29, నవంబర్ 2022, మంగళవారం

బానిసలుగా మారుతున్న యువత

 🌼🌼💧🌿🌿🌿☄️

*_18 ఏళ్లకే డ్రగ్స్, గంజాయి, ఆల్కహాల్ ,సిగరెట్లకి బానిసలుగా మారుతున్న  యువతను కాపాడేదెట్ల?_*


  *_ఇనుప కండలు, ఉక్కు నరాలతో ఉండాల్సిన యువత  మత్తు పదార్థాలకు బానిసై పెలుసుగా మారి  సమయం వృధా చేస్తూ  దేశ భవిష్యత్తు ని ప్రమాదంలోకి నెడుతున్న నేటి పరిస్థితుల్లో యువత ని కాపాడే బాధ్యతను తల్లిదండ్రులు ప్రజలు ..ఉపాధ్యాయులు,ప్రభుత్వాలు  తీసుకొని  తగు ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది._*


*_ఇప్పుడు ఎందుకు చెపుతున్నాను అంటే ఈ రోజు  విచారిస్తే  అతని కస్టమర్స్ లో  90 శాతానికి పైగా  విద్యార్థులే ఉన్నారని ఇది బాధాకరమని  చెప్పడం విన్నాను, పోలీసులు, ప్రభుత్వం ఎంత కట్టడి చేసిన ఎక్కడో ఒక దగ్గర డ్రగ్స్& గంజాయిని యువత  దొరికించుకోగలరు?  అందుకే దీనికి  అడ్డుకట్ట ఎట్లా ?అంతం ఎక్కడ....? అని నేను ఆలోచిస్తే  నా మదిలో కొన్ని ఆలోచనలు   మెదిలాయి._*




*_1) విద్యార్థుల కు   ఇంటర్ నుండి  పరీక్షలు రాయాలన్నా.. పై చదువులకు  అర్హత , అడ్మిషన్స్  పొందాలన్నా  ఆల్కహాల్ &  డ్రగ్స్ టెస్ట్ చేసి  అందులో క్లీన్ గా ఉన్నవారికే  అనుమతి ఇవ్వాలి అనే నిబంధన తీసుకురావాలి._*


*_2). ప్రభుత్వ  ఉద్యోగాలకు   పరీక్షలు రాయాలన్న మరియు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత  సాధించాలంటే అన్ని అర్హతలతో పాటు ఆల్కహాల్ & డ్రగ్స్ క్లీన్  సర్టిఫికేట్  కూడా  ఉండాలి  అనే నిబంధనలు పెట్టాలి._*


*_3)  IT, BT, ఇతర ప్రైవేట్ రంగ ఉద్యోగాలకు  కూడా  డ్రగ్స్ సర్టిఫికెట్   తప్పనిసరి చేయాలి._*


*_4). స్వయం ఉపాధికి ప్రభుత్వ రుణాలు ,సబ్సిడీలు పొందాలంటే  కూడా డ్రగ్స్ సర్టిఫికెట్   సమర్పించాలి అనే నిబంధనలు పెట్టాలి._*


*_5). పెళ్ళిళ్ళకి కూడా డ్రగ్స్ క్లీన్ సర్టిఫికెట్  నిబంధన పెట్టాలి_*


*_నేను పైన చెప్పిన కొన్ని ఆలోచనలు కొంత వరకైనా  యువతను  కాపాడగలదని  అనుకుంటున్నాను.లేదంటే  దేశాభివృద్ధి కి తీవ్ర విఘాతం కలుగుతుంది. మీరు కూడా కొంత ఆలోచన చేసి  డ్రగ్స్ ,ఆల్కహాల్ భారీ నుండి యువతకి ఎలా కాపడవచ్చో  మీకున్న ఆలోచనలు పంచుకోండి._*

🙏🙏🙏🙏


" రాతి లో భగవంతుడిని చూడడం తప్పుకాదు. కానీ రాయే  భగవంతుడు అనుకోవడమే తప్పు .

ఇది తెలుసుకోనంతవరకు వాస్తవం గ్రహించలేరు.

దశమ స్కంధము

 Srimadhandhra Bhagavatham -- 87 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


దశమ స్కంధము - ఉత్తర భాగము

ప్రద్యుమ్నకుమార చరిత్ర

పోతనామాత్యుల వారు దశమస్కంధము ఉత్తరభాగమును ప్రారంభిస్తూ -

శ్రీకర!పరితోషితరత్నాకర! కమనీయ గుణగణాకర! కారు

ణ్యాకర! భీకరశర ధారాకంపిత దానవేంద్ర! రామనరేంద్రా!!

వారు ఏది ప్రారంభం చేసినా ఒక్కసారి రామచంద్ర ప్రభువును ప్రార్థన చేస్తారు. ‘శ్రీకర’ – సమస్త ఐశ్వర్యములను కటాక్షించువాడా! అపారమయిన కారుణ్యమునకు అవధి అయిన వాడా! శత్రువులను పరిమార్చకలిగిన వాడా! రామచంద్ర ప్రభో! భాగవతం ఉత్తరభాగమును ఆంధ్రీకరణం ప్రారంభం చేస్తున్నాను’ అన్నారు. దీనిలో మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉన్నది. మనము ఏ పనిమీద తిరుగుతున్నా భగవంతుని స్మరణ మాత్రం విడిచిపెట్టకూడదు. దేహముతో తాదాత్మ్యత చెందిపోకూడదు. ఏ పని చేస్తున్నా ఈశ్వరుడి పట్ల కృతజ్ఞత భక్తుడయిన వాడికి అలవాటు కావాలి. సంతతము ఆ భగవంతుడిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు. ‘నా అంతటి వాడిని నేను’ అని అనకూడదు. అలా అంటే మీ స్థితి ఏమిటో చూపించడానికి ఈశ్వరుడికి ఒక్క క్షణం చాలు. ఆయన మహా దయాళువు. అలా చెయ్యడు. ఆయన ఎన్ని ఆగడములనయినా సహిస్తాడు. అందుకనే ఎంతో గొప్పమాట అంటారు. కమనీయ గుణగణాకర! కారుణ్యాకర!’ మహా కారుణ్యము కలిగినటువంటి వాడా – రామచంద్రప్రభో! అని ప్రారంభం చేశారు. దీనిని అలవాటు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. భాగవతమును వినేవాడు, భాగవతమును చదివేవాడు జీవితములో ప్రత్యేకముగా అస్తమానూ ఈశ్వరుడిని జ్ఞాపకమునకు తెచ్చుకోవడం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానిని ఈశ్వరునితో అనుసంథానం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. జీవితంలో ఇంతకన్నా గొప్ప వరం ఉండదు.

