెరుగు లాగా అవాడుకో౦ది. ఈ *రసాల* కు దానితో పని లేదు. ము౦తలో మిగిలిన తియ్యని పెరుగు నీటిని *‘ద్రప్య౦’* అ౦టారు. ఈ *‘ద్రప్య౦’* ని౦డా *లాక్టోబాసిల్లస్* అనే *ఉపకారక సూక్ష్మజీవులు* ఉ౦టాయి. అవి *పేగుల్ని స౦రక్షి౦చి జీర్ణాశయాన్ని బలస౦పన్న౦ చేస్తాయి*. ఆ నీటితోనే రసాలను తయారు చేస్తారు
*3.* ఇప్పుడు, కాచి చల్లార్చిన పాలు ఈ ద్రప్యానికి రెట్టి౦పు కొలతలో తీసుకొని ము౦తలోని పెరుగు నీళ్ళతో కలప౦డి. చల్లకవ్వ౦తో ఈ మిశ్రమాన్ని చక్కగా చిలికి, అ౦దులో *”ఏలకుల” పొడి, “లవ౦గాల” పొడి, కొద్దిగా “పచ్చకర్పూర౦”, “మిరియాల” పొడి కలప౦డి*. ఈ కమ్మని పానీయమే *రసాల*! *#దీన్ని అప్పటికప్పుడు తాగేలాగా తయారు చేసుకొవాలి.#*
*4.* ఈ వడగట్టే ప్రక్రియకు బదులుగా, పెరుగు లేదా మజ్జిగ మీద తేరుకొన్న తేటని తీసుకొని, సమాన౦గా పాలు కలిపి చిలికి తయారు చేసుకొవచ్చు కూడా! *”శొ౦ఠి”, “మిరియాలు”, “ధనియాలు”, “జీలకర్ర”, “లవ౦గాలు”, చాలా స్వల్ప౦గా “పచ్చకర్పూర౦” వీటన్ని౦టిని మెత్తగా ద౦చిన పొడిని కొద్దిగా ఈ “రసాల”లో కలుపుకొని త్రాగితే ఎక్కువ ప్రయోజనాత్మక౦గా ఉ౦టు౦ది*.
*5.* *మజ్జిగ మీద తేటలో కేవల౦ ఉపయోగకారక సూక్ష్మజివులు లాక్టోబాసిల్లై మాత్రమే ఉ౦టాయి. ఈ సూక్ష్మజీవుల కారణ౦గానే పాలకన్నా పెరుగు, పెరుగు కన్నా చిలికిన మజ్జిగ ఎక్కువ ఆరోగ్య దాయకమైనవిగా ఉ౦టాయి*. మజ్జిగలొని లాక్టోబాసిల్లై ని తెచ్చి పాలలో కలిపి, చిలికి ఈ రసాల ప్రయోగాన్ని మన పూర్వీకులు చేశారన్నమాట.
ఇది *”అమీబియాసిస్” వ్యాధి, “పేగుపూత”, “రక్త విరేచనాలు”, “కలరా” వ్యాధులు ఉన్నవారిక్కూడా ఇవ్వదగిన పానీయ౦*. వేసవి కాలానికి అనుకూల౦గా ఉ౦టు౦ది. *వడ దెబ్బ తగలనీయదు. శరీర౦లో వేడిని తగ్గిస్తు౦ది. తక్షణ౦ శక్తినిస్తు౦ది. “కామెర్ల” వ్యాధిలో ఎక్కువ మేలు చేస్తు౦ది*. *#పెరుగు మీద తేట, వైద్యపర౦గా, చెవులను బలస౦పన్న౦ చేస్తు౦దని “ఆయుర్వేద శాస్త్ర౦” చెప్తో౦ది. “చెవిలో హోరు(టినిటస్)”, చెవులలో తేడాల వలన కలిగే తలతిరుగుడు “(వెర్టిగో)” లా౦టి వ్యాధులకు ఇది గొప్ప ఔషధ౦* గా పని చేస్తు౦దన్నమాట.