రుక్మిణీ కృష్ణుల వివాహం పూర్తయింది. రుక్మిణీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పురుటికందుని చూసుకొని ఆమె పరవశించి పోయింది. ఆవిడ ఆదిలక్ష్మి. ఆమె నుండియే మిగిలిన అష్టలక్ష్ములు వస్తాయి. ఆవిడ ఒక నరకాంతగా ఉన్నప్పుడు కూడా తల్లి ప్రేమకు అతీతముగా ఉండడానికి ఇష్టపడదు. ఆవిడ తల్లి ప్రేమను తల్లి ప్రేమగానే ఉంచుతుంది. ఆ పురిటి మంచం మీద బిడ్డడికి పాలు ఇచ్చి బిడ్డడిని నిద్రపుచ్చి తాను నిద్రపోయింది.

ఆ పిల్లవాడు నిద్రపోతుండగా శంబరాసురుడనే రాక్షసుడు అంతఃపురంలోకి కామరూపియై ప్రవేశించాడు. పొత్తిళ్ళలో ఉన్న ప్రద్యుమ్నుడనబడే చిన్న బిడ్డడిని అపహరించి తీసుకొని వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపివేయడానికి ఒక మహాసముద్రంలో పారేశాడు. ఇది మీరు జాగ్రత్తగా గమనించ వలసిన లీల. ఈ లీలను గాని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగారంటే ఈశ్వరుని దివ్యమయిన అనుగ్రహం, కారుణ్యం, ఆయన ఎంత లెక్కలు వేసి ఉంచే మనిషి, ఆయన సంకల్పముతో ఎలా ఏమి జరుగుతాయన్నది అర్థం అవుతుంది. భక్తి ప్రచోదనం అయ్యేంత గొప్ప పద్యమును ఇచ్చారు.

తామరసాక్షునంశమున దర్పకు డీశ్వరుకంటిమంటలం

దా మును దగ్ధుడై పిదప దత్పరమేశుని దేహలబ్ధికై

వేమఱు నిష్ఠ జేసి హరి వీర్యమునం బ్రభవించె రుక్మిణీ

కామిని గర్భమం దసురఖండను మాఱట మూర్తియో యనన్!!

ఒకానొకప్పుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడు. పార్వతీదేవి ఆయనకు ఇల్లాలు కావాలి. లేకపోతే తారకాసుర సంహారం జరగదు. పరమశివుని కుమారుడు మాత్రమే తారకాసురుని నిర్జించగలడు. ఆ మేరకు తారకాసురుడు వరమును పొంది ఉన్నాడు. అందుకని పార్వతీ పరమేశ్వరులను కలపడం కోసమని మన్మథుడు బయలుదేరాడు. మన్మథుడు శ్రీమహావిష్ణువు కుమారుడు. శ్రీమహావిష్ణువు అందం అంతా మన్మథునికి వచ్చింది. మన్మథుడు అనగా మనస్సులను మథించగలిగిన వాడని అర్థం. ఆయన పుష్ప బాణుడై అవతలవారి మనస్సులను కదుపుతాడు. ఇంద్రుడు అడిగితే పరమశివుని మీదకు బాణ ప్రయోగం చేయబోయాడు. శివునిలో చిన్న మార్పు కలిగింది. ఆయన అనుమానం వచ్చి చూశాడు. పొదలో కూర్చుని వింటినారి సారిస్తున్న మన్మథుడు కనపడ్డాడు. అంతే! మూడవకన్ను తెరిచాడు. కాముడు భస్మమయిపోయాడు. అతను హర తేజస్సుచేత కాల్చబడ్డాడు. అది మామూలు అగ్నిహోత్రం కాదు. మూడవకంటి మంట. ఇంక దానికి ఎదురులేదు. మన్మథుడు దగ్ధమయి పోయాడు. శివుడికి ఉన్న మూడు నేత్రములు అయిన సూర్యచంద్ర అగ్నిహోత్రముల చేత కాలి బూడిదరాశియై పడిపోయాడు.

మన్మథుడు కాలిపోవడం పరమశివునకు విజయము. ఎందుకనగా ఆయన కామదహనం చేశాడు. కామునికి లొంగడు. మన్మథుడు దహింపబడడం వలన రతీదేవికి అపకారం జరిగింది. రతీదేవికి భర్త పోయాడు. ఆమెకు ఎవరు అయిదవతనమును ఇవ్వడంలో సమర్థులో, ఎవరిని పరమశివునితో చేర్చడం వలన వాళ్ళిద్దరికీ కలిగిన కుమారుడి వలన దేవతలు ప్రయోజనము పొందుతారనే భావనచేత మన్మథుడు బానప్రయోగం చేశాడో, అటువంటి భర్తను తనకు ఇమ్మనమని పార్వతీదేవిని, పార్వతీ పరమేశ్వర కళ్యాణం తరువాత రతీదేవి అడిగింది. పరమశివుని మంట చేత కాలిపోయిన మన్మథుని మరల పార్వతీదేవి బ్రతికించింది. అమ్మవారి శక్తికి పరిమితి లేదు. అందువలననే కాలి బూడిద అయిపోయిన వానిని తిరిగి బ్రతికించగలిగినది. ఆవిడ ఏదయినా చేయగలదు. శక్తి స్వరూపమయిన ఆమె రతీదేవికి ‘నీ అయిదవతనమునకు భంగం లేదు. నీ భర్త అనంగుడు అవుతాడు శరీరం ఉండదు. ఎవ్వరికీ కనపడడు. నీకు మాత్రం కనపడతాడు’ అని వరం ఇచ్చింది. రతీదేవికి తన పతిని శరీరముతో చూడాలని కోరిక కలిగింది. పరమశివుడు మన్మథునితో ‘ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించినపుడు నీవు ఆయనకు కుమారుడిగా జన్మించెదవుగాక! రతీదేవి నిన్ను శరీరంతో చూడగలదు’ అని వరం ఇచ్చాడు.

ఈ పుట్టిన మన్మథుడు రాక్షస సంహారమునకు శ్రీమన్నారాయణుడే మరొక అవతారం ఎత్తాడా అన్నట్లుగా ఉన్నాడు. హరుని కంటిమంటచేత కాలిపోయిన వాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకు కుమారుడిగా జన్మించాడు. భూదేవి వెళ్లి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు ‘తాను రాక్షస సంహారం చేసి భూభారమును తగ్గిసాను’ అని అభయం ఇచ్చాడు. ఆయన ఒకటి, ఆయన కుమారుడు ఒకటి కాదు కదా! ఈయన కూడా రాక్షస సంహారం చేయవలసి ఉన్నది. ఈయన వలన మరణించే శంబరాసురుడనే రాక్షసుడు ఉన్నాడు. వానికి ఈ విషయం తెలుసు. తన మృత్యువునకు ఏది కారణమని భావించాడో దానిని తీసివేసే ప్రయత్నం చేశాడు. శంబరాసురుడు ప్రద్యుమ్నుడిని సముద్రంలోకి విసిరేశాడు. పిల్లవాడు చచ్చిపోయి ఉంటాడని భావించి తన గృహమునకు వెళ్ళిపోయాడు.

ఈశ్వర సంకల్పం చేత ఆ బాలుడు బ్రతికాడు. విచిత్రం ఏమిటంటే ఆ పిల్లవాడు శంబరాసురుని ఇంటికే వెళ్ళాడు. శంబరాసురునిచే విసిరి వేయబడిన వాడిని ఒక చేప మింగేసింది. ఆ చేపను జాలర్లు వలవేసి బయటకు తీసి ఒడ్డుకు వచ్చి రంపముతో దాని కడుపు కోయగా కడుపులో చంటిపిల్లవాడు కనపడ్డాడు. ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడిని కానుకగా ప్రభువుకు ఇద్దామని వాళ్ళ ప్రభువయిన శంబరాసురుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పారు. శంబరాసురుడు మాయకు వశుడయ్యాడు. ఈలోగా రతీదేవి తన భర్త మన్మథుడు కృష్ణ పరమాత్మకు కొడుకుగా, ఈ మాంసనేత్రముతో చూడగలిగే వానిగా పుడతాడని ఎదురుచూస్తోంది. రతీదేవి మాయాదేవి అనే పేరుతో శంబరాసురుని వంటశాలలో ఉన్నది. ఈమె శంకరాసురుని వద్దకు వెళ్లి ఆ పిల్లవాడిని తనకివ్వమని, వానిని తాను పెంచుకుంటానని చెప్పింది. ఆ పిల్లవాడిని ఆమెకు ఇచ్చేశాడు.

ప్రపంచంలో ఎవరయినా తన భర్తను భర్తగా మాత్రమే చూడగలరు. భర్తను పసిపిల్లవానిగా రతీదేవి సాకింది. ఈయన పెరిగి పెద్దవాడయ్యాడు. రతీదేవి తన భర్త అనే భావనతోనే పెంచి పెద్ద చేసింది. ఆయనకు తాను మన్మథుడనని తెలియదు. రతీదేవికి తెలుసు. ప్రద్యుమ్నుడికి యౌవనము వచ్చిన తరువాత ఈమె చేష్టితములను కనిపెట్టాడు. ఈమె ప్రవర్తనయందు దోషమును కనిపెట్టి ‘నీవు మాతృత్వమునకే కళంకం తెస్తున్నావు. నీ ప్రవర్తన యందు దోషం కనపడుతున్నది. ఎందుకు నీయందు ఈ విధమయిన విచిత్రమయిన ప్రవర్తన జరుగుతోంది?’ అని అడిగాడు. ఆవిడ జరిగిన విషయమును తెలియజెప్పి ఆ అమ్మకు ఉన్న కష్టమును పరిమార్చి నీవు మరల అమ్మవద్దకు చేరవద్డా’ అని అడిగింది. ఆయనలో ఉన్న మాతృ భావమును ఎవరి వైపుకి తిరగాలో వారి వైపుకి తిప్పింది. అవతార ప్రయోజనమును పూర్తి చేయిస్తున్నది.