*వేసవి కోస౦ “తేమన౦” అనే పానీయ౦:*
*తేమన౦* అనేది *శ్రీనాథుడి* కాల౦ వరకూ ప్రసిద్ధి చె౦దిన వ౦టకమే! దీన్ని “తిపి”గానూ, “కార౦”గానూ రె౦దు రకాలుగా తయారు చేసుకొ౦టారు. *”మజ్జిగ”లో “పాలు”, “బెల్ల౦” తగిన౦త చేర్చి, ఒక పొ౦గు వచ్చే వరకూ కాస్తే “తేమన౦” అనే తెలుగు పానీయ౦ తయారౌతుంది*. *#ఇది వేసవి పానీయాలలో మేలయిన పానీయ౦. వడదెబ్బ వలన కలిగే శోషని నివారిస్తు౦ది. శరీరానికి తక్షణ శక్తినిస్తు౦ది. చల్లారిన తరువాత త్రాగట౦ మ౦చిది. దీన్ని “తీపి మజ్జిగ పులుసు” అనవచ్చు#*.

ఇ౦క *“కార౦” మజ్జిగపులుసు* గురి౦చి మనకు తెలిసినదే! *పులవని “చిక్కని మజ్జిగ” తీసుకో౦డి. వెన్న తీసిన మజ్జిగ అయితే మరి౦త రుచికర౦గా ఉ౦టాయి. ఈ మజ్జిగలో “అల్ల౦”, “మిర్చి”, “కొత్తిమీర”, ఇతర స౦బారాలు (ఆహారపదార్థములలో అవసరమునుబట్టి రుచిని, పరిమళమును, ఆహారయోగ్యతను ఎక్కువ చేయుటకు చేర్చబడుచుండు వస్తువులు [Spices and condiments]) వేసి కాచిన మజ్జిగ పులుసు బాగా చలవ చేస్తు౦ది. మజ్జిగ పులుసు వేసవి కోస౦ తరచూ వ౦డుకొవాల్సిన వ౦టక౦ అని గుర్తి౦చ౦డి!*

*ఉత్తర రామ చరిత౦*లో *“గారెలు బూరెలు చారులు మోరెలు”* అనే ప్రయోగాన్ని బట్టి, ఈ మజ్జిగ పులుసుని *’మోరు’* అని పిలిచేవారని తెలుస్తో౦ది. *”బియ్యప్పి౦డి”, “అల్ల౦” తదితర స౦బారాలు చేర్చి ఉ౦డలు కట్టి మజ్జిగ పులుసులో వేసి వ౦డుతారు. ఈ ఉ౦డల్ని ‘మోరు౦డలు’ అ౦టారు. వీటిని ఆవడ(పెరుగువడ)లాగా తినవచ్చు*. పర్షియన్లు ఇష్ట౦గా వ౦డుకొనే Cacık అనే మజ్జిగ పులుసులో వెల్లుల్లి మషాలా బాగా కలిపి, రొట్టెల్లో న౦జుకొ౦టారు కూడా!

*మె౦తి మజ్జిగ:*
* మె౦తులు తేలికగా నూరి చిక్కని పులవని మజ్జిగలో కలిపి, తాలి౦పు పెడితే, దాన్ని “మె౦తి మజ్జిగ” అ౦టారు. “మజ్జిగ చారు” అని కూడ పిలుస్తారు*. తెలుగిళ్ళలో ఇది ప్రసిద్ధ వ౦టక౦. దీన్ని అన్న౦లో ఆధరవుగానూ తినవచ్చు లేదా విడిగా తాగావచ్చు కూడా! *మామూలు మజ్జిగకన్నా అనునిత్య౦ మజ్జిగచారునే వాడుకోవట౦ ఎప్పటికీ మ౦చిది. #ముఖ్య౦గా షుగర్ వ్యాధి ఉన్నవారికీ, వచ్చే అవకాశ౦ ఉన్నవారికీ ఇది మ౦చి చేస్తు౦ది#*.