ప్రద్యుమ్నుడు ‘ఉత్తర క్షణం నేను నా తల్లిని చేరుకోవాలనుకుంటున్నాను. నేను వెంటనే శంబరాసురుణ్ణి చంపేస్తాను’ అన్నాడు. ఆమె ‘నీవు అంత తొందరగా వాడిని చంపలేవు. వాడి దగ్గర గొప్ప మాయలు ఉన్నాయి. ఆ మాయలను నిర్జించడం ఎవరివల్లా కాదు. నీకిప్పుడు ఒక మంత్రోపదేశం చేస్తాను. ఒక విద్యను నీకు ఉపదేశిస్తాను. ఆ విద్యపేరు మహామాయా విద్య’ అని ఆ విద్యను బోధచేసింది. అమ్మవారికి పన్నెండుమంది ఉపాసకులను చెపుతారు.

మనుశ్చంద్ర కుబేరస్య లోపాముద్రాచ మన్మథః అగస్తీరగ్నిసూర్యశ్చ

ఇంద్రస్కంధశ్శివస్తథా క్రోధభట్టారకోదేవ్య ద్వాదశాని ఉపాసకాః.

ఈ పన్నెండుమంది అమ్మవారి ఉపాసకుల గురించి విన్నా, వాళ్ళ గురించి చెప్పినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది. అందుకే రుక్మిణీ కళ్యాణం ప్రక్కనే ప్రద్యుమ్నోపాఖ్యానమును ఇచ్చారు. స్త్రీలు పెళ్ళయిన తరువాత మాతృత్వమును కోరుకుంటారు. ఆ మాతృత్వం నిలబడడానికి మహామాత అనుగ్రహం కలగాలి. రుక్మిణికి ప్రద్యుమ్నుడు పుట్టడమును అడ్డుపెట్టి అమ్మవారి అనుగ్రహమును పోతనగారు కథలోకి తీసుకువచ్చారు. ప్రద్యుమ్నుడు మహా మాయా తత్త్వమును పొంది శంబరాసురుని మీదికి యుద్ధమునకు వెళ్ళాడు.

వాడికి ఈ సత్యం తెలియగానే తోక త్రొక్కిన త్రాచులా లేచి ప్రద్యుమ్నుడితో యుద్ధమునకు బయలుదేరాడు. ప్రద్యుమ్నుడు తనకు ఉన్నటువంటి మహా మాయాశక్తి చేత అన్ని అస్త్రశస్త్రములను అణచివేసి తరువాత కత్తితో శంబరాసురుని కుత్తుక ఖండించివేశాడు. ఎవరిచేతిలో శంబరాసురుడు చచ్చిపోవాలని ఈశ్వరుడు సంకల్పం చేశాడో వానిచేతిలోనే చచ్చిపోయాడు. అలా చంపివేసిన తరువాత ఒక చిత్రం జరిగింది. వెంటనే ప్రద్యుమ్నుడు అమ్మని చూడడానికి వెళ్ళాలి కదా! ఇక్కడ జరుగుతున్న విషయములన్నీ కృష్ణుడికి తెలుసు. ప్రద్యుమ్నుడి జాడ తెలియనట్లు ఊరుకున్నాడు. శంబరాసుర సంహారం జరగాలని ఆయనకి తెలుసు. కృష్ణ పరమాత్మ చెప్పింది మాత్రమే మనం చెయ్యాలి తప్ప ఆయన చేసింది మనం చేయకూడదు. కృష్ణుడిది పరిపూర్ణావతారం. కృష్ణుడిని అనుకరించకూడదు.

ప్రద్యుమ్నుడు రతీదేవితో కలిసి ఆకాశమార్గంలో రుక్మిణీదేవి అంతఃపురమునకు వెళ్ళాడు. అక్కడ ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. కృష్ణుడు ఎలా ఉంటాడో ప్రద్యుమ్నుడు కూడా ముద్ర గుద్దినట్లు అలానే ఉంటాడు. అంతఃపుర పరిచారికలు అచ్చం శ్రీకృష్ణునిలా ఉన్న ప్రద్యుమ్నుని చూసి కృష్ణుడే వస్తున్నాడని ఎక్కడి వాళ్ళు అక్కడే స్తంభముల చాటుకి తప్పుకున్నారు. కొందరు కృష్ణుని కొడుకులా ఉన్నాడు అనుకున్నారు. రుక్మిణీదేవి మందిరం ఎక్కడ ఉన్నదాని అమ్మ గురించి వెతుకుతున్నాడు ప్రద్యుమ్నుడు. పరిచారికలు రుక్మిణీదేవి వద్దకు వెళ్లి ‘అమ్మా! ఎవరో ఆకాశమునుండి మన మందిరంలోకి దిగారు. అచ్చం కృష్ణుడి లాగానే ఉన్నారు. మీరు చూడవలసినది’ అని చెప్పారు. రుక్మిణీదేవి గబగబా మేలిముసుగుతో వచ్చి చూసింది. ఆవు దూడను చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆమె చూపు అలా అయింది. ఆమెలో పుత్రవాత్సల్యం తన్నుకు వచ్చి ఆమె స్తన్యములలో పాలు చేపునకు వచ్చాయి. ఆవిడ 'ఈపిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. నా కొడుకు బ్రతికి ఉన్నట్లయితే ఇప్పటికి ఇంతయి ఉండేవాడు. ఈతడు నా కొడుకే అయివుండాలి’ అనుకున్నది. అమ్మ ఇరువది అయిదేళ్ళ తరువాత తన కుమారుని గుర్తు పట్టింది.