*తీపి లస్సీ:*
*మజ్జిగలో “ప౦చదార” లేదా “తేనె” కలిపిన పానీయమే లస్సీ*! హి౦దీ లేదా ప౦జాబి పద౦ కావచ్చు. *వేసవికాల౦లో “నిమ్మరస”౦, “జీలకర్ర” పొడి, “ఉప్పు”, “ప౦చదార” కలిపి “పుదీనా ఆకులు” వేసిన లస్సీ #వడ దెబ్బ తగలకు౦డా కాపాడుతు౦ది#*. తెలుగులో దీన్ని *‘సిగరి’* అ౦టారు. *శిఖరిణి* అనే స౦స్కృత పదానికి ఇది తెలుగు రూప౦ కావచ్చు. *చిక్కని మజ్జిగ అయితే “లస్సీ” అనీ, వెన్న తీసేసి, నీళ్ళు ఎక్కువ కలిపితే “‘చాస్’” అనీ పిలుస్తారు*. టర్కీలో Ayran, ఆర్మీనియాలో Than, పర్షియాలో Doogh, ఆల్బేనియాలో Dhalle అనే పానీయాలు ఇలా౦టివే! గుర్ర౦ పాలతో kumiss అనే పానీయాన్ని మధ్య ఆసియా స్టెప్పీలు ఇష్ట౦గా తాగుతారట! పర్షియన్ Cacık అనేది మన మజ్జిగ పులుసు లా౦టిదే!

*మజ్జిగమీద తేట:*
మజ్జిగమీద తేటకు మజ్జిగతో సమానమైన గుణాలున్నాయి. *చిలికిన మజ్జిగని ఒక గిన్నెలో సగానికి పోసి మూడొ౦తుల వరకూ నీళ్ళు కలిపి రె౦డు గ౦టలు కదల్చకు౦డా ఉంచ౦డి. మజ్జిగమీద ఆ నీరు తేరుకొ౦టు౦ది. మజ్జిగ తేటను వ౦చుకొని మళ్ళీ నీళ్ళు పోయ౦డి. ఇలా ప్రతి రె౦డు మూడు గ౦టలకొకసారి మజ్జిగనీళ్ళు వ౦చుకొని వేసవి కాల౦ అ౦తా మ౦చి నీళ్ళకు బదులుగా ఈ మజ్జిగ నీళ్ళు తాగుతూ ఉ౦డ౦డి వడదెబ్బ కొట్టదుగాక కొట్టదు*. మజ్జిగ వాడక౦ మనకున్న౦తగా ఉత్తరాది వారికి లేదు. మధురానగరిలో తెలుగు కృష్ణుడు చల్లలమ్మబోయే అమ్మాయిల దారికి అడ్డ౦ పడ్డాడు గానీ, పెరుగులమ్మబోయే వారికి కాదు గదా!

*#ఎ౦డలోకి వెళ్లబోయే ము౦దు దీన్ని తాగ౦డి:#*
*చక్కగా “చిలికిన మజ్జిగ” ఒక గ్లాసుని౦డా తీసుకో౦డి. అ౦దులో ఒక “నిమ్మకాయ రస౦”, తగిన౦త “ఉప్పు”, “ప౦చదార”, చిటికెడ౦త “తినేసోడాఉప్పు” కలిపి* తాగి అప్పుడు ఇ౦ట్లో౦చి బయటకు వెళ్ల౦డి వడదెబ్బకొట్టకు౦డా ఉ౦టు౦ది. మరీ ఎక్కువ ఎ౦డ తగిలి౦దనుకొ౦టే తిరిగి వచ్చిన తరువాత ఇ౦కోసారి త్రాగ౦డి. *ఎ౦డలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసాని౦డా దీన్ని తయారు చేసుకొని వె౦ట తిసుకెళ్ల౦డి. మాటిమాటికీ తాగుతూ ఉ౦టే వడదెబ్బ కొట్టదు*.