ఈలోగా అక్కడికి కృష్ణ భగవానుని తీసుకువచ్చారు. ఆయన మహా మాయావి. ఆయన వచ్చి ఒకసారి రుక్మిణి వంక, ఒకసారి ప్రద్యుమ్నుని వంక చూసి ప్రద్యుమ్నుని ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించారు. ప్రద్యుమ్నుడు సమాధానం చెప్పేలోపల అక్కడికి మహాజ్ఞాని అయిన నారదుడు వచ్చి‘ నీకు తెలియని విషయమా! ఆనాడు మన్మథుడు కాలి బూడిద అయిపోతే వరం ఇచ్చారు కదా! దాని ప్రకారం మన్మథుడు ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. చిన్నతనంలో శంబరాసురుడు అపహరించాడు. ఇతడు శంబరాసురుణ్ణి సంహరించి రతీదేవితో కలిసి వచ్చాడు. నీ ఇంటికి కొడుకు కోడలు ఈశ్వర వరంగా వచ్చారు. ఇది ప్రద్యుమ్నుడు ఎంచుకుని చేసుకున్న పెళ్ళి కాదు. ఇది జన్మజన్మాంతర సుకృతం. ఇలాంటి కొడుకు కోడలు సృష్టిలో ఉండరు. పుట్టిన పిల్లవాడిని పెంచి పెద్ద చేసుకొని తన భార్యత్వమును నిరూపించుకొని, భర్తను తీసుకుని వచ్చి తల్లికి అప్పచెప్పిన కోడలు! అత్తగారియందు అంత గౌరవమును చూపించిన కోడలు! ఇంతకన్న నీకు ఏమికావాలి?’ అని చెప్పాడు.

రుక్మిణీదేవి గబగబా వచ్చి ప్రద్యుమ్నుడిని, రతీదేవిని ఆప్యాయతతో కౌగలించుకుంది. కృష్ణుడు సంతోషించాడు. అంతఃపురం అంతటా భేరీలు మ్రోగాయి.

చచ్చిపోయాడని అనుకున్న పిల్లవాడు బతికి వచ్చాడు. ఆహా! రుక్మిణీ దేవి ఎంత తపస్సు చేసినదో! మరల కొడుకు ఇంతవాడయి కనపడ్డాడు’ అని గోపకులందరూ ఆనందముతో వసంతములు జల్లుకుని పొంగిపోతుంటే రుక్మిణీ కృష్ణులు పొంగిపోతూ కొడుకునూ కోడలినీ ఇంట్లోకి తీసుకువెళ్ళి పెద్ద సంబరములు చేసుకున్నారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

సుబ్రహ్మణ్య షష్ఠి_*

 *_రేపు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి_*


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️




దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో *"శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి"* వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును *"శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి"* గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాము !


పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న *"తారకా సురుడు"* అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై ! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి , వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున ! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.

అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి , శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు ! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా ! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.

ఇలా ఉండగా ! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.

ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని , షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని , కార్తికేయుడని , అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు , సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.

కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు , దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి , వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా , ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.


అంత ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి *"సర్పరూపం"* దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.


సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును *"శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా* పరిగణిస్తారని , సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు.


ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు , పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున *"శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి"* వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.


ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు , చర్మవ్యాధులు తగ్గుతాయని , పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు , వెండి , పూలు పడగలు , వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.


ఇటువంటి పుణ్యప్రదమైన *"శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"* నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.


వీలున్న వారందరూ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించండి. పెళ్ళి కాని వారికి , సంతానం లేని వారికి ఇది అమృతతుల్యమైన అవకాశం. సుబ్రహ్మణ్యుని అనుగ్రహముతో వివాహ ప్రాప్తి , సత్సంతానం , వంశాభివృద్ధి , జ్ఞానము , తేజస్సు, పాప కర్మల నుండీ విముక్తి కలుగుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేసి జీవితాశయం పొందడానికి కూడా సుబ్రహ్మణ్యుని అనుగ్రహము అతి ముఖ్యము.🙏🙏

నమస్కరిస్తున్నాను

 శ్లోకం:☝️

*తారకాసురహంతారం*

  *మయూరాసనసంస్థితం l*

*శక్తిపాణిం చ దేవేశం*

  *స్కందం వందే శివాత్మజం ll*

   - శ్రీ స్కంద షట్కం - 2


భావం: తారకాసుర సంహారి, నెమలి వాహనముపై ఆసీనుడు, మరియు శక్తి అనే ఆయుధము ధరించిన పరమశివుని కుమారుడైన స్కందుడికి నేను నమస్కరిస్తున్నాను.🙏

28, నవంబర్ 2022, సోమవారం

పరోపకారార్థం ఇదం శరీరం

 "పరోపకారార్థం ఇదం శరీరం" అనే సూక్తి మీద ఒక అద్భుతమైన కథ ఒక పుస్తకములో చదవటం జరిగింది. మన సంస్థ సభ్యుల కోసం ఆ కథ. మనము చేసే సహాయం ఎంత చిన్నదైనా ఆ ఫలితం మనకు ఒకనాటికి తప్పక లభిస్తుంది అనే చెప్పే కథ ఇది. 


పాండవులు ఏకచక్రపురంలో బిక్షాటన చేసి జీవిస్తునప్పుడు ఒకరోజు వాళ్లకు ఏమి దొరకలేదు. ఆనాడు ఊళ్ళో ఒక పెళ్లి జరుగుతుందని ఊళ్ళో అందరికి అక్కడ భోజనాలు ఏర్పాటు చేసారని తెలిసి పాండవులు కూడా అక్కడకు వెళ్లి భోజనం చేశారు. వాళ్ళు భోజనం చేసి వచ్చి   ఎదురుగా ఉన్న ఒక తిన్నె మీద విశ్రమించి ఉండగా ఒక ముసలమ్మ వాళ్ళ దగ్గిరకు వచ్చి తనకు చాలా ఆకలిగా ఉన్నదని చెప్పింది. అప్పుడు అర్జనుడు ఆమెకు ఇవ్వడానికి తమ వద్ద ఆహారం లేదని తానే ఒక పెళ్లి ఇంట భోజనం చేసి వచ్చామని చెప్పి, ఆమెకు తన చూపుడు వేలితో ఆ ఇల్లు చూపించాడు. ఆమె అక్కడికి వెళ్లి భోజనం చేసి వచ్చి, పెట్టకపోయినా పెట్టె ఇల్లు చూపినందుకు కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయింది.


కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకనాడు అర్జనుడికి చాలా దాహం వేసింది. తనకు చాలా దాహంగా ఉందని అర్జనుడు శ్రీకృష్ణుడికి చెప్పాడట. తాను వెంటనే నీళ్లు తాగగాపోతే  కష్టమని, తనకు చాలా నీరసంగా ఉందని, అస్త్రాలకు సంభందించిన మంత్రాలు కూడా జ్ఞాపకం రావడం లేదని అర్జనుడు - రథాన్ని మళ్ళించమని శ్రీకృష్ణుడిని కోరాడట. అందుకు శ్రీకృష్ణుడు రథాన్ని మళ్లించడం సాధ్యం కాదని, అర్జనుడు తన చూపుడువేలును తన పెదవులకు ఆనించి నోరు తెరవాలని చెప్పాడట. అర్జనుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టే చేసాడు. అంతే - ఆ చూపుడు వేలి నుంచి గంగ ఉప్పొంగి అర్జనుడి దాహాన్ని తీర్చిందట. "నా చూపుడు వేలికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేసావు మహానుభావా!" అని అర్జనుడు శ్రీకృష్ణుడిని అడిగాడు. అయిన నవ్వి - "చాలా ఏళ్ల క్రితం ఒక ముసలమ్మ ఆకలిని నీ చూపుడు వేలితో తీర్చావు కదా దాని మహిమ ఇది!" అన్నాడట.


చిన్నదా, పెద్దదా అన్న దాంతో నిమిత్తం లేకుండా ఇతరులకు మనకు తోచిన సహాయం చేద్దాం, మన గురువుగారు చూపిన బాటలో మనము నడుద్దాం. జై గాయత్రి మాత.

మంగళకరమైన వస్తువులు

 *🙏🏽ఓం శ్రీ సూర్య నారాయణ నమః 🙏🏽*


మన ఇంట్లో ఉండదగిన మంగళకరమైన వస్తువులు🚩


ఉప్పులో చిల్లర నాణెం వేసి ఉంచటం మంగళకరం🙏🏽🌹

బియ్యం నిల్వ చేసే డబ్బాలో కాశీ అన్నపూర్ణాదేవి చిన్న విగ్రహం వేసి ఉంచటం మంగళకరం🌹🙏🏽

ప్రతిరోజు ప్రదోషకాలంలో సింహద్వారంవద్ద పెరటి గుమ్ముమువద్ద ఆవునేతి తో దీపాలు వెలిగించడం మంగళకరం🙏🏽🌹

అమావాస్యనాడు ఉదయం ఉపవాసం వుండి రాత్రివేళ మాత్రమే భోజనం చేయడం మంగళకరం🌹🙏🏽

గోవుకు మేత కుక్కలకు మినప పదార్థాలు కాకులకు తీపి పదార్థాలు పెట్టటం మంగళకరం🙏🏽🌹

పాలు పెరుగు నెయ్యి పసుపు కుంకుమ ఉప్పు ఇంట్లో ఎప్పుడూ వెలితి లేకుండా చూసుకోవడం మంగళకరం🌹🙏🏽

పుణ్య తిధి నక్షత్రములందు నది స్నానం చేయటం ప్రతినిత్యం స్నానం చేసేటప్పుడు గంగా స్తోత్రం పఠించటం మంగళకరం🙏🏽🌹

ఉప్పును ఆహార పదార్థాలతో కాకుండా విడిగా నిల్వ చేసుకోవడం మంగళకరం🌹🙏🏽

అమావాస్య తిధి పూర్తయినాక (ప్రతి మాసం )ఆవు పంచకముతో గృహమంతా సంప్రోక్షణ చేసుకోవడం మంగళకరం🙏🏽🌹

గవ్వలను పూజా మందిరంలో ఇలవేల్పుతో పాటుగా పెట్టుకుని పూజించటం మంగళకరం🌹🙏🏽

గురుసేవ ఆదిత్యము వ్రతము పరోపకారము దానము న్యాయ ప్రవర్తన పాతివ్రత్యము పశుపాలన మహోత్సవము లోకోద్ధరణ ఈ పది మానవ జీవితంలో అత్యంత మంగళకరమైనవి🙏🏽🌹

ప్రతినిత్యం ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు సింహద్వారం లోపల మాట్లాడే మాట దైవస్మరణ అయితే మంగళకరం🙏🏽🌹

సముద్ర నది స్నానం దంపతులిద్దరూ కలిసి ఆచరిస్తే అధిక ఫల పుణ్యఫలం  ప్రతి మాసానికి ఒకసారి ఈ విధమైన స్నానం చేయడం మంగళకరం🌹🙏🏽

ఏ గుడికైనా వెళ్ళినప్పుడు ప్రదక్షణం దైవదర్శనం తీర్థప్రసాదాలు సేవించడంతోపాటు ఆలయ ప్రాంగణములో ఆ దైవ నామాన్ని కనీసం తొమ్మిది సార్లు  ధ్యానం చేయడం మంగళకరం 🙏🏽🌹


ఓం శ్రీ సూర్య నారాయణ స్వామి యే నమః 🙏🏽🌹


సర్వేజనాసుఖినోభవంతు

ఏ సమయంలోనైనా.. ఎవరైనా..