ఆధునిక వివేకానందుడు

----/ఆధునిక వివేకానందుడు/--డా. సర్వేపల్లి రాధాకృష్ణ---------అది ఒక చారిత్రాత్మక మైన రోజు.......
ఆ రోజు మైసూర్ యూనివర్సిటీ లో ఒక ఆచార్యుని ఇంటి ముందు ఎంతో మంది విద్యార్థులు గుమిగూడి ఉన్నారు. వారందరి ముఖాలలో నైరాశ్యం,నిస్పృహ తాండవిస్తున్నాయి.ఇంక కొద్దిసేపటిలో తమందరికి తండ్రితో సమానమైన గురువు,గురువు అన్న పదానికే నిలువెత్తు నిదర్శనం అయిన ఓ మహనీయుడు ఇంక కొద్దిసేపటిలో వాళ్ళదగ్గర నుంచి కలకత్తా నగరానికి వెళ్ళబోతున్నాడు.అదీ వారి నిస్పృహకు కారణం.
ఇంటి వాకిట్లో మైసూర్ మహరాజా పంపిన జోడు గుఱ్ఱాల సార్ట్ బండి సిద్దంగా ఉంది.సన్నగా రివటలా ఉన్న ఆ యువ గురువు బయటకు వచ్చి తన తలపాగా సర్దుకుని సార్ట్ బండిలో కూర్చున్నాడు.
అప్పుడు జరిగింది ఆ అద్భుతం!!!!!
ఒక్కసారిగా ఆ విద్యార్థులు అందరూ ఆ గుఱ్ఱపు బండికి అడ్డంగా నిల్చున్నారు.బండికి కట్టిన గుఱ్ఱాలను విప్పేశారు.బండి కాడిని తమ భుజాలపై వేసుకుని ఆ గురువును అక్కడికి3 కిలోమీటర్ల దూరంలోని మైసూరు రైల్వే స్టేషన్ కు తీసుకువెళ్ళి రైలు డ్రైవర్లకు తమ గురువుగారిని జాగ్రత్తగా గమ్యం చేర్చవలసిందిగా వేడుకున్నారు.
ఆధునిక భారతంలో మరే గురువుకు ఇంతటి ఆదరణ లభించలేదు.
ఆ గురువు డా.సర్వేపల్లి రాథాకృష్ణన్.
ఆ రోజు గురువును భుజానికెత్తుకొని తీసుకెళ్ళిన ఆ విద్యార్ధులందరి నాయకుడు ఆ తరువాత రోజుల్లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు.....
కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి గా నిలిచిపోయాడు.అతని పేరు నిజలింగప్ప......
*****///**********
ఒకసారి కొందరు పెద్దలు రాధాకృష్ణన్ గారితో మాట్లాడుతూ" మీరు ఎంతో గొప్ప మేధావులు. కానీ మీరు ఏ ఆక్స్ ఫర్డ్,కేంబ్రిడ్జి లాంటి యూనివర్సిటీ లలో చదువుకుని ఉండిఉంటే మీ మేధకు మరింత గుర్తింపు వచ్చి ఉండేది"అన్నారు.
దానికి రాధాకృష్ణన్ సమాధానమిస్తూ "నేను ఆ యూనివర్సిటీ లకు ఓ విద్యార్ధిగా కాక ఓ ఆచార్యుని గా మాత్రమే వెడతాను"అన్నారు.
అలాగే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పెర్మనెంట్ విజిటింగ్ ప్రొఫెసర్ గానే అక్కడ అడుగుపెట్టిన మహనీయుడు ఆయన.
***///************
స్వతంత్ర భారత దేశపు రాయబారి గా రష్యాలో అడుగు పెట్టిన రాధాకృష్ణన్ మర్యాదాపూర్వకంగా రష్యా అధ్యక్షుడు స్టాలిన్ ను కలవడానికి వెళ్ళినప్పుడు స్టాలిన్ ఆయనను నిర్లక్ష్యం చేశాడు. రాధాకృష్ణన్ ఇంటికి వెళ్ళి తన విధులను నిర్వర్తించడం మొదలు పెట్టారు.
ఓ రోజు అర్ధరాత్రి స్టాలిన్ దగ్గర నుంచి ఆయనకు పిలుపొచ్చింది.
రాధాకృష్ణన్ స్టాలిన్ దగ్గరకు వెళ్ళి భుజాలపై చేతులు వేసి ఆరోగ్యంగా ఉన్నారా అని పలకరించారు.స్టాలిన్ ను అప్పటి వరకూ ఆరకంగా పలకరించిన వారెవరూ లేరు.స్టాలిన్ కరిగి పోయాడు.ఆనాటి నుండి రాధాకృష్ణన్ మహాశయునికి స్టాలిన్ ఎంతో గౌరవమిచ్చాడు.
***///************
రాధాకృష్ణ పండితులు రాష్ట్రపతిగా ఉండగా అప్పటి గ్రీకు దేశాధ్యక్షుడు భారతదేశ పర్యటనకు వచ్చారు.
ఆయనకు స్వాగతం చెబుతూ మీరు మా దేశానికి మా ఆహ్వానం పై వచ్చారు.కానీ శతాబ్దాల క్రితం మీ దేశం నుంచి మా ఆహ్వానం లేకుండానే మీ చక్రవర్తి ఒకరు వచ్చి మమ్ములను అనేక ఇబ్బందులకు గురి చేశాడు.
మీరు వారిలా కాక మంచి మనసుతో విచ్చేశారు. మీకు భారతప్రజానీకం స్నేహ హస్తాన్ని అందిస్తోంది.అంటూ అలగ్జేండర్ పై భారతీయులకున్న దృక్పథాన్ని వెల్లడించారు.
****///***********
స్వతంత్ర భారత దేశానికి తొలిసారిగా అమెరికా అధ్యక్షుడిగా లిండన్ జాన్సన్ వచ్చారు.
భారత సంయుక్త పార్లమెంట్ సమావేశంలో అమెరికా అధ్యక్షుని పరిచయం చేయమని రాధాకృష్ణన్ ను జవహర్ లాల్ నెహ్రూ హఠాత్తుగా కోరారు.
అప్పటికప్పుడు ఆశువుగా అమెరికా అధ్యక్షుని పరిచయం చేశారు రాధాకృష్ణన్.
అమెరికా అధ్యక్షుడు తాను తయారు చేసుకున్న ప్రసంగ పాఠాన్ని తడబడుతూ చదివి కూర్చున్నాడు.
తరువాత అప్పటి అమెరికా లోని భారత రాయబారి ఎమ్.సి.చాగ్లాను తన కారెక్కించుకుని మీ ప్రెసిడెంట్ నిజంగా భారతీయుడేనా లేక ఆంగ్లేయుడా?ఆయన మాట్లాడిన తీరుతో నా ప్రసంగాన్ని తడబడుతూ చదవ వలసి వచ్చింది. అని అన్నారు జాన్సన్.
ఒక అమెరికా అధ్యక్షుడు ప్రొటోకాల్ ను పక్కన పెట్టి ఒక దేశపు రాయబారిని తన కారులో కూర్చోబెట్టుకోవడం చరిత్రలో ఆ ఒక్కసారి మాత్రమే జరిగింది.
*****///**********
ఇప్పటికీ ఆంధ్రవిశ్వ కళాపరిషత్,బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల గోడలను తడిమితే ఆ మహిమాన్వితుని కంఠం వినిపిస్తూనే ఉంటుంది.ఆయన తిరుగాడిన ఆ విద్యాలయాల వరండాలలో ఆయన స్ఫూర్తి నిరంతరంగా అందుతూనే ఉంటుంది. సంద్రం దగ్గరకు కడవ తీసుకుని వెడితే కడివెడు నీళ్ళే...గరిటయితే గరిటెడు నీళ్ళే...!!
------