 రైల్వే , భరోసా 

రాజమండ్రికి చెందిన వెంకటేశ్వరరావు దంపతులు విజయవాడలో ఉంటున్న తన కూతురి దగ్గరకు వెళ్లి ఆమె బాగోగులు చూసి విజయవాడ నుంచి బిలాస్‌పూర్‌కు మరో రైల్లో బయలుదేరారు. విజయవాడలోని వెంకటేశ్వరరావు కుమార్తె మూడుగంటల తర్వాత తల్లిదండ్రుల క్షేమ సమాచారం కోసం ఫోన్‌చేయగా ఫోన్‌ రింగవుతున్నా కాల్‌ లిఫ్టు చేయలేదు. వెంటనే ఆమె రైల్వే హెల్ప్‌లైన్‌ 182కు ఫోన్‌చేసి విషయం చెప్పి తన తల్లిదండ్రుల క్షేమ సమాచారాన్ని తెలియజేయాలని కోరింది. వెంటనే రైల్వే అధికారులు సంబంధిత సిబ్బందికి వెంకటేశ్వరరావు వెళ్లే రైలు సమాచారాన్ని తెలపగా ఖాజీపేటలో రైల్వే అధికారులు ఆయన దగ్గరకు వెళ్లి వారితో ఫోన్‌లో విజయవాడలోని ఆయన కుమార్తెతో మాట్లాడించారు. దీంతో కుమార్తెకు వూరట లభించింది. 


హౌరా-యశ్వంత్‌పూర్‌ రైల్లో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళుతున్న ఓ విద్యార్థిని హిజ్రాలు ఏడిపించసాగారు. విద్యార్థి హిజ్రాల వేధింపులు భరించలేకపోవడాన్ని సాటి ప్రయాణికుడు గమనించాడు. వెంటనే టోల్‌ఫ్రీ నంబరు 182కు ఫోన్‌చేసి సమాచారాన్ని అందించాడు. రైలు ఏలూరు వెళ్లగానే ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది హిజ్రాలుండే బోగి ఎక్కి వారిని అదుపులోనికి తీసుకున్నారు. 


మండవల్లి, న్యూస్‌టుడే


భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 182 హెల్ప్‌లైన్‌ నంబరును ఏర్పాటు చేసింది. విపత్తులు, ఆపద సమయాల్లో ప్రయాణికులు ఈ నంబరుకు ఫోన్‌చేస్తే వెనువెంటనే సాయం అందుతుంది. ఇటీవల బెంగళూరు స్టేషన్‌లో ఒకే కుటుంబానికి చెందిన 30 మంది తప్పిపోయిన సంఘటనలో సైతం ఇది ఎంతగానో ఉపయోగపడింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లలోని రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్‌)కు అనుసంధానమై ఉంటుంది. ప్రయాణికులు ఆ నంబరుకు కాల్‌ చేసిన వెంటనే అది ఏ డివిజన్‌లో ప్రయాణిస్తుందో, ఏ రైల్వే స్టేషన్‌లో నిలుస్తుందనే సమాచారం మొత్తం జీపీఎస్‌ ద్వారా తెలుస్తుంది. రైలు తరువాత నిలిచే స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌ సిబ్బందికి సమాచారం వెళుతుంది. ఆర్పీఎఫ్‌ సిబ్బందికి వెళ్లే ఈ కాల్‌ రికార్డు కావడంతో ప్రతి కాల్‌కు ఎటువంటి పరిష్కారం చూపారనే విషయం సైతం సిబ్బంది నోట్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆర్పీఎఫ్‌ సిబ్బంది కాల్‌ వచ్చిన రైలు బోగీకి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. 


ఎలాంటి సమస్యకైనా పరిష్కారం.. 

మనం రిజర్వేషన్‌ చేసుకున్న సీట్లో వేరొకరు కూర్చున్నా వెంటనే 138 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. బోగీల్లొ ఎవరైనా అనుమానితులుగా ఉన్నా, మరుగుదొడ్లలో నీరు రాకున్నా, దుర్వాసన వస్తున్నా, ఫ్యాన్లు తిరగకపోయినా.. లైట్లు వెలుగకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. తోటి ప్రయాణికులు అనారోగ్యానికి గురైనా, హిజ్రాలు, ఆకతాయిల వేధింపుల ఎక్కువైనా ఫోన్‌చేసి తక్షణ పరిష్కారం పొందవచ్చు. రైల్లో మన లగేజీ మరచిపోయి.. దిగిపోయిన సందర్భంలో సైతం ఫోన్‌చేస్తే అవతలి స్టేషన్‌లో లగేజిని పొందవచ్చు. 


ఏ సమయంలోనైనా.. ఎవరైనా.. 

రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 182 ఉచిత హెల్‌లైన్‌ నంబరు 24గంటలు అందుబాటులో ఉండడంతో ప్రయాణికులు ఏ సమయంలో అయినా ఫోన్‌చేసి సహాయాన్ని పొందవచ్చు. ఈ నంబరుకు రైల్లో ప్రయాణించే ప్రయాణికులతోపాటు ఎవరైనా  ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణంలో అనారోగ్యం సంభవించినా.. 182 ఫోన్‌చేసి సత్వర పరిష్కారం పొందవచ్చు.

దైవ స్మరణ

 *శ్రీ గురుభ్యోనమః*

 

*ఎన్ని పనులున్నప్పటికీ మీరు దైవ స్మరణను మరువకండి. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా భగవంతుని పాదములను విడువకండి. భగవంతుడు లేని కాలం, చోటు లేదు కనుక మీరు ఎప్పుడు, ఎక్కడున్నా సరే నామస్మరణ చేసుకోండి. మీరు ఎంతటి విపత్కర పరిస్థితిలలో ఉన్నాసరే ఆయనని విశ్వాసంతో, ఆర్తితో పిలవండి . ఆయనే మీకు సమాధానం ఇస్తాడు. మీ సమస్యకు ఆ పరమాత్మయే పరిష్కారం చూపిస్తాడు. 'నాకు ఎవరూ తోడు లేరని' చింతించకండి. మనమంతా ఎవరికో తోడుండడానికి రాలేదు! ఎవరిదైనా తోడు పొందడానికి వచ్చాము. భగవంతుని ఆశ్రయించండి! మీకు ఆ పరమాత్మయే తోడు నీడై ఉంటాడు. మిమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి తెచ్చే భారం ఆయనదే కానీ మీ మీ కర్మలకి అనుసంధానంగానే సుమా*


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

చిన్నపిల్లవాడు

 ఇతను చిన్నపిల్లవాడు


1949వ సంవత్సరంలో శ్రీ పరమాచార్య స్వామివారు ఆనందతాండవపురం విజయం చేసి నలభై రోజులపాటు మకాం చేశారు. అప్పుడు నేను పదమూడు సంవత్సరాల పిల్లవాడిని. అక్కడున్న శివాలయ కొలను జీర్ణోద్ధరణ కోసం స్వామివారిని ప్రార్థించగా; స్వామివారు అంగీకరించి విజయం చెయ్యడానికి ఒప్పుకున్నారు.


ఊరెరిగింపులో భాగంగా స్వామివారు మా ఇంటి వద్దకు వచ్చినప్పుడు, సామవేదంలోని ‘అభి త్వా . . .’ అని మొదలయ్యే మంత్రం పఠిస్తూ స్వామివారికి పూర్ణకుంభం సమర్పించాము. శివస్తోత్ర రూపంలో వచ్చే మంత్రం ఇది. ఈ మంత్రాన్ని పఠిస్తూ పూర్ణకుంభం సమర్పించడం సామవేదీయుల సాంప్రదాయం.


వెంటనే స్వామివారు, “నీకు ‘న కర్మణా . . .’ అన్న మంత్రం తెలుసా?” అని అడిగారు. మా నాన్నగారు ఆ మంత్రాన్ని పూర్తిగా చెప్పారు, వారితో పాటుగా నేను కూడా చెప్పాను.


తరువాత పక్క ఇంటి వారి పూర్ణకుంభం. ‘అభి త్వా . . .’ అన్న మంత్రాన్ని పఠించమన్నారు. నా మంత్రపఠనం పూర్తైన తరువాత, “కొబ్బరికాయను తాకు. నువ్వు పఠించిన మంత్రశక్తి అందులోకి వెళ్ళాలి కదా” అన్నారు స్వామివారు. నేను తాకిన తరువాతనే స్వామివారు కొబ్బరికాయను తాకి ఆ ఇంటివారికి అనుగ్రహాన్ని ఇచ్చారు. ఆ వీధిలో ఉన్న ప్రతి ఇంటిలో కూడా ఇలాగే జరిగింది.


ఒకరోజు భిక్షావందనం అయిపోయిన తరువాత అక్కడున్న పెద్ద ఇత్తడి పాత్రలో ఉన్న ఎండుద్రాక్షను పిడికెడు తీసుకుని గుంపులో ఉన్న వ్యక్తికొకరికి ఇచ్చారు స్వామివారు. అతను వాటిని భుజంపైన ఉన్న తువ్వాలులో గట్టిగా మూటకట్టి భద్రం చేశాడు. స్వామివారి ఎదురుగా వాటిని నోటిలో వేసుకుని నమలడం ఉచితం కాదని నాకు తెలియకపోవడంతో వాటిని అక్కడే ఉన్న కొందరు పాఠశాల విద్యార్థులకు ఇచ్చి, వారితోపాటుగా తిన్నాను. కొద్దిసేపు అక్కడంతా మౌనం.


తరువాత పరమాచార్య స్వామివారు మాట్లాడారు, “ఇతను చిన్నపిల్లాడు; ప్రపంచం పోకడ తెలియదు. కనుక తనకి లభించిన దానిని ఇతరులతో పంచుకుని తిన్నాడు. నేను మరొక్కరికి కూడా ఇచ్చాను కదా? అతనికి లోకవ్యవహారం తెలుసు. అందుకే తన కుటుంబం కోసమని భద్రంగా దాచుకున్నాడు”.


“లోకవ్యవహారం తెలియకపోవడం వల్ల స్వార్థం కూడా తెలియదు. కానీ మరొకతనికి లోకవ్యవహారం తెలుసు కాబట్టి, స్వార్థం కూడా తెలుసు. మూటకట్టి భద్రంగా దాచుకున్నాడు”.


తత్వం ఎంత సులభం అయిపోయింది కదా!


--- ఎన్. వేంకట్రామన్, మైలదుతురై. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అత్యంత శ్రేష్టుడు!

 శ్లోకం:☝️

*అజ్ఞేభ్యో గ్రంథినః శ్రేష్ఠాః*

  *గ్రంథిభ్యో ధారిణో వరాః |*

*ధారిభ్యో జ్ఞానినః శ్రేష్ఠాః*

  *జ్ఞానిభ్యో వ్యవసాయినః ||*


భావం: ఒక ఏమీ చదవని వ్యక్తికంటే చదువుకొన్నవాడు కాస్త మేలు. వానికంటే చదివింది తన మేధలో నిలుపుకొన్నవాడు మేలు. వానికంటే దానిని ఆకళింపు చేసుకొన్న జ్ఞాని మేలు. ఆతనికంటే దానిని ఆచరణలో ఉంచినవాడు కదా అత్యంత శ్రేష్టుడు!